Down Market
-
ప్యాకేజీ... పావుకేజీ!!
రూ. 20,00,000 కోట్లు.. అక్షరాలా ఇరవై లక్షల కోట్లు. కరోనా వైరస్ దెబ్బతో విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ప్యాకేజీ ఇది. మన దేశ బడ్జెట్‌తో పోలిస్తే (సుమారు రూ. 30.42 లక్షల కోట్లు) దాదాపు 66 శాతం. ఇక జీడీపీలోనైతే దాదాపు 10 శాతం!!. అంకెలైతే అదిరిపోయాయి. ఇంకేముంది... ఆర్థిక వ్యవస్థ రయ్యిమని దూసుకెళ్ళిపోతుందన్నారు. మన సర్కారుకెవ్వరూ సరిలేరంటూ వీరతాళ్లు వేసేశారు. కానీ ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్లూ దేనికోసమో చెప్పటానికి ఆర్థిక మంత్రి ఓ డైలీ సీరియల్‌ను ఆరంభించారు. ఐదు రోజులు కొనసాగించారు. చిత్రమేంటంటే జనానికి న్యాయబద్ధంగా రావాల్సిన పన్ను రీఫండ్లు... బ్యాంకులిచ్చే రుణాలు... దేశంలోకి వస్తాయని ఆశపడే పెట్టుబడులు... ఇలాంటివన్నీ కూడా ప్యాకేజీలోకొచ్చేశాయి. అసలు ప్యాకేజీ అంటే ఇప్పటికిప్పుడు రాష్ట్రాలను, జనాన్ని ఆదుకోవటానికి సర్కారు చేసే సాయం కదా? ఇలాంటివన్నీ ప్యాకేజీ ఎందుకవుతాయి? వీరతాళ్లు వేసినవారికి కూడా ఇలాంటి అనుమానాలొచ్చాయి? మీ అనుమానాలన్నీ నిజమేనంటూ స్టాక్‌మార్కెట్ ధబాలున కుప్పకూలి చూపించింది. అంతేకాదు!! అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ప్యాకేజీని ఆడేసుకున్నాయి. ఆర్థిక మంత్రి మాటలన్నీ ఆ 20లక్షల కోట్లను చూపించటానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప ప్యాకేజీ డొల్లేనంటూ విమర్శించాయి. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులే పచ్చి మోసం... దగా అంటూ దుయ్యబట్టారు. పడిపోయిన డిమాండ్‌కు ఊతమిచ్చే ప్రత్యక్ష ఉద్దీపన చర్యలేమీ లేకుండా... చిన్న సంస్థలకు రుణాలంటూ హడావిడి చేస్తే లాభమేంటని పరిశ్రమ తప్పుబట్టింది. ఇది రుణ మేళా తప్ప ప్యాకేజీ కాదని విపక్షాలు తూర్పారబట్టాయి. కుదేలైన ఆతిథ్య, ఆటోమొబైల్ వంటి రంగాలు తమ ఊసే లేదంటూ మొత్తుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో జోకులు వైరల్ అవుతున్నాయి. నిజానికి లాక్డౌన్ ఆరంభం నుంచి ప్రధాని మోదీని కీర్తించిన వారూ... ఈ ప్యాకేజీ చూశాక పెదవి విరవక తప్పటం లేదు. ఆర్థిక రంగ విశ్లేషకుల అంచనాల ప్రకారం... నికరంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఈ ప్యాకేజీ కోసం ఖర్చు చేసేది రూ.3 లక్షల కోట్లు కూడా ఉండదు. ఇక బడ్జెట్లో చేసిన కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చేది రూ, లక్ష కోట్లను మించదు. పాత స్కీముల రీసైక్లింగ్.. ► రూ. 1 లక్ష కోట్లతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు ప్రతిపాదన. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి మోదీ ప్రభుత్వం దాదాపు ప్రతీ బడ్జెట్లోనూ దీన్ని ప్రతిపాదిస్తూనే వచ్చింది. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రా (ఏఎంఐ) 2018లో సబ్ స్కీముగా ప్రవేశపెట్టింది. నాబార్డు దీనికి నిధులు సమకూరుస్తోంది. పాత స్కీముకే కొనసాగింపే ఈ కొత్త ఫండు. ► చిన్న, సన్నకారు రైతాంగానికి నాబార్డ్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్!. సహకార, ప్రాంతీయ బ్యాంకుల ద్వారా నాబార్డ్ రూ.30,000 కోట్లు సమకూర్చనుంది. ఇది రుణాలిచ్చే మరో పథకమే తప్ప ప్రభుత్వం నేరుగా నిధులిచ్చేదేమీ లేదు. ► లఘు ఆహార సంస్థలను సంఘటిత రంగంలోకి తెచ్చేందుకు రూ.10,000 కోట్ల స్కీము. నిజానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ఇప్పటికే రూ. 2,000 కోట్ల ఫండ్ ఉంది. దీని పరిమితి పెరగవచ్చు. ►రూ. 20,000 కోట్లతో మత్స్యకారులకు ప్యాకేజీ. వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. ఇప్పటికే మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా నీలి విప్లవం పేరిట ప్రభుత్వం ప్రత్యేక స్కీము నిర్వహిస్తోంది. 2019–20లో రూ.560 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 570 కోట్లు కేటాయించింది. ఆర్థిక మంత్రి తాజా ప్యాకేజీలో ప్రస్తావించిన అంశాలన్నీ బ్లూ రెవల్యూషన్ వెబ్సైటులో ఉన్నవే!!. ► ముద్రా రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న వారికి 12 నెలల పాటు 2 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్యాకేజీలో ప్రకటించారు. సాధారణంగా బలహీన వర్గాలే ఎక్కువగా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. వడ్డీ తగ్గింపు కాకుండా ఏ మారటోరియమో ఇచ్చి ఉంటే ఆర్థిక ప్యాకేజీ అయి ఉండేది. ► తోపుడు బళ్ల వర్తకుల్లాంటి స్ట్రీట్ వెండార్లకు రూ.5,000 కోట్ల రుణ సదుపాయం. దీని కింద రూ.10,000 దాకా రుణాలిస్తారు. నిజానికి ఈ రుణాలిచ్చేది బ్యాంకులే. మరి ఇది ప్రభుత్వ ప్యాకేజీ ఎలా..? ► ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణ ఆధారిత సబ్సిడీ స్కీము పొడిగింపు ద్వారా హౌసింగ్ రంగానికి రూ.70,000 కోట్ల ఊతం. ఇది కూడా ఇప్పటికే ఉన్న పథకానికి కొనసాగింపే. 2017–2020 మధ్య కాలంలో 3.3 లక్షల ఇళ్లు బుక్ కాగా.. ఈ పథకం వల్ల కొనుగోలుదారులు రూ.75,000 కోట్లు లబ్ధి పొందారు. మరి మిగతా 10 నెలల్లో దాదాపు 2.5 లక్షల ఇళ్లు బుక్ అయితేనే కొనుగోలుదార్లకు రూ. 70,000 కోట్ల లబ్ధి కలుగుతుంది. ఉద్యోగాలే ఊడుతున్న ఈ తరుణంలో ఇది సాధ్యమేనా? ► ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు. ఇది కొత్తదేమీ కాదు. కొన్నాళ్లుగా నడుస్తూనే ఉంది. దీని డెడ్‌లైన్‌ను మార్చి 2021కి పొడిగించారు. ► బొగ్గు తవ్వకాల్లోకి ప్రైవేటు. గత అనుభవం ఉన్నా లేకున్నా ప్రపం చవ్యాప్తంగా ఏ కంపెనీ అయినా బొగ్గు, ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనవచ్చన్నది ప్యాకేజీలో ప్రతిపాదన. నిజానికిది తాజాగా ఆమోదించిన ఖనిజ చట్టాల సవరణ బిల్లులో ఉంది. ► ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రూ.4,000 కోట్లు. నిజానికి 2008–09 నుంచే నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ఇలాంటి పథకాన్ని అమలు చేస్తోంది. -
సంక్షోభం ఏదైనా.. ఆగకూడదు ప్రణాళిక
