
2024–25 సామాజిక ఆర్థిక సర్వే చెప్పిన సత్యమిదే
చంద్రబాబు పాలనలో ఏడాది తిరగకుండానే ఎన్నో అప్పులు
2023–24 వరకు వాస్తవ బడ్జెట్ అప్పు రూ.4.91 లక్షల కోట్లే
2024–25 నాటికి రూ.5.64 లక్షల కోట్లకు పెరుగుదల
జీఎస్‌డీపీలో 35.15 శాతానికి పెరిగిన అప్పు
తగ్గిన రాబడి.. పారిశ్రామిక వృద్ధీ లేదు
రెవెన్యూ, ద్రవ్యలోటు, నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుదల
జగన్ హయాంలో తగ్గిన పేదరికం.. మెరుగైన జీవనోపాధి
డీబీటీతో లీకేజీ లేకుండా లబ్ధిదారులకు ఆర్ధిక సాయం
వైఎస్సార్‌సీపీ పాలనలో నాడు–నేడు ద్వారా భారీగా మౌలిక సదుపాయాలు కల్పన
రైతుల కోసమే ‘సెకీ’ విద్యుత్ ఒప్పందం
వ్యవసాయంలో ఆ ఐదేళ్లు గణనీయమైన ప్రగతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పులపై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించింది. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ఎక్కువ అప్పులు చేసినట్లు కూడా స్పష్టమైంది. 2024–25 సామాజిక ఆర్థిక సర్వేను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది.
ఇందులో కూటమి నాయకులు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండగా అనేక అంశాలపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. మన బడి నాడు–నేడు కింద పాఠశాలల్లో రెండు దశల్లో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గణాంకాలతో సహా సామాజిక ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా అనేక పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడంతో లీకేజీ లేకుండా వారికి ప్రయోజనం అంది.. జీవనోపాధి మెరుగైందని, పేదరిక శాతం తగ్గిందని స్పష్టమైంది.
జగన్ హయాంలోనే పేదరిక నిర్మూలన..
పేదరిక నిర్మూలనకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేసింది. సంక్షేమ, వైద్య, ఆరోగ్య పథకాలు, ఉపాధి అవకాశాల, సామాజిక భద్రత, సాధికారత కార్యక్రమాల లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీతో గ్రామీణ పేదలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు లీకేజీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సకాలంలో సాయం అందింది.
కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు పేదరికం తగ్గడానికి దోహదపడ్డాయి. పేదరిక నిర్మూలనలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది. నీతి ఆయోగ్ 2023లో విడుదల చేసిన బహుళ పేదరిక సూచికల్లో ఏపీలో పేదరికం 50 శాతం తగ్గింది. 2015–16 నాటి ఈ స్కోరు 0.053 ఉండగా, 2019–21లో 0.025కు తగ్గింది.
2023–24 సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ సరసమైన స్వచ్ఛమైన ఇంధనం అందించడంలో 1వ స్థానంలో ఉందని, స్థిరమైన అభివృద్ధి కోసం నీటి వనరులను సంరక్షించడం, స్థిరంగా ఉపయోగించడంలో రెండో ర్యాంకు, పేదరిక నిర్మూలనలో మూడో ర్యాంకు, ఉత్పత్తుల బాధ్యతాయుత వినియోగంలో నాలుగో ర్యాంకులో ఉంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కంటే కూటమి సర్కారు ఏడాది పాలనలోనే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు భారీగా పెరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం కన్నా కూటమి పాలనలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు భారీగా తగ్గిపోయాయి.
కూటమి ప్రభుత్వంలో గనుల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2023ృ24లో రూ.3,425 కోట్లు రాబడి వస్తే 2024ృ25లో అది రూ.2,031 కోట్లే.
కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధి అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా తగ్గింది. 2023ృ24లో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం ఉండగా, 2024ృ25లో 6.71 శాతానికే పరిమితమైంది.
2023ృ24 ఆర్థిక సంవత్సరం వరకు వాస్తవ బడ్జెట్ గణాంకాల ప్రకారం జీఎస్‌డీపీలో 34.58 శాతం అప్పులు. 2024ృ25లో సవరించిన అంచనాల మేరకు కూటమి ప్రభుత్వం జీఎస్‌డీపీలో 35.15 శాతం అప్పులు చేసింది.
ఇవిగో సాక్ష్యాలు..
పేదరిక నిర్మూలన: జగన్ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలుచేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రత్యక్ష నగదు బదిలీ జరిగింది. ఇతర రాష్ట్రాలకన్నా పేదరికం 50శాతం తగ్గింది.
బడుల రూపురేఖలు మారాయి: 15,713 పాఠశాలల్లో రెండు దశల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించింది.
రైతులకు స్వర్ణయుగం: 10,778 ఆర్బీకేల ఏర్పాటు వినూత్న ప్రయోగం.. అవి అందించిన సేవలు రైతులకు బాగా ఉపకరించాయి. పంటల దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గ్యాప్ సర్టిఫికేషన్‌తో రైతులకు ఎమ్మెస్పీకి మించి ఆదాయం లభించింది. ప్రకృతి వ్యవసాయం కూడా గణనీయంగా పెరిగింది..
సెకీ విద్యుత్ రైతుల కోసమే: రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్ కోసమే గత ప్రభుత్వం సెకీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఏపీఈఆర్‌సీ అనుమతించింది.
అప్పులే కూటమి ఘనత.. నింగిలో నిత్యావసరాలు: కూటమి సర్కార్ ఏడాది తిరక్కుండా రూ. 53వేల కోట్ల బడ్జెట్ అప్పులు చేసింది.. (బడ్జెటేతర అప్పులతో కలిపితో1.25 లక్షల కోట్లకు పైమాటే..) ద్రవ్యలోటు, రెవెన్యూలోటు భారీగా పెరిగింది..
రాబడి బాగా తగ్గింది. పారిశ్రామికాభివృద్ధీ తగ్గింది.. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి.
గత నెల 28న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఇన్ బ్రీఫ్‌లో మొత్తం అప్పుల చార్ట్‌ను తొలగించారు. అయితే, ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వేలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్ అప్పులను పేర్కొన్నారు. దీనిప్రకారం చూస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న అప్పుల కన్నా ఈ ఆర్థిక ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది.
2023-24 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4,91,734 కోట్లు ఉండగా..
2024-25లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులతో అది రూ.5,64,488 కోట్లకు చేరింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇంగ్లిష్ ల్యాబ్, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీలు, కౌంపౌండ్ వాల్ సహా తొలి దశలో 15,713 పాఠశాలల్లో రూ.3,859.12 కోట్లతో 9 రకాల నిర్మాణాలను చేపట్టారు.
రెండో దశలో 22,344 పాఠశాలల్లో రూ.8 వేల కోట్లతో 11 రకాల మౌలిక సదుపాయాలను చేపట్టారు. (వీటిని పట్టిక రూపంలో సర్వేలో పేర్కొన్నారు).
Comments
Please login to add a commentAdd a comment