సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ అసైన్డ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం జిల్లా కలెక్టర్లకు ఈ–ఫైల్ విధానంలో ఆదేశాలిచ్చారు.
ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తి, అతను లేకపోతే అతని వారసుల ఆదీనంలో ఆ భూమి ఉంటేనే యాజమాన్య హక్కులు కల్పించాలని సూచించారు. ఆ భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) నుంచి తొలగించాలని ఆదేశించారు. లంక భూములు, నీటి వనరులకు సంబంధించిన భూములకు ఇందులో నుంచి మినహాయించాలని సూచించారు. ఇందుకోసం వీఆర్‌ఓలు, తహశీల్దార్లు, ఆర్డీఓలు–సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు ఏం చేయాలనే అంశాలను నిర్దిష్టంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
వీఆర్‌ఓలు ఇలా చేయాలి..
రికార్డులను సంస్కరించడంలో (పీఓఎల్‌ఆర్–ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) భాగంగా తహశీల్దార్లు వ్యవసాయం, ఇళ్ల పట్టాల కోసం అసైన్ చేసిన భూములను గుర్తించారు. వాటిని బట్టి వీఆర్‌ఓలు ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం వివరాలను సమకూర్చాలి. ఇప్పటికే గుర్తించిన సర్వే నంబర్ల ప్రకారం ఆ భూముల డీకేటీ రిజిష్టర్లు, 1బీ, అడంగల్, 22 (ఎ) జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో వంద శాతం తనిఖీలు నిర్వహించాలి.
ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పట్టాను పరిశీలించి, ఆ పట్టాదారు.. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? (ఒరిజినల్ అసైనీనా లేక లీగల్ హైరా), సంబంధిత భూమి వారి ఆ«దీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం అది లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను కచ్చితంగా సేకరించాలి. ఇందుకోసం అన్ని రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించాలి.
తహశీల్దార్ల పాత్ర
వీఆర్‌ఓలు ఇచ్చిన అసైన్డ్ భూముల సర్వే నంబర్లను తహశీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. మండలంలోని అన్ని అసైన్డ్ భూముల వివరాలు ఆ జాబితాలో ఉన్నాయో.. లేదో.. చూడాలి. ఈ కసరత్తులో ఏ అసైన్డ్ భూమిని వదిలి వేయకూడదు. ఒకవేళ ఏదైనా భూమిని వదిలివేసినట్లు గుర్తిస్తే వెంటనే ఆ వివరాలను సీసీఎల్‌ఏ కార్యాలయంలోని సీఎంఆర్‌ఓ (కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్) సెక్షన్‌కు ఈ–ఫైల్ విధానంలో పంపి కసరత్తులో చేర్చాలి.
పక్కాగా తనిఖీ చేసిన తర్వాత తహశీల్దార్ అసైన్డ్ భూముల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిక్ నోటీస్ బోర్డులో పెట్టాలి. సూచనలు, అభ్యంతరాల కోసం 7 రోజుల సమయం ఇవ్వాలి. ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని వెంటనే క్లియర్ చేయాలి. ఆ తర్వాత మొత్తం రికార్డుల్లో 5 శాతాన్ని ఆర్డీఓలు తనిఖీ చేయాలి.
జాయింట్ కలెక్టర్ల పాత్ర
ఆర్డీఓలు/సబ్ కలెక్టర్లు తనిఖీ చేసిన 5 శాతం రికార్డుల్లో 1 శాతం రికార్డులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి, అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడాలి. వీఆర్వో నుంచి ఆర్డీఓ స్థాయి వరకు జరిగిన కసరత్తును పూర్తిగా పర్యవేక్షిస్తూ అన్ని దశల్లోనూ పారదర్శకంగా జరిగిందో లేదో పరిశీలించాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 22 (ఎ) జాబితా నుంచి ఎంపిక చేసిన సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్లకు ముసాయిదా లేఖ సిద్ధం చేయాలి.
కలెక్టర్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్‌కు పంపాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 5వ తేదీన ఇదే విధంగా నిబంధనల ప్రకారం 22 (ఎ) నుంచి తొలగించాల్సిన అసైన్డ్ భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి. అసైన్డ్ భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించాలి. మొత్తం కసరత్తు పూర్తయిన తర్వాత కలెక్టర్.. జిల్లా రిజిస్ట్రార్‌కు 22 (ఎ) నుంచి తొలగించాల్సిన సర్వే నంబర్ల జాబితాను పంపి, తర్వాత దాన్ని జిల్లా గెజిట్‌లో ప్రచురించాలి.
Comments
Please login to add a commentAdd a comment