చరిత్రలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆర్థిక మాంద్యాలు, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ప్రపంచం విజయవంతంగా అధిగమించి ప్రగతి దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో 2020లో కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. గతంలో పడి లేచిన కెరటాల్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ.. ఇటీవలి కరోనా వైరస్ ఆధారిత మార్కెట్ పతనం.. ఇన్వెస్టర్లలో తమ పెట్టుబడులకు దీర్ఘకాల భద్రత ఏంటన్న ఆందోళనకు దారితీసింది. ఎంతో మంది ఇన్వెస్టర్లు నిపుణులు, బ్రోకరేజీలు, ఫండ్స్ హౌస్‌లకు తమ ఆందోళనలను ప్రశ్నల రూపంలో సంధిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి, మార్కెట్ల పతనంలో అవకాశాలు, తదితర విషయాలపై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన పరిశోధక బృందం తరచుగా ఇన్వెస్టర్ల నుంచి తమకు ఎదురైన ప్రశ్నలు, వాటికి నిపుణుల సమాధానాలు, సూచనలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం అనంతరం ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయమై ఏ విధంగా వ్యవహరించాలన్నది వీటి ఆధారంగా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేందుకు వీలుంటుంది. ఇందుకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ టీమ్ విడుదల చేసిన ప్రశ్నలు, జవాబుల జాబితా ఇది... కొనుగోళ్లకు ఇది సరైన తరుణమేనా..? నిర్దేశిత పరిమాణం కంటే ఈక్విటీల్లో తక్కువ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే.. ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులను ప్రారంభించుకోవచ్చు. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫం డ్స్ లేదా నేరుగా స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ తీసుకునే వారు 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలిన శాతం పెట్టుబడులను ఈక్విటీలకు (ఫండ్స్ లేదా స్టాక్స్) కేటాయించుకోవచ్చు. ఒకవేళ రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారు 100కు బదులు 70 నుంచి తమ వయసును తీసివేసి, మిగిలిన శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన పెట్టుబడులను స్థిరాదాయ పథకాలైన ఎఫ్డీలు, బాండ్ ఫండ్స్ లేదా చిన్న మొత్తాల పొదు పు పథకాలు, బంగారానికి కేటాయించుకోవచ్చు. ఫండ్స్ పెట్టుబడుల విలువ పడిపోతే? ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు వాటి ఇటీవలి గరిష్టాల నుంచి రెండు నెలల వ్యవధిలోనే 40 శాతం పడిపోయాయి. ఫండ్స్ లేదా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు అందరూ ఈ నష్టాలను చూస్తున్నారు. గడిచిన 34 ఏళ్లలో (ఆరు భారీ బేర్ మార్కెట్లు (40% అంతకంటే ఎక్కువ నష్టపోవడం) ఎదురయ్యాయి. కానీ, ప్రతీ పతనం తర్వాతి రెండు మూడేళ్ల కాలంలో మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుత స్థాయిలో మార్కెట్లో కరెక్షన్ ముగి సిందని చెప్పలేం. వచ్చే కొన్నేళ్ల కాలానికి డబ్బు అవసరం లేని వారు తమ ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ సమయానుకూలంగా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు. సిప్‌ను కొనసాగించాలా..? ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ కారణంగా ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులు నష్టాలు చూపిస్తున్నాయని సిప్‌ను ఆపేద్దామని అనిపించొచ్చు. కానీ, అలా చేస్తే అది పెద్ద తప్పిదమే అవుతుంది. ఇటువంటి మార్కెట్ల దిద్దుబాట్లు ఫండ్స్ యూనిట్ల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. తక్కువ ధరల కారణంగా అధిక యూనిట్లను సమకూర్చుకునే అవకాశం ఇటువంటి సందర్భాల్లోనే లభిస్తుంది. కనుక వీలైనంత వరకు సిప్‌ను ఇప్పుడు కొనసాగించాలి. వీలుంటే సిప్ మొత్తాన్ని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, పనితీరు సజావుగా లేని పథకాల్లో సిప్ ఆపేసి, మంచి పథకాల్లో సిప్ కొనసాగించడం, పెంచుకోవడం చేయాలి. ఎఫ్ అండ్ ఓ లతో రక్షణ ఎలా? రిస్క్ నిర్వహణకు డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) చాలా ముఖ్యమైన సాధనం. హెడ్జింగ్ రూపంలో నష్టాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. నిఫ్టీ పుట్ ఆప్షన్ల కొనుగోలు ద్వారా మీ పోర్ట్‌ఫోలియోకు సులభంగా హెడ్జ్ చేసుకోవచ్చు. అయితే, హెడ్జింగ్ అన్నది బీమా కవరేజీ వంటిది. ఒకవేళ మార్కెట్లు పడిపోకుండా పెరిగితే పుట్ ఆప్షన్ల కోసం చెల్లించిన ప్రీమియం నష్టపోవాల్సి వస్తుంది. కానీ, మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో లాభపడింది కనుక దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, అన్ని వేళలా హెడ్జింగ్ కాకుండా.. మార్కెట్లు పెద్ద కరెక్షన్లు లేకుండా దీర్ఘకాలం పాటు గణనీయంగా పెరిగిన సందర్భాల్లో హెడ్జ్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో బేర్ మార్కెట్లు ఎంత కాలం పాటు కొనసాగాయి? 1992, 2000, 2008 సందర్భాల్లో బేర్ మార్కెట్లను చవిచూశాం. 1992 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ తన పూర్వపు గరిష్టాలను అధిగమించేందుకు రెండున్నరరేళ్ల సమయం తీసుకుంది. 2000–2001 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ గరిష్టాలకు చేరుకునేందుకు నాలుగేళ్లు పట్టింది. 2008 తర్వాత పూర్వపు గరిష్టాలను దాటేందుకు సెన్సెక్స్‌కు ఆరేళ్లు పట్టింది. బంగారంలో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? అంతర్జాతీయ సంక్షోభ సమయంలో బంగారం అన్నది విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం. ఈక్విటీలకు బంగారం వ్యతిరేక దిశలో ఉంటుంది. కనుక ఈక్విటీ మార్కెట్ల పతనం సమయంలో బంగారం సురక్షిత సాధనం. ప్రస్తుత సమయాల్లో బంగారంలో పెట్టుబడులను కొనసాగించుకోవడమే సూచనీయం. ఈక్విటీ మార్కెట్లు కనిష్టాలకు చేరినట్టు ధ్రువీకరణ అయిన తర్వాత బంగారంలో కొంత లాభాలను స్వీకరించొచ్చు. మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తే...? మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి ప్రస్తుత సమయం అనుకూలమైనది. మంచి నాణ్యమైన ఐపీవోలకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా పెట్టుబడులు ప్రారంభించుకోవాలి. తగినంత అనుభవం, పరిజ్ఞానం సంపాదించిన తర్వాత నాణ్యమైన కంపెనీల షేర్లలో నేరుగానూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌తో ప్రయోజనం పొందే రంగాలు? ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, టెలికం, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ రంగ కంపెనీలు, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు లౌక్‌డౌన్ సమయంలో కొనసాగుతున్నాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇవి సంక్షోభాన్ని మెరుగ్గా అధిగమించగలవు. ఒక్కసారి లౌక్‌డౌన్ ముగిస్తే ఆకర్షణీయంగా ఉన్న ఇతర రంగాల వైపు మళ్లొచ్చు. నష్టాలను బుక్ చేసుకోవచ్చా..? భవిష్యత్తు పరిస్థితుల గురించి అవగాహన లేకుండా చెప్పుడు మాటల ద్వారా, విన్న వార్తల ద్వారా ఏవైనా కొనుగోలు చేసి ఉంటే, ఈ సమయంలో ఆ కంపెనీల ఫండమెంటల్స్, ఇటీవలి పరిణామాలు, సూచీలతో పోలిస్తే స్టాక్ ధర పరంగా జరిగిన నస్టాన్ని సమీక్షించుకోవడం చేయాలి. ఈ అంశాల్లో బలహీనంగా కనిపిస్తే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, దీర్ఘకాలంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించే వాటిల్లో, నిపుణుల సూచనల మేరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. -
సెన్సెక్స్ 3,935 పాయింట్లు డౌన్
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్ నష్టాలు కూడా కొనసాగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ వైరస్ కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా కుంటుపడతాయనే భయాందోళనతో ఇన్వెస్టర్లు సోమవారం ఎడాపెడా అమ్మకాలకు పాల్పడ్డారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్ట స్థాయి, 76 మార్క్‌ను దాటిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, ప్రపంచ మార్కెట్ల పతనం తీవ్రమైన ప్రభావమే చూపించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయిలన్నింటినీ కోల్పోవడం ఇన్వెస్టర్ల సెంట్మెంట్ను దెబ్బకొట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 26,000 పాయింట్లు దిగువకు పడిపోగా, నిఫ్టీ ఒక్క రోజే 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. సెన్సెక్స్ 3,935 పాయింట్లు పతనమై 25,981 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,135 పాయింట్లు నష్టపోయి 7,610 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 3,400 పాయింట్ల నష్టంతో 16,918 పాయింట్లకు పడిపోయాయి. ఈ సూచీలన్నీ ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పతనం కావడం ఇదే మొదటిసారి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 13.15 శాతం, నిఫ్టీ 12.9%, బ్యాంక్ నిఫ్టీ 16% నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు నాలుగేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 10 శాతం పతనం కావడంతో సర్క్యూట్ బ్రేకర్ నిబంధనల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. ఆ తర్వాత ట్రేడింగ్ మొదలైనప్పటికీ, నష్టాలు కొనసాగాయి. పతనానికి పంచ కారణాలు.. ► ఇండియా లాక్డౌన్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.41 లక్షలకు, మరణాలు 14,700కు, రికవరీలు 99,000కు చేరాయి. ఇక భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 468కు పెరగ్గా, మరణాలు పదికి చేరాయి. ప్రస్తుతం భారత్ కీలక దశలో ఉందని, ఇటలీ గతి పడుతుందా, చైనాలాగా రికవరీ అవుతుందా చూడాల్సి ఉందని నిపుణులంటున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో ఈ వైరస్ కట్టడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. పలు కంపెనీలు తమ తమ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు ఆపేస్తున్నాయని ప్రకటించాయి. మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాట నడవనున్నాయి. ఈ లాక్డౌన్లు, ప్లాంట్ల మూసివేతల కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలు మందగించి ఆర్థిక వ్యవస్థ కుంటుపడగలదనే భయాలతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెల 24 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అయినకాడికి షేర్లను అమ్మేస్తున్నారు. సోమవారం నాటి రూ.2,989 కోట్ల నికర అమ్మకాలను కలుపుకుంటే ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.54,232 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ► రూపాయి ఢమాల్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మరింతగా కొనసాగుతాయనే భయాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతోంది. సోమవారం రూపాయి విలువ జీవిత కాల కనిష్ట స్థాయి, 76.30కు చేరింది. ► ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి పలు దేశాలు లాక్డౌన్లు ప్రకటించాయి. ఈ ప్రపంచవ్యాప్త లాక్డౌన్లు మహా మాంద్యానికి దారి తీస్తాయనే భయాలతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. చైనా, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియాల సూచీలు 5 శాతం మేర నష్టపోయాయి. ఒక్క జపాన్ నికాయ్ సూచీ మాత్రం 2 శాతం పెరిగింది. ఇక యూరప్ మార్కెట్లు 5 శాతం నష్టాల్లో మొదలై, 3–5 శాతం నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ఏడేళ్ల కనిష్టాలకు పడిపోయాయి. అమెరికా ఫ్యూచర్స్ 5 శాతం మేర నష్టపోయాయి. ► వృద్ధి అంచనాలు తగ్గింపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.2 శాతంగానే ఉండగలదని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించడం ప్రతికూల ప్రభావం చూపింది. భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 వాతంగా ఉండగలదని ఈ సంస్థ గతంలో అంచనా వేసింది. మరిన్ని వివరాలు... ► సెన్సెక్స్‌లోని 30, నిఫ్టీలోని 50 షేర్లు నష్టపోయాయి. ► యాక్సిస్ బ్యాంక్ షేర్ 28 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా నష్టపోయిన షేర్ ఇదే. ► 1,180 పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ ఈ జాబితాలో ఉన్నాయి. ► బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్‌లు 20 శాతం మేర నష్టపోయాయి. ► బీఎస్ఈ 500 సూచీలోని వందకు పైగా షేర్లు ఒక్క నెలలోనే 70–50% మేర క్షీణించాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ జాబితాలో ఉన్నాయి. ► పలు వాహన కంపెనీలు తమ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపేశాయి. ఫలితంగా మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్ తదితర వాహన కంపెనీల షేర్లు 10 శాతం మేర పతనమయ్యాయి. ► రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు రెండేళ్ల కనిష్టానికి, యాక్సిస్ బ్యాంక్ ఆరేళ్ల కనిష్టానికి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎనిమిదేళ్ల కనిష్టానికి, ఎం అండ్ ఎం పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. 45 నిమిషాలు ఆగిన ట్రేడింగ్ భారీ నష్టాలతోనే సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 2,718 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. పది గంటల సమయానికే ఈ నష్టాలు 2,992 పాయింట్లు (శుక్రవారం ముగింపుతో పోల్చితే 10 శాతం నష్టం)కు చేరాయి. ఈ సమయానికి నిఫ్టీ 842 పాయింట్లు (9.6 శాతం నష్టం)తో 7,903 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 10 శాతం నష్టపోవడంతో సర్క్యూట్ బ్రేకర్ నిబంధన ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. సర్క్యూట్ బ్రేకర్ కారణంగా ట్రేడింగ్‌ను నిలిపేయడం పది రోజుల్లో ఇది రెండోసారి. ఈ నెల 13న కూడా ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు ఆపేశారు. ఉదయం 11 గంటల అనంతరం ట్రేడింగ్ మళ్లీ ఆరంభమైంది. నష్టాలు కొనసాగాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఒడిదుడుకులను నివారించడానికి షార్ట్ సెల్లింగ్ నిబంధనలను కఠినతరం చేస్తూ, సెబీ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. కరోనా కేసులు తగ్గితేనే మార్కెట్ రికవరీ అవుతుందని నిపుణులంటున్నారు. 14 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ. 14.22 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇది అల్జీరియాతో సహా 130 దేశాల జీడీపీకి సమానం. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.14,22,207 కోట్లు హరించుకుపోయి రూ.1,01,86,936 కోట్లకు పడిపోయింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మార్కెట్లో కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు కొనసాగుతాయి. కరోనా వైరస్ వల్ల ఆర్థికంగా వాటిల్లే నష్టాన్ని తగ్గించే ఉద్దీపన చర్యల కోసం మార్కెట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ విశ్లేషకులు మాంద్యం భయాలతో మార్కెట్ సోమవారం భారీగా పడిపోయింది. కరోనా అనిశ్చితి నేపథ్యంలో ఈ పతనం ఇక్కడితో ఆగుతుందా, లేదో అని చెప్పడం కష్టతరమే. అయితే వైరస్‌కు సంబంధించి స్వల్ప ఊరట లభించినా, మార్కెట్లో స్మార్ట్ రికవరీ ఉండొచ్చు. –సంతోశ్ మీనా, ట్రేడింగ్ బుల్స్, ఎనలిస్ట్ ఇన్వెస్టర్ల భయాన్ని ప్రతిబింబించే ఒలటైల్ ఇండెక్స్ (వీఐఎక్స్) 6.6 శాతం ఎగసి 71.56 స్థాయిలకు చేరింది. ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.54,232 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ప్రస్తుత స్టాక్ మార్కెట్ సంక్షోభం మరింత భయాందోళనకు దారి తీయనున్నది. ఆర్బీఐ తక్షణం రేట్లను తగ్గించాలి. ప్రభుత్వం కూడా తగిన చర్యలతో ముందుకు రావాలి. మార్కెట్లను మూసేయాల్సిన అవసరం ఉంది. –దేవేన్ చోక్సీ, కేఆర్ చోక్సీ మార్కెట్ గురించి ఒక ఆరు నెలల పాటు మరచిపోండి. యోగా చేయండి. చేతిలో నగదు ఉంచుకోండి. విజయ్ కేడియా, కేడియా సెక్యూరిటీస్ 50కు పైగా షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్లను తాకాయి. ట్రెంట్, ర్యాలీస్, పాలీక్యాబ్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. మరో 130 షేర్లు 10% లోయర్ సర్క్యూట్లను తాకాయి. మార్కెట్ పతన సమయాల్లో ఒక్క రోజు లాభాలను తర్వాతి రోజుల్లో వచ్చే నష్టాలు హరించివేసే పోకడ... పతనం ఎంత బలంగా ఉందో సూచిస్తోంది. ఇక నిఫ్టీ తదుపరి కీలక మద్దతు 6,825 పాయింట్లు. ఇక్కడి నుంచే 2016, ఫిబ్రవరి నాటి పతనం రివర్స్ అయింది. –నాగరాజ్ శెట్టి, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ -
సెన్సెక్స్‌కు కీలక స్థాయి 37,415
కరోనావైరస్ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒకేవారంలో ఎన్నడూ చూడనంత పెద్ద పతనం అంతర్జాతీయ మార్కెట్లలో సంభవించింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్ల కోత, ఇతర ఉద్దీపన చర్యలకు సిద్ధంగా వున్నట్లు గత శుక్రవారం ప్రకటించడంతో ఆరోజున అమెరికా స్టాక్ సూచీలు కనిష్టస్థాయి నుంచి చాలావరకూ కోలుకున్నప్పటికీ, ఈ ఉద్దీపన ప్రకటన ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. చైనా కేంద్ర బ్యాంకు గత పదిరోజుల్లో ఇటువంటి ఎన్నో ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ దేశపు సూచీలు ఇంకా పతనబాటలోనే వున్నాయన్నది గమనార్హం. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఫిబ్రవరి 28తో ముగిసినవారంలో 38,220 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 2,873 పాయింట్ల భారీనష్టంతో 38,297పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు భారీ కదలికల రీత్యా, ఈ వారం సైతం సెన్సెక్స్ ఎటువైపైనా వేగంగా ప్రయాణించవచ్చు. గతేడాది అక్టోబర్ 9నాటి ‘స్వింగ్ లో’ అయిన 37,415 స్థాయి ఈ వారం సెన్సెక్స్‌కు ముఖ్యమైన తక్షణ మద్దతు. ఈ మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగినా, గ్యాప్‌అప్‌తో మొదలైనా.... క్రితంవారపు భారీ కరెక్షన్కు కౌంటర్ట్రెండ్ ర్యాలీ జరిగి 39,090 పాయింట్ల వద్దకు వెంటనే చేరగలదు. అటుపై 39,420 పాయింట్ల వరకూ ఎగిసే అవకాశం వుంటుంది. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 39,950–40,255 పాయింట్ల శ్రేణిని సైతం చేరే ఛాన్స్ వుంటుంది. అయితే తొలి మద్దతుస్థాయిని వదులుకుంటే డౌన్‌ట్రెండ్ మరింత వేగవంతమై 36,720 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున ముగిస్తే 35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. 11,090 వద్ద మద్దతు పొందితే నిఫ్టీ సేఫ్... గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,175 పాయింట్ల వరకూ పతనమై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 879 పాయింట్ల భారీనష్టంతో 11,202పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీకి సైతం గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 11,090 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ స్థాయిని పరిరక్షించుకున్నా, గ్యాప్‌అప్‌తో మొదలైనా వేగంగా 11,385 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే 11,535 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 11,660–11.780 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. తొలి మద్దతుస్థాయిని కోల్పోతే వేగంగా 10,930 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. 2018 అక్టోబర్ 23నాటి 10,004 పాయింట్ల నుంచి ఈ ఏడాది జనవరి 20 నాటి 12,430 పాయింట్ల రికార్డుస్థాయివరకూ జరిగిన ర్యాలీకి ఈ 10,930 పాయింట్లు...61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయి. ఈ స్థాయిని సైతం వదులుకుంటే ప్రస్తుత కరెక్షన్ మరెన్నో వారాలు కొనసాగే ప్రమాదం వుంటుంది. ఈ వారం ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 10,670 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. -
మార్కెట్ అక్కడక్కడే
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకున్నా మన మార్కెట్లో మాత్రం ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, నవంబర్ నెల వాహన విక్రయాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో వాహన, బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించనుండటంతో పలువురు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 40,802 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 12,048 పాయింట్ల వద్ద ముగిశాయి. మొబైల్ చార్జీలు 40 శాతం మేర పెరగడంతో టెలికం కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయి. -
పసిడి ప్రియం.. సేల్స్ పేలవం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ధంతేరాస్‌గా పిలిచే ధన త్రయోదశికి పసిడి మెరుపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 40% దాకా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.40 వేలకు అటూఇటుగా కదులుతుండటంతో పాటు.. కస్టమర్లు చేసే వ్యయాలు తగ్గడం కూడా ఇందుకు కారణమని వర్తకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిజానికి ధన త్రయోదశికి బంగారం, వెండి, లేదా విలువైన వస్తువులు కొనడం శుభసూచకమని హిందువులు భావిస్తారు. 2018లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి కూడా. అయితే పసిడి ధర అప్పటితో పోలిస్తే 10 గ్రా. రూ.6000 వరకూ ప్రస్తుతం ఎక్కువ. శుక్రవారం హైదరాబాద్‌లోని నగల షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర రూ.39,900 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.36,850 పలికింది. కిలో వెండి రూ.50,600 ఉంది. రూ.2,500 కోట్ల విక్రయాలు... ఈ సంవత్సరం ధన త్రయోదశికి శుక్రవారం సాయంత్రం వరకు రూ.2,500 కోట్ల విలువైన సుమారు 6,000 కిలోల పుత్తడి అమ్ముడైనట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. గతేడాది ధనత్రయోదశికి మాత్రం రూ.5,500 కోట్ల విలువైన 17,000 కిలోల బంగారం విక్రయమైనట్లు సీఏఐటీ తెలియజేసింది. ‘‘వ్యాపారం 35–40% పడిపోయింది. గోల్డ్, సిల్వర్ ధరలు క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో అత్యధికంగా నిరాశపర్చిన ఏడాది ఇదే’’ అని సీఏఐటీ గోల్డ్, జ్యుయలరీ కమిటీ చైర్మన్ పంకజ్ అరోరా చెప్పారు. పరిమాణం పరంగా 2018తో పోలిస్తే అమ్మకాలు 20% తగ్గొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. మెరిసిన వెండి..: అధిక ధర కారణంగా ఈ సారి సెంటిమెంట్ పడిపోయిందని గోల్డ్ రిఫైనింగ్ సంస్థ ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేశ్ ఖోస్లా చెప్పారు. ‘‘బంగారం ప్రస్తుత ధర వినియోగదార్ల దృష్టిలో చాలా ఎక్కువ. అందుకే కస్టమర్లు వెండి నాణేల వైపు మొగ్గు చూపారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సిల్వర్ కాయిన్స్ విక్రయాలు 2018తో పోలిస్తే 15% పెరిగాయని చెప్పారాయన. వివాహాల సీజన్ తోడవడంతో వెండి వస్తువుల అమ్మకాలు పెరిగాయని శ్రీ స్వర్ణ జ్యుయలర్స్ ఎండీ ప్రియ మాధవి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాలికి వేసుకునే కడియాలకు మళ్లీ డిమాండ్ పెరిగిందన్నారు. విదేశాల నుంచి సైతం వీటికి ఆర్డర్లు వచ్చాయని చెప్పారామె. చిన్న ఆభరణాలకే.. అన్ని షోరూంలలోనూ అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్ తెలిపారు. స్తబ్దుగా ఉన్న మార్కెట్లో ధంతేరాస్ రాకతో పరిస్థితిలో కొంత మార్పు కనపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ చెప్పారు. ఈ సారి తక్కువ విలువ ఉన్న ఆభరణాల వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపారని జీజేసీ అంటోంది. 60–70 శాతం చిన్న ఆభరణాల అమ్మకాలేనని శారీనికేతన్ గోల్డ్ విభాగం ఇన్చార్జ్ గుల్లపూడి నాగ కిరణ్ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్‌తో ముడిపడి 30% పైగా అమ్మకాలు నమోదయ్యాయని చెప్పారాయన. మొత్తంగా పుత్తడి అమ్మకాలు 40 శాతం పడిపోయాయన్నారు. -
11,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ
రెండు రోజుల రికార్డ్ లాభాల నేపథ్యంలో మంగళవారం ఆరంభమైన లాభాల స్వీకరణ బుధవారం కూడా కొనసాగింది. వృద్ధిని మరింతగా కుంటుపరిచేలా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు చోటు చేసుకోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌పై అభిశంసన విచారణ మొదలు కావడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. వీటికి తోడు మన వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) కోత కోయడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ముడి చమురు ధరలు 1.6 శాతం పతనమైనా, మన మార్కెట్ పతనబాటలోనే కొనసాగింది. సెన్సెక్స్ 504 పాయింట్లు నష్టపోయి 38,594 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 148 పాయింట్లు పతనమై 11,440 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిప్టీ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు చెరో 2% పతనమయ్యాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్... అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అభిశంసన ప్రతిపాదన కారణంగా అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. దీని ప్రభావం స్వల్పకాలికంగానే ఉండనున్నదని ఆయన భావిస్తున్నారు. మొండి బకాయిలకు సంబంధించి తాజా సమస్యలు, సెప్టెంబర్ వాహన అమ్మకాలు బలహీనంగా ఉండే అవకాశాలు, ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని వివరించారు. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనుండటంతో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులంటున్నారు. వచ్చే నెల 4న ఆర్బీఐ పాలసీ, క్యూ2 ఫలితాలను బట్టి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,84,484 కోట్లు తగ్గి రూ.1,46,88,764 కోట్లకు పడిపోయింది. పతనానికి ప్రధాన కారణాలు లాభాల స్వీకరణ డొనాల్ట్ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ ట్రంప్ చైనా వ్యతిరేక వ్యాఖ్యలు పతనమైన ప్రపంచ మార్కెట్లు వృద్ధి అంచనాలను తగ్గించిన ఏడీబీ రూపాయి పతనం మార్కెట్ భారీగా నష్టపోయినా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ మెరుపులు మెరిపించింది. దేశంలోనే అతి పెద్ద బీ2బీ కంపెనీ అయిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,970ను తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ. 1,874 వద్ద ముగిసింది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఈ కంపెనీ ఇష్యూ ధర, రూ.973తో పోల్చితే దాదాపు రెట్టింపైంది. గత నెల కాలంలోనే ఈ కంపెనీ షేర్ 70 శాతానికి పైగా పెరగడం విశేషం. -
భగ్గుమన్న పెట్రోల్ ధరలు
సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో సెప్టెంబర్ డెలివరీ ఒక బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 19.5 శాతం ఎగసి 71.95 డాలర్లను తాకింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి డాలర్ల పరంగా ఒక్క రోజులో ఇంతగా ధర పెరగడం ఇదే మొదటిసారి. ఇక అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటరీ్మడియట్ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్స్ 15.5 శాతం ఎగసి 63.34 డాలర్లకు పెరిగింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ రెండు రకాల ముడి చమురు ధరలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఈ వార్త రాసే సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ నైమెక్స్ క్రూడ్ ధర 12 శాతం ఎగసి 61.38 డాలర్ల వద్ద, బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 12.4 శాతం ఎగసి 67.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లో 9 శాతం అప్... ఇక మన మార్కెట్ విషయానికొస్తే, సోమవారం మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎమ్‌సీఎక్స్)లో సెపె్టంబర్ డెలివరీ క్రూడ్ ధర 9.14 శాతం ఎగసి రూ.4,273 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో స్పెక్యులేటర్లు తాజాగా పొజిషన్లు తీసుకోవడంతో ధరలు పెరిగాయి. ట్రేడర్ల స్పెక్యులేటివ్ పొజిషన్ల కారణంగా సమీప భవిష్యత్తులో ధరలు అధిక స్థాయిల్లోనే ట్రేడవుతాయని నిపుణులంటున్నారు. సౌదీ సగం ఉత్పత్తికి గండి... ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ప్రాసెసింగ్ కేంద్రం, సౌదీ అరేబియాలోని సౌదీ ఆరామ్కో ఆయిల్ ప్లాంట్లపై గత శనివారం ద్రోన్లతో దాడి జరిగింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని అబ్క్వైక్ నగరంలోని రిఫైనరీపైనా, రియాద్‌కు 150 కిమీ. దూరంలోని ఖురయాస్ చమురు క్షేత్రంపైనా ద్రోన్లతో దాడి జరిగింది. దీంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగం (ఇది ప్రపంచ రోజువారీ చమురు సరఫరాల్లో ఐదు శాతానికి సమానం) వరకూ తగ్గుతుందని అంచనా. రోజుకు 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి గండి పడుతుంది. కాగా ఈ దాడులకు కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపిస్తుండగా, ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దాడులు తామే చేశామని యెమెన్‌కు చెందిన హౌతి రెబెల్స్ పేర్కొన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులు చేసే అవకాశాలు మరింతగా పెరిగాయని, ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. సౌదీ ఆరామ్కో ఐపీఓ ఆలస్యం...! ఉగ్రవాద దాడుల కారణంగా సౌదీ ఆరామ్కో భారీ ఐపీఓ (ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్) మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దాడుల నష్టా న్ని మదింపు చేస్తున్నామని, ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ మార్కెట్లో లిస్టయ్యే ముందు సౌదీ అరేబియా స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది నవంబర్‌లో లిస్టింగ్ కావాలని సౌదీ ఆరామ్కో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లనూ నియమించింది. మరింతగా వదలనున్న మన ‘చమురు’... సింగపూర్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచి్చందని సామెత. సామెత అన్వయం సరిగ్గా లేకపోయినప్పటికీ, సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా భారత్‌కు మరింతగా చమురు వదలనున్నది. సౌదీ ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా మన దిగుమతి బిల్లు మరింతగా పెరుగుతుందని, ముందుగా రూపాయిపై దెబ్బ పడుతుందని సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకింగ్ గ్రూప్ వెల్లడించింది. ముడి చమురు ధరలు 10 శాతం పెరిగితేనే, ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని, భారత కరంట్ అకౌంట్ లోటు 0.4–05 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కో డాలర్ పెరిగితే, భారత చమురు దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని వివరించింది. భారత్ తన అవసరాల్లో 83 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునేది ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే. గత ఆరి్థక సంవత్సరంలో భారత్ మొత్తం 2017.3 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోగా, దీంట్లో సౌదీ అరేబి యా వాటా 40.33 మిలియన్ టన్నులుగా ఉంది. సరఫరాల్లో కొరత ఉండదు సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై దాడుల కారణంగా మనకు చమురు సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాబోవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాడుల అనంతరం సౌదీ ఆరామ్కో కంపెనీ ప్రతినిధులను సంప్రదించామని, సరఫరాల్లో ఎలాంటి కొరత ఉండబోదని వారు భరోసానిచ్చారని వివరించారు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్‌కంపెనీల వద్ద సెప్టెంబర్ నెలకు సంబంధించిన చమురు నిల్వలపై సమీక్ష జరిపామని, పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని, సరఫరాల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధర రూ.5–6 పైపైకి..! సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడుల కారణంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు మరో రెండు వారాల్లో రూ.5–6 మేర పెరుగుతాయని నిపుణులంటున్నారు. ఈ దాడుల కారణంగా సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరలు భగ్గుమంటూనే ఉంటాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. సౌదీలో చమురు ఉత్పత్తి సాధారణ స్థాయికి రావడానికి మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. మరోవైపు సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయి. మరోవైపు సౌదీ అరేబియా అమెరికాతో కలిసి ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏతావాతా పశ్చిమాసియాలో సంక్షోభం మరింతగా ముదిరితే ముడి చమురు ధరల ర్యాలీ ఇప్పట్లో ఆగదని విశ్లేషకులు భయపడుతున్నారు. ముడి చమురు, సంబంధిత ఉత్పాదకాలు పలు పరిశ్రమలకు ముడిపదార్ధాలుగా వినియోగమవుతున్నాయని, పెయింట్లు, టైర్లు, ఆయిల్, గ్యాస్, వాహన విడిభాగాల పరిశ్రమలపై పెను ప్రభావం పడుతుందని వారంటున్నారు. ముడి చమురు ధరలు భగ్గుమంటే, అది ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రతికూలమేనని, అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే వెనుజులా, ఇరాన్‌ల నుంచి చమురు సరఫరాలు తగ్గాయని కోటక్ ఈక్విటీస్ తెలిపింది. రూపాయి.. ‘క్రూడ్’ సెగ! ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పరుగు భయాలు సోమవారం రూపాయిని వెంటాడాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 68 పైసలు పతనమైంది. 71.60 వద్ద ముగిసింది. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటన పయనించిన రూపాయి సోమవారం మొట్టమొదటిసారి నేలచూపు చూసింది. క్రూడ్ ధరల పెరుగుదల భారత్ కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి కీలక ఆరి్థక గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో... సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి బలహీనంగా 71.54 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 71.63 స్థాయినీ చూసింది. రూపాయి శుక్రవారం ముగింపు 70.92. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. స్టాక్ మార్కెట్లో ‘మంట’... సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ద్రోన్లతో దాడి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇంట్రాడేలో 20% వరకూ క్రూడ్ ధరలు ఎగియడంతో మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. చమురు సెగతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 356 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 262 పాయింట్ల నష్టంతో 37,123 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 11,004 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరి్థక వ్యవస్థలో వృద్ధి జోష్‌ను పెంచడానికి ప్రభుత్వం శనివారం ప్రకటించిన రూ.70,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ(ఎగుమతులు, రియల్టీకి) చమురు దాడుల నష్టాల్లో కొట్టుకుపోయింది. ఆయిల్ షేర్లు విలవిల.... సౌదీ చమురు క్షేత్రాల దాడుల నేపధ్యంలో బీఎస్ఈ ఆయిల్ గ్యాస్ అండ్ ఎనర్జీ ఇండెక్స్ భారీగా నష్టపోయింది. చమురు సంబంధిత షేర్లు బాగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, క్యా్రస్టాల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7% వరకూ నష్టపోయాయి. స్పైస్‌జెట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జెట్ ఎయిర్వేస్ వంటి విమానయాన ఇంధన షేర్లు 4% వరకూ నష్టపోయాయి. ఇప్పటికే అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కుదేలైన ప్రపంచ మార్కెట్లపై సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తాజాగా జరిగిన దాడి మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని షేర్‌ఖాన్ బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ గౌరవ్ దువా వ్యాఖ్యానించారు. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే, మన ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు. ప్రధాన ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. -
పసిడి పరుగో పరుగు..
న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజులుగా జీవితకాల గరిష్టస్థాయిలను తిరగరాస్తూ ర్యాలీ చేస్తోన్న పసిడి ధరలు తాజాగా మరో నూతన గరిష్టస్థాయిని నమోదుచేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్ గోల్డ్) బంగారం ధర రూ.38,970 వద్దకు చేరుకుంది. తాజాగా రూ. 39,000 ధరకు సమీపించింది. ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ క్రమంగా పెరుగుతున్న కారణంగా ఇక్కడి ధర ఒక్క రోజులోనే రూ.150 పెరిగి ఆల్ టైం రికార్డు హైకి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం న్యూయార్క్‌లో స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో 1,498.80 డాలర్లకు తగ్గింది. శుక్రవారం జాక్సన్ హోల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం, జీ7 సమిట్ ఫలితాల వెల్లడి వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1,500 డాలర్ల స్థాయిలోనే ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ విభాగం హెడ్ హరీష్ అన్నారు. ఇక సావరిన్ గోల్డ్ ధర ఎనిమిది గ్రాములకు రూ.28,800 వద్ద ఉంది. పసిడి బాటలోనే వెండి.. దేశ రాజధానిలో వెండి ధరలు గురువారం çస్వల్ప పెరుగుదలను నమోదుచేశాయి. ఇండస్ట్రీ, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిన కారణంగా స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.60 పెరిగి రూ.45,100 చేరుకోగా.. వీక్లీ డెలివరీ సిల్వర్ ధర రూ.113 పెరిగి రూ.43,765 వద్దకు చేరుకుంది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.91,000 కాగా, అమ్మకం ధర రూ.92,000. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 17.09 డాలర్లకు ఎగబాకింది. -
36,220–36,778 శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్ ప్రతిపాదనల అనంతరం లబ్దిపొందుతాయని అంచనావేస్తున్న ఆటో, కన్జూమర్ షేర్లు ర్యాలీ జరపగా, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలతో బాండ్లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు క్షీణించాయి. మరోవైపు రూపాయి క్షీణత ఫలితంగా ఐటీ షేర్లు కూడా మెరుగుపడ్డాయి. రానున్న కొద్ది రోజుల్లో బడ్జెట్ రోజునాటి ట్రెండే కొనసాగే అవకాశం లేదు. మరో మూడు నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై అంచనాలు, ప్రపంచ ఆర్థికాభివృద్ధి గమనం తదితర అంశాలపై మార్కెట్ దృష్టి నిలపవచ్చు. తాజా బడ్జెట్ ప్రతిపాదనలపై విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే పెట్టుబడుల శైలికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో మన మార్కెట్ కదలికలు ఉండొచ్చు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... ఫిబ్రవరి 1తో ముగిసిన వారం తొలిరోజున 35,565 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం బడ్జెట్ సమర్పణ తర్వాత 36,778 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంకంటే 444 పాయింట్లు లాభపడి 36,469 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్ రోజునాటి కనిష్ట, గరిష్టస్థాయిలు సెన్సెక్స్ సమీప ట్రెండ్‌కు కీలకం. ఆ రోజునాటి కనిష్టస్థాయి అయిన 36,220 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తుండగా, నిరోధం ఆ రోజునాటి గరిష్టస్థాయి అయిన 36,778 పాయింట్ల వద్ద ఎదురవుతున్నది, ఈ శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు సెన్సెక్స్ వచ్చేవారం కదలవచ్చు. 36,220 పాయింట్ల స్థాయిని కోల్పోతే వేగంగా 35,740 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ రెండో మద్దతును కోల్పోయి, ముగిస్తే 35,565–35,380 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం 36,778 పాయింట్ల స్థాయిని అధిగమించి, ముగిస్తే అప్‌ట్రెండ్ బలోపేతమై 37,050–37,200 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపై 37,500 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక శ్రేణి 10,813–10,983 గతవారం తొలిరోజున 10,630 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ తదుపరి క్రమేపీ పెరుగుతూ వారాంతంలో 10,983 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 114 పాయింట్ల లాభంతో 10,894 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్ రోజునాటి కనిష్ట, గరిష్టస్థాయిలైన 10,813–10,983 పాయింట్ల శ్రేణిని నిఫ్టీ ఎటు ఛేదిస్తే అటు వేగంగా కదలవచ్చు. 10,813 పాయింట్ల స్థాయిని కోల్పోయి, ముగిస్తే 10,680 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ రెండో మద్దతును సైతం వదులుకుంటే వేగంగా 10,630–10,535 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,983 పాయింట్ల స్థాయిని దాటగలిగితే పటిష్టమైన అప్ట్రెండ్లోకి మార్కెట్ మళ్లవచ్చు. కొద్ది వారాల నుంచి పలు దఫాలు గట్టి అవరోధాన్ని కల్పిస్తున్న ఈ స్థాయిపైన నిఫ్టీ వేగంగా 11,100 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 11,220 పాయింట్ల స్థాయి కూడా నిఫ్టీకి కష్టసాధ్యం కాదు. -
ఆమె అరెస్ట్‌తో... అతలాకుతలం!
