
సెన్సెక్స్ 1,414 పాయింట్ల పతనం; 74 వేల స్థాయి దిగువకు
22,500 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ; 420 పాయింట్లు క్రాష్
అన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలు
ఒక్క రోజులో రూ. 9.08 లక్షల కోట్ల ఆవిరి
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10%, యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 25% తాజా సుంకాల ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74వేల స్థాయి దిగువన 73,198 వద్ద నిలిచింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,125 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించి 73,141 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు కుప్పకూలి 22,105 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.
→ అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇండెక్సుల వారీగా.. ఐటీ సూచీ 4.20% పతనమైంది. టెలి కమ్యూనికేషన్, ఆటో ఇండెక్సు 4%, కన్జూమర్ డి్రస్కేషనరీ 3%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.50%, విద్యుత్ ఇండెక్స్ 2% నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.33%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.16 క్షీణించాయి.
→ స్టాక్ మార్కెట్ 2% పతనంతో శుక్రవారం ఒక్కరోజే రూ.9.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.384.01 లక్షల కోట్లకు దిగివచ్చింది.
→ సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (2%) తప్ప మిగిలిన అన్ని షేర్లూ పతనమయ్యాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా 6%, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్‌టెల్ 5%, టైటాన్ 4.5% పడ్డాయి.
→ గతేడాది సెపె్టంబర్ 27 నాటి సెన్సెక్స్ రికార్డు గరిష్టం(85,978) నుంచి 12,780 పాయింట్లు(15%), నిఫ్టీ జీవితకాల గరిష్టం(26,277) నుంచి 4,153 పాయింట్లు(16%) క్షీణించాయి. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనలు, ట్రంప్ వాణిజ్య విధానాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దీనికి కారణయ్యాయి.
పతనానికి కారణాలు
తారస్థాయికి వాణిజ్య యుద్ధ భయాలు: చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% సుంకాలు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10% విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 25% సుంకాల విధింపు ఉంటుందన్నారు. వీటికి తోడు భారత్‌తో సహా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.
టెక్ షేర్లు క్రాష్: టెక్ దిగ్గజం ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలతో వాల్ స్ట్రీట్‌లో అధిక మార్కెట్ విలువ కలిగిన టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగ షేర్లపైనా పడింది.
నెలరోజుల కనిష్టానికి ప్రపంచ మార్కెట్లు: వాణిజ్య యుద్ధ భయాలకు తోడు టెక్ రంగ షేర్ల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నెలరోజుల కనిష్టానికి దిగివచ్చాయి. ఆసియాలో దక్షిణ కొరియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ సూచీలు 3.50% నుంచి 3% కుప్పకూలాయి. చైనా, సింగపూర్ తైవాన్ ఇండెక్సులు 2–1% నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.
బలపడుతున్న డాలర్ ఇండెక్స్: వాణిజ్య యుద్ధ భయాలతో అమెరికా కరెన్సీ డాలర్ ఇండెక్స్ 10 వారాల గరిష్టానికి (108) చేరుకుంది. దీంతో భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది.
ఆగని ఎఫ్‌ఐఐల అమ్మకాలు: దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దలాల్ స్ట్రీట్ పతనానికి మరో ప్రధాన కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ ఫిబ్రవరిలోనే రూ.58,988 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు.
రూపాయి 19 పైసలు పతనం
డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 87.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం, వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 35 పైసలు బలహీనపడి 87.53 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా, ఫిబ్రవరి 10న రూపాయి 87.94 వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment