పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర | YS Jagan Govt Created New history in Distribution of housing sites | Sakshi
Sakshi News home page

పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర

Published Thu, Jan 25 2024 4:47 AM | Last Updated on Thu, Jan 25 2024 4:37 PM

YS Jagan Govt Created New history in Distribution of housing sites - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజి­స్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్‌ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్‌ చేస్తుండటం దేశం­లోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ నేడో, రేపో జారీ కానుంది.

ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్‌ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు.

అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్‌ డీడ్‌లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్‌ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్‌ డీడ్‌లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

పేదలు ఇబ్బంది పడకూడదనే..
చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్‌ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్‌లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్‌ డీడ్‌లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. 

యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. 
ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్‌వో పేదలకు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్‌ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్‌ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్‌ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది.

పేదలకిచ్చే కన్వేయన్స్‌ డీడ్‌లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్‌ డీడ్‌లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్‌ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్‌వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement