
బ్రిటిష్ ప్రభుత్వ దురాగతానికి 106 ఏళ్లు..
భారతీయుల్లో జాతీయ భావాన్ని రగల్చిన ఘటన
ఇక్కడి గోడలపై కనిపించే గాయాలు చరిత్రకు ఆనవాళ్లు
ఆంగ్ల సైన్యాధికారి రాక్షస క్రీడకు చిహ్నంగా చరిత్రలో నిక్షిప్తం
13 ఏప్రిల్ 1919 బైసాఖీ ఓ రక్తచరిత్ర
జలియన్‌వాలా బాగ్ పేరు చెబితే.. రౌలట్ చట్టం.. నిరసన తెలుపుతూ ప్రజా సమూహం సమావేశం.. బ్రిటిష్ సైన్యాధికారి హ్యారీ డయ్యర్ కాల్పులు.. వందల మంది దుర్మణం.. చరిత్రలో కనిపించేది ఇదే. ఏళ్ల తరబడి చదువుకున్నదీ ఇదే! కానీ, చరిత్ర వెనుక చెరగని గుర్తులు అమృత్‌సర్‌లోని ఆ తోటను ఆనుకుని ఉన్న గోడలపై నాటి ఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. స్వేచ్ఛా, స్వాతం్రత్యాల కోసం పంజాబ్ ప్రజలు 106 ఏళ్ల క్రితం చేసిన ప్రాణ త్యాగాలను నేటి తరానికి వివరిస్తున్నాయి. ఇటుక గోడల్లో దిగిన తూటాల గుర్తులు, 120 మంది ప్రాణాలు బలితీసుకున్న బావి.. సందర్శకుల హృదయాలను బరువెక్కిస్తుంటాయి. – సాక్షి అమరావతి
ఘటనకు ముందు చరిత్ర ఇదీ..
మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులుగా పనిచేసేవారికి అనేక అవకాశాలు కల్పిస్తామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ఆశ చూపడంతో పంజాబ్ నుంచి 3.55 లక్షల మంది బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరారు. యుద్ధం ముగిశాక ప్రభుత్వం సైనికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారిని సైన్యం నుంచి వెనక్కి పంపేసింది. దీంతో వారంతా పంజాబ్ చేరుకున్నాక నిరుద్యోగం వెంటాడింది. మరోవైపు కొన్నేళ్లుగా పంజాబ్ ప్రాంతం కరువుతో కొట్టుమిట్టాడుతోంది. మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా 1915లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకొచ్చింది.
దీని ప్రకారం ప్రజలపై నిరవధిక నిర్బంధం, విచారణ లేకుండా జైలుకు పంపడం వంటి కఠిన చర్యలను అనుసరించింది. యుద్ధం ముగిసినా ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఉద్యమకారులపై ప్రయోగించేందుకు అనువుగా మార్చుకుంది. ఇందుకోసం సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షతన 1917లో కమిటీ నియమించింది. దాని సిఫార్స్‌ల ఆధారంగా 1919 మార్చి 18న రౌలట్ చట్టాన్ని ఆమోదించింది.
రౌలట్ చట్టం ప్రకారం ఏప్రిల్ 10న పంజాబ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్ సైపుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర భారతదేశాన్ని కుదిపేసింది. ఇదే తేదీన ఇంగ్లండ్ చర్చి మిషనరీకి చెందిన మిస్ మార్షెల్లా షేర్‌వుడ్‌పై అమృత్‌సర్‌లో దాడి జరిగింది. అనంతరం బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ నివాసంపై దాడి చేసేందుకు నిరసనకారులు యత్నిస్తూన్నారని చెప్పి అమృత్‌సర్‌లోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై 25 మంది నిరాయుధులైన భారతీయులను సైన్యం కాల్చి చంపేసింది. దీంతో అవిభక్త పంజాబ్ మొత్తం ప్రజలు రగిలిపోయారు.
1919 ఏప్రిల్13న ఏం జరిగింది?
బైశాఖి వేడుకలను పంజాబ్‌లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమృత్‌సర్‌లో ఏప్రిల్ 13న జరిగే వేడుక చూసేందుకు చుట్టపక్కల పట్టణాలు, గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మరోవైపు డాక్టర్ సైపుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ అరెస్టులకు నిరసనగా అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో జాతీయవాదులు సాయంత్రం 5 గంటలకు శాంతియుత సమావేశం ఏర్పాటు చేశారు. పంజాబ్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది లాలా కన్హియాలాల్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు కీలక ప్రసంగం ఉందని చెప్పడంతో చిన్నా, పెద్దా అంతా వేలాదిగా తరలివచ్చారు. అదే క్రమంలో రాత్రి 8 గంటల నుంచి మార్షల్ లా అమలులో ఉంటుందని చెప్పుకున్నారు కానీ దీనిపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రచారం చేయలేదు.
కాల్పుల్లో 2 వేల మంది దుర్మరణం!
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి అత్యంత సమీపంలో 6.50 ఎకరాల్లో జలియన్‌వాలా బాగ్ ఉంది. మహరాజా రంజిత్‌సింగ్ కోటలో న్యాయవాదిగా పనిచేసి మరణించిన ‘హిమ్మత్‌సింగ్ జలియన్‌వాలా’ పార్థివదేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఆయన పేరుతోనే ఈ ప్రాంతానికి జలియన్‌వాలా బాగ్‌గా పేరొచ్చింది. చుట్టూ ఎత్తయిన భవనాల మధ్య ఉత్తరం వైపున 3 నుంచి 4 అడుగుల వెడల్పు మార్గం మాత్రమే ఉంది. బాగ్‌లో తూర్పు వైపున నుయ్యి, ఆపై కొద్దిగా చెట్లు ఉన్నాయి.
సమావేశంపై ప్రచారంతో బైశాఖి వేడుకకు వచ్చిన వారు సైతం ఇందులో పాల్గొనడంతో జనం దాదాపు 20 వేల వరకు హాజరైనట్టు అంచనా. సరిగ్గా సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డయ్యర్ మెషిన్ గన్ అమర్చిన వాహనాలతో 50 మంది సైనిక బగంతో అక్కడకు చేరుకున్నాడు. వస్తూనే బాగ్‌లోకి వెళ్లే మార్గాన్ని మూసివేసి కాల్పులకు ఆదేశాలిచ్చాడు. కేవలం 10 నుంచి 12 నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతం తుపాకుల మోతతో నిండిపోయింది.
ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు పిట్టల్లా రాలిపోయారు. తప్పించుకునే మార్గం లేదు.. పదుల సంఖ్యలో తూటాలు శరీరాలను చీల్చుకుంటూ భవనాల గోడల్లో దిగబడ్డాయి. ఆందోళనతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు ప్రాంగణంలోని బావిలోకి దూకేశారు. ఆ రాత్రంతా జలియన్‌వాలాబాగ్ పరిసరాలు ఆర్తనాదాలతో నిండిపోయాయి. ఈ కాల్పుల్లో దాదాపు 2 వేల మంది మరణించినట్లు స్థానికులు చెబుతారు. డయ్యర్ ముందుగానే కర్ఫ్యూ విధించడంతో గాయపడ్డవారిని తరలించే ఆస్కారం లేకపోయింది.
లెక్కలోకి రాని మరణాలెన్నో..
తమవారిఆచూకీ కోసం వెదికిన కుటుంబ సభ్యులకు మృతదేహాలను వెదికేందుకు రెండు మూడురోజులు పట్టిందని ఇక్కడి వారు చెబుతుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం దుర్ఘటనపై హంటర్ కమిషన్ వేయగా 200 మంది చనిపోయినట్టు నివేదికిచ్చింది. సేవా సమితి సొసైటీ 379 మంది మరణించారని, 192 మంది తీవ్రంగా గాయపడ్డారని నివేదించింది. కానీ స్థానికులు మాత్రం 2 వేల మంది చనిపోయారని చెబుతుంటారు.
చనిపోయిన 41 మంది బాలల్లో 7 నెలల వయసు వారు, ఆరువారాల శిశువు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ మారణకాండ జరిగిన మూడు నెలలకు అంటే జూలైలో ఎవరు చనిపోయారో గుర్తించేందుకు అధికారులు నగర ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, నాటి ఘనటలో పాల్గొన్న వారిని గుర్తిస్తే చనిపోయినవారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తారన్న భయంతో ఎవరూ వాస్తవాలు చెప్పలేదు. దాంతో ఎంత మంది చనిపోయారో అధికారికంగా లెక్కలు లేవు.
దుర్మాగానికి నిలువుటద్దం డయ్యర్
సైనికాధికారి రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డయ్యర్.. దుర్ఘటన అనంతరం ప్రభుత్వం చేసిన విచారణలో అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా, ఎలాంటి అపరాదభావం లేకుండా ఇచ్చిన సమాధానాలు అతడిలోని రాక్షసత్వానికి అద్దం పడతాయి.
ప్రశ్న: ‘‘నువ్వు బాగ్ లోకి వెళ్ళగానే, ఏం చేశావు?’’
డయ్యర్:– నేను కాల్పులు జరిపాను.
ప్రశ్న:– ‘‘వెంటనే?’’
డయ్యర్:– వెంటనే. నేను ఆ విషయం గురించి ఆలోచించాను, నా విధి ఏంటో నిర్ణయించుకోవడానికి నాకు 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టలేదు.
జనసమూహాన్ని చెదరగొట్టడానికి కాల్పులు జరపలేదు. బదులుగా, పార్కులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపైకి విచక్షణా రహితంగా కాల్చి చంపారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలని సైనికులను డయ్యర్ ఆదేశించాడు. తెచ్చిన మందుగుండు సామగ్రి అయిపోయే వరకు సైనికులు కాల్పులు ఆపలేదు. రెజినాల్డ్ డయ్యర్ కూడా తాను మిషన్ గన్‌లు అమర్చిన కార్లను బాగ్ లోకి తీసుకురాగలిగితే, వాటితో కూడా కాల్పులు జరిపేవాడినని ఒప్పుకున్నాడు. కాగా ఈ మారణకాండలో మరణించినవారి ప్రాణాలకు 5 వేల పౌండ్ల చొప్పున వెలకట్టింది. అయితే చాలామంది ఈ మొత్తాన్ని తీసుకోలేదు. ‘‘మా తాతగారు గోబింద్ రామ్ సేథ్ సమావేశానికి హాజరై ప్రాణాలు కోల్పోయారు.
చనిపోయిన వారిలో స్థానికులతో పాటు బైశాఖి వేడుకకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నట్టు మా నాన్న, పూర్వీకులు చెప్పారు. చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చిన 5 వేల పౌండ్లకు పంజాబీలు ఆశపడలేదు’’ అని చెప్పారు జలియన్‌వాలా బాగ్ ప్రభుత్వ గైడ్‌గా ఉన్న దీపక్ సేథ్. ఇక్కడికి నిత్యం వచ్చే వారికి నాటి ఘటనను వివరిస్తూ చైతన్యులను చేస్తారీయన. తర్వాత పార్కులో ప్రభుత్వం ప్రజల ఆత్మార్పణకు చిహ్నంగా స్మారకాన్ని నిర్మించింది. 120 మంది మరణించిన బావిని అద్దాలతో మూసివేసింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనగా నమోదైన జలియన్‌వాలా బాగ్‌లో తూటాలు దిగిన గోడలను 106 ఏళ్లుగా అలాగే కాపాడుతున్నారు.