ఎక్కడైనా వివాదంలో ఉన్న మన 4 సెంట్ల భూమి మన సొంతమైతే ఆ ఆనందమే వేరు. ఆ కుటుంబానికి అది స్థిరాస్తిగా నిలిచిపోతుంది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 32 లక్షల ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పించడమంటే మాటలు కాదు. ఒక్కసారిగా ఆ రైతుల ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. సంపద సృష్టి ద్వారా ఇటు రైతులు, అటు ప్రభుత్వానికి లబ్ధి కలుగుతుంది. ఇంతటి కీలక నిర్ణయానికి కారణమైన ఏపీ ప్రభుత్వంపై భూ చట్టాల నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన సంపద అన్నదాతల చేతుల్లోకి రావడం దేశంలోనే విప్లవాత్మక మార్పు అని కొనియాడుతున్నారు.
సాక్షి, అమరావతి: భూములపై ఆంక్షలు తొలగేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో సరికొత్త సంపదను సృష్టించాయి. ఈ కొత్త సంపద సృష్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు దోహద పడుతుందని భూ చట్టాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 32 లక్షల ఎకరాలను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడం ద్వారా వాటిపై సంబంధిత రైతులకు సంపూర్ణ హక్కులు లభించనున్నాయి.
అంటే ఆ భూములన్నీ కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించినట్లే. ఇప్పటి వరకు ఎటువంటి లావాదేవీలు జరగని ఆ భూములన్నీ కొత్తగా మార్కెట్‌లోకి రావడం వల్ల వాటిపై జరిగే వ్యాపారం ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ఆ భూములకు చెందిన 20 లక్షల మంది రైతుల ఆర్థిక స్థితిగతులు మారతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పేదల భూములకు విలువ పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది గొప్ప ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్నారు.
32 లక్షల ఎకరాలకు విముక్తి
అత్యంత వివాదాస్పదంగా ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన నిషేధిత జాబితా భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. ఎక్కడైనా నాలుగైదు ఎకరాలను నిబంధనల ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తేనే వివాదాలు ఏర్పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఏకంగా లక్షల ఎకరాలను ఆ జాబితా నుంచి తొలగిస్తోంది.
తద్వారా దశాబ్దాలుగా అనేక కష్టాలు పడుతున్న సుమారు 20 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతులు గల పట్టాలు, అనాధీనం, ఖాళీ కాలమ్, సర్వీసు ఈనాం భూములతోపాటు ఇవే తరహా మరికొన్ని కేసుల్లో మొత్తం 32 లక్షల ఎకరాలను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగిస్తోంది.
27.41 లక్షల ఎకరాల భూములపై హక్కులు
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూముల యజమానులకు సర్వ హక్కులు కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్‌మెంట్ చేస్తే ఆ రికార్డులు క్షేత్రస్థాయికి తగ్గట్టుగా లేవు.
అసైన్‌మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయిన భూములకు హక్కులు కల్పించడం ద్వారా 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. రైతుల ప్రమేయం లేకుండా రెవిన్యూ యంత్రాంగం 20 సంవత్సరాలు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది. నెల రోజుల్లో ఆంక్షలు తొలగిపోయేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చకచకా అడుగులు ముందుకు వేస్తోంది.
2.06 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి
15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూముల పేరుతో ఉన్న 4.06 లక్షల ఎకరాలను సుమోటోగా రీ వెరిఫికేషన్ చేసింది. ఆర్డీఓలు, తహశీల్దార్లు 1.81 లక్షల సర్వే నంబర్లలోని 4.06 లక్షలపైగా ఎకరాలకు సంబంధించిన భూములను రీ వెరిఫికేషన్ చేశారు. రికార్డుల్లో రైతు పేరు ఉన్నట్లు ధృవీకరించుకోవడంతోపాటు 11 ఏళ్లుగా అతని ఆధీనంలోనే భూమి ఉంటే ఆ భూమిని 22 (ఏ)1ఇ నుంచి తొలగించారు.
తద్వారా చుక్కల భూములపై సంబంధిత రైతులకు సర్వ హక్కులు లభించాయి. తద్వారా చాలా సంవత్సరాల నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన సభలో చుక్కల భూముల రైతులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
షరతుల పట్టా భూములు 33 వేల ఎకరాలు
చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమకెలాంటీ ఉపయోగం ఉండదని భావించి, వాటిని 22(ఏ) కేటగిరీలో పెట్టింది.
అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఆ జాబితా నుంచి తీసివేసింది. 17,730 సర్వే నెంబర్లకు సంబంధించిన 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం మోడు వారిన సుమారు 50 వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసేశారు.
2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఆ భూములను సర్వ హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు.
అనాధీనం, ఖాళీ కాలమ్ భూములు 50 వేల ఎకరాలు
చుక్కల భూముల మాదిరిగానే కొన్ని ప్రాంతాల్లో అనాధీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు.
1.68 లక్షల సర్వీసు ఈనాం భూముల సమస్యకు పరిష్కారం
సర్వీసు ఈనాం భూముల సమస్యనూ సానుకూలంగా పరిష్కరించింది. నిషేధిత ఆస్తుల జాబితా 22(ఎ) నుంచి 1.68 లక్షల ఎకరాల సర్వీసు ఈనాం భూములను తొలగిస్తోంది. 25 జిల్లాల్లో 1.13 లక్షల మంది కుల వృత్తులు చేసుకునే రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. 1956లో ఈనాం చట్టం రావడంతో ఈనాం భూములను రద్దు చేసి వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు.
2013 వరకు ఇవి రైత్వారీ పట్టా భూములుగానే ఉన్నాయి. 2013లో జరిగిన ఈనాం భూముల చట్ట సవరణతో నిషేధిత భూముల జాబితాలో చేరాయి. గ్రామ సర్వీసు ఈనాం భూములను అందరి మేలు కోసం పనిచేసిన కుల వృత్తుల వారికి (నాయీబ్రాహ్మణులు, రజకులు, వడ్రంగి వంటి వృత్తులు) ఇచ్చారు. ఆ భూములు ఆ వృత్తులు చేసుకునే వ్యక్తులు, వారి వారసులకు వస్తాయి.
ఇలా సర్వీసు చేసిన కుల వృత్తుల వారి సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే వారికి రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలు గ్రామ సర్వీసు ఈనాం భూములకు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ భూములన్నింటినీ త్వరలో 22(ఎ) నుంచి తొలగించనుంది.
కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గం సుగమం
భూములపై ఆంక్షలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ రావాలని గత 20 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. మార్కెట్‌లో పెన్ను, పేపర్ ఎంత సులభంగా అమ్ముకుని, కొనుక్కుంటున్నామో.. భూమిని కూడా అలాగే కొనుక్కుని, అమ్ముకునే పరిస్థితి ఉండాలి. అలా ఉంటేనే పేదరిక నిర్మూలన, సంపద సృష్టి జరుగుతుందనే వాదన అన్ని దేశాల్లో బలంగా వినిపిస్తోంది.
ఆ దిశగానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. 32 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించడం అందులో భాగంగానే జరిగిందని భావించాలి. ఈ భూములపై హక్కులు కల్పించడం ద్వారా ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. ఉన్న భూమికి సరైన కాగితాలు, సంపూర్ణమైన హక్కులు లేకపోవడం వల్ల ఆ రైతుకు, సమాజానికి ఆర్థికంగా జరిగే నష్టం చాలా ఎక్కువ. ఆస్తి ఉన్నా.. దాన్ని సంపదగా మార్చుకోలేకపోతున్నాం.
ఈ సమస్యను పరిష్కరిస్తే మన దేశం సుసంపన్న దేశంగా మారుతుందని అంతర్జాతీయంగా మేధావులు చెబుతున్నారు. అంటే ఉన్న భూమికి పత్రాలు సక్రమంగా ఉండేలా చూడాలి. ఆ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించాలి. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. ఏపీలో 33 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి.
అసైన్డ్ భూముల చట్ట సవరణ ద్వారా అసైన్‌మెంట్ జరిగిన 20 ఏళ్లు పూర్తయిన భూములన్నీ పట్టా భూములుగా మారతాయి. అప్పుడు రైతులకు అన్ని విధాలా లాభమే. విలువ పెరిగి, సంపద సృష్టి జరుగుతుంది. సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. వాటితో ముడిపడిన గొడవలూ తగ్గిపోతాయి.
– ఎం. సునీల్‌కుమార్, భూ చట్టాలనిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment