వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’లో పేర్కొంది.
సందర్భం
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు.
ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.
గత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.
కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు.
అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండి యన్ స్టేట్స్’లో పేర్కొంది.
కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగన్ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది.
ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది.
రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది.
ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.
జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది.
ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్ సెక్టార్‌లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.
రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పామ్ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి.
జగన్ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.
వి.వి.ఆర్. కృష్ణంరాజు
వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
మొబైల్: 89859 41411
Comments
Please login to add a commentAdd a comment