శివయ్య ప్రీతికి ‘శంఖు’ నాదం : దంపతులకు అవార్డు
రాజమహేంద్రవరం రూరల్: శివయ్యను ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు అనేకమార్గాలను అనుసరిస్తారు. శంఖాన్ని ఏకబిగిన పూరిస్తూ మహాదేవుడిని ఆనందింపచేస్తారు మరికొందరు. శ్వాసను బిగించి ఏకధాటిగా దాదాపు ఇరవై నిముషాల పాటు శంఖాన్ని పూస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్న ఎస్పీఎఫ్ కమాండెంట్ నర్సింహరావు, అలివేలు మంగాదేవి దంపతులకు ఆధ్మాత్మిక సంపూర్ణత్వంతో పాటు, భౌతికంగా కూడా అవార్డులు వరిస్తున్నాయి. వీరు చేసే ఆధ్యాత్మిక సేవ అవార్డుల కోసం కాకపోయినప్పటికీ శంఖనాదంలో వీరి నిపుణతకు హైదరాబాదుకు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామధేను –2024 అవార్డ్స్‌లో భాగంగా జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం (డిసెంబరు 14) హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో నరసింహారావు దంపతులు ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.ఈ సందర్భంగా తమ ఆధ్యాత్మిక మార్గం, శంఖునాదం సాధన గురించి నర్సింహరావు మాటల్లో.. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి.గన్నవరం తమ స్వగ్రామం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఏపి ప్రత్యేక రక్షణ దళం(ఏపీఎస్పీఎఫ్) కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా. తన భార్య అలివేలు మంగాదేవి గృహిణి. తమకు శివుడు అంటే ఎనలేని భక్తి. తాను 1989లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలో సరిహద్దు భద్రత దళంలో పనిచేసే సమయంలో బెంగాలీ పూజారి చక్రవర్తి వద్ద శంఖం పూరించడంలో మెలుకువలు నేర్చుకున్నాను. అదే స్పూర్తితో తన భార్య మంగాదేవికి కూడా ఈ విద్యలో పట్టుసాధించారు. దీంతో తమకు ‘అఖండ శంఖారావ యుగళం’గా పేరొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళ,తమిళనాడు ,కర్ణాటక, డిల్లీ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఇంతవరకు నాలుగువేలకు పైగా కార్యక్రమాలు తమ శంఖారావంతో ఆరంభమయ్యాయంటారు ఈ దంపతులు ఇంకా గోదావరి,కృష్ణాపుష్కరాలు, ఇబ్రహీంపట్నం పవిత్ర నదీసంగమ అనుసంధానం వంటి పెద్దపెద్ద కార్యక్రమాల్లో శుభసూచికంగా అఖండ శంఖారావం పూరించాం. ఈసందర్బంగా పలు సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు, అవార్డులు, సత్కారాలు, సువర్ణ ఘంటాకంకణాలు లభించాయన్నారు. ఇదంతా కేవలం సాధనతోనే సాధ్యమైందని, పదేళ్లపాటు దీన్ని సాధన చేశామని నరసింహారావు దంపతులు పేర్కొన్నారు.