Land registration
-
‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్: నిత్యం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉండే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్ కార్యాలయం మూడు నెలలుగా దాదాపుగా వెలవెలబోతోంది. దీనికి కార ణం కేవలం ఒక్క పదమే కారణమంటే ఆశ్చర్యంగా ఉన్నా, అదే నిజం. ఉన్నతాధికారుల ఉత్తర్వుల్లో ‘మరియు’అనే పదం స్థానంలో ‘నుండి’ అనే పదం టైపింగ్ చేయడమే ఆ పరిస్థితికి కారణం. అప్పటి ‘నుండి’ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆ ఒక్క పదంతో రెండు సర్వే నంబర్లకు బదులు ఏకంగా 168 సర్వే నంబర్లలోని వందల ఎకరాల స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. దీనికి హైడ్రా కూడా తోడవడంతో క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రతిరోజు 100కుపైగా జరిగే రిజిస్ట్రేషన్లు సగానికి తగ్గిపోయాయి. ‘మరియు’కు బదులు ‘నుండి’ కుత్బుల్లాపూర్ టౌన్ పరిధిలో 58, 226 సర్వే నంబర్లలో వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో వాటిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టరాదని వక్ఫ్ బోర్డు ఆగస్టు 27న ఆదేశాల జారీ చేసింది. ఆదేశాలలో 58 మరియు 226 సర్వే నంబర్లు అని టైపు చేయకుండా పొరపాటున 58 సర్వే నంబర్ నుండి 226 సర్వే నంబరు వరకు అని టైపు చేయడంతో ఏకంగా 168 సర్వే నెంబర్లపై ఈ ఎఫెక్ట్ పడింది. దీంతో వందల ఎకరాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేశారు. చదవండి: మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!వాస్తవానికి నిలిపివేసిన సర్వే నంబర్లలో వక్ఫ్‌బోర్డ్ స్థలం మొత్తం కేవలం ఒక ఎకరం ఒక గుంట స్థలం ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 నెలల నుంచి నిలిచిపోవడంతో 50 కాలనీలు, పలు బస్తీల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వెంటనే ఆదేశాల్లో దొర్లిన పొరపాటును సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ‘రిజిస్ట్రేషన్లు సగం మేర తగ్గిపోవడంతో డాక్యుమెంట్ రైటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, 5 హోటల్స్, మనీ ట్రాన్స్ఫర్ సెంటర్లు బోసిపోతున్నాయి’అని రవీందర్ ముదిరాజ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘భూ’చక్రం తిప్పేశారు!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌లో అక్రమాల భూ‘చక్రం’ తిరిగింది. నిబంధనల ప్రకారం సీనియారిటీ ఉన్న సభ్యులకుగానీ, ప్రభుత్వానికి గానీ చెందాల్సిన భూమిని పాలకమండలిలోని ముఖ్యులు పక్కా ప్లాన్‌తో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. సొసైటీలోని ముఖ్యులతోపాటు అధికార యంత్రాంగం కూడా ఈ తతంగంలో భాగస్వామ్యం కావడం గమనార్హం. ప్రభుత్వం ఈ సొసైటీకి కేటాయించిన భూమి నుంచి 304/జీ/111 ప్లాట్‌ను 1988లో సభ్యత్వం నంబర్ 4153గా ఉన్న ఐఏఎస్ నటరాజన్‌కు కేటాయించారు. నటరాజన్ మరణించిన కొన్నేళ్లకు ఆయన కుమారుడు శంకర్ నారాయణన్ పేరుపై సభ్యత్వ బదిలీ జరిగింది. కానీ ఆయన ఇప్పటివరకు ప్రభుత్వ విలువను చెల్లించి ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.ఇలాంటప్పుడు సదరు ప్లాట్‌ను సీనియారిటీ మేరకు తర్వాతి లబ్ధిదారులకు బదిలీ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ అలా చేయలేదు. 36 ఏళ్లు గడిచాయి. ఇప్పటి పాలకమండలి సభ్యులు ‘భూ’ చక్రం తిప్పారు. అతి ఖరీదైన ఈ ప్లాట్‌ను తొలుత శంకర్ నారాయణన్ పేరిట, ఆ వెంటనే సర్దార్ దల్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి పేరిట ఒక్కరోజులోనే గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది పూర్తిగా సొసైటీ నిబంధనలకు విరుద్ధం.ప్లాట్ ఓనర్ కాకుండానే..సొసైటీ పాలకవర్గం చకచకా స్థలాన్ని శంకర్ నారాయణన్ పేరు మీదకు, తర్వాత గంటల వ్యవధిలోనే దల్జీత్ సింగ్‌కు బదిలీ చేయడం గమనార్హం. శంకర్ నారాయణన్‌కు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వ విలువను సొసైటీకి చెల్లించాల్సిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని దల్జీత్ సింగ్ బదిలీ చేశారు. జూన్ 28న నారాయణన్ చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ కోసం రూ.25,89,735.. 29న రూ.60,80,550 చెల్లించారు. విచిత్రమేంటంటే అప్పటికి ఆయన ప్లాట్ ఓనర్ కానే కాదు. అలాగే సొసైటీకి చెల్లించాల్సిన రూ.3,40,67,600ను జూలై 1న బదిలీ చేశారు. డాక్యుమెంట్ నంబర్ 4244/2024తో 529 గజాల భూమి శంకర్ నారాయణన్ పేరు మీదకు మారింది. తర్వాత గంటల వ్యవధిలోనే ఆ భూమిని దల్జీత్ సింగ్ పేరిట మార్చే పని మొదలుపెట్టారు.ఇళ్లు నిర్మించకుండా అమ్మకం చెల్లదుసొసైటీలో భూమి పొందిన లబ్ధిదారులెవరైనా 18 నెలల్లో ఇల్లు నిర్మించకుంటే.. దాన్ని రద్దు చేసే అధికారం సొసైటీకి ఉంటుంది. అసలు ఇల్లు నిర్మించకుండా అమ్మడం చెల్లదనేది సొసైటీ నిబంధన కూడా. రిజిస్ట్రేషన్ పత్రాల్లోనూ ఈ విషయాన్ని పేర్కొంటారు. ఇవేమీ పట్టించుకోకుండా దల్జీత్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్ 4257/2024) మారిపోయింది. సాధారణంగా ఎవరైనా రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేశాక డాక్యుమెంట్లు రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేతికిచ్చారంటే.. అక్రమంలో అధికారుల పాత్ర ఏమిటో తెలిసిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణన్ పేరు మీది డాక్యుమెంట్ రాకుండానే సబ్ రిజిస్ట్రార్ దల్జీత్ పేరిట రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేయడం గమనార్హం. రిజిస్ట్రేషన్ సమయంలో రూ.8 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్న దల్జీత్.. రూ.4,25,42,665ను డీడీ రూపంలో నారాయణన్‌కు బదిలీ చేసినట్టు చూపారు. సొసైటీలోని భూమి నారాయణన్ పేరు మీదకు జూలై 1న రిజిస్ట్రేషన్ కాగా.. అదే రోజున దల్జీత్ పేరు మీదకు మారడం గమనార్హం.నిబంధనలను పక్కకు నెట్టి..హౌసింగ్ సొసైటీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం స్థలం మంజూరు చేస్తుంది. కేటాయించిన స్థలంలో గృహ నిర్మాణం చేపట్టాలి. లేదంటే తిరిగి సొసైటీకి స్థలాన్ని అప్పగించాలి. అంటే శంకర్ నారాయణన్ పేరిట స్థలం మారినా.. అందులో ఎలాంటి నిర్మాణం చేపట్టకుండానే దల్జీత్‌కు విక్రయించడం సొసైటీ నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు.. స్థలం బదిలీకి ఒకట్రెండు సంవత్సరాలు వేచిచూడాలి, లేదా సొసైటీలోని తర్వాతి లబ్ధిదారులకు కేటాయించాలని చట్టం చెబుతోంది. దీన్ని సొసైటీ పాలకమండలి పూర్తిగా ఉల్లంఘించింది. రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో అధికారులకూ ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల అక్రమం!దల్జీత్‌సింగ్ తన పేరుమీదకు మారిన స్థలంలో నిర్మాణం ప్రారంభించేందుకు జూన్ 18న జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేశారు. సొసైటీ నుంచి నారాయణన్ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్‌లో 529 గజాల ప్లాట్‌కు గజానికి రూ.64,400 చొప్పున మొత్తం రూ.3,40,67,600గా లెక్కగట్టారు. రూ.25,89,720 స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. ఇదే ప్లాట్‌ను దల్జీత్ పేరిట మార్చిన రిజిస్ట్రేషన్‌లో మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.1,54,228 చొప్పున లెక్కించారు. స్టాంపు డ్యూటీగా రూ.60,80,550 చెల్లించారు. అంటే మొత్తం ప్లాట్ ధర రూ.8 కోట్లుగా చూపారు. (జూన్ 8న ఆర్టీజీఎస్ ద్వారా రూ.25,89,735.. జూన్ 29న ఆర్టీజీఎస్ ద్వారా రూ.3,40,67,600.. జూలై 1న డీడీ రూపంలో రూ.4,25,42,665.. టీడీఎస్‌కు రూ.8 లక్షలు చెల్లించినట్టు చూపారు). నిజానికి జూబ్లీహిల్స్‌లో బహిరంగ మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంది. అంటే ఈ భూమి విలువ రూ.16 కోట్లకుపైనే! అందులో రూ.8 కోట్లు లెక్కకు వచ్చిందని, మిగతా సొమ్ము సంగతి తేల్చాలనే డిమాండ్ వస్తోంది. ఈ వ్యవహారంపై పలువురు ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’ను ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. -
‘రికార్డు’ సంస్కరణలు ప్రజలకు చెబుదాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెవిన్యూ శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేటేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను క్షుణ్నంగా వివరిస్తూ ప్రజల్లోకి విస్తృత సమాచారాన్ని పంపాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు తీరుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలపై కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ద్రుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు రాతలు రాస్తోందని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేకనే వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఆయా మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉండగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కీలక సంస్కరణలు చేపట్టి రిజిస్ట్రేటేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాల వద్దకే తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేటేషన్ చేయించుకునేవారు ఇంటి నుంచే ఆ పనిని చేయించుకునేలా సాంకేతికతను తెస్తున్నామన్నారు. ఇన్ని సౌలభ్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే కొందరు తప్పుడు రాతలు, వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి అంతా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. 95 శాతం డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జరుగుతున్న సమగ్ర సర్వే ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గానూ 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లయింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తైనట్లు చెప్పారు.60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) జిల్లాలకు పంపే పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. సర్వేలో 3,240 రోవర్లను వినియోగించామని, గతం కంటే 1,620 అదనంగా పెరిగినట్లు చెప్పారు. తొలి విడతగా చేపట్టిన 2 వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తయిందని వివరించారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్ డివిజన్లు, 19 వేల సరిహద్దుల సమస్యల పరిష్కారం,సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూహక్కు పత్రాల పంపిణీ పూర్తైనట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో మరో 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దఫా సర్వే గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి రిజిస్ట్రేటేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో.. మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా అధికారులు నివేదించారు. ఇప్పటికే 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తైందని, 66 మున్సిపాలిటీల్లో ఓఆర్ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. ఫేజ్ 2 సర్వే పూర్తైన చోట రిజిస్ట్రేటేషన్ సేవలకు సిద్ధం కావాలి మొదటి దశ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడంతోపాటు ఫేజ్ 2 సమగ్ర సర్వే పూర్తైన గ్రామాల్లో కూడా రిజిస్ట్రేటేషన్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేటేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను గ్రామాల్లోకే తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు సేవలందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రిజిస్ట్రేషన్ చేయకుంటే పెట్రోల్ పోస్తాం.. తహసీల్దార్‌కు బెందిరింపులు..
సాక్షి, వరంగల్: ‘భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్‌పోసి చంపుతాం’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్‌ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిల్‌నాయక్‌తండాకు గుగులోత్ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని స్లాట్ బుక్ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్ నుంచి నోడ్యూస్ సర్ఠిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్‌నాయక్‌తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్ బుక్ చేసుకున్నాం..రిజిస్ట్రేషన్ చేయండి.. నోడ్యూస్ ఎందుకు తీసుకురావాలి’అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్ చేయకపోతే నీపై పెట్రోల్ పోసి చంపేస్తామని తహసీల్దార్‌ను నానా దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. చదవండి: రేవంత్‌కు సిట్ నోటీసులు.. మరోసారి కౌంటర్ -
రైతు నిజాయితీ.. 15 గుంటలకు పట్టా పుస్తకం వచ్చినా కూడా తనకెందుకని..
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తూనే ఉన్నాం. కన్నవారిపైనే అమానుషానికి పాల్పడుతున్న వారసుల గురించి విన్నాం. కానీ, తనది కాని భూమి తనకెందుకని ఓ యువరైతు నిజాయితీ చాటుకున్నాడు. తన పేరుపై పొరపాటున నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా భూమిని తిరిగి ఇచ్చేశాడు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో వెలుగుచూసింది. పాలకుర్తి మండల పరిధి తిరుమలగిరి గ్రామంలో పొన్నం రాజు అనే రైతు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు బక్క సోమయ్యకు చెందిన 15 గుంటల పట్టా భూమి రికార్డుల్లో తప్పిదం కారణంగా పొన్నం రాజు పేరున నమోదైంది. అయితే, ఆ భూమి తనది కాదని సోమయ్యకు చెందినదని రాజు గుర్తించాడు. మండల తహసీల్దార్ పాల్‌సింగ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. స్వచ్ఛందంగా తహసీల్దార్ సమక్షంలో శనివారం సోమయ్యకు పట్టా చేయించి నిజాయితీ చాటుకున్నాడు. ఉప సర్పంచ్ నాగరాజుతో పాటు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు రాజును అభినందించారు. (చదవండి: బద్రినాథ్‌యాత్రలో వరంగల్ వైద్యురాలు మృతి) -
Andhra Pradesh: గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి : పారదర్శకత కోసం గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖల సమన్వయంతో రీసర్వే ప్రాజెక్టు ఫేజ్–1లోని 51 గ్రామ సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్–6 ప్రకారం నిర్దేశించిన గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రజత్ భార్గవ అధికారులను కోరారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సచివాలయ కార్యదర్శులకు అవసరమైన శిక్షణను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషగిరిబాబును ఆదేశించారు. సమావేశంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ ఉదయభాస్కర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై ‘సీఐడీ’ వేయండి
నరసాపురం: గత సర్కార్ హయాంలో అన్నదాతలను మోసం చేస్తూ టీడీపీ నేతలు చేసిన రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖ కోరింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో లీజు ముగిసిన భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ అమాయకులైన రైతుల నుంచి డబ్బులు దండుకున్న వ్యవహారంపై సమగ్ర దర్యాపునకు ఆదేశాలివ్వాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ‘నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీ’ భూముల రిజిస్ట్రేషన్‌కు కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారాన్ని గతేడాది సెప్టెంబర్ 16న ‘టీడీపీ తీరంతా అవినీతి’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కుంభకోణంపై అప్పటి నరసాపురం సబ్ కలెక్టర్ విచారణ చేసి.. అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రిటిష్ హయాంలో ఇచ్చిన భూములు.. బ్రిటిష్ హయాంలో నరసాపురం తీర ప్రాంతమంతా ఇసుక భూములే. ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు కలిసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. తమకు భూములిస్తే.. సాగు చేసుకుని ఉపాధి పొందుతామన్నారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. స్థానిక రైతులంతా కలిసి నరసాపురం అగ్రికల్చర్ కంపెనీగా ఏర్పడ్డారు. దర్భరేవు, మర్రితిప్ప, వేములదీవి ప్రాంతాల్లోని 1,811.33 ఎకరాలను ఈ కంపెనీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1920లో ఆమోదం తెలిపింది. అమలు కాని జీవోను అడ్డంపెట్టుకొని.. మొత్తం 1,811.33 ఎకరాల్లో గట్లు, నీటి కుంటలను తీసివేయగా.. నికరంగా 1,754.49 ఎకరాలను 1,485 మంది రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లీజు గడువు ముగింపునకు వచ్చింది. ఈ భూములను ఉచితంగా ఇస్తామంటూ సాగుదారులకు టీడీపీ పాలకులు సరిగ్గా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 2019 జనవరి 24న జీవో కూడా విడుదల చేశారు. ఎకరాకు రూ.1,000 చొప్పున రైతులకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ భూముల వ్యవహారాలు చూసేందుకు రైతులు సభ్యులుగా ఉన్న ‘కంపెనీ’ బోర్డుకు టీడీపీ నేత కోట్ల సాయి వెంకట రాజా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో కలిసి బోర్డు డైరెక్టర్లు, టీడీపీ స్థానిక నేతలు సజ్జా వీర వెంకట సత్యనారాయణ, మేకా శ్రీధర్ చౌదరి రంగంలోకి దిగారు. రైతుల నుంచి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. డబ్బులివ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసేది లేదంటూ బెదిరించారు. దీంతో 1,485 మంది సాగుదారుల్లో 760 మంది రూ.1.58 కోట్లు ఇచ్చారు. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవోను మాత్రం అమలు చేయలేదు.. రైతుల పేర్ల మీద భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ కుంభకోణాన్ని గతేడాది ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. బాధిత రైతులు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, అప్పటి సబ్ కలెక్టర్ విశ్వనాథన్‌కు ఫిర్యాదు చేశారు. రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు మా కుటుంబానికి కంపెనీ భూముల్లో 5 ఎకరాలున్నాయి. తరతరాలుగా వాటిని సాగు చేసుకుంటున్నాం. 2019 ఎన్నికలకు ముందు మీ భూములు మీకే రిజిస్ట్రేషన్ చేసేస్తాం.. ఎకరాకు రూ.21 వేలు కట్టాలని చెప్పారు. రూ.1,000 ప్రభుత్వానికి, మిగిలినవి ఖర్చులకని చెప్పి.. నా నుంచి రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదు. మా నుంచి వసూలు చేసిన డబ్బులను బోర్డు పెద్దలే జేబులో వేసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే వారేమీ జవాబివ్వట్లేదు. సీఐడీ విచారణతో న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం. – జి.బంగార్రాజు, రైతు, దర్భరేవు -
ప్లాట్‌పై కన్నేసి.. నకిలీ పత్రాలతో స్థలం కబ్జా
హస్తినాపురం: ప్లాట్ యజమాని పేరుతో నకిలీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డులు తయారు చేసి కోటి రూపాయల ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు షేక్ హస్సన్(56)ను ఆదివారం వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని గౌలిగూడచమన్కు చెందిన బాలేశ్వర్ 1984లో పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సురాబాద్ జడ్జెస్ కాలనీలో సర్వే నంబర్–33లో 267 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్లాట్‌పై కన్నేసిన ఎన్టీఆర్నగర్కు చెందిన షేక్ హస్సన్ పథకం ప్రకారం వివిధ జిల్లాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో సదరు ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హస్సన్ మూడు నెలలకు పైగా పరారీలో ఉన్నాడని, అతడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
స్థలం ఒకరిది..రిజిస్ట్రేషన్ మరొకరిది
ఈ చిత్రంలో ఉన్న పెద్ద మనిషి పేరు కె.పుల్లయ్య. ఇతనిది వెల్దుర్తి మండలం ఎన్.వెంకటాపురం గ్రామం. ఇతను కర్నూలు సమీపంలోని 40వ జాతీయ రహదారి పక్కన వెంగన్న బావి వద్ద 98, 99, 116 సర్వే నంబర్లలో వేసిన వెంచర్లో 2000వ సంవత్సరంలో ప్లాట్ నంబర్ 99ఏ కొనుగోలు చేశాడు. ఏటా ఒకటి, రెండు సార్లు ప్లాటు వద్దకు వచ్చి చూసుకొని వెళ్లేవాడు. అయినా ఇటీవల తన ప్లాటు కర్నూలుకు చెందిన చిట్టిబాబు పేరుతో ఉందని తెలుసుకుని అతన్ని నిలదీశాడు. తాను కూడా కురువ మధు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశానని చిట్టిబాబు వివరణ ఇవ్వడంతో ఈసీ తీశాడు. అప్పటికే 15 మంది చేతులు మారిందని తెలుసుకొని నోరెళ్లబెట్టాడు. ‘నేనెవరికీ ప్లాటు విక్రయించకున్నా ఇలా ఎందుకు జరిగిందని రిజిస్ట్రేషన్ అధికారులను, వెంచర్ వేసిన వారిని అడిగినా వారు సమాధానం చెప్పడం లేదు’ అ బాధితుడు వాపోతున్నాడు. సాక్షి,కర్నూలు(సెంట్రల్): మన పొలమో, ప్లాటో, ఇల్లో ఎక్కడికి పోతుందిలే అనుకుంటే పొరపాటే. డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయని, భూములు, స్థలాలు మన కళ్లెదుటే ఉన్నాయనుకొని ఇంట్లో కూర్చుంటే అక్రమార్కులు బరి తెగించి కొత్త మోసాలతో మాయ చేసేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇతరుల పేరుతో సొంతం చేసుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు రిజిస్ట్రేషన్ అధికారుల వ్యవహారంతో ఆస్తులు కోల్పోయి బాధితులు రోడ్డున పడుతున్నారు. పదే పదే రిజిస్ట్రేషన్.. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కొందరు మాఫియాగా ఏర్పడి భూములు, స్థలాలు, ఇళ్లను రాత్రికి రాత్రే ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వీరికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటున్నట్లు సమాచారం. ముందుగా భూమాయగాళ్లు ప్లాటు, స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా రిజిస్ట్రేషన్ అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని తమ పేరుతో గానీ, తమకు తెలిసిన వారి పేర్లతో గానీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఆ తరువాత అదే స్థలాన్ని పదే పదే రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ పోతారు. రిజిసే్ర్టషన్ సమయంలో స్థలం/పొలం/ఇంటి వద్దకు వెళ్లరు. మొదటి సారి ఆ ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్లు లింకు డాక్యుమెంట్ అడగకుండా మేనేజ్ చేస్తారు. తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించుకుంటూ పోతారు. ఈ ప్రక్రియలో ఎవరైనా ఆస్తిదారులు అప్రమత్తమైతే పంచాయితీకి రమ్మంటారు. ఏదో పొరపాటున జరిగి పోయిందని ఎంతో కొంత చెల్లిస్తే వెనక్కి ఇస్తామని, లేదంటే రిజిస్ట్రేషన్ చార్జీలను అయినా చెల్లించాలని కోరతారు. కె.పుల్లయ్య విషయంలోనూ ప్రస్తుతం అదే జరుగుతోంది. ‘సెటిల్ చేసుకుందామని పంచాయితీకి పిలుస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు’ అంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. వెయ్యికి పైగా కేసులు.. జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో డబుల్ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం, పదే పదే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి కేసులు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. విష యం తెలుసుకున్న లబ్ధిదారులు కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఐదేళ్లలో దాదాపు 1,000కి పైగా కేసులు వచ్చాయి. వీటిపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తరువాత దానిని రద్దు చేసే అధికారం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కేసులు కోర్టులకు ఎక్కుతున్నాయి. ఫలితంగా దీర్ఘకాలికంగా కొన్ని వందల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కొందరు ఫిర్యాదు దారులు పంచాయితీల ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. -
Telangana: భూముల విలువ పెంపు!
►రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించి ఎనిమిదేళ్లవుతోంది. 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా విలువల సవరణ జరిగింది. ►ప్రతి రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. ►రాష్ట్రంలో జరిగిన పాలనా సంస్కరణల కారణంగా.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు ఏర్పడ్డాయి. రియల్ బూమ్, రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదాయం పెంపునకు ప్రభుత్వం అధికారిక విలువల సవరణకు ముందుకు వచ్చింది. ►2019–20 లెక్కల ప్రకారం ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,299 కోట్లు ఆదాయం వచ్చింది. కొత్త విలువలు అమల్లోకి వస్తే ఇది రూ.9,600 కోట్ల వరకు చేరొచ్చని అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ (కార్డ్ వ్యాల్యూ) పెంపునకు రంగం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల కేటగిరీల్లో 30 శాతం నుంచి 400 శాతం వరకు పెరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు చేరాయని.. ఆయన అంగీకరిస్తే ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. సవరణలు జరిగితే ప్రభుత్వానికి ఏటా సగటున రూ.3,400 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది. రిజిస్ట్రేషన్ లావాదేవీలు పెరిగితే మరింత అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. శాస్త్రీయ పద్ధతిలో అంచనాలతో.. భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించే దిశలో ప్రభుత్వం కసరత్తు చేసింది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన మ దింపు ఆధారంగా.. 2019–20 ఆర్థిక సంవత్సరం లో జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీల సగటును తీసుకుని లెక్కలు గట్టింది. సర్వే నంబర్ల వారీగా భూములు, నంబర్ల వారీగా ఇళ్లు, వెంచర్లను బట్టి ఫ్లాట్లు, ఖాళీ స్థలాల విలువలను నిర్ధారించే ప్రయ త్నం జరిగింది. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర, అంతర్ జిల్లా రహదారులు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలను బట్టి విలువలను నిర్ధారించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. కమిటీలు లేకుండానే ప్రక్రియ.. ప్రభుత్వ విలువల సవరణకు సంబంధించి గతంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసేవారు. అందులో ప్రాంతాన్ని బట్టి మున్సిపాలిటీ, హెచ్ఎం డీఏ, పంచాయతీరాజ్, ప్లానింగ్ అధికారులు సభ్యులుగా ఉండి మదింపు చేసేవారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఆయా జిల్లాల్లోని ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల విలువల సవరణ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేవారు. కానీ ఈసారి కమిటీలు ఏర్పాటు కాకుండానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ప్రభుత్వం నిర్ణయించి నట్టు సమాచారం. గతంలో పలుమార్లు ఈ కమిటీల ఏర్పాటు ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరణ కస రత్తు చేసి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం అంగీకరించక పోవడంతో రిజిస్ట్రేషన్ విలువ లు మార్చలేదు. అయితే తాజాగా రాష్ట్ర ఆదాయా న్ని పెంచే దిశగా చర్యలు చేపట్టిన సర్కా రు రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై దృష్టి పెట్టింది. కాస్త జాప్యం జరిగినా కొత్త విలువలు ఈ ఏడాది చివరిలో గా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. -
Telangana: రిజిస్ట్రేషన్లకు ‘అంతుచిక్కని’ సమస్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేసే ప్రధాన సర్వర్‌లో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌లో సరి సంఖ్యలో నమోదై ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శుక్రవారం వరకు సజావుగానే పనిచేసినా, శనివారం సరి, బేసి సంఖ్యలో (రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల క్రమసంఖ్యలోని సరి, బేసి సంఖ్యలు) ఉన్న అన్ని కార్యాలయాలకూ సమస్య వచ్చింది. దీంతో శనివారం అరకొరగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొదలైన మూడురోజులకే.. లాక్డౌన్ వేళలు సవరించిన తర్వాత మే 31 నుంచే రిజిస్ట్రేషన్ లావాదేవీలు మళ్లీ మొదలయ్యాయి. రెండు, మూడు రోజుల పాటు సజావుగానే జరిగిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడింది. తొలుత చిన్నదే అనుకున్నా తర్వాత పెద్దది అయ్యింది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి వివరాల కోసం సబ్ రిజిస్ట్రార్ల లాగిన్‌లోని కార్డ్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి తలెత్తడంతో ఏం జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. దీంతో గచ్చిబౌలి స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని తేలింది. తొలుత ఐటీ శాఖతో కలిసి ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆ సిబ్బంది చేసిన ప్రయత్నం మేరకు గురు, శుక్రవారాల్లో కొన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ప్రధాన సర్వర్‌లో సరి సంఖ్యతో ఉన్న కార్యాలయాల్లో ఇబ్బంది లేకుండానే కార్డ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక, బేసి సంఖ్యతో కూడిన కార్యాలయాల సమస్యను కూడా పరిష్కరించేందుకు సిబ్బంది యత్నించడంతో శనివారం సరి సంఖ్యలోని కార్యాలయాల్లో కూడా సర్వర్ డౌన్ అయినట్టు తెలుస్తోంది. సమస్య ఏమిటో తేలకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం రోజుకు సగటున 3,500కు పైగా లావాదేవీలు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం రోజుకు సగటున 900 వరకు మాత్రమే జరుగుతున్నాయి. శనివారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 500కు మించి జరగలేదని తెలుస్తోంది. అయితే ఆదివారం కల్లా సమస్య పరిష్కారమవుతుందని, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
కాళ్లరిగేలా తిరిగి కడుపు మండి.. మంత్రాలయలో బాంబు..
సాక్షి, ముంబై: స్థలం రిజిస్ట్రేషన్ కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి, ఇక పని కాదని ఏకంగా మంత్రాలయలోనే బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశాడు నాగ్‌పూర్‌కు చెందిన సాగర్ మాంఢరే అనే వ్యక్తి. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులతో మంత్రాలయలో సోదాలు చేశారు. బాంబు లేకపోవడంతో ఫేక్ కాల్‌గా భావించి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. స్థలం విషయంలో కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల అతడి మానసిక స్థితి దెబ్బతినడంతో బెదిరింపు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. కాగా, బెదిరింపు కాల్‌తో మంత్రాలయ భవనం ఆవరణలో, భవనం బయట భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అసలేం జరిగింది? మంత్రాలయ భవనంలో బాంబు ఉందని ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. అయితే 24 గంటలు పోలీసులు, భద్రతా సిబ్బంది విధులు నిర్వహించే మంత్రాలయలో బాంబు పెట్టడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రితోపాటు కేబినెట్, సహాయ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహనాలను తనిఖీ చేయనిదే మంత్రాలయ భవనంలోకి అనుమతించరు. ఇలాంటి పటిష్టమైన భద్రత ఉన్న మంత్రాలయలోకి సామాన్య వ్యక్తులు బాంబు తీసుకెళ్లి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. ఆదివారం మంత్రాలయకు సెలవు అయినప్పటికీ పోలీసులు ఈ బెదిరింపు కాల్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. రంగంలోకి దిగిన బాంబు నిర్వీర్యం బృందం, డాగ్ స్క్వాడ్ మంత్రాలయలో అణువణువూ గాలించారు. కానీ, ఎక్కడా ఎలాంటి బాంబు గాని అనుమానాస్పద వస్తువుగాని లభించలేదు. తరువాత ఈ బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని టెలిఫోన్ ఎక్ఛేంజీ నుంచి ఆరా తీయగా మహారాష్ట్ర ఉప రాజధాని నాగ్‌పూర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగ్‌పూర్ నుంచి ఫోన్ చేసిన సాగర్ మాంఢరేను అరెస్టు చేశారు. ముంబైలో స్థానిక మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగి.. నాగ్‌పూర్‌లో కోల్ ఫిల్డ్ స్టోన్ క్రషింగ్‌కు ఆనుకుని ఉన్న స్థలం తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవడాని కి సాగర్ మాంఢరే అనేక సార్లు స్థానిక ప్రభుత్వం కార్యాలయాల చుట్టు తిరిగాడు. పని జరగకపోవడంతో తనకు న్యాయం చేయాలని తహశీల్దార్, జిల్లా కలెక్టర్, రీజినల్ కమిషనర్ తదితర ఉన్నత స్థాయి అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ, పరిపాలనా విభాగం రికార్డుల ప్రకారం ఆ స్థలం అస్థిత్వంలో లేదు. చివరకు కొద్ది నెలల కిందట ఆ స్థలానికి సంబంధించిన పత్రాలతో మంత్రాలయకు వచ్చి ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ విభాగానికి చెందిన కార్యదర్శులతో భేటీ అయ్యాడు. ఇక్కడ కూడా నిరాశే మిగలడంతో అధికారులను, కార్యదర్శులను అరెస్టు చేయాలని మంత్రాలయలో గొడవ చేశాడు. అంతటితో ఊరుకోకుండా అక్కడే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ బాంబు బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు భావిస్తున్నారు. -
పాస్‌పోర్టు సేవలు, రిజిస్ట్రేషన్లు నిలిపివేత
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని రకాల పాస్‌పోర్టు సేవలను నిలిపివేశారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు సేవా లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో అన్ని సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ పాటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ అపాయింట్మెంట్లను రీ షెడ్యూల్ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ ఆవరణలోనే ఉండే విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన బ్రాంచ్ సెక్రటేరియేట్ కార్యకలాపాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు. లాక్డౌన్ కాలంలో నో రిజిస్ట్రేషన్.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల తర్వాత ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. లాక్డౌన్ మినహాయింపు కేటగిరీలో రిజిస్ట్రేషన్ల శాఖను చేర్చకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి పాస్‌లు జారీ చేయరని, ప్రజలెవరూ రిజిస్ట్రేషన్ల కోసం రావొద్దని తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినందున రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచే ఉంటాయని, రిజిస్ట్రేషన్లు మాత్రం జరగవని వెల్లడించారు. -
రూ.50 లక్షలు, కళ్లకు గంతలు.. అసలేం జరిగింది..?
సాక్షి, రామగిరి(మంథని): రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలు భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో శనివారం ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు. సోమవారం తెల్లవారు జామున ఇంటికి చేరుకున్నారు. అయితే తమను కొంతమంది కిడ్నాప్ చేసి డబ్బులు కాజేశారని చెబుతున్న తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భూ రిజిస్ట్రేషన్ కోసం రాజేశం, మల్లయ్య శనివారం రూ.50 లక్షలతో ద్విచక్ర వాహనంపై కాటారం బయలుదేరారు. మార్గమధ్యలో బట్టుపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనాన్ని ఆపి, మాస్క్ పెట్టుకోకుండా ఎక్కడి వెళ్తున్నారని ప్రశ్నించి వివరాలు నోట్ చేసుకున్నాడు. అయితే ద్విచక్ర వాహనాన్ని ఆపింది పోలీసు అనుకొని వీరు భయపడ్డారు. అంతలోనే మరో వ్యక్తి అక్కడికి వచ్చి రాజేశం సెల్‌ఫోన్ లాక్కొని స్విచ్ఆఫ్ చేసి, ఇద్దరి కళ్లకు గంతలు కట్టి దాదాపు అరగంట కారులో ప్రయాణించిన తర్వాత ఒక ఇంట్లో బంధించారు. ఆదివారం అర్ధరాత్రి మళ్లీ కళ్లకు గంతలు కట్టి కారులో తీసుకువచ్చి రాజాపూర్ శివారు ఎల్–7 ఎస్సారెస్పీ కాలువ వద్ద వదిలిపెట్టడంతో ప్రాణ భయంతో పరుగెత్తుకుంటూ ఇంటికి చేరినట్లు వెల్లడించారు. వారు చెప్పిన కథనంలో అనుమానాలు రేకెత్తిస్తుండడంతో రామగిరి ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగిందో, బాధితులు చెప్పే కథనంలో ఎంతవరకు వాస్తవం ఉందో పోలీసుల విచారణలో తేటతెల్లం కానుంది. -
రూ.50 లక్షలతో ఇంటి నుంచి వెళ్లారు.. తిరిగి రాలేదు
మంథని: భూ రిజిస్ట్రేషన్ కోసం రూ.50లక్షలతో ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరిన ఇద్దరు వ్యక్తుల అదృశ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కు వెళ్లకుండా.. ఇంటికి రాకుండా.. మార్గంమధ్యలో ద్విచక్రవాహనం ఉండడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన ఉడుత మల్లయ్య, చిప్ప రాజేశంలు నాలుగేళ్ల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం శివారులో బిల్క్ ఉన్నీసా బేగంకు (ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో ఉంటున్నారు) చెందిన భూమిని కొనుగోలు చేశారు. అయితే భూమికి సంబంధించి ఇరువర్గాల మధ్య మనస్పర్థలు రావడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. అయితే రాజేశం, మల్లయ్యలు కొనుగోలు చేయాలనుకున్న భూమిని సదరు భూయజమానులు వేరేవారికి విక్రయించారు. ఈ విషయమై పలుసార్లు పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలో రాజేశం, మల్లయ్యకు మరోచోట ఉన్న భూమిని ఎకరాకు రూ.10లక్షల చొప్పున సదరు భూయజమానులు విక్రయించేందుకు ఒప్పందం జరిగింది. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షలతో ద్విచక్రవాహనంపై కాటారం బయలుదేరారు. అయితే రిజిస్ట్రేషన్ వద్దకు వెళ్లకపోవడం, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. కాగా ఆదివారం మంథని మండలం భట్టుపల్లి సమీపంలో మైసమ్మ ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం నిలిపి ఉందనే సమాచారం మేరకు పోలీస్ జాగిలాలతో గాలింపు చేపట్టారు. మంథని నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ పోలీస్‌స్టేషన్, కాటారం వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. సమీప అటవీ ప్రాంతాల్లో సైతం గాలింపు చేపడుతున్నారు. రూ.50లక్షలతో బయలుదేరిన విషయం ఎవరెవరికి తెలుసు, ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఎంత దూరం ద్విచక్రవాహనంపై వెళ్లారు, తర్వాత వారే వాహనం మార్చారా, ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ( చదవండి: మానవత్వం చాటిన మగువ..) -
రిజిస్టార్‌ను బురిడీ.. రూ.కోటిన్నర స్థలం హాంఫట్
సాక్షి, శంషాబాద్: నకిలీ పత్రాలతో ఇద్దరు వ్యక్తులు కోటిన్నర విలువ చేసే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఎంఓ పేరిట పలుమార్లు ఫోన్ చేసి రిజిస్టార్‌ను బురిడీ కొట్టించారు. జరిగిన తప్పు తెలుసుకున్న రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రయంలో భూములు కోల్పోయిన బాధితులకు శంషాబాద్ పట్టణంలో ఎయిర్‌పోర్టు కాలనీలో సర్వే నంబర్ 626/1లో ప్లాట్లను 2003లో కేటాయించారు. వీటికి అప్పట్లో పట్టా సర్టిఫికెట్లను మాత్రమే జారీచేశారు. అయితే, ఇప్పటికీ కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వాటిపై కన్నేసిన మోసగాళ్లు పెద్ద కుట్రకు తెరలేపారు. ఈ సంవత్సరం జనవరి నెలలో కుమ్మరి అమృత అనే మహిళ ఎయిర్‌పోర్టు కాలనీలో ప్రభుత్వం తనకు కేటాయించిన 360 గజాల ప్లాటును మొకరాల శ్రీనివాస్‌శాస్త్రికి విక్రయించేందుకు శంషాబాద్ సబ్‌రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లింది. ఆమె పేరిట ఉన్న పట్టాపై అనుమానం వ్యక్తం చేసిన శంషాబాద్ సబ్ రిజిస్టార్ సిద్ధిఖీ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించారు. దీంతో అక్రమార్కులు నకిలీ పత్రాన్ని సృష్టించారు. ప్రస్తుత రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ జనవరి 19న కుమ్మరి అమృత సరైన లబ్దిదారు అంటూ నకిలీ పత్రాన్ని తయారు చేసి సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో సమర్పించారు. అంతేగాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) నుంచి అంటూ రిజిస్టార్కు పలుమార్లు ఫోన్లు కూడా చేయించారు. దీంతో సబ్‌రిజిస్టార్ వీటిపై పూర్తిగా విచారణ చేయకుండానే ఈ నెల 15న కుమ్మరి అమృత నుంచి శ్రీనివాస్‌శాస్త్రికి 360 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేశారు. కాగా కుమ్మరి అమృత పాత్రను కూడా కొనుగోలుదారులే సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. అది బర్త్ సర్టిఫికెట్.. మోసగాళ్లు ఆర్డీఓ పేరిట తయారు చేసిన పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించగా అది నకిలీదిగా నిర్ధారణ అయింది. ఉన్నతాధికారులు జారీ చేసే పత్రాలపై ఎక్కడా తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఎంబ్లం ఉండదని తేల్చిచెప్పారు. అంతేగాకుండా సదరు పత్రంలో వేసిన ఎస్డీసీఎల్ఈ(ఎల్ఏపీ) బి/691/2003 రికార్డుల పరిశీలనలో అప్పటి చేవెళ్ల ఆర్డీఓ పరిధిలో ఉన్న బాలానగర్ నివాసికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఆర్డీఓ జారీ చేసినట్లుగా ఇచ్చిన పత్రం పూర్తిగా నకిలీదిగా తేలింది. కొనుగోలుదారుడైన వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఈ తంతంగాన్ని నడిపించారు. మరికొన్ని ప్లాట్లు కూడా ఇదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు పథకాన్ని రచించారు. కేసుల నమోదుకు సూచించాం.. విమానాశ్రయం భూ నిర్వాసితులకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం నుంచి అధికారులెవరూ లేఖలను ఇటీవల జారీ చేయలేదు. సదరు వ్యక్తులు సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో ఇచ్చిన లేఖ నకిలీది. అధికారికంగా మేము జారీచేస్తున్న వాటిలో ఎక్కడ కూడా తెలంగాణ రాజముద్ర ఉండదు. లేఖలో వారిచ్చిన నంబరుపై ఇక్కడ మేము బర్త్ సరి్టఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాల్సిందిగా సబ్‌రిజిస్టార్‌కు సూచించాం. – చంద్రకళ, రాజేంద్రనగర్ ఆర్డీఓ నకిలీ డాక్యుమెంట్‌గా తేలింది తొలుత మేము పట్టా సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో పలుమార్లు సీఎంఓ నుంచి అంటూ ఫోన్లు చేయించారు. అంతేగాకుండా ఆర్డీఓ జారీ చేసినట్లు లబ్దిదారులు లేఖను అందజేయడంతో సరైనదేనని భావించి రిజిస్ట్రేషన్ చేశాం. అనంతరం పరిశీలనలో అది నకిలీ డాక్యుమెంట్‌గా తేలింది. కొనుగోలుదారుడే వాటిని మాకు సమర్పించాడు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – సిద్ధిఖీ, సబ్ రిజిస్టార్, శంషాబాద్ చదవండి: ఏ బస్సు ఎప్పుడొస్తుందో..? -
రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా..
సాక్షి, హైదరాబాద్ : రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా మార్చుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గత పది నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆస్తులను కాపాడేందుకు ధరణి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. అయితే గతంలో బ్రిటిష్, నిజాం కాలం నుంచి ఆస్తులకు భద్రత లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. . ఆస్తుల వివరాలు మీకెందుకు అని అధికారులను జనం నిలదీశారని, సీఎం తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, అధికారులు పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. అధికారుల మాటలు విని సీఎం చెడ్డ పేరు తెచ్చకోవద్దని, ఎల్ఆర్ఎస్పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. (‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలేదు’) కరోనా కాలంలో ట్రీట్మెంట్కు ఆస్తులను కుదవ పెట్టుకుందామన్నా, ఆఖరికి పెళ్లిలకు కూడా డబ్బు అవసరమైతే.. ఆస్తులు అక్కరకు రాకుండా పోతున్నాయని ధ్వజమెత్తారు. ధరణి లోని ఆస్తులను చూపించి.. అప్పులు తెస్తారేమోనని అనుమానం కలుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. పాత పద్ధతి లో రిజిస్ట్రేషన్ ఉంటదని చెప్పి జీవోలో వంద కండీషన్లు పెట్టారు..ప్రభుత్వ తీరుతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందని ఆరోపించారు. తక్షణమే రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎల్.ఆర్.ఎస్ విషయంలో కూడా ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని, లేదంటే ప్రజల ఉసురు తగిలి ప్రభుత్వం కుప్పకూలుతుందని మండిపడ్డారు. (సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట) -
తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పులదండ
రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కని, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులనైనా.. రక్తం పంచుకుని పుట్టిన పిల్లలనైనా సరే నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడేస్తున్నారు. ఆస్తికున్న విలువ అమ్మానాన్నకు ఇవ్వడంలేదు. కొడుకుపై ఉండే ప్రేమ కూతురిపై చూపించడంలేదు. విచిత్రమేమిటంటే.. ఏ కొడుకుల కోసం ఆడపిల్లలను వద్దని అనుకుంటున్నారో.. ఆ కొడుకులే తల్లిదండ్రులపాలిట కాలయములవుతున్నారు. రాష్ట్రంలో జరిగిన మూడు ఘటనలు చూస్తే అసలు మన సమాజం ఎక్కడికి వెళుతుందో అనే అనుమానం కలగకమానదు. డబ్బులివ్వడంలేదనే కోపంతో తల్లి మెడపైనే కాలేసి తొక్కి చంపడానికి ప్రయత్నించిన ప్రబుద్ధుడు ఒకడైతే.. ఆస్తి పంచడంలేదనే కారణంతో తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పులదండలేసి అవమానించిన పుత్రులు మరో ఇద్దరు. ఇవన్నీ చూస్తే.. ‘తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు..’అన్న వేమన పద్యం గుర్తురాక మానదు. సాక్షి, సూర్యాపేట : కని, పెంచి, ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను ఇద్దరు కుమారులు ఘోరంగా అవమానించారు. అమ్మానాన్నలను చిత్రహింసలకు గురిచేయడమేకాకుండా వారి చిత్రపటానికి చెప్పులదండ వేసి కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా తండ్రిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని భగత్‌సింగ్ నగర్లో నివాసం ఉంటున్న తహసీల్దార్ సంజీవరావు, సరోజ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్దకొడుకు నూనె రవీందర్, మూడో కొడుకు నూనె దయాకర్‌లు ప్రభుత్వ ఉద్యోగులు. నాలుగో కుమారుడు ప్రశాంత్ ప్రైవేట్ ఉద్యోగి. రెండో కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. కుమార్తె సుజాత వివాహం చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడింది. సంజీవరావుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడలో ఐదెకరాల భూమి ఉంది. ఈ భూమి పంపకాల విషయంలో రవీందర్, దయాకర్‌లు తండ్రితో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరూ కలిసి తల్లిదండ్రుల చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఫొటో తీశారు. దీనిని కుటుంబ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. సోమవారం సంజీవరావును కిడ్నాప్ చేసి రామన్నపేటకు తీసుకెళ్లి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చదవండి: టీచర్ కాదు.. టీచకుడు తల్లిదండ్రుల ఫోటోకు చెప్పులదండ వేసిన కుమారులు రవీందర్, దయాకర్ పోలీసులకు తల్లి ఫిర్యాదు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నాలుగో కుమారుడికి సాయం చేస్తుంటే తమపై దాడి చేస్తున్నారని తల్లి సరోజ ఆరోపించారు. రవీందర్, అతని కుమారులు నూనె ప్రశాంత్, నూనె భాస్కర్ల సహాయంతో తన భర్త సంజీవరావును కిడ్నాప్ చేశారని ఆమె ఈనెల 14న సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం పోలీసులు రవీందర్‌ను, ఆయన కుమారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే దయాకర్‌ను మిర్యాలగూడలో పోలీసులు పట్టుకొని సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తండ్రి నుంచి ఆస్తులు బలవంతంగా రిజిసే్ట్రషన్ చేయించుకున్నట్టు విచారణలో వారు అంగీకరించడంతో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన ఇష్టపూర్వకంగానే కుమారుడు రవీందర్ ఇంటికి వెళ్లానని సంజీవరావు చెప్పడం గమనార్హం. మరోవైపు తల్లిదండ్రులను అవమానిస్తే ఊరుకోబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ ఎ.ఆంజనేయులు హెచ్చరించారు. (చదవండి: పుట్టిన కాసేపటికే కన్నుమూసిన పసికందులు) తల్లి మెడపై కాలేసి.. గణపురం: డబ్బులు అడిగినా ఇవ్వడంలేదనే కోపంతో కన్నతల్లినే చంపడానికి సిద్దపడ్డాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. డబ్బు కోసం ఆమెపైనే వేధింపులకు దిగి హత్య చేయబోయాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని ఎస్సీ కాలనీ(ఎర్రగడ్డ)లో మంగళవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బొట్ల సమ్మక్క(75)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు బొట్ల స్వామి వరంగల్‌లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి సమ్మక్క స్థానికంగా ఉన్న ఓ రైస్‌మిల్లులో పని చేస్తోంది. స్వామి తరచుగా తల్లి వద్దకు వచ్చి డబ్బు కోసం వేధించేవాడు. మంగళవారం తెల్లవారుజామున సమ్మక్కను తీవ్రంగా కొట్టి బంగారం, డబ్బు లాక్కోవడమే కాక మెడపై కాలుమోపి హత్యచేసే ప్రయత్నం చేశాడు. స్థానికులు ఇది గమనిం చి గట్టిగా అరవడంతో స్వామి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సమ్మక్కను ములుగు ఆస్పత్రికి తరలించారు. -
ఆస్తులు రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లోనే పూర్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పాత పద్ధతిలో నే కొత్తగా ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతోంది. క్రయ, విక్రయదారుల నమోదు నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ వరకు అన్నీ ఆన్లైన్లో పూర్తి చేసి.. నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే సులభంగానే ఈ ప్రక్రియ పూర్తవుతోందని తొలిరోజు పరిశీలన చెబుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా సాగుతుంది! వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సిటిజన్ లాగిన్, డెవలపర్స్, బిల్డర్స్‌కు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. అమ్మేవారు, కొనేవారు, సాక్షుల వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత పీ టిన్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్)ను నమోదు చేయాలి. అయితే ఆ ఆస్తి లేదా భూమి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదై ఉంటేనే సదరు వివరాలు కన్పిస్తాయి. ఆ తర్వాత ఫ్లాట్ విస్తీర్ణం, నిర్మాణ విస్తీర్ణం కన్పిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువ మేర ఫీజు, మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడు స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ కాగానే క్రయ, విక్రయదారులు, సాక్షులు నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ స్లాట్ అడ్వైజరీ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రయ, విక్రయదారులు, సాక్షుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటారు. వెబ్సైట్ నుంచి సబ్రిజిస్ట్రార్లే ఒక ఫారంను డౌన్లోడ్ చేసి సంతకాలు చేయిస్తారు. మళ్లీ దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుంది. మ్యుటేషన్ వివరాలు కూడా అందులో ఉంటాయి. సదరు ఆస్తికి సంబంధించిన ఈ–పాస్‌బుక్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఆ తర్వాత రూ.300 చెల్లిస్తే సదరు ఆస్తికి సంబంధించిన మెరూన్ రంగు పాసుపుస్తకం కొనుగోలుదారుడి ఇంటికి వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి స్టాంపు పేపర్ అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ లోగో, మాస్టర్హెడ్తో తెల్లకాగితం మీదే డాక్యుమెంట్ వస్తోంది. అయితే, ఈ డాక్యుమెంట్‌తో పాటు మెరూన్ రంగు పాసుపుస్తకం ఉంటేనే చట్టబద్ధం అవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా అన్ని వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కడితేనే స్లాట్ బుక్ అవుతుంది. ఆంగ్ల పరిజ్ఞానం లేని వారు, నిరక్షరాస్యులు మీ–సేవకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 పేజీల డాక్యుమెంట్ వస్తుంది. ఇందులో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు, క్రయవిక్రయదారులు, సాక్షుల వివరాలు, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, సేల్ డీడ్ వస్తున్నాయి. ఇక, పాసు పుస్తకం కూడా 2 పేజీలు వస్తుంది. డీఎస్‌కు ‘ధరణి’ కష్టాలు! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌కు ధరణి పోర్టల్ కష్టాలు తప్పలేదు. ఇటీవల తన వ్యవసాయ భూమిని విక్రయించిన ఆయన.. కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సోమవారం నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే, రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆధార్ వెరిఫికేషన్ కోసం వేలిముద్రలు, ఐరిస్ సంబంధిత పోర్టల్‌లో సరిపోలకపోవడంతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిజామాబాద్ రూరల్ మండలం సారంగపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న తన 3.5 ఎకరాల భూమిని ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆయన నవంబర్ 12న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు డీఎస్ వేలిముద్రలు, ఐరిస్ ఆధార్ కార్డులోని వివరాలతో సరిపోలలేదు. దీంతో అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండానే వెనుదిరిగారు. డీఎస్ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోవడంతో ఐరిస్ ట్యాలీ కాలేదని భావించారు. దీంతో ఆయన ఇటీవల ఆధార్ కార్డులో తన వేలిముద్రలు, ఐరిస్‌ను అప్డేట్ చేసుకున్నారు. అప్డేట్ చేసిన ఆధార్ కార్డుతో సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాగా, ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తన వేలిముద్రలు, ఐరిస్ మ్యాచింగ్ కాలేదు. పలుమార్లు వేలిముద్రలు, ఐరిస్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రెవెన్యూ అధికారులు సాంకేతిక నిపుణుడి సాయం తీసుకోవడంతో ఎట్టకేలకు వేలిముద్రలు, ఐరిస్ మ్యాచ్ అయ్యాయి. దీంతో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాన్ని అందజేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం డీఎస్ తహసీల్దార్ కార్యాలయానికి రావడం ఇది మూడోసారి.. తొలి రోజు రిజిస్ట్రేషన్లు 82 సాక్షి, హైదరాబాద్: మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. తొలిరోజు 40 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా జరిగాయని, సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. స్లాట్ బుక్ చేసుకోకుండానే కొందరు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారని, స్లాట్ బుక్ చేసుకొని వారికి రిజిస్ట్రేషన్లు జరపబోమని స్పష్టం చేశారు. మంగళవారం 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 155 రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు స్లాట్లు బుక్ అయ్యాయని వెల్లడించారు. అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంట్ సాక్షి, నెట్వర్క్: అమావాస్య సెంటిమెంట్‌కు తోడు సాంకేతిక సమస్యలతో తొలిరోజు ఆయా జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా కొనసాగింది. నిబంధనల మేరకు పలు పత్రాలను సమర్పించాల్సి ఉండటంతో చాలామంది వాటిని అందజేయలేక ఇబ్బందిపడ్డారు. సర్వర్ల మొరాయింపుతో పలుచోట్ల స్లాట్లు బుక్‌కాలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 21 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కరీంనగర్లో 1 రిజిస్ట్రేషన్ కాగా, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కటీ కాలేదు. అరగంటలోనే పనైంది.. నా భర్త పేరిట ఉన్న ఆర్సీసీ భవనం (బిల్డింగ్) నా పేరిట దానపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. గతంలో దీనికోసం 3 నెలలు తిరిగి వేసారిపోయాం. కొత్త విధానంలో ముందే స్లాట్ బుక్ చేసుకుని.. ఈరోజు దుబ్బాక ఆఫీస్‌కు వెళ్లగా అరగంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. – కాస్తి యాదమ్మ రాములు, ధర్మాజీపేట, దుబ్బాక మున్సిపాలిటీ -
స్లాట్ బుకింగ్: మొరాయిస్తున్న వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ హై కోర్టు ప్రకటించిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రస్తుతానికి స్లాట్ బుక్ చేసుకుని పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. మరి కొద్ది సేపట్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈనెల 14 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. (చదవండి: వ్యవసాయేతర ‘రిజిస్ట్రేషన్లు’ షురూ..) ఇక పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు చేసినప్పటికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. స్లాట్ బుక్ చేసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ మొరాయిస్తుందని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం (డిసెంబర్ 11) నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తులను గతంలో మాదిరే కంప్యూటర్ ఆధారిత విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. Hon’ble CM Sri KCR Garu has directed chief secretary to commence the registration activities of Non-Agricultural properties from tomorrow in accordance with the HC orders — KTR (@KTRTRS) December 10, 2020 ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అభ్యంతరం లేదన్న ధర్మాసనం తేల్చి చెప్పింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సీఏఆర్డీ పద్దతి కొనసాగించాలని పిటిషన్ తరపు న్యాయవాదులు కోరగా.. ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ గతంలో లాగా రిజిస్ట్రేషన్ చేసుకునే విదంగా చూడలని అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్‌కు ప్రోపర్టీట్యాక్స్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని వాదించారు. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లను ఆపిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. ధరణి వివరాలు మాత్రమే ఆపాలని చెప్పామని, రిజిస్ట్రేషన్‌పై ఎలాంటి స్టేలు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. స్లాట్ బుకింగ్‌తోపాటు పీటీఐఎన్(PTIN) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. ధరణి పోర్టల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అనంతరం తతుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. -
భూ మాయ!
సాక్షి, జనగామ: రూ.కోట్లు విలువైన భూమికి ఎసరు పెట్టారు. ఇతర రైతులకు చెందిన భూముల సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేయడంతో 12 ఏళ్ల క్రి తం జరిగిన ఈ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన భూ మాయపై రెవెన్యూ అధికారులు కూపీ లాగుతుండగా బాధిత రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్, లక్ష్మీతండా శివారు రామచంద్రగూడెంలో పలువురు రైతులకు చెందిన సర్వే నంబర్లతో ఓ వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని నడిపినట్లుగా తెలుస్తోంది. 2008 ఫిబ్రవరి 5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కె.లక్ష్మారెడ్డి బూన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీద ఇతర రైతుల సర్వే నంబర్ల పేరుతో జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇతర రైతుల సర్వే నంబర్లను వినియోగించడమే కాకుండా కొందరిని రైతులుగా చూపించి రెండు గ్రామాలకు చెందిన 30 మంది రైతుల సర్వే నంబర్లతో 118 ఎకరాల వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పట్లో సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఈ పన్నాగానికి పాల్పడినట్లు సమాచారం. దరఖాస్తు చేయడంతో వెలుగులోకి.. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న కె.లక్ష్మారెడ్డి మృతి చెందాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారు డు ఇటీవల పట్టాదారు పాసుపుస్తకాల కో సం రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు. పాసుపుస్తకాల కోసం పొందుపర్చిన సర్వే నంబర్లను పరిశీలించిన వీఆర్ఏ సంబంధిత రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ భూములు గతంలోనే రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. రెవె న్యూ రికార్డుల్లోని సర్వే నంబర్లలో ఇతర రైతు ల పేర్లు కనిపిస్తున్నాయి. ఈసీలో మాత్రం కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డి పేరు మీద భూమి ఉన్నట్లు వస్తోంది. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారనే విషయంపై ఆరా తీయడంతో రైతుల సర్వే నంబర్లతో ఓ బ్రోక ర్ మృతి చెందిన కె.లక్ష్మారెడ్డికి అమ్మకం చేసినట్లుగా తె లుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని గుర్తి ంచడం కోసం రెవెన్యూ అధికారు లు రంగం లోకి దిగి విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది రైతుల సర్వే నంబర్లు వినియోగించా రు అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉన్న ఫొటోలు, సంతకాల ఆధారంగా ఆరా తీస్తున్నారు. గుర్తించిన భూమి విలువ రూ.23.60 కోట్లు పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తులో పొందుపర్చిన భూమి విలువ రూ.23.60 కోట్లుగా ఉంటుంది. కె.లక్ష్మారెడ్డి కుమారులు సమర్పించిన పత్రాల్లో ఏడు డాక్యుమెంట్లను గుర్తించారు. వీటిలో 118 ఎకరాలుగా భూమి ఉంది. ఫతేషాపూర్, రామచంద్రాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం ఆ భూములు ఎకరానికి రూ.20 లక్షలపైనే ఉంది. ఇంకా బాధిత రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ భూముల సర్వే నంబర్లతో దళారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంపై బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసీలో తమ పేర్లు గల్లంతు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భూమినే నమ్ముకున్న రైతులకు అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దరఖాస్తు తీసుకోకుండా పంపించా.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు పట్టుకుని లక్ష్మారెడ్డి కుమారుడు వచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చే వరకు ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని చెప్పా. 25వ తేదీ వరకు ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్లను మార్చే అధికారం మాకు లేదు. – భన్సీలాల్, తహసీల్దార్, రఘునాథపల్లి -
స్లమ్స్‌లో రూ.5కే క్రమబద్దీకరణ
సాక్షి, హైదరాబాద్: మురికివాడల్లోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు కేవలం రూ.5 రుసుం చెల్లిస్తే సరిపోనుంది. లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతం ప్లాట్ ధరను చార్జీలుగా చెల్లించాలి. అయితే మురికి వాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చార్జీల నుంచి మినహాయింపు కల్పించనుంది. గత నెల 31న జారీ చేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ జీవో 131లో ఈ మేరకు మరింత స్పష్టతనిస్తూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మురికివాడల్లోని పేద, మధ్యతరగతి ప్రజ లకు ఈ నిర్ణయం వరంగా మారనుంది. లేనిపక్షంలో ప్లాటు విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రూ.వేల నుంచి రూ.లక్షల వరకు రుసుం చెల్లించాల్సి వచ్చేది. జీవోలో ప్రస్తావన లేక ఆందోళన: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీ్ధకరణను ప్రభుత్వం తప్పనిసరిచేసింది. లేనిపక్షంలో సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరపమని, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్–2020లో స్పష్టం చేసింది. మురికివాడల్లోని ప్లాట్ల విషయంలో ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువతో సంబంధం లేకుండా నామమాత్రంగా రూ.5ను ‘క్రమబద్ధీకణ రుసుం’గా చెల్లిస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, లేఅవుట్లో 10 శాతం ఖాళీ స్థలం లేనందుకు చెల్లించాల్సిన 14 శాతం ప్లాట్ ధర చార్జీలు మురికివాడల్లోని ప్లాట్లకు వర్తిస్తాయా? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో మురికివాడల్లో స్థలాలు కలిగి ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు 14శాతం ప్లాటు ధరను చార్జీలుగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ‘సాక్షి’పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ను సంప్రదించగా, మురికివాడల్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ విషయంలో 14 శాతం ప్లాటు ధర చార్జీలు వర్తించవని, దీనిపై త్వరలో క్లారిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. దస్తావేజులో స్లమ్ పేరు ఉండాలి జీహెచ్ఎంసీ పరిధిలో 1,179 నోటిఫైడ్ స్లమ్స్, 297 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ కలిపి మొత్తం 1,476 మురికివాడలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో మరో 700కి పైగా మురికివాడలు ఉన్నాయి. వీటికి సంబందించిన జాబితా స్థానిక పురపాలికతో పాటు మెప్మా అధికారుల వద్ద లభిస్తుంది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులో మురికివాడ పేరు ఉంటే ఈ మేరకు 14శాతం ప్లాటు ధరను ఫీజుగా చెల్లించకుండా మినహాయింపు పొందడానికి వీలుకలగనుంది. ప్లాటు మురికివాడలో ఉన్నా కొన్నిసార్లు దస్తావేజుల్లో సదరు మురికివాడ పేరుకు బదులు వేరే పేర్లు ఉండే అవకాశముంది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్లాట్లకు సంబంధించిన గత 20, 30 ఏళ్ల కాలానికి సంబంధించిన పహాణీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తీస్తే అందులో మురికివాడ పేరు ఉండే అవకాశలుంటాయి. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులో ఆ మేరకు కాలనీ పేరు సవరణ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపు నుంచి రాయితీ పొందడానికి అవకాశం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
‘ఎల్ఆర్ఎస్’ ఊరట
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ చార్జీలు తగ్గనున్నాయి. లే–అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల(ఎల్ఆర్ఎస్)–2020 ఉత్తర్వుల(జీవో 131)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం కొత్త ఉత్తర్వులు(జీవో 135) జారీ చేశారు. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న ప్లాట్ల మార్కెట్ విలువ ఆధారంగా చార్జీలు వసూలు చేస్తామని బుధవారం శాసనసభలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఖాళీ స్థలం లేకుంటే.. రిజిస్ట్రేషన్ తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా 14 శాతాన్ని చెల్లిస్తే సరిపోతుందని కొత్త జీవో ద్వారా కీలక సవరణ జరపడంతో దరఖాస్తుదారులకు భారీ ఊరట కలగనుంది. తగ్గనున్న భారం.. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ మొత్తం ధరలో 14శాతాన్ని చెల్లించాలని జీవో 131లో ఉండటంతో దరఖాస్తుదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తే లక్షల రూపాయల్లో చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, రిజిస్ట్రేషన్ తేదీ నాటి మార్కెట్ విలువ ఆధారంగా ప్లాట్ ధరలో 14 శాతాన్ని చెల్లించాలని తాజాగా సవరణ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరగడానికి ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలతో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులకు మాత్రం ఈ సవరణతో ఎలాంటి లబ్ధి ఉండదు. వారు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారం గానే.. 14 శాతాన్ని చెల్లించాల్సి రానుంది. అయితే, పాత జీవోలో పేర్కొన్న ప్రకారం 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే క్రమబద్ధీకరణ చార్జీలు వర్తించనున్నాయి. అదే విధంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసేందుకు చెల్లించా ల్సిన నాలా చార్జీలను ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవస రం లేదని ప్రభుత్వం పేర్కొనడం మరో ఊరట కలిగించే అంశం. శ్లాబులు 4 నుంచి 7కి పెంపు.. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ చార్జీలను ప్రకటిస్తూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో 131 జారీ చేసింది. 2020, ఆగస్టు 26 నాటికి ఉన్న ప్లాటు మార్కెట్ విలువ ఆధారంగా ‘కనీస క్రమబద్ధీకరణ చార్జీ’ల్లో నిర్ణీత శాతాన్ని కనీస క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాలని తొలి జీవోలో పేర్కొంది. అలాగే క్రమబద్ధీకరణ చార్జీలను నాలుగు శ్లాబులుగా విభజించింది. సవరణ ఉత్తర్వుల ప్రకారం.. శ్లాబుల సంఖ్యను 4 నుంచి 7కు పెంచింది. ఆ మేరకు క్రమబద్ధీకరణ చార్జీల శాతాన్ని సైతం తగ్గించింది. అసెంబ్లీలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్–2015 పథకంలో పేర్కొన్న శ్లాబులనే తాజాగా సవరించిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పొందుపరిచింది. దీంతో క్రమబద్ధీకరణ చార్జీల భారం దరఖాస్తుదారులపై తగ్గనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
క్రమబద్ధీకరణలో ఊరట
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులకు భారీ ఊరట లభించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయానికి ఉన్న మార్కెట్ రేట్ల ఆధారంగానే క్రమబద్ధీకరణ రుసుములు వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 ఆగస్టు 28 తేదీన అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో (131)లో పేర్కొంది. చాలా ఏళ్ల కింద, అప్పటి మార్కెట్ విలువ ప్రకారం తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగాభారీగా క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. గడిచిన దశాబ్దకాలంలో భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. తాజా మార్కెట్ విలువ ప్రకారం చాలా చోట్ల 200 గజాల స్థలానికి సైతం రూ.లక్షల్లో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమబద్ధీకరణ రుసుములు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండటాన్ని శాసనసభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దృష్టికి తెచ్చారు. దీంతో ఎల్ఆర్ఎస్ (జీవో 131) విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉప్రకమించింది. బుధవారం శాసనసభలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఆయా స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే ఫీజులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈమేరకు సవరించిన ఉత్తర్వును గురువారమే వెలువరించనున్నట్టు ప్రకటించారు. తాము తీసుకున్న చర్యల్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకునేందుకు వెనకాడబోమని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. చాలా కాలం కింద భూములు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉపశమనం లభించనుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎంత పాతది అయితే అంత ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. ఆరేళ్లుగా అదే మార్కెట్ విలువ.. మరోవైపు గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. అంటే గత ఆరేళ్లలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు యధావిధిగా భారీ మొత్తంలో క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరించుకోకపోతే అనధికార, అక్రమ ప్లాట్ల క్రయావిక్రయాల రిజిస్ట్రేషన్లను జరపమని, వీటిల్లో భవన నిర్మాణాలకు సైతం అనుమతులు జారీ చేయమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్లాట్లు, లేఅవుట్ల యజమానులు నిర్బంధంగా క్రమబద్ధీకరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది తమ ప్లాట్లను బేరానికి పెడుతున్నారు. కొనుగోలుదారులు బయానాగా క్రమబద్ధీకరణ చార్జీలు భరించాలని, ఆ తర్వాత మిగిలిన డబ్బులను రిజిస్ట్రేషన్‌లో సమయంలో తీసుకుంటామని ప్లాట్ల యజమానులు ఆఫర్ చేస్తున్నారు. మురికివాడల్లో మినహాయింపు ఇవ్వాలి... భవన నిర్మాణ నిబంధనల ప్రకారం నోటిఫైడ్ స్లమ్స్‌లో భవన నిర్మాణ అనుమతుల జారీకి భారీ రాయితీలు, సడలింపులున్నాయి. ఇతర చోట్లలో వసూలు చేసే భవన నిర్మాణ చార్జీలతో పోల్చితే మురికివాడల్లో నాలుగో వంతు చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే విధంగా లేఅవుట్ అనుమతులు లేకపోయినా /ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ చేసుకోకపోయినా మురికివాడల్లోని ప్రజల నుంచి ఇళ్ల నిర్మాణ అనుమతుల జారీ సమయంలో ఎలాంటి జరిమానాలు, చార్జీలు వసూలు చేయడం లేదు. తాజాగా ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకం కింద మురికివాడల్లోని స్థలాల క్రమబద్ధీకరణకు చదరపు మీటర్‌కు రూ.5 చొప్పున కనీస క్రమబద్ధీకరణ చార్జీలకు తోడుగా, స్థలం మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు క్రమబద్ధీకరణ చార్జీలుగా చెల్లించాల్సి రానుంది. మురికివాడల్లోని పేదలకు ఇది భారం కాబట్టి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.