భూమి(తల) రాత మార్పు
నాలుగైదు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన ఆ భూమి ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా మారిపోయింది. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కష్టపడి అలాంటి భూమిని కొనుక్కుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అన్యాయమైపోయారు.
ఆ భూమిలో పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్న రైతులు ఒక్కసారిగా కుదేలైపోయారు. తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. ఈ సమస్యలను వైఎస్ జగన్ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించింది.
బ్రిటీష్ కాలం నుంచి రైతుల చేతుల్లో ఉండి, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని.. ఆ జాబితా నుంచి వాటిని తొలగించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 17,730 సర్వే నంబర్లకు సంబంధించి 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసేసింది. మోడు వారిన సుమారు 50 వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. కోడూరు మండలంలో 9,600 ఎకరాలను తొలగించారు.
బొల్లికొండ ఫణికుమార్ – సాక్షి, అమరావతి: ఆర్‌ఎస్‌ఆర్‌లో షరతులు గల పట్టా అని ఉన్న 33 వేల ఎకరాల భూములను 2016లో తెలుగుదేశం ప్రభుత్వం 22ఏ (1)ఇ జాబితాలో చేర్చడంతో రైతులు కుదేలయ్యారు. 1910లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ భూములను రైతులకు వేలం ద్వారా ఇచ్చినట్లు రెవెన్యూ శాఖ భావిస్తోంది. వేలం కాదు రైతులకు అసైన్డ్ చేసిందనే వాదన కూడా ఉంది. ఏదైనా వందేళ్లకు ముందు నుంచే ఆ భూములు రైతుల చేతుల్లో ఉన్నాయి. వారికి పట్టాలుండటంతోపాటు,ఆర్‌ఎస్‌ఆర్‌లో వారి పేర్లు నమోదయ్యాయి. అప్పటి నుంచి శిస్తు కడుతూనే ఉన్నారు.
అవసరానికి వాటిని అమ్ముకున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. బ్రిటీష్ హయాం నుంచి లావాదేవీలున్న ఆ భూములను 2016 మే 5న జీఓ ఎంఎస్ నెంబర్ 196 ద్వారా టీడీపీ ప్రభుత్వం 22ఏ(1)ఇ కేటగిరీలో పెట్టేసింది. అప్పటి వరకు సర్వ హక్కులతో ఏళ్ల తరబడి ఆ భూములను అనుభవించిన రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు కూడా ఆగిపోయాయి. అప్పటికే బేరం కుదుర్చుకున్న వారు కొనడానికి ముందుకు రాలేదు.
కొందరైతే కొంత డబ్బు తీసుకుని భూమిని వదులుకున్నారు. తమ కూతుళ్లకు ఆ భూమిని ఇచ్చిన తండ్రులు కొందరు అల్లుళ్లకు సమాధానం చెప్పలేక నానా బాధలు పడ్డారు. గత ప్రభుత్వం ఆ భూములపై పంట నష్టం కూడా ఇవ్వలేదు. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు అనేక మంది చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ధర్నాలు చేసినా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. దీంతో వేలాది రైతు కుటుంబాలకు తీరని కష్టంగా మారింది.
జగన్ రాకతో మంచి రోజులు
2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారిలో ఆశలు చిగురించాయి. తమ సమస్యను వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నారు. అప్పటికే ఈ సమస్యపై పోరాడిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించడంతో రెవెన్యూ శాఖ షరతులు గల పట్టా భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధ్యయనం చేసింది.
వందేళ్ల నుంచి రైతులు అనుభవిస్తున్న భూములను 22ఏ కేటగిరీలో చేర్చడం తప్పని నిర్ధారించింది. ఒకవేళ ప్రభుత్వం రైతులకు అసైన్డ్ చేసిందనుకున్నా.. 1954కు ముందే అది జరిగింది కాబట్టి నిరభ్యంతరంగా వాటిపై రైతులకు హక్కులు ఉంటాయని తేల్చింది. దీంతో ప్రభుత్వం వాటిని రిజిస్ట్రేషన్ల చట్టం 1908 22ఏ(1)ఇ కేటగిరీ నుంచి తొలగిస్తూ 2022 అక్టోబర్ 7న జీఓ ఎంఎస్ నంబర్ 667ను జారీ చేసింది.
గత ఏడాది అక్టోబర్ 20న అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఆ భూములను సర్వ హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఈ షరతుల బారిన పడిన ఏ రైతును కదిలించినా జగన్ ప్రభుత్వం తమకు చేసిన మేలు మరచిపోలేమని భావోద్వేగంతో చెబుతున్నారు.
నా జీవితాన్ని నిలబెట్టారు..
షరతులు గల పట్టా పేరుతో నా లాంటి వేల మంది రైతుల జీవితాలను గత ప్రభుత్వం తలకిందులు చేస్తే, ప్రస్తుత సీఎం జగన్ మళ్లీ జీవితాలు ఇచ్చారు. నాకు 7.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాత అల్లపర్తి రామబ్రహ్మం నుంచి మా నాన్న రాధాకృష్ణకు, ఆయన నుంచి నాకు ఆ భూమి వచ్చింది. 1920 నుంచి ఆ భూమిని మా కుటుంబం సాగు చేసుకుంటోంది. అప్పటి నుంచి శిస్తు కట్టాం. అవసరమైనప్పుడు బ్యాంకుల్లో తనఖా పెట్టాం. ఏటా పంట రుణాలు తీసుకున్నాం.
మూడు తరాల నుంచి మాకున్న భూమిని 2016లో ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. బ్యాంకు రుణం కోసం వెళితే ప్రభుత్వ భూమి కాబట్టి ఇవ్వమన్నారు. పంట దెబ్బతింటే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. తనఖా పెట్టడానికి, అమ్ముకోవడానికి అవకాశం లేదు. భూమి చేతిలోనే ఉంది.. కానీ ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. నా కూతురు పెళ్లి చేసినప్పుడు ఉన్న భూమిలో కొంత ఆమెకు ఇచ్చా.
అది విలువ లేనిదంటూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంత మంది చుట్టూ తిరిగామో లెక్కలేదు. మేం పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో వైఎస్ జగన్ ఆపద్భాందవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు సర్వ హక్కులూ వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది.
– అల్లపర్తి హరి మోహనరావు, భావదేవరపల్లి, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా
మా పొలం మాకు దక్కింది
కోడూరు మండలం మాచవరంలో సర్వే నంబర్ 446/ఏలో నాకు 83 సెంట్ల పొలం ఉంది. 2006లో బడే వాసుదేవరావు నుంచి కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఏడాది క్రితం నా భర్తకు గుండె సమస్య రావడంతో బైపాస్ చేయాలని చెప్పారు. రూ.6 లక్షలు అవసరమవడంతో పొలం అమ్ముదామని బేరం పెడితే ఇది రిజిస్ట్రేషన్‌కు పనికిరాదన్నారు.
కో ఆపరేటివ్ సొసైటీ రుణం కోసం వెళ్లినా ఇవ్వలేదు. పంట నష్టం కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా పొలాన్ని మాకు దక్కేలా చేశారు. షరతులు గల పట్టా నుంచి తీసి దానిపై మాకు పూర్తి హక్కు కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం మేలు మరచిపోము.
– సనకా గోవర్ధన, వి.కొత్తపాలెం, కోడూరు మండలం
పనికి రాదన్న భూమికి విలువ వచ్చింది
నా తండ్రి సనకా కృష్ణమూర్తి నాకు 2.20 ఎకరాలు ఇచ్చారు. 2003లోనే దాన్ని నా పేరుతో రిజిష్టర్ చేసి అప్పగించారు. అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ అన్ని హక్కులతో ఉపయోగించుకున్నాం. 2018లో పెద్ద రుణం (ఎల్‌టీ లోన్) కోసం బ్యాంకుకు వెళితే ఈ భూమి 22ఏ జాబితాలో ఉందని, రాదని చెప్పారు. చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. జగన్ ప్రభుత్వానికి ఎంతో రుణ పడి ఉంటాం. పనికిరాదన్న మా భూమికి తిరిగి విలువ కల్పించారు.
– రేపల్లె నాగరాజ, వి.కొత్తపాలెం, కోడూరు మండలం
ఎంతో సంతోషంగా ఉన్నాం
2001లో మా గ్రామంలోని సర్వే నంబర్ 226/1, 228/1లో 3.31 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 2017 తర్వాత అందులో ఒక ఎకరం మా అబ్బాయి పేరు మీద మార్చాలని వెళితే ఇది 22–ఏ జాబితాలో ఉన్నందున కుదరదన్నారు. చాలా మంది చుట్టూ తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. అన్నం పెట్టే భూమిని ఇలా చేశారేంటని చాలా బాధ పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. అమ్ముకోవడానికి, నా కొడుకు పేర రాయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సంతోషంగా ఉంది.
– చిట్టిప్రోలు రామ్మోహనరావు, లింగారెడ్డిపాలెం, కోడూరు మండలం, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment