రెవె'న్యూ' విధానాలతో భూ హక్కు | CM Jagan govt completely cleansed Andhra Pradesh revenue department | Sakshi
Sakshi News home page

రెవె'న్యూ' విధానాలతో భూ హక్కు

Published Sun, Oct 8 2023 4:15 AM | Last Updated on Sun, Oct 8 2023 11:19 AM

CM Jagan govt completely cleansed Andhra Pradesh revenue department - Sakshi

సాహసోపేత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవిన్యూ సంస్కరణలు, కొత్త కార్యక్రమాలతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా భూముల విలువ అనూహ్యంగా పెరిగిపోవడంతో పేద రైతుల తల రాత మారిపోతోంది. 

ఎందుకూ పనికి రావనుకున్న భూములకు సైతం మంచి ధరలు కళ్లెదుటే కనిపిస్తుండటంతో అసైన్డ్‌ రైతుల పంట పండింది. ‘కొనుగోళ్లు – అమ్మకాలు – రిజిస్ట్రేషన్లు’ చక్రం ద్వారా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఇకపై మరింతగా ఊపందుకోనున్నాయి. తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి ఏమేరకు జరిగిందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ తోడు ఇన్నాళ్లూ అనుభవంలో ఉన్నప్పటికీ రికార్డు పరంగా హక్కు లేని భూమికి ఇప్పుడు ‘ఇది నా భూమి’ అని సంతృప్తిగా చెప్పుకునే పరిస్థితిని రైతులకు కలిగించింది. 


సాక్షి, అమరావతి :  వివాదాలు, సమస్యలు, ఎడతెగని జాప్యంతో కునారిల్లిన రెవెన్యూ శాఖను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో సమూలంగా మార్చేసింది. ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూపింది. సర్టిఫికెట్లు పొందడాన్ని సులభతరం చేయడం దగ్గర నుంచి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నిషేధిత భూముల చిక్కు ముడులు విప్పడం, సాహసోపేతమైన రీతిలో అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది.

భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తొలిసారి భూముల రీ సర్వేను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక కొత్త స్వరూపాన్ని ఇచ్చింది. మొత్తంగా నాలుగేళ్లలో రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న మార్పులు ఇలా ఉన్నాయి.  

మహా యజ్ఞంలా భూముల రీ సర్వే 
► అస్తవ్యస్థంగా మారిన భూముల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సాహసోపేతంగా భూముల రీ సర్వే చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. బ్రిటీష్‌ కాలం నాటి భూముల రికార్డుల స్థానంలో ఆధునిక డిజిటల్‌ భూ రికార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు జరగని విధంగా మొత్తం భూ విస్తీర్ణాన్ని కొలిచే బృహత్తర కార్యక్రమం ఇది. ఇందుకోసం ఏకంగా 14,630 మంది సర్వేయర్లను నియమించడం ఒక రికార్డు. 

► రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ యజమానులకు స్పష్టమైన హక్కు కల్పించడం, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూముల హద్దులను గుర్తించి.. ఆ భూమికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా రీ సర్వే అత్యంత ఆధునిక రీతిలో సాగుతోంది. అత్యంత సంక్లిష్టమైన ఈ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో అన్ని దశల్లోనూ పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో త్వరలో పూర్తవనుంది. ప్రతి మూడు నెలలకు 2 వేల గ్రామాల చొప్పున సర్వే పూర్తికానుంది. 

► సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటి వరకు 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 16.55 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 8.70 లక్షల భూ కమతాలకు సంబంధించి ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌లు తయారయ్యాయి. రైతులకు శ్రమ లేకుండా, వారి డబ్బు ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎంతో క్లిష్టమైన ఈ పనుల్ని పూర్తి చేసింది.  

► ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి భూముల హద్దులను నిర్ధారించి, భూ రక్ష సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి, ఇళ్ల యజమానులకు ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.   

ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక 
రాష్ట్రంలోని దళిత వాడలకు శ్మశాన వాటిక సమస్య లేకుండా చేసేందుకు ఆ దిశగా నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని దళిత వాడలను గుర్తించి, వెంటనే ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 1,700 గ్రామాల్లో 1050.08 ఎకరాల భూమిని శ్మశాన వాటికలకు కేటాయించింది.   

సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీ 
రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 23 జిల్లాల్లో 50 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46 వేల మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా, అందులో ఎక్కువ మంది దళితులే. వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో 2013 తర్వాత మళ్లీ భూ పంపిణీకి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు 
► అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో లక్షలాది మంది దళిత, పేద రైతుల ఆర్థిక స్థితి ఒక్కసారిగా పెరిగిపోయింది. అసైన్‌ చేసిన 20 ఏళ్ల తర్వాత అసైన్‌దారులు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించింది.
 
► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్‌ రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అసైన్‌ చేసిన 20 ఏళ్ల తర్వాత హక్కుదారులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించింది. దీనివల్ల తమ భూములపై హక్కులు లేని 15,21,160 మంది పేద దళిత, ఇతర పేద వర్గాల రైతులకు సంబంధించిన 27,41,698  ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. ‘ఇక ఇది నా భూమి’ అని ఆ రైతులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించింది. 

► ఇన్ని లక్షల ఎకరాల లావాదేవీలు మార్కెట్‌లోకి రావడంతో ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విలువ లేని పేద రైతుల భూమికి విలువ పెంచడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. 

కొత్త జిల్లాల కల సాకారం 
► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 77 డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించింది. జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరి­గణనలోకి తీసుకుని విభజన పూర్తి చేసింది. 

► పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూని­ట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయా­ల్సి ఉన్నప్పటికీ,  గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. పరిపాలనా వికేంద్రీ­కరణ, భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రజ­ల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 

► ప్రతి జిల్లాకు అక్కడి పరిస్థితులను బట్టి పేరు పెట్టి, ఆయా ప్రాంతాల ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను విస్మరిస్తే.. ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడం ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని నిలబెట్టింది.  

1.68 లక్షల సర్వీసు ఈనాం భూములకు విముక్తి  
గ్రామాల్లో కుల వృత్తుల వారికి ఇచ్చిన ఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. 1,68,604 ఎకరాల ఈనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నారు.  

లంక భూములకు డి పట్టాలు 
అనేక సంవత్సరాలుగా అపరిష్కృత సమస్యగా ఉన్న లంక భూములకు డీకేటీ పట్టాలిస్తున్నారు. 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతుండడంతో వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది.   

చుక్కల భూముల సమస్యకు పరిష్కారం 
► అత్యంత వివాదాస్పదమై ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన చుక్కల భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించి చరిత్ర సృష్టించింది.
 
► చుక్కల భూములుగా ఆర్‌ఎస్‌ఆర్‌లో రికార్డు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా, ప్రైవేటు పట్టాదారులవా అనే అంశాన్ని గత ప్రభుత్వం ఖరారు చేయకుండా నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఆ రికార్డులన్నింటినీ పరిశీలించి చుక్కల భూములకు విముక్తి కల్పించింది. ఈ నిర్ణయం వల్ల 1,07,134 మంది రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు లభించాయి.   

షరతులు గల పట్టా భూములపై తొలగిన ఆంక్షలు  
► చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది.  

► బ్రిటీష్‌ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22ఏ కేటగిరీలో పెట్టగా, అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ఈ ప్రభుత్వం తీసివేసింది.  

► ఇలా ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. 2022 అక్టోబర్‌ 20న అవనిగడ్డలో బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు.   

అనాదీనం, ఖాళీ కాలమ్‌ భూముల సమస్యకు చెక్‌  
అనాదీనం, ఖాళీ కాలమ్‌ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు.  

సాదాబైనామా కేసుల పరిష్కారం  
గతంలో భూముల లావాదేవీలను తెల్ల కాగితాల మీద రాసుకోవడం, నోటి మాటగా జరిగిన భూముల లావాదేవీల (సాదాబైనామా విధానం) సమస్యకు పరిష్కారం చూపింది. ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది.  

మ్యుటేషన్లలో పారదర్శకత  
► మ్యుటేషన్ల పేరుతో జరిగే అక్రమాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. ఇష్టానుసారం మ్యుటేషన్లు చేయడాన్ని నిలిపివేసి, పట్టాదారుకు నోటీసు ఇచ్చి, విచారణ జరిగిన తర్వాతే రెవెన్యూ రికార్డులో మార్పు జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చారు. దీంతో కరెక్షన్‌ పేరుతో జరిగే మ్యుటేషన్లు నిలిచిపోయాయి.  

► మ్యుటేషన్లు తిరస్కరించే అధికారాన్ని తహశీల్దార్లకు తీసివేసి ఆర్డీఓలకు అప్పగించడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్‌కు ముందే సర్వే నంబర్‌ సబ్‌ డివిజన్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో డబుల్‌ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ విధానం అందుబాటులోకి వచ్చింది.  

సర్టిఫికెట్ల జారీ సులభతరం 
► ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సులభతరం చేసింది. సర్టిఫికెట్లు జారీ చేయడానికి దరఖాస్తులు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయం, మీసేవా కేంద్రాలు, ఆన్‌లైన్‌ వెబ్‌ అప్లికేషన్, కాల్‌ సెంటర్‌ వంటి వ్యవస్థలన్నింటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారమే పని చేయిస్తోంది. 

► హౌస్‌ హోల్డ్‌ డేటా బేస్‌లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలి మెంబర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్‌ గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్‌ డిజిటల్‌ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే ఇవ్వడం 
లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తోంది.   

ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియ ముమ్మరం   
భూములకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏదైతే జరగాలని చెబుతున్నారో.. అలాంటి మార్పులన్నీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే ఆస్తిని సంపదగా మార్చుకున్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి సంపదగా మారాలంటే అడ్డంకులను ప్రభుత్వమే తొలగించాలి. ఆ పని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. భూ హక్కులకు భద్రత కల్పించడం, సరిహద్దుల స్పష్టత, అమ్మకాలు–కొనుగోళ్లను సులభం చేయడం, ఆంక్షలను తొలగించడం, మంచి భూ పరిపాలన యంత్రాంగాన్ని తయారు చేయడం ప్రధానమైనవి.

ఏపీ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తోంది. అసైన్డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తేయడం, చుక్కల భూములు, అనా«దీనం భూములపైనా ఆంక్షలు తొలగించడం ఇందులో భాగమే. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గ్రామ స్థాయికి రావడం పెద్ద మార్పు. ఇలా ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. తద్వారా వేల కోట్ల సంపద ఆవిష్కృతమైంది. 
– ఎం.సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement