
రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలను కోరారు. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించడం ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని వాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిచ్చిన పారిస్ సదస్సు అనంతరం ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న మిత్రదేశాల కూటమి ‘కొలిషన్ ఆఫ్ ది విల్లింగ్’తో వీడియో కాల్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌పై సుంకాలు, యూరప్‌పై ఒత్తిడి
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల భారత ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో సుంకాల భారం 50%కు రెట్టింపు అయింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈమేరకు సుంకాలు విధించినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్ కూడా భారీగానే రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆ దేశపు చమురు కొంటూ యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తున్నాయన్నారు.
యూరప్ తీరుపై అసహనం
యూరప్ ఓ వైపు యుద్ధం ఆపాలంటూ, మరో వైపు చమురు కొనుగోళ్ల రూపంలో రష్యాకు నిధులు సమకూర్చడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గత ఏడాది కాలంలో ఇంధన అమ్మకాల ద్వారా ఈయూ 1.1 బిలియన్ యూరోలను రష్యాకు ముట్టజెప్పిందని అంతర్గత డేటాను ట్రంప్ ఉదహరించారు. అయితే కొన్ని ఈయూ దేశాలు 2022లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను, 2023 నాటికి శుద్ధి చేసిన ఇంధనాన్ని నిలిపివేయగా హంగేరి, స్లొవేకియా పరిమిత దిగుమతులను కొనసాగిస్తున్నాయి.
ఇదీ చదవండి: వైట్‌హౌజ్‌లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు