ట్రంప్‌ టారిఫ్‌ల టెన్షన్‌! | Trump Liberation Day tariffs to hit all nations starting April 2 | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టారిఫ్‌ల టెన్షన్‌!

Published Tue, Apr 1 2025 3:46 AM | Last Updated on Tue, Apr 1 2025 3:46 AM

Trump Liberation Day tariffs to hit all nations starting April 2

రేపే డెడ్‌లైన్‌.. ఎగుమతిదారుల్లో అయోమయం

రంగాలవారీ వడ్డింపా.. విడివిడిగా ఉత్పత్తుల మీదా అని ఆందోళన 

నాలుగు స్థాయిల్లో టారిఫ్‌ల ప్రభావం ఉండొచ్చని అంచనా 

వాయిదా వేసే అవకాశం ఉందని ఆశాభావం

భారత్‌–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్‌ డాలర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార టారిఫ్‌ల అమలుకు డెడ్‌లైన్‌ అయిన ఏప్రిల్‌ 2 దగ్గరపడటంతో ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొంది. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు,  ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై అందరిలోనూ అయోమయం నెలకొంది. వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే దేశాల జాబితాలో భారత్‌ని కూడా అమెరికా చేర్చడంతో ... టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని ఆశాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో టారిఫ్‌లు, ఏయే రంగాలపై ప్రభావం పడొచ్చనే అంశాలను ఒకసారి చూస్తే.. – న్యూఢిల్లీ

అమెరికా ప్రణాళిక ఏంటంటే..
వివిధ దేశాలతో తమకున్న వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు వాటి నుంచి తమకు వచ్చే దిగుమతులపై అమెరికా సుంకాలను విధించడం / పెంచడం వంటి చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ప్రతిపాదన ఇది. అమెరికన్‌ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్‌ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్‌ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన.

2021–22 నుంచి 2023–24 మధ్య కాలంలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భారత్‌ ఎగుమతుల్లో 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, అన్ని దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం వాటా అమెరికాది ఉంది. 2023–24లో భారత్‌–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారత్‌ నుంచి 77.51 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు, అమెరికా నుంచి 42.19 బిలియన్‌ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. దీంతో వాణిజ్య మిగులు భారత్‌ పక్షాన సుమారు 35.31 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..
ప్రస్తుతానికి టారిఫ్‌లను ఏ విధంగా విధిస్తారనేది, అంటే ప్రోడక్టు స్థాయిలోనా, లేదా రంగాలవారీగానా, లేదా దేశ స్థాయిలోనా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

అమెరికా నుంచి దిగుమతులపై భారత్‌ విధించే సుంకాలు, నిజానికి ఆరోపిస్తున్న దానికంటే చాలా తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికా గానీ సహేతుక వాణిజ్య విధానాన్ని అవలంబిస్తే, పెద్దగా అవాంతరాలు లేకుండా భారత పరిశ్రమలు ఎగుమతులను కొనసాగించవచ్చని, ఇరు దేశాల మధ్య మరింత సమతూకమైన, స్థిరమైన విధంగా వాణిజ్య బంధం బలోపేతం కావచ్చని పేర్కొన్నారు. నాలుగు స్థాయిల్లో టారిఫ్‌ల ప్రభావాలను జీటీఆర్‌ఐ అంచనా వేసింది.

దేశ స్థాయిలో: భారత్‌ నుంచి అన్ని ఎగుమతులపై ఒకే రకంగా టారిఫ్‌లు విధించడం: ఒకవేళ ఈ విధానాన్ని అమలు చేస్తే మన ఎగుమతులపై అదనంగా 4.9 శాతం భారం పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై మన దగ్గర టారిఫ్‌లు సగటున 7.7 శాతంగా ఉండగా, మన ఎగుమతులపై అక్కడ సగటున 2.8 శాతంగా ఉంటోంది. ఆ విధంగా రెండింటి మధ్య 4.9 శాతం వ్యత్యాసం ఉంది.

వ్యవసాయం, పరిశ్రమల స్థాయిలో:  ఈ విధానాన్ని అమలు చేస్తే వ్యవసాయోత్పత్తులపై అదనంగా 32.4 శాతం, పారిశ్రామికో­త్పత్తులపై 3.3 శాతం భారం పడొచ్చు. ప్రస్తుతం అమెరికాకు భారత వ్యవసాయోత్పత్తులపై 5.3 శాతం సుంకాలు ఉండగా, అక్కడి నుంచి దిగుమతులపై అత్యధికంగా 37.7 శాతంగా (వ్యత్యాసం 32.4 శాతం) ఉంటోంది. మరోవైపు పారిశ్రామికో­త్పత్తుల విషయానికొస్తే.. అమెరికా నుంచి దిగుమతులపై సగటున 5.9 శాతం, మన ఎగుమతులపై కేవలం 2.6 శాతం (వ్యత్యాసం 3.3 శాతం) ఉంటోంది.

రంగాల స్థాయిలో: వివిధ రంగాల్లో ఇరు దేశాల ఉత్పత్తులపై టారిఫ్‌ల మధ్య వ్యత్యాసాలు వివిధ రకాలుగా ఉన్నాయి. రసాయనాలు..ఫార్మాలో 8.6 శాతం, ప్లాస్టిక్స్‌లో 5.6 శాతం, టెక్స్‌టైల్స్‌పై 1.4 శాతం, వజ్రాలు.. బంగారం మొదలైన వాటిపై 13.3 శాతం, ఇనుము..ఉక్కుపై 2.5 శాతం, మెషినరీ .. కంప్యూటర్స్‌పై 5.3 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 7.2 శాతం, ఆటోమొబైల్స్‌ .. ఆటో విడిభాగాలపై 23.1 శాతం వ్యత్యాసం ఉంటోంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, సదరు రంగంపై ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. భారత్‌ ఎగుమతులు 30 కేటగిరీలుగా ఉంటున్నాయి. ఇందులో వ్యవసాయంలో ఆరు, పరిశ్రమల్లో 24 ఉన్నాయి.

వ్యవసాయం
అత్యధికంగా చేపలు, మాంసం, ప్రాసెస్డ్‌ సీఫుడ్‌పై ప్రభావం ఉంటుంది. దాదాపు 2.58 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగుమతులపై టారిఫ్‌ల వ్యత్యాసం 27.83 శాతం ఉంటోంది. 
1.03 బిలియన్‌ డాలర్లుగా ఉంటున్న ప్రాసెస్డ్‌ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ఏకంగా 24.99 శాతం మేర టారిఫ్‌లు పెరగొచ్చు. దీంతో అమెరికాలో భారతీయ స్నాక్స్‌ ఖరీదు మరింత పెరగొచ్చు. 
చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలపై వ్య­త్యాసం (1.91 బిలియన్‌ డాలర్ల విలువ) 5.72 శాతంగా ఉంటోంది. బియ్యం మొదలైన ఎగుమతులపై ప్రభావం పడొచ్చు.

⇒ 181.49 మిలియన్‌ డాలర్ల విలువ చేసే డెయిరీ ఉత్పత్తులపై ఏకంగా 38.23 శాతం టారిఫ్‌ వ్యత్యాసం ఉంటోంది. దీంతో నెయ్యి, వెన్న, పాల పొడిలాంటివి రేట్లు పెరిగి, మన మార్కెట్‌ వాటా పడిపోవచ్చు.
⇒ 199.75 మిలియన్‌ డాలర్ల విలువ చేసే  వంటనూనెల ఎగుమతులపై 10.67 శాతం మేర టారిఫ్‌ పెరగవచ్చు.
సుమారు 19.20 మిలియన్‌ డాలర్ల ఎగుమతులే అయినప్పటికీ ఆల్కహాల్, వైన్‌లపై అత్యధికంగా 122.10 శాతం సుంకాలు విధించవచ్చు.

పారిశ్రామిక ఉత్పత్తులు
⇒ 12.72 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటున్న ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి టారిఫ్‌ వ్యత్యాసం 10.90 శాతం మేర ఉంటోంది. ఇది విధిస్తే, జనరిక్‌ ఔషధాలు, స్పెషాలిటీ డ్రగ్స్‌ రేట్లు పెరిగిపోతాయి.
⇒ 14.39 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రికల్, టెలికం, ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులపై 7.24 శాతం టారిఫ్‌లు పడొచ్చు.
మెషినరీ, బాయిలర్, టర్బైన్, కంప్యూటర్‌ ఎగుమతుల విలువ 7.10 బిలియన్‌ డాల­ ర్లుగా ఉంటోంది. వీటిపై 5.29 శాతం టారిఫ్‌ల పెంపు అవకాశాలతో భారత్‌ నుంచి ఇంజనీరింగ్‌ ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చు.
⇒ 5.71 బిలియన్‌ డాలర్ల విలువ చేసే రసాయనాల ఎగుమతులపై  (ఫార్మాను మినహాయించి) 6.05 శాతం, 1.71                                 బిలియన్‌ డాలర్ల సెరామిక్, గ్లాస్, స్టోన్‌ ఉత్పత్తులపై 8.27 శాతం, 457.66 మిలియన్‌ డాలర్ల ఫుట్‌వేర్‌పై 15.56 శాతం ఉండొచ్చు.  


టెక్స్‌టైల్స్, ఫ్యాబ్రిక్స్, కార్పెట్లు మొదలైన వాటి ఎగుమతులు 2.76 బిలియన్‌ డాలర్లుగా ఉండగా వీటిపై సుమారు 6.59 శాతం; 1.06 బిలియన్‌ డాలర్లుగా ఉన్న రబ్బర్‌ ఉత్పత్తులపై (టైర్లు, బెల్టులు సహా) 7.76 శాతం; పేపర్‌ .. కలప ఉత్పత్తులపై (969.65 మిలియన్‌ డాలర్లు) 7.87 శాతం మేర టారిఫ్‌ల ప్రభావం ఉండొచ్చు.

పెద్దగా ప్రభావం / అసలు ప్రభావమే 
ఉండని రంగాలు3.33 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ముడి ఖనిజాలు, పెట్రోలియం ఎగుమతులపై టారిఫ్‌లు మైనస్‌ స్థాయిలో (మైనస్‌ 4.36) ఉంటున్నాయి కాబట్టి, కొత్తగా విధించడానికేమీ ఉండకపోవచ్చు.
అలాగే, 4.93 బిలియన్‌ డాలర్ల గార్మెంట్స్‌ ఎగుమతులపై, వ్యత్యాసం మైనస్‌ 4.62 శాతంగా ఉంది కాబట్టి టారిఫ్‌ల భారం ఉండకపోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement