
సాక్షి, అమరావతి: తాత్కాలిక (నోషనల్) ఖాతాలున్న రైతులకు రెవెన్యూ శాఖ చుక్కలు చూపుతోంది. ఏళ్ల తరబడి తాత్కాలిక ఖాతాలు అలాగే కొనసాగుతున్నాయి. వీటిని శాశ్వత ఖాతాలుగా మార్చి వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లు నమోదు చేసి ఇ–పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో 13 లక్షలుపైగా నోషనల్ ఖాతాలున్నట్లు తేలడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. నోషనల్ (తాత్కాలిక) ఖాతాలను శాశ్వత ఖాతాలుగా మార్చాలంటూ అధికారులు, మంత్రులకు రైతులు వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ‘మీసేవ’, గ్రీవెన్స్ సెల్స్, రెవెన్యూ సదస్సులు, జన్మభూమి సమావేశాల్లో తమ కష్టాలను మొరపెట్టుకుంటున్నా ఆలకించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్ చేపట్టినా..
తాత్కాలిక ఖాతాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న చిక్కులను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేత రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)గా ఉన్నప్పుడు గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, క్షేత్రస్థాయిలో అధికారులు చొరవ చూపకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదు. స్పెషల్‌డ్రైవ్‌లో 1.12 లక్షల తాత్కాలిక ఖాతాలు మాత్రమే శాశ్వత ఖాతాలుగా మారాయి. గత ఏడాది సెప్టెంబరులో 17.37 లక్షలున్న నోషనల్ ఖాతాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్ పూర్తయ్యేనాటికి 16.25 లక్షలకు తగ్గింది. తదుపరి కూడా సీసీఎల్‌ఏ ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి పెంచడంతో నెల క్రితం నాటికి తాత్కాలిక ఖాతాల సంఖ్య 13.08 లక్షలకు తగ్గింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అత్యధికంగా 2,36,789, శ్రీకాకుళం జిల్లాలో 2,25,360, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2,21,240 తాత్కాలిక ఖాతాలు ఉండటం గమనార్హం.
అత్యవసరమై అమ్మాలన్నా కుదరదు...
గతంలో తాత్కాలిక ఖాతా ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. క్రయవిక్రయాలకు ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత తాత్కాలిక ఖాతాల్లోని సర్వే నంబర్లలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్లు చేయరాదని, బ్యాంకులు ఈ భూములకు రుణాలు ఇవ్వరాదని అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆడపిల్లల పెళ్లిళ్లు, పిల్లల చదువులు, ఖరీదైన జబ్బులకు వైద్యం లాంటి అవసరాల కోసం భూమి అమ్ముకోవాలన్నా దీనివల్ల వీలుకాని పరిస్థితి ఏర్పడింది. నోషనల్ ఖాతాల్లోని భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 2016 ఆగస్టు 12న అన్ని సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలకు 3/6033/2016 నంబరుతో అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది.
ఇబ్బందులు వాస్తవమే : అధికారులు
ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా ‘తాత్కాలిక ఖాతాలవల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. ‘కొన్ని చోట్ల వాస్తవంగా ఉన్న భూమికి, రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకున్న, భాగపరిష్కారం చేసుకున్న భూ విస్తీర్ణానికి మధ్య తేడా ఉంది. సబ్ డివిజన్ చేయాలంటే సర్వేయర్ల కొరత ఉంది. కొన్ని చోట్లేమో న్యాయపరమైన చిక్కులున్నాయి. సబ్ డివిజన్ చేసినవి కూడా రిజిస్ట్రేషన్ కాని సంఘటనలూ ఉన్నాయి. రెవెన్యూ, స్టాంపులు – రిజిస్ట్రేషన్లు, సర్వే – సెటిల్‌మెంట్ శాఖలతో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలపై మార్గదర్శకాలు జారీ చేయాలి. సర్వేయర్ల కొరత పరిష్కరించనిదే ఇది సాధ్యం కాదు. వాస్తవంగా ఉన్న భూమికి రైతుల వద్ద రికార్డుల్లో రాసుకున్న భూమికి మధ్య తేడా ఉంటే వారే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటే తప్ప తాత్కాలిక ఖాతాలు రద్దు చేసి శాశ్వత ఖాతాలు ఇవ్వడం వీలుకాదు’ అని పేర్కొన్నారు.
నోషనల్ ఖాతా అంటే..?
కొనుగోలు, వంశపారంపర్యంగా, భాగ పరిష్కారం ద్వారా ఎవరికైనా భూమి సంక్రమించినప్పుడు రెవెన్యూ శాఖ వెంటనే శాశ్వత ఖాతా ఇవ్వదు. కొత్తగా భూమి పొందిన రైతు పేరుతో తాత్కాలిక ఖాతా నమోదు చేస్తుంది. దీన్నే నోషనల్ ఖాతా, అన్‌సెటిల్డ్ ఖాతా అని కూడా అంటుంటారు. ఆ భూమి యాజమాన్య హక్కులపై ఎలాంటి వివాదాలు లేవని రెవెన్యూ అధికారులు నిర్ధారించిన తర్వాత తాత్కాలిక ఖాతాను శాశ్వత ఖాతాగా మార్చాల్సి ఉంటుంది. శాశ్వత ఖాతాగా మారిన తర్వాతే రైతుకు ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, భూయాజమాన్య హక్కు పత్రం(టైటిల్ డీడ్) జారీ చేస్తారు. వెబ్‌ల్యాండ్‌లో భూమి హక్కుదారుగా నమోదు చేస్తారు. రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, సిబ్బంది స్వార్థం, విస్తీర్ణంలో తేడాలు తదితర కారణాల వల్ల లక్షల సంఖ్యలో నోషనల్ ఖాతాలు ఏళ్ల తరబడి శాశ్వత ఖాతాలుగా మారకుండా అలాగే ఉండిపోతున్నాయి. వాస్తవంగా రెవెన్యూ చట్టంలో నోషనల్ ఖాతా అనేది లేదు. చంద్రబాబు సర్కారు దీన్ని తెచ్చి రైతులను ఇబ్బందుల్లో పడేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవట్లేదు..
మాకు వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాం. రైతుల సదస్సు సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకం అడిగితే శాశ్వత ఖాతా లేదని అధికారులు పేర్కొనటంతో వెంటనే దరఖాస్తు సమర్పించా. మూడేళ్ల నుంచి తిరుగుతున్నా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వలేదు. నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. భూమి అమ్మి పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే పాసు పుస్తకం లేనందున వీలు కావడం లేదు. ఈ సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నానో లెక్కే లేదు.
– కరణం అసిరినాయుడు, పాలవలస, సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం జిల్లా.
రెండేళ్లుగా పరిష్కారం కాలేదు..
రెండేళ్ల కిందట చిత్తూరు జిల్లా కురబలకోట మండలం పెద్దపల్లి పంచాయతీలో రెండెకరాల భూమి కొన్నా. అప్పట్లో తాత్కాలిక ఖాతా ఇచ్చారు. శాశ్వత ఖాతాగా మార్చి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో లెక్కే లేదు. ఆర్థిక సమస్యల వల్ల భూమి అమ్మాలని నిర్ణయించుకున్నా. బేరం కూడా కుదిరింది. వెబ్ ల్యాండ్‌లో నమోదు కానందున ఈ భూమి రిజిస్ట్రేషన్ కాదని అధికారులు చెబుతున్నారు.
– జయచంద్రారెడ్డి, పెద్దపలి, కురబలకోట మండలం, చిత్తూరు జిల్లా
శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావు మూడేళ్ల క్రితం నాలుగెకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన కొనుగోలు చేసిన సర్వే నంబరులో వాస్తవంగా ఉన్న భూమి కంటే రెవెన్యూ రికార్డుల్లో ముగ్గురు హక్కుదారుల పేరుతో ఎక్కువ విస్తీర్ణం నమోదై ఉందంటూ అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో వెబ్‌ల్యాండ్‌లో తన పేరు నమోదు చేయాలంటూ ఆయన కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నారాయణస్వామి పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బుతో రెండేళ్ల క్రితం ఐదెకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని వెబ్‌ల్యాండ్‌లో చేర్చాలని దరఖాస్తు చేసుకోగా అమ్మిన వ్యక్తి సోదరి సంతకం లేనందున భూయాజమాన్య హక్కు నమోదు చేయడం కుదరదంటూ రెవెన్యూ అధికారులు కొర్రీ పెట్టారు (బాధితుల కోరిక మేరకు పేర్లు మార్చాం). వారసత్వంగా, భాగస్వామ్య పరిష్కారం, కొనుగోలు ద్వారా భూములు పొందిన లక్షల మంది ఇలా సమస్యలతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.