ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan gives direction to leaders | Sakshi
Sakshi News home page

ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం: వైఎస్‌ జగన్‌

Published Thu, Dec 5 2024 4:33 AM | Last Updated on Thu, Dec 5 2024 8:55 AM

YSRCP President YS Jagan gives direction to leaders
  • కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీద్దాం.. ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పడదాం

  • వైఎస్సార్‌సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

  • ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

  • ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు 

  • సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌.. గాలికెగిరిపోయాయి

  • చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపంగా మారాయి.. ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది 

  • రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు

  • అయినా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు

  • ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు

  • ఈ పరిస్థితిలో మనం ప్రజలకు అండగా నిలబడాలి

  • వారి తరఫున అందరం పోరాటం చేద్దాం

  • ఈనెల 11న రైతుల సమస్యలపై ఆందోళన

  • 27న కరెంటు ఛార్జీల మోతపై నిరసన

  • జనవరి 3న విద్యార్థులకు బాసటగా నిలదీత

  • వీటితో పాటు సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు డిమాండ్‌

కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఓ వైపు ఎక్కడ చూసినా అక్రమాలు, కమీషన్లు, మామూళ్ల గోల. పరిశ్రమ నడుపుకోవా­లన్నా, వ్యాపారాలు చేయాలన్నా కప్పం కట్టాల్సిందే. వేలం పాటలుపెట్టి ఊరూరా బెల్ట్‌ షాపులు కేటాయిస్తున్నారు. అన్నింటికీ నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు వాటాలు. ఇంకో వైపు సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమై­పోతోంది. భరోసా ఇచ్చే వారు లేక అన్నదాతలు విలవిల్లాడిపోతు­న్నారు. విద్యుత్‌ చార్జీల షాక్‌లతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఈ పరిస్థితిలో బాధిత వర్గ ప్రజల తరఫున నిలబడాల్సింది మనమే. వారి గొంతుకగా నిలిచి ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడుదాం.
– పార్టీ శ్రేణులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్‌ సిక్స్‌ సహా ఎన్ని­కల హామీలను తుంగలో తొక్కి.. అన్ని వర్గా­లనూ దగా చేస్తున్న చంద్రబాబునాయుడి ప్రభు­త్వంపై ఆరు నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరే­కత పెల్లుబుకుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర దక్కక రైతులు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు.. కరెంటు ఛార్జీల బాదుడుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనలతో అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన సాగిస్తు­న్నా­రని మండిపడ్డారు. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, వారి తరఫున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యద­ర్శులు, ప్రాంతీయ సమ­న్వయకర్తలతో వైఎస్‌ జగన్‌ సమావేశమ­య్యారు. 

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమ­స్యలపై చర్చించి.. ప్రజల పక్షాన కూటమి ప్రభు­త్వంపై పోరాటం చేయడానికి కార్యా­చరణ ప్రణా­ళికను ఖరారు చేశారు. పార్టీని మరింతగా బలోపే­తం చేయడంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. కూటమి ప్రభు­త్వంపై ప్రజల్లో ఎప్పూడూ చూడని విధంగా విపరీ­తమైన వ్యతిరేకత కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరే­కత ఎక్కడా చూడలేదు. 

ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ వాగ్దానాలు గాలికెగిరి­పో­యాయి. వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూస్తే.. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపం కింద మారి ఎక్కడికక్కడ వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయి. నానాటికీ వ్యవ­స్థలన్నీ దిగజారిపోతున్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదు 
⇒ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చూస్తే.. మన ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్‌ (మూడు నెలలు) అయి­పోయిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్ర­వరి, మార్చి ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో విడుదల చేసే వాళ్లం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌లో ఇవ్వాల్సిన ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు సరి కదా.. ఏకంగా మూడు త్రైమాసికాల సొమ్ము పెండింగ్‌లో పెట్టారు. 

⇒ ఈ డిసెంబర్‌ గడిస్తే నాలుగు క్వార్టర్లు ఇవ్వని పరిస్థితి. జనవరి వస్తే ఏకంగా రూ.2,800 కోట్లు విద్యా దీవెన బకాయిలు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. వసతి దీవెనకు సంబంధించి రూ.1,100 కోట్లు పెండింగ్‌ ఉంది. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్‌ పెట్టారు. మరో వైపు ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని పిల్లలకు యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు.

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం 
ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. మార్చి నుంచి ఇంత వరకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదు. మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 9 నెలలకు సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు గొడవ చేస్తే ఏదో రూ.200 కోట్లు ఇచ్చారు. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగారిపోతోంది. ఇంకా 108, 104 ఉద్యోగులకు సంబంధించి నాలుగు నెలల జీతాలు పెండింగ్‌. వాళ్లు సర్వీసు అందించే పరిస్థితి లేదు. 

ధాన్యం సేకరణ.. మద్దతు ధర లేదు 
⇒ ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) లభించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్‌ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వాళ్లం. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేది. ఇదొ­క్కటే కాకుండా జీఎల్‌టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్‌పోర్ట్‌) ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. జీఎల్‌టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎక­రాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేది.

⇒ ఇవాళ రైతులకు కనీస మద్దతు ధర కూడా అంద­డం లేదు. 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.­1,725 అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదు. కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్ర­మం నిలిపివేశారు. గత్యంతరం లేక రైతులు దళారు­లు, రైస్‌ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లు రైతుల నుంచి రూ.300 నుంచి రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తు­న్నారు. ధాన్యం సేక­రణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగు­తో­ంది. మరోవైపు వర్షాలతో రైతులు పూర్తిగా దెబ్బ­తిని కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతో­ంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.



కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు 
⇒ కరెంటుకు సంబంధించి ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడు మొదలైంది. మరో రూ.9 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయిలో రూ.15 వేల కోట్ల బాదుడు కార్యక్రమాన్ని భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేసి ఉండరు. ఆరు నెలల్లోనే ఎవరూ రోడ్డు మీదకు రాకూడని, ఎవరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. 

⇒ కేసులు మ్యానుఫ్యాక్చర్‌ చేసి, ఎవిడెన్సెస్‌ మ్యాను­ఫ్యాక్చర్‌ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తు­న్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆయన చేస్తున్న బాదుడు కార్యక్రమాన్ని నిర­సిస్తూ ఎవరూ రోడ్డు మీదకు రాకూడదని ఇలా చేస్తున్నారు. ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థి­తులు కల్పిస్తూ పోలీసులను ఉపయోగించుకు­న్నారు. అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం యథేచ్ఛగా నడుస్తోంది.

ఇసుక, మద్యం మాఫియా 
⇒ అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. కానీ, దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా, మన ప్రభుత్వం కంటే డబుల్‌ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత అని.. చంద్రబాబు, లోకేష్‌ మొదలు ఎమ్మెల్యేల వరకు పంచుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. దాని కోసం కిడ్నాప్‌లతో పాటు, పోలీసుల ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి బలవంతంగా రాయించుకున్నారు. పైగా గ్రామంలో వీళ్లే వేలం పాటలు పెట్టి బెల్ట్‌షాప్‌లు కేటాస్తున్నారు. 

⇒ ఈ రోజు బెల్ట్‌షాప్‌లు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్ట్‌షాప్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేలం పాట పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తు­న్నాయి. ఏ నియోజకవర్గంలో పరిశ్రమ నడుపు­కో­వా­లన్నా, మైనింగ్‌ యాక్టివిటీ జరగాలన్నా, ఏది కావాలన్నా ఎమ్మెల్యేకు ఇంత.. కడితే తప్ప జరిగే పరిస్థితి లేదు. ప్రతి దానికీ కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. మాఫియా సామ్రాజ్యాన్ని నడుపు­తున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్ర­బాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామూళ్ల కోసం కూడా గొడవలు జరుగుతు­న్నాయి. నెల్లూరులో ఏకంగా క్వార్ట్‌జ్‌ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్‌ చేశారు. 

ప్రజల పక్షాన నిలబడదాం.. వారి గొంతుక వినిపిద్దాం 
⇒ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఈరోజు తీవ్ర స్ధాయిలో కనిపిస్తోంది. మనం కూడా ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. మామూలుగా ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి నుంచి.. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది.

⇒ కరెంటు ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కక పోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలు ప్రజలను ఇప్పు­డు ఇబ్బంది పెడుతున్నాయి. మీ మీ నియోజక­వర్గాల్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, సమన్వయకర్తలతో కలిసి వారిని ఇన్వాల్వ్‌ చేస్తూ, కార్యాచరణ ప్రణాళిక అమలు చేయా­ల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరం అయి­న­ప్పుడు మనం వారి తరఫున నిలబడాలి. వారి పక్షాన పోరాడాలి. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనం వారికి దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాటం చేయాలి. వారి తరఫున నిలబడాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఇది కచ్చితంగా చేయాలి.

సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన
సంక్రాంతి తర్వాత నా జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధ, గురువారాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవు­తాను. ‘జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో నేను పర్యటిస్తాను. నా పర్యటన వచ్చేసరికి మీరు జిల్లా, నియోజ­కవర్గ, మండల కమిటీల నియామ­కాలు పూర్తి చేయాలి. ప్రతి కార్యకర్తకు ఫేస్‌ బుక్, ఎక్స్‌ (ట్విట్టర్‌), యూట్యూబ్‌ అకౌంట్‌ ఉండాలి. 

జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్య­కర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామ స్థాయి­లో తెలుస్తుంది. మా ఆస్పత్రులు ఎందుకు ఇలా ఉన్నాయి? మా స్కూళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? మా ధాన్యాన్ని ఎందుకు కనీస మద్ధతు ధరకు అమ్ముకోలేకపోతున్నాం.. అని ప్రశ్నించాలి. రాబోయే రెండున్నరేళ్లు మనం, మన పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఆప్పుడే మనం చేయబోయే పోరాటాలకు మద్దతు బలంగా ఉంటుంది. ఇదంతా పక్కాగా జరగాలంటే జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న పార్టీ కమిటీల నియామ­కాలను త్వరితగతిన పూర్తి చేయాలి.

మూడు ప్రధాన అంశాలపై కార్యాచరణ
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు.. రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైఎస్సార్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలి. ధాన్యం సేకరణలో వారికి కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేయాలి. పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయాలి. ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని కూడా డిమాండ్‌ చేయాలి. రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలి.

చంద్రబాబు ప్రభుత్వ కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబర్‌ 27న ఆందోళన చేపట్టాలి. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో పెంచిన కరెంటు ఛార్జీ­లు, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడుతో పాటు, రానున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకో­వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాల్లో ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన తెలపాలి. ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వినతి పత్రం అందజేయాలి.

జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఫీజు రీయిం­బర్స్‌­మెంట్‌పై ఆందోళన చేపట్టబోతున్నాం. పిల్లలకు అం­దిం­చాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన.. మొత్తంగా దాదాపు రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేయాలి. ఇప్పటి వరకు ఏడాదిగా అంటే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి పెం­డిం­గ్‌­లో ఉన్న ఫీజులు చెల్లించాలని చంద్ర­బాబు ప్రభు­త్వాన్ని నిలదీస్తూ.. చదువు­కుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి, వినతి­పత్రాలు సమర్పించి, డిమాండ్‌ చేయాలి.

ఈ మూడు సమస్యలతో పాటు సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు డిమాండ్‌ చేద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement