revenue department
-
జీవో 59తో రూ.6 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న జీవో 59ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. ఈ జీవో కింద వచ్చిన 50వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఆదాయ వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి దీనిపై నివేదిక కూడా సమర్పించింది. ఈ జీవో అమలును నిలిపివేయడానికి ముందువరకు రూ.534 కోట్ల ఆదాయం వచ్చిoదని.. మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా మరో రూ.500 కోట్లు వస్తాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే జీవో కింద అధిక విలువ గల భూములను క్రమబద్దీకరిస్తే ఇంకో రూ.5,500 కోట్లు వస్తాయని... జీవో 76, 118 దరఖాస్తుల పరిష్కారం ద్వారా అదనంగా రూ.300 కోట్లు అందుతాయని వివరించినట్టు సమాచారం. ఏడాది నుంచి ఎదురుచూపులే.. జీవో 59 కింద భూముల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఏడాది నుంచి ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నా... ఎలాంటి పలుకుబడి లేని సాధారణ ప్రజలు మాత్రం వీటి పరిష్కారం ఇంకెప్పుడు అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ జీవో కింద పరిశీలన పూర్తయి డిమాండ్ నోటీసు మేరకు డబ్బులు పూర్తిగా చెల్లించినవారు, పాక్షిక మొత్తం చెల్లించినవారు, తనిఖీలు పూర్తిచేసుకున్న వారు, కన్వేయన్స్ డీడ్లు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం విధించిన స్టేతో ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేనివారు వేల మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ సర్కారు నిర్ణయం పట్ల ఆశతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, అదే క్రమంలో అర్హులైన వారికి భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రక్రియ కొనసాగుతుండగానే.. జీవో 59 కింద ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం 2022, 2023 సంవత్సరాల్లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 31 వేలు, మిగతా అన్ని జిల్లాల్లో 26 వేల వరకు.. మొత్తంగా 57 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వం 32,788 దరఖాస్తులను ఆమోదించి సదరు లబ్దిదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 10వేల మందికిపైగా ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి కన్వేయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు) కూడా పొందారు. డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు కట్టినా.. కన్వేయన్స్ డీడ్లు జారీకానివారు మరో 3 వేల మందికి పైగా ఉన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కారు ఏర్పాటవగా.. అదే నెల 11వ తేదీ నుంచి ఈ జీవోకు సంబంధించిన పోర్టల్‌ను నిలిపివేశారు. ఆ జీవో కింద అప్పటికే చేసిన క్రమబద్దీకరణలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని విలువైన భూములను బీఆర్ఎస్ నేతలు క్రమబద్ధీకరించుకున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే అలాంటివన్నీ ముందే జరిగిపోయాయని... సాధారణ ప్రజల దరఖాస్తులే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని దరఖాస్తు దారులు పేర్కొంటున్నారు. హక్కులు కల్పించని కారణంగా ఈ భూములు ఇటు తమవి కాకుండా, అటు ప్రభుత్వానివి కాకుండా మిగిలిపోతున్నాయని పేర్కొంటున్నారు. అసలు జీవో 59 ఏంటి?తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 డిసెంబర్ 30న తొలిసారి జీవో 59 విడుదల చేసింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 2022, 2023 సంవత్సరాల్లో ఆ జీవోలో స్వల్ప మా ర్పులు చేస్తూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు.చివరిగా 2023లో విడుదల చేసిన జీవో ప్రకారం... క్రమబద్దీకరణ కోసం 125 నుంచి 250 గజాల వరకు స్థలాలకు మార్కెట్ విలువలో 25 శాతం... 250 గజాల నుంచి 500 గజాల ఉన్న స్థలాలకు 50శాతం, 500–750 గజాల స్థలాలకు 75శాతం, 750 గజాలపైన ఉంటే మార్కెట్ విలువలో 100 శాతం సొమ్ము చెల్లించాలి. క్రమబద్దీకరణ సంబంధించిన మరో జీవో 58 ప్రకారం... 125 చదరపు గజాలలోపు భూమిలో నిర్మాణాలుంటే ప్రభుత్వం ఉచితంగా క్రమబద్దీకరిస్తుంది. తొలుత 2014 జూన్ 2 నాటికి ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్దీకరిస్తామని జీవోలో పేర్కొన్నా.. 2023లో విడుదల చేసిన జీవోలో దరఖాస్తు చేసుకునే నాటికి ఆక్రమణలో ఉన్నా క్రమబద్దీకరిస్తామని సర్కారు పేర్కొంది. -
ఆ భూములు ఇవ్వండి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ)లకు గతంలో కేటాయించిన భూము ల్లో.. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్నవాటిని తిరిగి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. మొత్తంగా 10 వేల ఎకరాలకుపైగానే నిరుపయోగంగా ఉన్నాయని ఇప్పటికే గుర్తించింది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ భూములను ప్రభుత్వ ధర తీసుకుని తమకు అప్పగించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని రెవెన్యూ వర్గాల సమాచారం. మిధాని, డీఆర్డీవో, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీహెచ్ఈఎల్, హెచ్ఏ ఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఎల్ వంటి సంస్థల భూములు ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణా రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్ ఉందని, దీంతో ఈ డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశముందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. దశాబ్దాల కింద కేటాయింపు.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం దశాబ్దాల క్రితం పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ భూములను కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అంగీకారంతోపాటు నిబంధనలకు అనుగుణంగా అప్పగించిన ఈ భూములను ఆయా సంస్థలు తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. అయితే ఆ సంస్థలు ఏ మేరకు భూములను వినియోగించుకుంటున్నాయన్న దానిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ఇటీవల వివరాలు సేకరించింది.రాష్ట్రంలోని 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం 8,900 ఎకరాలు కేటాయించగా.. అందులో 2,300 ఎకరాలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని, మిగతా భూములను నిరుపయోగంగా వదిలేశారని తేలింది. వీటితోపాటు ఇప్పటికే మూతపడిన సిమెంట్ కార్పొరేషన్, డ్రగ్స్ లిమిటెడ్, హెచ్‌ఎంటీల పరిధిలో మరో 3,300 ఎకరాల వరకు భూమి ఉందని రెవెన్యూ శాఖ గుర్తించింది. రూ.45 వేల కోట్ల విలువతో.. హైదరాబాద్ నగరానికి శివార్లలో, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ నిరుపయోగ భూముల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.45 వేల కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఈ భూములను ప్రభుత్వ ధరకు తిరిగి తీసుకోవడం ద్వారా... పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య అవసరాలకు, వేలం వేసి నిధుల సమీకరణ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వానికి ఇచి్చన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.ఆ నివేదిక ప్రకారం... ప్రభుత్వ ధరతో ఆ భూములను తిరిగి తీసుకోవాలంటే రూ.8 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేసినట్టు సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించిందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే కోరినా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన నిరుపయోగ భూములను ఇవ్వాలని గత బీఆర్ఎస్ సర్కారు కూడా కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2022లో కేంద్రానికి లేఖ రాశారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర పీఎస్‌యూల భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మవద్దని... రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు. కానీ కేంద్రం అప్పట్లో సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఎలా స్పందిస్తున్నదని తేలాల్సి ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. -
హరీశ్‌రావు కొన్న భూములపై విచారణ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్‌రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని.. దీనివల్ల రైతుల భూములు పోతాయని బెదిరించి హరీశ్ ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. హరీశ్ భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేశారని దుయ్యబట్టారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని... ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న హరీశ్‌రావు.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని పొంగులేటి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పొంగులేటి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక దాన్ని రద్దు చేయలేరని.. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆరెస్టు చేయట్లేదంటూ ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి.. అందుకు వీలుగా గవర్నర్ చేత అనుమతి ఇప్పించాలని సూచించారు. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నామని, తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశాల్లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే కులగణన, రైతు రుణమాఫీ, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ, సోనియాగా>ంధీ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌తో నాటి ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చంచనున్నట్లు సమాచారం. కేంద్రం స్పష్టత ఇస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కాస్త అస్పష్టంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత కోరుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెరుగుతుందన్నారు. ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైతే పథకం వేగం పుంజుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రివర్గ విస్తరణ! మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న ప్రశ్నకు ఆయన నేరుగా స్పందించలేదు. తాను మంత్రిని మాత్రమేనని, మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని వ్యాఖ్యానించారు. -
ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన 45 రోజుల్లోగా కొత్త రెవెన్యూ చట్టం
త్వరలో జీవో 59 దరఖాస్తుల పరిష్కారంజీవో 59 కింద అక్రమంగా భూములను క్రమ బద్ధీకరించుకున్నారు. నానక్‌రాంగూడలో రూ.3 వేల కోట్ల ఖరీదైన 32 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. మేం రాగానే వాటిని వెనక్కు తీసుకున్నాం. అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో జీవో 59 దరఖాస్తులను పరిష్కరిస్తాం.సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2020 స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీలైతే అసెంబ్లీలో పెట్టి లేదంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే రూపొందించిన ముసా యిదా చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచ నలు వస్తున్నాయన్నారు. సూచనలు తీసుకునే గడువును ఈనెల 23నుంచి మరో వారం పొడిగి స్తామని చెప్పారు. గడువు ముగిసిన 45 రోజుల్లో గా కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు రెవె న్యూ సంబంధిత అంశాలపై ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త చట్టం, ధరణి పోర్టల్‌లో తెస్తున్న మార్పులు, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు హక్కుల కల్పన, భూముల విలువల సవరణ, జీవో 59 దరఖా స్తులు వంటి అంశాలపై పొంగులేటి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..ధరణితో ప్రజలు కుదేలు: గత ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాల భూమి డేటాను విదేశీ కంపెనీకి అప్పగించినందుకే మేం ధరణి పోర్టల్‌ను తప్పుపడుతున్నాం. ఇది రైతుల మెడలో పెద్ద గుదిబండ. ఈ పోర్టల్ కారణంగా ప్రజలు కుదేలయ్యారు.. తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని తెచ్చిన చట్టం ఇది. ప్రజలు తమ భూమి తమకు రావాలని దేవుళ్లకు దండం పెట్టారో లేదో తెలియదు కానీ, దొరకు, కలెక్టర్లకు మాత్రం పొర్లు దండాలు పెట్టాల్సి వచ్చింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. తినీతినక కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని అమ్ముకునే హక్కును కాలరాసింది. పుట్టలో పాముల్లా అక్రమాలుమేం అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే పుట్టలో పాముల్లాగా ధరణిలో వందలాది అక్రమాలు బయటకు వస్తున్నాయి. రెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మూడు నిమిషాల్లో మ్యుటేషన్ అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు ఆస్కారం కల్పించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్లు చేసుకుని తాళాలు వేసుకున్నారు. వాళ్లేం చేశారో కలెక్టర్లకు కూడా తెలియదు. హెడ్ ఆఫీస్, విదేశీ కంపెనీకి మాత్రమే తెలుసు. మేం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అన్ని వివరాలు ప్రజా బాహుళ్యంలో పెట్టించాం లొసుగులు సవరించేందుకే చట్టం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామంటే.. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఆత్రుతగా తప్పులు చేయడం కాదు. పేరు మార్చడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మన నిర్ణయాలతో తరతరాలు ముందుకెళ్లాలి. అందుకే భేషజాలకు పోకుండా ధరణి పోర్టల్‌ను మాత్రమే కాదు. చట్టంలోని లొసుగులను సవరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. ఆర్వోఆర్ చట్టం–2020 కారణంగానే సమస్యలన్నీ వచ్చాయి.80–85 వేల దరఖాస్తులే పెండింగ్‌లో..మేం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించాం. అప్పటికే 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిరోజూ 3–5 వేల కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టి 1.28 లక్షల దరఖాస్తులు పరిష్కరించాం. అంతేకాదు రోజూ పరిష్కరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు పోర్టల్‌లో 80–85 వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా నమోదు చేయిస్తున్నాం. అభిప్రాయ సేకరణకు జిల్లా స్థాయిలో సదస్సులుకొత్త చట్టం ముసాయిదాపై చెట్టుకింద కూర్చునే సామాన్య రైతు నుంచి దొర వారు ఇచ్చే సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరుపుతాం. దేశంలోనే రోల్‌మోడల్ చట్టంగా రూపొందిస్తాం. దీని ద్వారా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందుతాయి. పోర్టల్‌లోని దరఖాస్తు పద్ధతిని మార్చేస్తాం. ఇప్పటివరకు ఉన్న 33 మాడ్యూళ్ల స్థానంలో ఒకటే మాడ్యూల్ తెస్తాం. రైతుల ఏ సమస్యపై అయినా ఈ మాడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పహాణీలో 35 కాలమ్‌లు ఉండేవి. 100 ఏళ్ల చరిత్ర ఉండేది. ఇప్పుడు ఒక్కటే కాలమ్ ఉంది. దీని స్థానంలో 14–16 కాలమ్‌లతో కొత్త పహాణీ అందుబాటులోకి తెస్తాం. సీసీఎల్ఏ స్థాయిలో కూడా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కటాఫ్ డేట్ నిర్ణయిస్తున్నాం. సీసీఎల్ఏకు వచ్చిన దరఖాస్తులు వారం రోజుల్లోగా పరిష్కారం కావాలని ఆదేశిస్తా. ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా?దొరగారు చెపితే వినలేదని 23 వేల మందిని అర్ధరాత్రి వేరే శాఖకు బదిలీ చేశారు. వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూకు సాక్ష్యాలు లేకుండా చేశారు. మేం రాష్ట్రంలోని 10,945 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు కాపలాదారులను నియమించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఇంట్లోకి ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా? పేదోళ్ల భూములు వారికే పంచుతాంపేదలకు ఇందిరమ్మ పంచిన భూములు లాగేసుకున్నారు. అలాంటి భూములు గుర్తించాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటినీ తిరిగి పేదలకు పంచుతాం. పేదోడి భూమి ధనికుల చేతికి వెళ్లనివ్వం. ఆ కోణంలోనే అసైన్డ్ భూములపై అమ్మకపు హక్కు కల్పిస్తాం. కొత్త చట్టం ఏర్పాటు కాగానే మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న 9 లక్షల దరఖాస్తులకు తోడు కొత్తగా వచ్చే వాటిని ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం భూముల విలువల సవరణలో శాస్త్రీయత పాటించలేదు. మేం అధికారులు, థర్డ్ పార్టీ నుంచి వివరాలు సేకరించాం. రెండింటినీ క్రోడీకరించి త్వరలోనే న్ణియం తీసుకుంటాం. పార్టీ ఆస్తులు ఏం చేయాలా అని దొర ఆలోచిస్తున్నాడు‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం 100 శాతం ఖాయం. అయితే బీఆర్ఎస్ పేరిట ఉన్న ఆస్తులు, డబ్బులు ఏం చేయాలనేదానిపై దొర ఆలోచిస్తున్నాడు. పార్టీని విలీనం చేయకుండా కవితకు బెయిల్ రాదు. మేం కేంద్రంలో అధికారంలో లేము కనుక ఆ కేసులు తప్పించడం మాతో కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ జోలికి రాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్ మాత్రమే పడింది. ప్రతి దానికీ ఆషాఢాలు, శ్రావణాలు ఉంటాయి కదా! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. నెలాఖరులోనే జేఎన్జే సొసైటీకి భూమిని సీఎం చేతుల మీదుగా అప్పగిస్తాం. ఈ సొసైటీలో లేని మిగిలిన వారికి ఎలా ఇవ్వాలన్న దానిపైనా ఆలోచిస్తున్నాం. ఇతర సొసైటీల సభ్యత్వాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. -
భూ అక్రమాలు క్షేత్ర స్థాయిలో కనిపించలేదు
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో భూ అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు చేస్తున్న దు్రష్పచారానికి తెరపడినట్లే. భూ అక్రమాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.. జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్‌తో కలిసి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భూ అక్రమాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదని చెప్పారు. మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి, ఆయన కుమారుడు దాదాపు 2 వేల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను బెదిరించి రాయించుకున్నారనే ప్రచారంపైనా పరిశీలించామని చెప్పారు. అయితే, జిల్లాలో 2,600 ఎకరాలు ప్రీహోల్డ్కు అవకాశం ఉండగా, వాటిలో 626 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసి 22ఎ నుంచి తీసివేశారని తెలిపారు. ఇందులో 4 మండలాల పరిధిలోని 133 ఎకరాలు మాత్రమే కొత్త వారి పేరుతో రిజి్రస్టేషన్ జరిగిందని చెప్పారు. ఇందులో మాజీ సీఎస్‌కు ప్రమేయం ఉందని చెప్పలేమని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం 20 ఏళ్లు దాటిన డి పట్టా భూములను ఎవరైనా కొనొచ్చని తెలిపారు. జిల్లాలో అసైన్డ్, డి పట్టా భూములను ఫ్రీ హోల్డ్ చేసి, రిజి్రస్టేషన్ వంటివి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. త్వరలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరం విస్తరించడం, భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల విశాఖలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఏడాది క్రితం వరకు లేఅవుట్లకు అనుమతి ఉందో లేదో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలిసేది కాదని, నూతన విధానం వల్ల ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఎర్రమట్టి దిబ్బల్లో అనుమతులివ్వలేదు ఎర్రమట్టి దిబ్బల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వలేదని తెలిపారు. అక్కడ కొంత భూమిని చదును చేస్తుండగా, జిల్లా యంత్రాంగం నిలిపేసిందని తెలిపారు. దసపల్లా ఎస్టేట్ భూములపై కోర్టు కేసులున్నాయన్నారు. 60 ఎకరాల్లో 14.5 ఎకరాల ప్రభుత్వ భూమిని 22ఎ లో పెట్టారని, మిగతా భూమిని ఏ విధంగా పరిష్కరించాలో మార్గాలను వెదుకుతున్నామని అన్నారు. ఎస్టేట్ భూములపై సెటిల్మెంట్ ఆఫీసర్ ల్యాండ్ రెంట్ పట్టా ఇవ్వడాన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సిటీ మ్యాప్ తయారుచేసి, ప్రభుత్వ, ప్రభుత్వేతర భూములను, రోడ్లు, పార్కులు వంటివి రంగులతో చూపుతామని, దీనివల్ల ఆక్రమణలకు ఆస్కారం ఉండదని తెలిపారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ కార్యాలయంలో భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. -
రూ.250 కోట్ల మఠం భూమి హాంఫట్.. కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గ్యాంగ్ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోంది. అధికారమే అండగా రూ.250 కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని అమాంతం మింగేసింది. నాని అనుచరులు.. అభ్యంతరం చెప్పిన దేవదాయశాఖ సిబ్బంది బట్టలు విప్పి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నానాబూతులు తిట్టి నిర్బంధించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నా ‘డోంట్ కేర్’ అంటూ వారి ఎదుటే.. దేవుడి మాన్యానికి దర్జాగా ప్రహరీ నిర్మించారు. నానీస్ గ్యాంగ్ అక్రమాలపై ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనం తిరుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనూ, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పనంగా కొట్టేసి.. సొమ్ము చేసుకోవడమే లక్ష్యం.. తిరుపతి రూరల్ మండలం అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 145, 147/1లో సుమారు 10 ఎకరాల విలువైన దేవుడి మాన్యం భూమిని నాని గ్యాంగ్ ఆక్రమించుకుంది. ఇక్కడ అంకణం కనీసం రూ.4 లక్షల వరకూ ఉంది. మొత్తం10 ఎకరాలు బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లు పలుకుతోంది. నాని గ్యాంగ్ దీన్ని అప్పనంగా కొట్టేసి, అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.250 కోట్లకు స్కెచ్ వేశారంటే అధికార పారీ్టలోని ఎవరో ‘ముఖ్య’నేత ప్రమేయం ఉండకుండా ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు మూడు.. మీకు ఏడు హథీరాంజీ మఠానికి చెందిన భూమిని స్వాదీనం చేసుకోవడానికి చూస్తున్న ముగ్గురు వ్యక్తులతో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి మఠం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తనకు మూడెకరాలు కేటాయించాలని.. మీరు ఏడెకరాలు తీసుకోవాలని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. అంతటితో ఆగని నాని ఆ తర్వాత ఆ ఏడెకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటానని చెప్పడంతో ఆ ముగ్గురు షాక్ అయ్యారు. ‘ఆ ఏడెకరాలకు రూ.25 కోట్లు ఇస్తా.. ఆ నగదును ముగ్గురు పంచుకోండి. దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉంది’ అని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఆ ముగ్గురూ తెల్లముఖం వేశారని సమాచారం. పనులు ప్రారంభం ఆ పదెకరాలు చుట్టూ జూన్ 9న ఉదయం 7 గంటలకు ప్రహరీ గోడ వేయడానికి నానీస్ గ్యాంగ్ పనులు ప్రారంభించింది. ఈ సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అధికారులు, మఠం సిబ్బంది అందరూ కలిసి జూన్ 10న ఆ స్థలం వద్దకెళ్లి ప్రహరీ నిర్మించడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ 100 మందికిపైగా నాని గూండాలు కాపుకాస్తున్నారు. ‘మేమెవరో తెలియదా?, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? మూసుకుని వెళ్లండి’ అంటూ బెదిరింపులకు దిగారు. అయితే మఠం అధికారులు పనులు ఆపాల్సిందేనంటూ గట్టిగా వాదించారు. దీంతో కోపోద్రిక్తులయిన టీడీపీ గూండాలు మఠం సిబ్బందిని తాత్కాలికంగా నిర్మించుకున్న గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీయించారు. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ప్రాణ భయంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు కాళ్లా వేళ్లా పడి బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి మఠం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మఠం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చంద్రగిరి డీఎస్పీ జూన్ 11న నాని గ్యాంగ్‌ను, దేవదాయ శాఖ అధికారులను అక్కడకు పిలిపించుకున్నారు. పోలీస్ స్టేషన్లో సైతం గ్యాంగ్ ఓ దశలో అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో దేవదాయ అధికారులకు ‘నాని గ్యాంగ్’ వారి్నంగ్ ఇచి్చనట్లు తెలుస్తోంది. ఎక్కడా ఈ అంశంపై నోరు మెదపవద్దని మండిపడినట్లు సమాచారం. తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి లేదని హుకుం జారీచేసినట్లు తెలుస్తోంది. ఆందోళనకు ప్రజా సంఘాలు సిద్ధం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఒక ఆర్యవైశ్య వ్యాపారి రూ.రెండు కోట్లు ఇవ్వనందుకు ఇటీవల రైస్‌మిల్లు మూయించారు. అదే క్రమంలో టీటీడీ కాంట్రాక్టర్ నుంచి రెండెకరాలు రాయించుకున్నారు. ఇప్పుడు రూ.250 కోట్ల విలువైన పదెకరాల మఠం భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.ఆ భూమి హథీరాంజీ మఠందే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన భూమి హథీరాంజీ మఠానిదే. మఠానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు వెళ్లిన మఠం సిబ్బందిని వంద మంది గూండాలతో రూమ్‌లో బంధించి, బట్టలూడదీసి.. నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారు. ఈ మేరకు తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఈ భూకబ్జాలో ల్యాండ్ మాఫియా పాత్ర ఉంది. – రమేష్ నాయుడు, హథీరాంజీ మఠం పరిపాలనాధికారి భూములను సంరక్షించాలి.. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న హథీరాంజీ మఠం, పరకాల మఠం, దేవదాయ భూములను ప్రభుత్వం సంరక్షించాలి. తిరుపతి నగర నడిబొడ్డున 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారులను బట్టలూడదీయించి.. నానా బూతులు తిడుతూ భయకంపితులను చేశారు. ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. – కందారపు మురళి, సీపీఎం నేత -
ప్రజా‘వాణి’ వినిపించదా?
సాక్షి, హైదరాబాద్: ఇబ్బంది ఏదైనా, పరిష్కార వేదిక ఏదైనా.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు మాత్రం పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. భూసంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యల అర్జీలు పేరుకుపోతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ వర్గాలు పరిష్కరించినవి 30శాతం కూడా దాటలేదు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు 13,513 దరఖాస్తులు రాగా.. అందులో పరిష్కారమైనవి 3,147 దరఖాస్తులు మాత్రమే. మిగతా 10,366 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు వెళ్లే దరఖాస్తుల్లో ఎక్కువశాతం ధరణి సంబంధిత సమస్యలే ఉంటాయని.. కొన్నిచోట్ల పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేవలం విచారణతోనే సరి! ప్రజావాణి కింద వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్‌లో తమకు వచ్చిన లాగిన్ల ఆధారంగా సదరు దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి రిపోర్టు పంపించే అధికారం మాత్రమే తమకు ఉందని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఈ దరఖాస్తులను విచారించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా లేరని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అంటున్నారు. మండలంలో ఉన్న ఒకరిద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లే (ఆర్ఐలే) ఈ దరఖాస్తులన్నింటినీ విచారించాల్సి వస్తోందని చెప్తున్నారు. విచారణ అనంతరం రిపోర్టులను పంపినా పైస్థాయిలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని దరఖాస్తులు పరిష్కారమైనా ఆన్లైన్లో అప్డేట్ కావడం లేదని వివరిస్తున్నారు. తహసీల్దార్ల స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పైస్థాయికి పంపిన వాటిని కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అక్కడా ఆగిపోతున్నాయని అంటున్నారు. నాలుగు జిల్లాల్లోనే కాస్త మెరుగు.. ‘సీఎం ప్రజావాణి’ దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిష్కార కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. జగిత్యాల, కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికిపైగా దరఖాస్తులను పరిష్కరించారు. ఆరు జిల్లాలు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, భువనగిరి జిల్లాల్లో అయితే 100శాతం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ జిల్లాల్లో ఒక్క రెవెన్యూ అర్జీ కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. మిగతా జిల్లాల్లో మొక్కుబడిగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార కార్యక్రమం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కూడా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉండటం రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతకు అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వారానికి వెయ్యి దాకా దరఖాస్తులు రాష్ట్రస్థాయిలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నాయి. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. గత శుక్రవారం 494 దరఖాస్తులురాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 125, హౌసింగ్ 43, పౌరసరఫరాల శాఖ 71, హోంశాఖ 45, పంచాయతీరాజ్ శాఖ 47, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
టార్గెట్ రూ.5,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వర్గాలతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రాథమిక స్థాయి సమావేశాలను పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో భూములు, ఆస్తుల విలువలను పెంచడం ద్వారా 20 నుంచి 35 శాతం వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశముందని రిజి్రస్టేషన్ల శాఖ అంచనా వేస్తోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు ఆదాయం పెరగొచ్చని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. గజం రూ.1,000... ఎకరం రూ. 4లక్షలు పెంపు! రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్న సవరణ ప్రక్రియ అనంతరం గజం నివాస స్థలం విలువ కనీసం రూ.1,000 పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు కనీస విలువతో పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాల విలువల పెంపు ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రభుత్వ వర్గాల ద్వారా రిజి్రస్టేషన్ల శాఖకు మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇక, ఎకరం వ్యవసాయ భూమి కనీస విలువ ఏ మేరకు సవరించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల బహిరంగ మార్కెట్ విలువ ఎంతుందన్న దానిపై రెవెన్యూ వర్గాలతో చర్చించిన అనంతరం దీనిపై ఓ అంచనాకు రానున్నారు. అయితే, రిజి్రస్టేషన్ల శాఖ అంచనా ప్రకారం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ప్రకారం రాష్ట్రంలో ఎకరం వ్యవసాయ భూమి విలువ రూ.4 లక్షల వరకు పెరగనుందని తెలుస్తోంది. ఇక, విలువల సవరణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస, వాణిజ్య సముదాయాలను కేటగిరీలుగా తీసుకోనున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న నివాస, వాణిజ్య సముదాయాల ప్రభుత్వ విలువలను 100 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 29 కల్లా కమిటీల సంతకాలు విలువల సవరణ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నాటికి అన్ని రకాల భూములు, ఆస్తుల విలువల పెంపుపై సవరణ కమిటీలు సంతకాలు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జేసీ, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజిస్ట్రార్లతో; పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజి్రస్టార్లతో; హెచ్ఎండీఏ పరిధిలో కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజి్రస్టార్లతో విలువల సవరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సంతకాలు చేసిన అనంతరం ప్రతిపాదిత విలువలను ఆన్లైన్లో ఉంచి 15 రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకుని జూలై 24 కల్లా విలువల సవరణకు తుదిరూపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరించి ఆగస్టు 1 నుంచి కొత్త విలువలను అమలు చేయనున్నారు. -
TG: ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు కొత్త ప్రభుత్వ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈనెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూలై 31 నాటికి పూర్తి కానుంది. అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త ప్రభుత్వ విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు, ఆస్తుల విలువలను మరోమారు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇరు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, విలువల సవరణ ప్రక్రియ షెడ్యూల్‌తో కూడిన ఈ మార్గదర్శకాలను ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ సంబంధిత అధికారులకు పంపారు. వీటి ప్రకారం సవరించిన విలువలను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజులు గడువు ఇవ్వనున్నారు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే అధికారంగా కొత్త విలువలను నమోదు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సవరణ ప్రక్రియ ఇలా... ⇒ వ్యవసాయేతర వినియోగానికి అనువుగా (ప్లాట్లు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమలు, సెజ్‌లు, వినోద సౌకర్యాల ఏర్పాటు) జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లోని భూముల విలువను అధికంగా పెంచాలి. ⇒ ఈ క్రమంలో గ్రామపటాలను తీసుకుని ఇప్పటికే ఇంటి స్థలాలుగా మారిన సర్వే నంబర్లు, మారే యోగ్యత ఉన్న సర్వే నంబర్లు, జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లను వేర్వేరుగా గుర్తించాలి. ⇒ సబ్రిజి్స్ట్రార్, జిల్లాల రిజి్స్ట్రార్లు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా వెళ్లి సమాచారం సేకరించాలి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, రెవెన్యూ పంచాయతీ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూములు, ఆస్తులకు ఉన్న విలువను గుర్తించాలి. ⇒ బహిరంగ మార్కెట్ విలువలను సేకరించే విషయంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దు. రియల్ ఎస్టేట్ కంపెనీల బ్రోచర్లు, భూసేకరణ పరిహారం, బ్యాంకులు, రెవెన్యూ వర్గాలు నిర్వహించిన వేలం లాంటి వివరాలను విలువల నిర్ధారణకు వాడుకోవచ్చు. బహిరంగ మార్కెట్ విలువలను సేకరించిన తర్వాత ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువలతో పోల్చుకుని సవరించాల్సిన విలువలను ప్రతిపాదించాలి. ⇒ 5–6 కిలోమీటర్ల రేడియస్‌లోని గ్రామాల్లో ఉండే తేడాలను జాగ్రత్తగా గమనించాలి. ఆ వ్యాసార్థంలోని గ్రామాల్లో ఏ పాయింట్లో ఎంత విలువ ఉంది, ఏయే పాయింట్‌కు ఎంత మారుతోందనే అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ⇒ ఒకే గ్రామంలో ఉన్నా వేర్వేరు చోట్ల ఉన్న భూములు, ఆస్తులకు రెండు కంటే ఎక్కువ విలువలను కూడా ప్రతిపాదించవచ్చు. ⇒ వ్యవసాయ భూముల విషయంలో ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువలను రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి. ⇒ గతంలో పొరపాటుగా బహిరంగ మార్కెట్ విలువల కంటే ప్రభుత్వ విలువలను ఎక్కువగా నమోదు చేసి ఉంటే వాటిని వ్యక్తిగతంగా డీఐజీ స్థాయి అధికారులు పరిశీలించి కమిటీ ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయ భూముల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇలా... ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అధికారికంగా నిర్ధారించిన ప్రాంతాల వివరాలను సేకరించి నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు వేర్వేరుగా ఆ ప్రాంతం మొత్తానికి ఒకే విలువ నిర్ధారించాలి. సదరు ప్రాంతాల్లో కొన్ని కాలనీలు, వీధులను కలపాల్సి వచి్చనా విలువలు మాత్రం ఒకేలా ఉండాలి. ⇒ రోడ్డుకిరువైపులా ఉన్న ఆస్తులకు ఒకే విలువ ప్రతిపాదించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి తాజా డోర్ నంబర్ల వివరాలను ఫామ్–2లో పొందుపరచాలి. ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనం చేసిన గ్రామాల్లో విలువల ప్రతిపాదన కసరత్తు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగినట్టు ఉండాలి. ఈ గ్రామాలను ఆనుకుని ఇప్పటికే వార్డులు, బ్లాక్‌లుగా ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లో విలువలు ఆయా గ్రామాలకు సమీపంగా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ⇒ నివాస ప్రాంతాల్లో ఉన్న డోర్ నంబర్లను వాణిజ్య ప్రాంతాలుగా పొరపాటున నమోదు చేసినా, వాణిజ్య ప్రాంతాల డోర్ నంబర్లను నివాస ప్రాంతాలుగా నమోదు చేసినా వాటిని సవరించాలి. ⇒ గ్రౌండ్ ఫ్లోర్, ఇతర ఫ్లోర్లకు వేర్వేరు విలువలు నిర్ధారించే అంశాన్ని కేవలం ప్రధాన రహదారుల పక్కన ఉండే నివాస సముదాయాలకు మాత్రమే వర్తింపజేయాలి. సాధారణ మార్గదర్శకాలు: ⇒ భారత స్టాంపుల చట్టం–1899లోని సెక్షన్ 47(ఏ) ప్రకారం ఆస్తుల విలువలను సవరించే సమయంలో క్రమానుగుణంగా జరిగిన ప్రక్రియ, విలువలను పరిగణనలోకి తీసుకుని సవరణ విలువలను ప్రతిపాదించాలి. (అంటే ఒకేసారి పెద్ద ఎత్తున పెంపు, తగ్గింపు ఉండకూడదు.) –గ్రామీణ ప్రాంతాల డేటా, రికార్డులను తహశీల్దార్లు, గ్రామపంచాయతీల నుంచి తీసుకోవాలి. ⇒ ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువల కంటే ఎక్కువ విలువలతో ఒక ప్రాంతంలో పలు లావాదేవీలు జరిగి ఉంటే ఆ విలువను సవరణకు ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో జోనల్ అభివృద్ధి మ్యాప్‌లను, మిగిలిన పట్టణ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మాస్టర్ప్లాన్లను విలువల సవరణకు ప్రాతిపాదికగా తీసుకోవాల్సి ఉంటుంది. -
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్‌లోని గాందీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. -
అన్నీ కలెక్టర్లే అంటే సరికాదు
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారాలను వికేంద్రీకరించడమే మేలని పలు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరణి పరిధిలోని ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించే పద్ధతి సరైంది కాదని, ఇందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధరణి దర ఖాస్తులు పేరుకుపోయాయని వెల్లడించారు. ధరణి పునర్నిర్మాణ కమిటీ బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, నవీన్ మిత్తల్‌తో పాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్ (సిద్దిపేట), రాజీవ్‌గాంధీ హనుమంతు (నిజామాబాద్), ప్రావీణ్య (వరంగల్), గౌతమ్ కుమార్ (ఖమ్మం), శశాంక్ (రంగారెడ్డి), రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలను కమిటీ సభ్యులకు కలెక్టర్లు వివరించారు. అన్ని సమస్యలకూ తగిన మాడ్యూల్స్ లేవు ధరణి పోర్టల్‌లో అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన మాడ్యూల్స్ లేవని, తమకు ఉన్న పని ఒత్తిడిలో అన్ని దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో లేరని చెప్పినట్టు తెలిసింది. సమస్యల పరిష్కార అధికారాలను కేవలం కలెక్టర్లకే కాకుండా కేటగిరీల వారీగా తహశీల్దార్లకు, ఆర్డీవోలకు కూడా ఇవ్వాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేనందున వాటిని పరిష్కరించలేకపోయామని వివరించినట్టు సమాచారం. టెర్రాసిస్ కాంటెల్లా ప్రతినిధులతోనూ సమావేశం ధరణి పోర్టల్ నిర్వహిస్తోన్న టెర్రాసిస్ కాంటెల్లా కంపెనీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పనితీరు, ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాల గురించి చర్చించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, కంపెనీ ప్రతినిధుల నుంచి అవసరమైన సమాచారాన్ని కమిటీ సభ్యులు సేకరించారు. 27న అటవీ, వ్యవసాయ అధికారులతో భేటీ ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని, ఉదయం అటవీ, గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్టాంపులు, రిజి్రస్టేషన్లు, సర్వే సెటిల్మెంట్, దేవాదాయ, వక్ఫ్ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, ఆ భేటీ తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. -
పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండటం దేశంలోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేదలు ఇబ్బంది పడకూడదనే.. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్వో పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. పేదలకిచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. -
పక్కాగా ధరణి అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రికార్డుల నుంచి క్రయ విక్రయ లావాదేవీల వరకు అన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్న ధరణి పోర్టల్‌ను పక్కాగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని దీనిపై కొత్తగా ఏర్పాటైన కమిటీ భావిస్తోంది. రైతులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేసి పనిచేయాలని, పూర్తి సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ వ్యవహారాలతో సంబంధమున్న భాగస్వామ్య పక్షా లన్నింటితో చర్చించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ (రైతులకు సులభంగా ఉండే)వెబ్సైట్ తయారు చేసే లక్ష్యంతో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కూడా సవాలేనని, ఇందుకోసం సాంకేతిక నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ప్రాథమికంగా భావిస్తోంది. ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా భూమాత పోర్టల్‌ను రూపొందించే దిశలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా గురువారం సమావేశం కానుంది. నిషేధిత భూములు పెద్ద సవాల్! కొత్తగా ఏర్పాటైన ధరణి కమిటీ ముందున్న ప్రధాన సమస్యల్లో నిషేధిత జాబితా భూములే ప్రధానాంశంగా మారనున్నాయి. ధరణి రికార్డుల ప్రకారం నిషేధిత (22ఏ) జాబితాలో చేరిన రైతుల పట్టా భూములను తిరిగి వారి పేరిట రికార్డు చేయడమే పెద్ద సవాల్‌గా మారనుంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిషేధిత భూముల జాబితా రూపొందించారు. రెవెన్యూ వర్గాలిచ్చిన ఆ జాబితా ప్రకారం అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌లో ఆయా భూముల సర్వే నంబర్లను అప్లోడ్ చేశారు. ఈ సర్వే నంబర్ల పరిధిలోనే రైతుల పట్టా భూములు కూడా ఉండేవి. అయితే రైతుల పట్టా భూములకు, నిషేధిత జాబితాలో పేర్కొన్న ప్రభుత్వ భూములకు వేర్వేరు బై నంబర్లు ఇవ్వడంతో ప్రభుత్వ భూముల లావాదేవీలు మాత్రమే నిలిచిపోయి, ప్రైవేటు భూముల లావాదేవీలు నిరాటంకంగా జరిగిపోయేవి. కానీ ధరణి పోర్టల్ ఏర్పాటైన తర్వాత స్టాంపుల శాఖ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేసేటప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ ఎక్కించినా ఎలాంటి బై నంబర్లు ఇవ్వకపోవడంతో సదరు సర్వే నంబర్లోని భూమి పూర్తిగా నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దీంతో రైతులు తమ పట్టా భూముల్లోనూ ఎలాంటి లావాదేవీలు జరిపే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇలా నిషేధిత జాబితాలో పడిన పట్టా భూములు 10 లక్షల ఎకరాల వరకు ఉంటాయని భూసమస్యలపై పనిచేస్తున్న వారు చెపుతున్నారు. గత ఏడాదిలోనే 30 వేల దరఖాస్తులు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ టీఎం15 కింద ఒక్క 2023లోనే 30 వేల దరఖాస్తులు ధరణిలో వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ ర్పాటైన కమిటీ ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించనుందని, ధరణి పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యేలోపు నిషేధిత జాబితాను కొత్తగా తయారు చేసేలా సిఫారసు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాను మళ్లీ ధరణి లేదా భూమాత పోర్టల్‌లో అప్లోడ్ చేస్తేనే రైతుల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, లేదంటే మళ్లీ రెవెన్యూ వర్గాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిషేధిత జాబితాలో పట్టా భూములు రైతుల పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. వీటిని తొలగించుకోవడం కోసం రైతులు 2,3 ఏళ్లు తిరిగినా పరిష్కారం కావడం లేదు. అసలు 22ఏ జాబితాలోనే చాలా తప్పులున్నాయి. 2007 నుంచి 2023 వరకు తప్పులతో కూడిన డేటా ఎక్కించారు. రెవెన్యూ శాఖ కొత్త జాబితా తయారు చేసి దాన్ని అటు స్టాంపుల శాఖ, ఇటు ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఈ నిషేధిత జాబితా సమస్య పరిష్కారం కాకుండా ధరణి సమస్యలు తేలవు. – మన్నె నర్సింహారెడ్డి, ధరణి భూ సమస్యల వేదిక కన్వినర్ -
భారమైతే బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ శాఖ గ్రామసభలను నిర్వహిస్తుందని, పోలీసుశాఖ వాటిని గాడిలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం అమల్లో ఏవైనా ఇబ్బందులుంటే సీఎస్, డీజీపీకి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. పని చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇష్టం లేకపోయినా చెప్పాలని.. వేరే చోటికి బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉండి ఏమీ చేయబోమంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం ఎవరికైనా ఇష్టం లేకున్నా.. ఎక్కువగా పనిచేయాల్సి వస్తోందని, 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకని అనిపించినా చెప్పండి. అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. 18 గంటల పని ఉండని ప్రాంతానికి బదిలీ చేయడంలో అభ్యంతరం లేదు. అధికారుల సూచనలు, సలహాలను ఓపెన్ మైండ్‌తో స్వీకరిస్తాం. అధికారుల పనితీరుకు నీతి, నిజాయతీలే పెద్ద కొలమానం. పోస్టింగ్స్‌లో వాటినే పరిగణనలోకి తీసుకుంటాం..’’అని రేవంత్ చెప్పారు. ప్రజా పాలనకు ప్రత్యేకాధికారులు ప్రజాపాలనలో భాగంగా ప్రతి మండలంలో రోజూ రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మండలంలో రెండు బృందాలుంటే ఒక బృందానికి ఎమ్మార్వో, మరో బృందానికి ఎంపీడీవో బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తామని చెప్పారు. ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలని.. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నిరక్షరాస్యుల దరఖాస్తులను నింపించడానికి అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తులకు అవసరమైన డేటా, ఆధార్‌కార్డు, ఫోటో వంటివి తేవాలని ప్రజలకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. అమరవీరులు, ఉద్యమకారులపై ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను సేకరించాల్సి ఉంటుందని, ముందే అప్లికేషన్లు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజాపాలన కింద సేకరించిన దరఖాస్తులను డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూ్కటినీ చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామసభలు, ప్రజాపాలన పరిస్థితిని సమీక్షించుకుందామన్నారు. అద్దాల మేడలు కట్టి అభివృద్ధి అంటే ఎలా? ‘‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరసలోని పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది..’’అని రేవంత్ చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే పూర్తి బాధ్యత పెట్టామని, వారిపై నమ్మకంతో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి ‘‘తెలంగాణ ప్రజలు గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. అభివృద్ధిని విస్మరిస్తే వారి ప్రతిస్పందన చాలా కటువుగా ఉంటుంది. అది మీరంతా ఇటీవలే చూశారు..’’అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోకుంటే ఎంతటి వారినైనా ఇంటికి పంపించగలరని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమే.. కానీ.. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని.. అయితే ప్రజలతో శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. అధికారుల్లో మానవీయ కోణం ఉంటే ప్రజల సమస్యల్లో 90శాతం సమస్యలు అక్కడే పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. రూల్స్‌ను అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో సానుకూల (పాజిటివ్) దృక్పథం, ధోరణితో ముందుకెళ్లాలన్నారు. అలా కాకుండా ఏ కాగితం వచ్చినా ఎలా తిరస్కరించాలన్న ఆలోచనా ధోరణి ఉంటే అభివృద్ధి, సంక్షేమం సరైన దిశగా ప్రయాణించవని స్పష్టం చేశారు. పాత ప్రభుత్వ పద్ధతులను మానుకుంటే మంచిది డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని.. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని.. ఈ ప్రభుత్వం తమదేనన్న నమ్మకం, భరోసాను ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని సూచించారు. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మార్చుకోవాలని, ఆ మైండ్‌సెట్ ఇక ముందు ఉండకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగతా గ్యారంటీలను కూడా వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
రిజిస్ట్రేషన్లకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత కూడా రెవెన్యూ కార్యకలాపాల్లో కదలిక కనిపించడం లేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందే (షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే) రెవెన్యూ లావాదేవీలు నిలిచిపోయాయి. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన జిల్లాల కలెక్టర్లు కీలకమైన ధరణి పోర్టల్‌తోపాటు ఇతర కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం దాటినా వాటిని పట్టించుకోకపోవడంతో రెవెన్యూ వ్యవస్థ సుప్తచేతనావస్థకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచనతో కలెక్టర్లు తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేయడం, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కూడా పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది రెవెన్యూ పనులు తప్ప మిగిలిన పనులతో కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం. ధరణిపై సమీక్షించినా... వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి ధరణి పోర్టల్‌పై సమీక్షించి 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్‌ను ఆదేశించారు. కానీ రెవెన్యూ ఫైళ్ల పరిష్కారం అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ధరణి పోర్టల్ కింద 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమావేశంలో భాగంగా రెవెన్యూ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమస్యల పరిష్కారంపైన ఆయన ఎలాంటి ఆదేశాలివ్వకపోవడం గమనార్హం. దీనికితోడు రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. జీవో 58, 59తోపాటు ఇతర జీవోల ద్వారా జరగాల్సిన ఈ ప్రక్రియ కూడా ఎన్నికల కారణంగానే ఆగిపోయింది. ఎన్నికల తర్వాత తమ విన్నపాలకు పరిష్కారం లభిస్తుందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ దరఖాస్తులను కూడా కలెక్టర్లు పరిష్కరించడం లేదు. అటు ధరణి పోర్టల్, ఇటు భూముల క్రమబద్ధీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో కేవలం ధరణి పోర్టల్ ద్వారా భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి, క్రిస్మస్ తోఫాను పంపిణీ చేయడానికే పరిమితమయ్యామని, భూ సంబంధిత సమస్యలపై తమ కార్యాలయాలకు వచ్చే వారికి సమాధానం చెప్పుకోలేక పోతున్నామని తహసీల్ కార్యాలయాల సిబ్బంది వాపోతున్నారు. అటు ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంతోపాటు భూముల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారనే కారణంతోనే వ్యవస్థ స్తంభించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ వ్యవహారాలపై స్పష్టతనివ్వాలని, అప్పుడే భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
చిటికెలో ‘మ్యుటేషన్’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అరిశేపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు నమోదైంది. ఒకే రోజు రిజిస్ట్రేషన్‌తో పాటు ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ కూడా జరిగిపోయింది. సరళంగా ప్రక్రియ ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహసనమే. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యుటేషన్ జరగక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రవేశపెట్టిన విధానాలు, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా వెబ్‌ల్యాండ్‌లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతోంది. ఎక్కడికి తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంలో మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ల తీరును ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తయ్యేదాకా ఉత్కంఠే! స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇన్నాళ్లూ క్లిష్టతరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టడంతో కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు. ఆస్తిని రిజిష్టర్ చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అయితే దాన్ని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేసేది రెవెన్యూ శాఖ. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఏళ్ల తరబడి అదే విధానం కొనసాగడంతో రిజిస్ట్రేషన్ పూర్తయినా మ్యుటేషన్ కోసం నిరీక్షణ తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ అయిన ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో మ్యుటేషన్ జరిగేది కాదు. అవతవకలకు ఆస్కారం ఉండేది. సంక్లిష్టంగా ఉన్న మ్యుటేషన్ల విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం సరళంగా మార్చింది. ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తెచ్చి ప్రజల అవస్థలను తొలగించింది. రిజిస్ట్రేషన్ల శాఖకు వెబ్‌ల్యాండ్ అనుసంధానం నూతన విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు. దానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ కార్డ్ స్థానంలో కార్డ్ ప్రైమ్‌ను ప్రవేశపెట్టారు. ఆటో మ్యుటేషన్‌తోపాటు ఆన్లైన్లోనే డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే మార్కెట్ విలువ కనిపించడం, అందుకు తగ్గట్టుగా ఆన్లైన్లోనే చలానాలు కట్టడం, అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కార్డ్ ప్రైమ్ విధానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. నిర్దేశించిన స్లాట్ ప్రకారం రిజిస్టార్ ఆఫీసు లేదంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ కొత్త విధానంలో వెంటనే రిజిస్ట్రేషన్‌తోపాటు ఆ వివరాల ప్రకారం ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతోంది. మళ్లీ మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అన్నింటినీ పక్కాగా నిర్థారిస్తారు. సబ్ రిజి్రస్టార్లు రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ జరగగానే రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు నెలల క్రితం నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లతోపాటు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. కొత్త విధానం వచ్చాక 26 జిల్లాల్లో ఇప్పటివరకు 7 వేలకుపైగా ఆటో మ్యుటేషన్లు జరిగాయి. వ్యవసాయ భూములకు సంబంధించి అమలవుతున్న ఆటో మ్యుటేషన్ విధానాన్ని త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తుల రికార్డులు మున్సిపల్ శాఖ నిర్వహిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అందుబాటులోకి తెచ్చిన కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు సిద్ధమవగా మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. సులభతరం రిజిస్ట్రేషన్ సేవలతోపాటు మ్యుటేషన్ విధానాన్ని సులభతరం చేశాం. కార్డ్ ప్రైమ్ విధానంలో ఆటో మ్యుటేషన్ వెంటనే జరిగిపోతోంది. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సాఫ్ట్వేర్లను పూర్తిగా మార్చాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అర్బన్ ఆస్తులకూ ఇదే విధానాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల విధానం, ఆటో మ్యుటేషన్ చాలా బాగా అమలవుతోంది. దుష్ప్రచారాలను నమ్మవద్దు. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే ఆన్లైన్లో.. మా గ్రామ సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశా. నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అరగంటలోనే పూర్తయింది. ఆ తర్వాత వెంటనే నా పేరు మీద ఆన్లైన్లో కూడా మారింది. ఇంతకుముందు ఆన్లైన్లో పేరు చేర్చాలంటే రిజిస్ట్రేషన్ పత్రాలతో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ జరగడం బాగుంది. – నల్లపోతుల నాగరాజు, నందిగామ మండలం, రాఘవాపురం తిరిగే తిప్పలు లేవు.. నా పేరుతో ఉన్న 33 సెంట్ల భూమిని నా కుమార్తె వెంకటేశ్వరమ్మ పేరిట రాశాను. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఆమె పేరిట భూమి మారిపోయింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ లేకుండా వెంటనే పని పూర్తయింది. – చల్లా ఆంజనేయులు, కొండూరు, నందిగామ మండలం. -
అరవింద్ కుమార్‌కు ‘విపత్తు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిశోర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతల నుంచి సైతం అరవింద్‌కుమార్‌ను తప్పించింది. ఆ రెండు పోస్టుల అదనపు బాధ్యతలనూ దానకిశోర్కే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లీజుపై అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అప్పగింతపై నిర్వహించిన టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్‌గా అరవింద్ కుమార్ స్పందిస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్‌కుమార్‌ను అప్రధానమైన విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఆయన్ను కొనసాగించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను తప్పించి ఆమెను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ క్రిస్ట్రీనా జెడ్.చొంగ్తును కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించడం విశేషం. -
10 రోజుల్లో నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యలు, ధరణి పోర్టల్ అంశాలపై పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘ధరణి పోర్టల్‌ను ఎలా డిజైన్ చేశారు? భూ రికార్డులు అందులో ఎలా భద్రపరిచారు? సదరు డేటా ఎక్కడ ఉంది? పోర్టల్ నిర్వహిస్తున్న కంపెనీ కాంట్రాక్టు ఎప్పటివరకు ఉంది? ఆ కంపెనీ మళ్లీ ఎందుకు వేరే కంపెనీలకు లీజుకిచ్చింది? ఈ పోర్టల్ నిర్వహిస్తున్న, నిర్వహించిన కంపెనీలకు ఉన్న చట్టబద్ధత ఏంటి? ఒకవేళ పోర్టల్‌లోని రికార్డులు కరప్ట్ అయి వివరాలన్నీ పోతే రాష్ట్రంలోని భూములకు మాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? ఈ పోర్టల్ ద్వారా వస్తున్న దరఖాస్తులు ఏడాదిన్నరగా ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి?’ అని ప్రశ్నించారు. అన్ని అంశాల తో నివేదిక రూపొందించిన తర్వాత మళ్లీ సమావేశమవుదామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ తరహాలో రాష్ట్రంలోని భూసమస్యల అధ్యయనానికి క మిటీ కూర్పుపై అధ్యయనం చేయాలని చెప్పారు. భూదాన్, అసైన్డ్ భూముల అంశాలపై ఇంకోసారి సమావేశమై సమగ్రంగా చర్చిద్దామని అన్నారు. బు ధవారం మధ్యాహ్నం సచివాలయంలో ధరణి పోర్ట ల్ నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, అధికారులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం సమీక్ష సందర్భంగా సీఎంతో పాటు పలువురు మంత్రులు రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నారాయణపేట జెడ్పీ చైర్మన్ ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తు పరిష్కారం కాకపోగా ఆ డబ్బులు మీరు తిరిగి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్లి తన డబ్బులు తనకివ్వాలని ఆర్డర్ తెచ్చుకున్నా మీరు స్పందించలేదు. ధరణి పోర్టల్ కింద చేసుకునే ప్రతి దరఖాస్తుకు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు? ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖాతాకే వస్తున్నాయా? ప్రైవేటు కంపెనీకి వెళ్లి మళ్లీ ప్రభుత్వానికి వస్తున్నాయా? భూముల రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుంది కదా? డేటాను దుర్వినియోగం చేయకుండా నియంత్రించే మెకానిజం ఏంటి? స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకుంటే ఆ డబ్బులు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ సుమోటోగా ఎందుకు చేయొద్దు? నోషనల్ ఖాతా అంటే ఏంటి? ఆ ఖాతాలో భూములెందుకున్నాయి? 31 కాలమ్స్ ఉన్న పహాణీలో 16వది అయిన అనుభవదారు కాలమ్ ఎందుకు తీసేశారు?..’ అని రేవంత్ ప్రశ్నించారు. నివేదికపై సంతకం పెట్టి ఇవ్వండి ధరణి పోర్టల్‌కు, రైతుబంధుకు సంబంధమేంటని సీసీఎల్ఏ మిత్తల్‌ను సీఎం ప్రశ్నించారు. సంబంధమేమీ లేదని మిత్తల్ చెప్పగా, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపర్చాలని రే వంత్ సూచించినట్టు తెలిసింది. నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కాకుండా అధికారికంగా సంతకం పెట్టి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్ జగన్ వేగం మీకెందుకు లేదు? కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ సదస్సులు పెట్టిన తీరు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నివేదికను సమర్పించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వేగం మీకెందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. భూముల సర్వే, టైటిల్ గ్యారంటీ, అసైన్డ్ భూముల చట్టం, కౌలు రైతుల చట్టం అమలు లాంటి విషయాల్లో జగన్ వేగంగా దూసుకుపోతుంటే మీరేం చేశారని ప్రశ్నించారు. కమిటీ ఏర్పాటు చేయండి: భూమి సునీల్ రాష్ట్రంలోని భూసమస్యలపై సమగ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఈ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భూమి సునీల్ కోరారు. భూ సంబంధిత అంశాలపై ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. సాదా బైనామాల చట్ట సవరణ చేయాలని, రెవెన్యూ సదస్సులు పెట్టి సుమోటోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్‌లో 2.30 లక్షల దరఖాస్తులు సమీక్షలో భాగంగా రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ అధికారులు ధరణిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన మాడ్యూల్స్‌లో ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కారమయ్యాయో వివరించారు. టెక్నికల్ మాడ్యూల్ 1 నుంచి టీఎం 33 వరకు మొత్తం 2.30 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, 1.80 లక్షల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సమీక్షలో కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, మన్నె నర్సింహారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, రాజ్ ఠాకూర్లతో పాటు ట్రెసా ప్రతినిధులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోడ్ మూడ్‌లోనే రెవెన్యూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మినహా ఆ శాఖ పరిధిలో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని, ఎన్నికల కోడ్ కారణంగా గత రెండున్నర నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందన్న సాకుతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు ముందుకు రాకపోవడం గమనార్హం. ధరణి పోర్టల్‌తో పాటు జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాల్సిన కలెక్టర్లు ఆ ఫైళ్లన్నింటినీ పక్కన పెట్టేయడం, తాజాగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వా త కూడా వాటిని పరిశీలించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొందని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. దీనికి తోడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయిందని, కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఆరా తీసే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఈ ఏడాది సెపె్టంబర్ నుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమయింది. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్రాగా, నవంబర్‌లో నోటిఫికేషన్ వెలువడింది. అయితే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి నుంచి రెవెన్యూ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ సిబ్బందిదే కీలక పాత్ర కావడం, తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా, ఆర్డీవోలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉండటంతో వారు రెవెన్యూ పనులన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక కలెక్టర్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఈనెల 4వ తేదీ వరకు (ఎన్నికల కోడ్ ముగిసే వరకు) బిజీబిజీగా ఉన్నారు. దీంతో తహసీల్దార్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ వ్యవహారాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కనీసం విరాసత్, పెండింగ్ డిజిటల్ సంతకాల దరఖాస్తులను కూడా పరిష్కరించలేదు. దీంతో ప్రస్తుతం ధరణి, జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధికరణ)లకు చెందిన లక్షలాది మంది దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తదుపరి ఆదేశాల వరకు పెండింగ్‌లోనే? రాష్ట్రంలో అధికారం చేతులు మారిన నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రెవెన్యూ కార్యకలాపాలు ముట్టుకో వద్దని, అన్ని ఫైళ్లు పెండింగ్‌లో పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ మేరకు కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పా రని అంటున్నారు. మరోవైపు రెవెన్యూ కార్యకలాపాలపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని సీసీఎల్ఏ కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని కూడా సమాచారం. అయితే ఇవి కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రెవెన్యూ వ్యవహారాలు స్తబ్దుగా మారాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘రెవెన్యూ వ్యవహారాలపై ప్రభుత్వం ఆదేశాలివ్వడం కొత్తేమీ కాదు. కానీ అధికారంలో ఉన్న పార్టీ మారడంతో రెవెన్యూ సిబ్బందిలో కొంత కంగాళీ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఏం చేస్తే ఏం జరుగుతుందోననే ఆందోళనతో ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు..’ఈ శాఖ ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ‘ఎప్పటివో పాత దరఖాస్తులు పరిష్కరించేందుకు అడ్డు వచ్చిందెవరు? జీవో 59 కింద దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు దాటిపోయింది. వాటి పరిష్కారం వద్దని ప్రభుత్వం ఎందుకు అంటుంది?’అని ప్రశ్నించారు. పైగా వీటి పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా? ’అని అన్నారు. -
ఐడీ లేక.. వేతనం రాక..
సాక్షి, కామారెడ్డి: గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోవడంతో వేతనాలు అందడం లేదు. జీతాల కోసం రాష్ట్రంలో 14,954 మంది వీఆర్ఏలు ఎదురు చూస్తున్న దుస్థితి నెల కొంది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని భా వించిన గత సర్కారు.. మొదట వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. తర్వాత వీఆర్ఏలను కూడా వారి విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా, ఆఫీసు సబార్డినేట్లు గా సర్దుబాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది గ్రామ సేవకులు (వీఆర్ఏ) ఉండగా వారిలో తొలి విడతలో 14,954 మందిని వివిధ శాఖల్లో స ర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా 2,451 మంది, మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లుగా 1,266 మంది, రెవెన్యూ శాఖలో రికార్డు అసిస్టెంట్లుగా 2,113 మంది, ఆఫీసు సబార్డినేట్లుగా 680 మంది, నీటి పా రుదల శాఖలో 5వేల మంది, మిషన్ భగీరథలో 3, 372 మందిని సర్దుబాటు చేశారు. మరికొన్ని శాఖ ల్లో మరో 72 మందిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక వృద్ధాప్యంతో ఉన్న వారు, వారసులు లేకపోవడం వంటి కారణాలతో కొందరి ఉద్యోగా లు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 10న వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో అక్కడే జాయిన్ కావాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో దూరమైనా సరే వెళ్లి ఉద్యోగాల్లో జాయిన్ అయి పని చేస్తున్నారు. ఇంకా ఎంప్లాయ్ ఐడీ జనరేట్ కాలేదు ఎంప్లాయ్ ఐడీ నమోదైన తర్వాతనే వారిని ప్రభు త్వ ఉద్యోగుల కింద లెక్కగట్టి వేతనాల ప్రక్రియను మెదలుపెడతారు. వీఆర్ఏలను ఆయా ఉద్యోగాల్లో సర్దుబాటు ప్రక్రియను చేపట్టిన గత ప్రభుత్వం వారికి ఐడీ ఇంకా ఇవ్వలేదు. ఇంతలో ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఆ విషయం పక్కకు వెళ్లింది. ఫలితంగా నాలుగు నెలలుగా వేతనాలు అందక వీఆర్ఏలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదీలీలతో ఊరు కాని ఊరు వెళ్లిన తాము అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పరిష్కరించాలి వీఆర్ఏలుగా పనిచేస్తున్న మమ్మల్ని వివిధ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయడంతో ఎంతో సంతోషించాం. అయితే మాకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. – ముదాం చిరంజీవి, వీఆర్ఏల సంఘం ప్రతినిధి, కామారెడ్డి -
AP: ఇటు ప్రకటన.. అటు సాయం..
సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు నిత్యావసరాల సరుకులతోపాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రతి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో ఆర్టీ నెంబర్ 67 జారీ చేసింది. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2,500 చొప్పున అందిస్తూ వస్తున్నారు. తాజాగా పునరావాస కేంద్రాలకు రాని బాధిత కుటుంబాలకు సైతం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మాదిరిగానే ఈ ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచించారు. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయగా మిగిలిన కుటుంబాలకు కూడా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. 2,068 గ్రామాలపై ప్రభావం మిచాంగ్ తుపాను 15 జిల్లాల పరిధిలో 240 మండలాల్లోని 2,068 గ్రామాలపై ప్రభావం చూపినట్లు తేలింది. ఆయా గ్రామాల్లో బాధితుల కోసం 494 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 31,628 మందికి ఆశ్రయం కల్పించారు. 1,32,569 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 3.71 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. తక్షణ వైద్యం కోసం 355 శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందించారు. మరోవైపు నిత్యావసరాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె అందించారు. ఇప్పటివరకు 1,02,844 కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత 16 మండలాల్లో రెండో రోజు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 22 వైద్య శిబిరాలు నిర్వహించి 1,500 మందికి వైద్యసేవలు అందించారు. జ్వర పీడితులను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. పొలాల్లో ముంపు నీటిని తొలగించేందుకు 1,080 మంది ఉపాధి కూలీలను వ్యవసాయ సహాయక చర్యలకు వినియోగించారు. వరద నీటితో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. తడిచిన ధాన్యం కొనుగోలు తడిచిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం 6,252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనిలో చాలా వరకు తేమ ఉన్న ధాన్యం కావడం గమనార్హం. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్, సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి సుధాసాగర్లు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారు. మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులను వేగవంతం చేశారు. -
కొత్తగా 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు కొత్త పోస్టుల మంజూరుతో వీఆర్ఏల నుంచి తహశీల్దార్ల వరకు పదోన్నతులు దక్కుతున్నాయి. తాజాగా రెవెన్యూ శాఖలో కొత్తగా 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 973 జారీ చేసింది. దీంతో అతి త్వరలో రాష్ట్రంలో 44 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించనుంది. ఆరు నెలల క్రితం కూడా 63 డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు 63 మంది తహశీల్దార్లు పదోన్నతి పొందారు. వీరంతా ఆయా శాఖల్లో పనిచేస్తున్నారు. అంటే.. 6 నెలల కాలంలోనే ప్రభుత్వం 107 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మంజూరు చేసింది. పోస్టులను మంజూరు చేయడంతోపాటు పదోన్నతుల అంశంలో ఇదొక రికార్డుని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల అవసరం ఎక్కువ ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల అవసరం ఉందని, వారిని తమకు డిప్యుటేషన్‌పై పంపించాలని వివిధ శాఖలు గత ప్రభుత్వాన్ని కోరాయి. అదే సమయంలో చాలామంది అధికారులు పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ కలెక్టర్ల కొరత ఇంకా ఎక్కువైంది. దీంతో రెవెన్యూ శాఖ గత ప్రభుత్వాన్ని పదే పదే కోరడంతో నామమాత్రంగా కొన్ని పోస్టులు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. దీంతో ఆయా శాఖల్లో అవసరాల మేరకు అధికారులు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు మూడు విడతల్లో మంజూరు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ శాఖల వినతులను పరిగణనలోకి తీసుకుని ఇప్పటివరకు మూడు విడతల్లో కొత్తగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే మొదట 20, ఈ ఏడాది రెండు విడతలుగా 107 పోస్టుల్ని మంజూరు చేసింది. తాజాగా మంజూరైన 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సంబంధించి సీనియారిటీ జాబితా కూడా సిద్ధమైంది. త్వరలో దాన్ని విడుదల చేయనున్నారు. ఈసారి 44 మంది (మంజూరైన పోస్టులకి 10 శాతం అదనంగా నియమిస్తారు) తహశీల్దార్లు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగుల సర్వీస్ అంశాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలును ఈ ప్రభుత్వం చేసిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కొనియాడారు. వేలాది పోస్టుల మంజూరుతోపాటు పదోన్నతులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విడతల వారీగా 370 తహశీల్దార్ పోస్టులు కొత్తగా మంజూరయ్యాయి. దీంతో అంతే సంఖ్యలో డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. అలాగే వెయ్యి మందికిపైగా సీనియర్ అసిసెంట్లు.. డిప్యూటీ తహశీల్దార్లు అయ్యారు. అదేవిధంగా 670 మంది కంప్యూటర్ అసిస్టెంట్లను రెవెన్యూ శాఖలో కొత్తగా నియమించారు. సీనియర్ అసిస్టెంట్ల కోసం నిర్వహించిన పదోన్నతుల్లో వీఆర్వోలకు 40 శాతం కేటాయించడంతో వేలాది మంది వీఆర్వోలకు లబ్ధి చేకూరింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో 3,600 మంది వీఆర్ఏలు వీఆర్వోలు అయ్యారు. సర్వే సెటిల్మెంట్, భూరికార్డుల శాఖలోనూ 30 ఏళ్ల తర్వాత అవకాశం కల్పించడంతో వందలాది మందికి లబ్ధి కలిగింది. కొత్త పోస్టుల మంజూరు, పదోన్నతుల విషయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా రెవెన్యూ శాఖను ప్రభుత్వం బలోపేతం చేసింది. -
కుల ధ్రువీకరణ పత్రం ఇక శాశ్వతం
సాక్షి, అమరావతి: ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వారికి మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తే దాన్ని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు.. విద్యార్థులు, లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆదాయ ధ్రువీకరణకు గ్రామ సచివాలయాల్లోనే ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. డిజీ లాకర్లలో సర్టిఫికెట్లు కులం, స్థానికత, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల నిబంధనలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 469, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 484ను తాజాగా విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి పలు మార్గదర్శకాలు ఇచ్చింది. వాటికి సంబంధించి అన్ని శాఖలకు త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఏటా కుల, ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి 1.20 కోట్ల సర్టిఫికెట్లను రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది. కొత్త నిబంధనలతో 95 శాతం సర్టిఫికెట్ల జారీ తగ్గిపోనుంది. ప్రభుత్వ శాఖలు మళ్లీ మళ్లీ అడగకూడదు.. సంక్షేమ పథకాల కోసం వచ్చే లబ్ధిదారులను ఆయా ప్రభుత్వ శాఖలు తాజా కుల ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు వాటికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. గతేడాది 52 లక్షల కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 42 లక్షలకుపైగా పత్రాలు అందజేశారు. వాటికి సంబంధించిన డేటా బేస్ మొత్తం మీసేవ, ఏపీ సేవ కేంద్రాల్లో ఉంది. వాటిద్వారా ఈ సర్టిఫికెట్లను ఎలాంటి విచారణ లేకుండా మళ్లీ జారీ చేసేలా కొత్త నిబంధనలు రూపొందించారు. వీటి ప్రకారం.. ఒకసారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఎప్పుడైనా చెల్లుబాటవుతుంది. లబ్ధిదారుడు గతంలో జారీ చేసిన సర్టిఫికెట్ సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలు మళ్లీ తాజా సర్టిఫికెట్‌ను అడగకూడదు. అలాగే మీసేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందిన వారికి ఎ–కేటగిరీ సేవగా తక్షణమే తాజా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. వారి కుల నిర్ధారణ కోసం తహశీల్దార్, ఇతర అధికారులు దానిపై మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ లబ్ధిదారుడి తండ్రి, సోదరులు ఎవరైనా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వారి బంధుత్వాన్ని పౌరసరఫరాల శాఖ డేటాబేస్ ద్వారా నిర్ధారించుకుని ఈకేవైసీ పూర్తయితే విచారణ లేకుండా వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాలి. ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ అందించాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం ప్రస్తుత విధానంలోనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ ధ్రువీకరణకు ఆరు దశల నిర్ధారణే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి (బీపీఎల్) గురించి తెలుసుకోవడానికి, విద్యా సంస్థల్లో స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపులు పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది. గత రెండేళ్లలో 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వీటికోసం రెవెన్యూ అధికారులు ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆయా శాఖలకు తాజాగా స్పష్టం చేసింది. సంక్షేమ, విద్యా, ఇతర శాఖలు తమ పథకాల అమలుకు సంబంధించి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఇందుకు వినియోగించుకోవాలి. ఒకవేళ అందులో దరఖాస్తుదారులు ఎంపిక కాకపోతే ఆ శాఖలు సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. పది, ఇంటర్ విద్యార్థుల డేటాబేస్‌ను విద్యా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాలకు పంపితే అక్కడ 6 దశల నిర్ధారణ ప్రక్రియతో వారి ఆదాయ స్థాయిని నిర్ధారిస్తారు. ఒకవేళ అక్కడ విద్యార్థులు అర్హత సాధించకపోతే ఆ వివరాలను ఆయా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. రెవెన్యూ శాఖ విచారణ చేసి వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. స్కాలర్షిప్లు, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఆరు దశల నిర్ధారణ ప్రక్రియ సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం జారీ చేసే సర్టిఫికెట్లకు కూడా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి. -
సర్వీస్ ఈనాం భూములపై మరింత స్పష్టత
సాక్షి, అమరావతి: సర్వీస్ ఈనాం భూములపై హక్కులు కల్పించే క్రమంలో అనుసరించాల్సిన విధానాలపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. నిషేధిత జాబితా 22 (ఎ)లో ఉన్న వివిధ కేటగిరీ భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరణ ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తాజాగా మెమో జారీ చేశారు. 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలో దేవాలయాల ఈనాం భూములతోపాటు సర్వీస్ ఈనాం భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి. వాటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించి లక్షలాది మంది సర్వీస్ ఈనాం రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మేలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాల్లో జరుగుతున్న వెరిఫికేషన్‌లో అధికారులు పలు అంశాలు లేవనెత్తారు. ఈ భూములు 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22(ఎ)లోని 1(ఎ) అసైన్డ్ భూములు, 1(బి)– ప్రభుత్వ పోరంబోకు భూములు, 1(సి)–దేవదాయ, వక్ఫ్ భూములు.. 1(డి)–మిగులు భూములు, సీలింగ్ భూములు, 1(ఈ)– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసక్తి ఉన్న భూములు, చుక్కల భూములు, అనాధీన భూముల కేటగిరీల్లో ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో ఉన్న సర్వీస్ ఈనాం భూముల విషయంలో ఏం చేయాలని పలువురు కలెక్టర్లు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఎ)ను స్పష్టత కోరగా.. వీటిన్నింటిపైనా సీసీఎల్ఏ ఈ మెమోలో వివరణ ఇచ్చారు. వెరిఫికేషన్‌లో తొలగించడానికి ఎంపికైన నిషేధిత జాబితాలోని 22(ఎ)1(ఎ), (బి), (డి) కేటగిరీ భూముల వివరాలను కలెక్టర్లు నేరుగా జిల్లా రిజిస్ట్రార్లకు పంపి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 22(ఎ)1 (ఈ) కేటగిరీ భూముల వివరాలను ప్రభుత్వానికి పంపాలని, సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 22 (ఎ)1(సి) కేటగిరీలోని భూముల దేవదాయ శాఖ కమిషనర్ లేదా వక్ఫ్ బోర్డు సీఈఓకు తగిన నిర్ణయం తీసుకునేందుకు పంపాలని స్పష్టం చేశారు. 22ఎ జాబితాలో చేర్చని ఈ తరహా భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, వాటిని అలాగే ఉంచాలని సూచించారు. -
రెవె'న్యూ' విధానాలతో భూ హక్కు
సాహసోపేత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవిన్యూ సంస్కరణలు, కొత్త కార్యక్రమాలతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా భూముల విలువ అనూహ్యంగా పెరిగిపోవడంతో పేద రైతుల తల రాత మారిపోతోంది. ఎందుకూ పనికి రావనుకున్న భూములకు సైతం మంచి ధరలు కళ్లెదుటే కనిపిస్తుండటంతో అసైన్డ్ రైతుల పంట పండింది. ‘కొనుగోళ్లు – అమ్మకాలు – రిజిస్ట్రేషన్లు’ చక్రం ద్వారా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఇకపై మరింతగా ఊపందుకోనున్నాయి. తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి ఏమేరకు జరిగిందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ తోడు ఇన్నాళ్లూ అనుభవంలో ఉన్నప్పటికీ రికార్డు పరంగా హక్కు లేని భూమికి ఇప్పుడు ‘ఇది నా భూమి’ అని సంతృప్తిగా చెప్పుకునే పరిస్థితిని రైతులకు కలిగించింది. సాక్షి, అమరావతి : వివాదాలు, సమస్యలు, ఎడతెగని జాప్యంతో కునారిల్లిన రెవెన్యూ శాఖను వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో సమూలంగా మార్చేసింది. ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూపింది. సర్టిఫికెట్లు పొందడాన్ని సులభతరం చేయడం దగ్గర నుంచి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నిషేధిత భూముల చిక్కు ముడులు విప్పడం, సాహసోపేతమైన రీతిలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తొలిసారి భూముల రీ సర్వేను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక కొత్త స్వరూపాన్ని ఇచ్చింది. మొత్తంగా నాలుగేళ్లలో రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న మార్పులు ఇలా ఉన్నాయి. మహా యజ్ఞంలా భూముల రీ సర్వే ► అస్తవ్యస్థంగా మారిన భూముల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సాహసోపేతంగా భూముల రీ సర్వే చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి భూముల రికార్డుల స్థానంలో ఆధునిక డిజిటల్ భూ రికార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు జరగని విధంగా మొత్తం భూ విస్తీర్ణాన్ని కొలిచే బృహత్తర కార్యక్రమం ఇది. ఇందుకోసం ఏకంగా 14,630 మంది సర్వేయర్లను నియమించడం ఒక రికార్డు. ► రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ యజమానులకు స్పష్టమైన హక్కు కల్పించడం, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూముల హద్దులను గుర్తించి.. ఆ భూమికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా రీ సర్వే అత్యంత ఆధునిక రీతిలో సాగుతోంది. అత్యంత సంక్లిష్టమైన ఈ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో అన్ని దశల్లోనూ పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో త్వరలో పూర్తవనుంది. ప్రతి మూడు నెలలకు 2 వేల గ్రామాల చొప్పున సర్వే పూర్తికానుంది. ► సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటి వరకు 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 16.55 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 8.70 లక్షల భూ కమతాలకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు తయారయ్యాయి. రైతులకు శ్రమ లేకుండా, వారి డబ్బు ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎంతో క్లిష్టమైన ఈ పనుల్ని పూర్తి చేసింది. ► ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి భూముల హద్దులను నిర్ధారించి, భూ రక్ష సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి, ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక రాష్ట్రంలోని దళిత వాడలకు శ్మశాన వాటిక సమస్య లేకుండా చేసేందుకు ఆ దిశగా నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని దళిత వాడలను గుర్తించి, వెంటనే ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 1,700 గ్రామాల్లో 1050.08 ఎకరాల భూమిని శ్మశాన వాటికలకు కేటాయించింది. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 23 జిల్లాల్లో 50 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46 వేల మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా, అందులో ఎక్కువ మంది దళితులే. వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో 2013 తర్వాత మళ్లీ భూ పంపిణీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ► అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో లక్షలాది మంది దళిత, పేద రైతుల ఆర్థిక స్థితి ఒక్కసారిగా పెరిగిపోయింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసైన్దారులు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత హక్కుదారులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించింది. దీనివల్ల తమ భూములపై హక్కులు లేని 15,21,160 మంది పేద దళిత, ఇతర పేద వర్గాల రైతులకు సంబంధించిన 27,41,698 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. ‘ఇక ఇది నా భూమి’ అని ఆ రైతులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించింది. ► ఇన్ని లక్షల ఎకరాల లావాదేవీలు మార్కెట్లోకి రావడంతో ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విలువ లేని పేద రైతుల భూమికి విలువ పెంచడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కొత్త జిల్లాల కల సాకారం ► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 77 డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించింది. జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విభజన పూర్తి చేసింది. ► పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. పరిపాలనా వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ► ప్రతి జిల్లాకు అక్కడి పరిస్థితులను బట్టి పేరు పెట్టి, ఆయా ప్రాంతాల ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను విస్మరిస్తే.. ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని నిలబెట్టింది. 1.68 లక్షల సర్వీసు ఈనాం భూములకు విముక్తి గ్రామాల్లో కుల వృత్తుల వారికి ఇచ్చిన ఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. 1,68,604 ఎకరాల ఈనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నారు. లంక భూములకు డి పట్టాలు అనేక సంవత్సరాలుగా అపరిష్కృత సమస్యగా ఉన్న లంక భూములకు డీకేటీ పట్టాలిస్తున్నారు. 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతుండడంతో వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. చుక్కల భూముల సమస్యకు పరిష్కారం ► అత్యంత వివాదాస్పదమై ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన చుక్కల భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించి చరిత్ర సృష్టించింది. ► చుక్కల భూములుగా ఆర్‌ఎస్‌ఆర్‌లో రికార్డు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా, ప్రైవేటు పట్టాదారులవా అనే అంశాన్ని గత ప్రభుత్వం ఖరారు చేయకుండా నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఆ రికార్డులన్నింటినీ పరిశీలించి చుక్కల భూములకు విముక్తి కల్పించింది. ఈ నిర్ణయం వల్ల 1,07,134 మంది రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు లభించాయి. షరతులు గల పట్టా భూములపై తొలగిన ఆంక్షలు ► చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. ► బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22ఏ కేటగిరీలో పెట్టగా, అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ఈ ప్రభుత్వం తీసివేసింది. ► ఇలా ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. అనాదీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యకు చెక్ అనాదీనం, ఖాళీ కాలమ్ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. సాదాబైనామా కేసుల పరిష్కారం గతంలో భూముల లావాదేవీలను తెల్ల కాగితాల మీద రాసుకోవడం, నోటి మాటగా జరిగిన భూముల లావాదేవీల (సాదాబైనామా విధానం) సమస్యకు పరిష్కారం చూపింది. ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది. మ్యుటేషన్లలో పారదర్శకత ► మ్యుటేషన్ల పేరుతో జరిగే అక్రమాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. ఇష్టానుసారం మ్యుటేషన్లు చేయడాన్ని నిలిపివేసి, పట్టాదారుకు నోటీసు ఇచ్చి, విచారణ జరిగిన తర్వాతే రెవెన్యూ రికార్డులో మార్పు జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చారు. దీంతో కరెక్షన్ పేరుతో జరిగే మ్యుటేషన్లు నిలిచిపోయాయి. ► మ్యుటేషన్లు తిరస్కరించే అధికారాన్ని తహశీల్దార్లకు తీసివేసి ఆర్డీఓలకు అప్పగించడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్‌కు ముందే సర్వే నంబర్ సబ్ డివిజన్ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. సర్టిఫికెట్ల జారీ సులభతరం ► ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం సులభతరం చేసింది. సర్టిఫికెట్లు జారీ చేయడానికి దరఖాస్తులు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయం, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్, కాల్ సెంటర్ వంటి వ్యవస్థలన్నింటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారమే పని చేయిస్తోంది. ► హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలి మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే ఇవ్వడం లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తోంది. ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియ ముమ్మరం భూములకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏదైతే జరగాలని చెబుతున్నారో.. అలాంటి మార్పులన్నీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే ఆస్తిని సంపదగా మార్చుకున్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి సంపదగా మారాలంటే అడ్డంకులను ప్రభుత్వమే తొలగించాలి. ఆ పని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. భూ హక్కులకు భద్రత కల్పించడం, సరిహద్దుల స్పష్టత, అమ్మకాలు–కొనుగోళ్లను సులభం చేయడం, ఆంక్షలను తొలగించడం, మంచి భూ పరిపాలన యంత్రాంగాన్ని తయారు చేయడం ప్రధానమైనవి. ఏపీ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తోంది. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తేయడం, చుక్కల భూములు, అనా«దీనం భూములపైనా ఆంక్షలు తొలగించడం ఇందులో భాగమే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ స్థాయికి రావడం పెద్ద మార్పు. ఇలా ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. తద్వారా వేల కోట్ల సంపద ఆవిష్కృతమైంది. – ఎం.సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్