ఒక వ్యక్తి అరెస్ట్... ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నింటినీ గురువారం అల్లకల్లోలం చేసి పడేసింది. దీనికి తోడు డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ 71 మార్క్‌కు దిగడంతో మన మార్కెట్ కూడా అదే దారిలో ప్రయాణించింది. అన్ని రంగాల షేర్లలో అదేపనిగా అమ్మకాలు జరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడి కొనుగోళ్ల కంటే అమ్మకాలకే అధిక ప్రాధాన్యమివ్వటంతో... బీఎస్ఈ సెన్సెక్స్ 572 పాయింట్లు పతనమై 35,312 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 182 పాయింట్లు క్షీణించి 10,601 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 1.59 శాతం, నిఫ్టీ 1.69 శాతం చొప్పున పతనమయ్యాయి. కిందటి వారమంతా లాభపడిన స్టాక్ సూచీలు... గడిచిన మూడు రోజులూ వరుసగా నష్టపోయాయి. మెటల్, ఆయిల్, గ్యాస్, ఫార్మా, ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ... ఇలా అన్ని రంగాల షేర్లూ నష్టపోయాయి. ఇటీవల నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు బుధవారం నికర అమ్మకాలు జరపడం, మన జీడీపీ అంచనాలను ఫిచ్ రేటింగ్స్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 618 పాయింట్లు నష్టం స్టాక్ మార్కెట్‌పై దెబ్బ మీద దెబ్బ పడుతోందని సెంట్రమ్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తునుగుంట్ల చెప్పారు. ఇటీవల కొంత కోలుకున్నట్లు కనిపించిన రూపాయి మళ్లీ పతనమైందన్నారు. ముడి చమురు ఉత్పత్తి కోత దిశగా ఒపెక్ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని తెలియజేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే మంగళవారం (ఈ నెల 11న) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లలో ఒకింత ఆదుర్దా నెలకొందని చెప్పారాయన. నష్టాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజులో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రోజంతా నష్టాల్లోనే సాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 618 పాయింట్ల వరకూ నష్టపోగా, నిఫ్టీ 195 పాయింట్ల వరకూ పతనమైంది. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో ఒక్క సన్ ఫార్మా మాత్రమే లాభపడింది. గత మూడు రోజులుగా నష్టపోతూ వస్తున్న సన్‌ఫార్మా షేర్.. సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టపోయినా, గురువారం పెరగడం విశేషం. ► 50 షేర్ల నిఫ్టీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 47 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► ధరలను పెంచనున్నామని ప్రకటించడంతో మారుతీ సుజుకీ షర్ 4.6 శాతం పతనమై రూ.7,208 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 5 శాతం నష్టంతో రూ.7,178ను తాకింది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోయిన షేర్ ఇదే. మారుతీ సుజుకీతో పాటు టాటా మోటార్స్ 4%, బజాజ్ ఆటో 1.5%, హీరో మోటొకార్ప్1.2 శాతం చొప్పున పడిపోయాయి. ► లోహ షేర్లు భారీగా నష్టపోయాయి. వేదాంత, సెయిల్, ఎన్ఎమ్డీసీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకగా, టాటా స్టీల్, హిందుస్తాన్ జింక్ ఏడాది కనిష్ట స్థాయిలకు చేరువయ్యాయి. లోహ షేర్లే కాకుండా పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ► రిటైల్ రుణాల వడ్డీరేట్లను ఎమ్సీఎల్ఆర్తో కాకుండా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్స్‌తో అనుసంధానించాలన్న ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీలోని 12 బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. 2.26 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కె ట్ భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 2.28 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,42,15,155 కోట్ల నుంచి రూ.2.26 లక్షల కోట్లు తగ్గి రూ.1,39,88,560 కోట్లకు పడిపోయింది. గత మూడు రోజుల్లో రూ.3.64 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. పతనానికి ప్రధాన కారణాలివీ... ► భారీ నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు... చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), మెంగ్ వాంఝూను కెనడాలో అరెస్టు చేశారు. ఈమె ఈ కంపెనీ వ్యవస్థాపకుడి కుమార్తె. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను హువావే కంపెనీ ఉల్లంఘించిందనేది ఆరోపణ. ఈ ఆరెస్ట్ను చైనా తీవ్రంగా నిరసించింది. ఇప్పటికే వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–చైనా సంబంధాలు ఈ వివాదంతో మరింత క్షీణిస్తాయన్న భయాలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. జపాన్ నికాయ్ 1.9 శాతం, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 2.4 శాతం, చైనా షాంగై సూచీ 1.6 శాతం, కొరియా కోస్పి సూచీ 1.5 శాతం చొప్పున కుదేలయ్యాయి. ఇక యూరప్ స్టాక్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో క్షీణించాయి. అమెరికా డోజోన్స్ 700 పాయింట్లు, నాస్డాక్ 100 పాయింట్ల నష్టాలతో ట్రేడవుతున్నాయి. ► 71 మార్క్ దిగువకు రూపాయి... ముడిచమురు ధరల భారీ పతనం కారణంగా కోలుకున్న రూపాయి ఇటీవల మళ్లీ నష్టాల బాట పట్టింది. డాలర్ బలపడుతుండటం, మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తలెత్తడంతో రూపాయి మళ్లీ 71 మార్క్‌ను దాటింది. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు నవంబర్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ► ఒపెక్ సమావేశంపై ఆందోళన ముడి చమురు ధరల పతనాన్ని అడ్డుకోవడానికి ఒపెక్ దేశాలు ఉత్పత్తి కోతకు సిద్ధం అవుతున్నాయి. ఉత్పత్తి కోత కారణంగా మళ్లీ ధరలు పెరుగుతాయని, ఇది మన రూపాయిపై, మన ఆర్థిక స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నది. ► ఎన్నికల ఫలితాలపై ఆదుర్దా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకం. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్, మిజోరమ్ ఎన్నికల పలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నది. ► ఫిచ్ నివేదిక ప్రకంపనలు... అంతర్జాతీయ రేటింగ్ సంస్థ, ఫిచ్ ఈ ఏడాది భారత్ జీడీపీ అంచనాలను 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. మరోవైపు వచ్చే ఏడాది చివరికల్లా డాలర్‌తో రూపాయి మారకం 75కు చేరుతుందని కూడా ఫిచ్ పేర్కొనడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది. ► గణాంకాల నిరుత్సాహం ఇటీవల వెలువడ్డ జీడీపీ, పన్ను వసూళ్లు, వాహన విక్రయా లు తదితర గణాంకాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మార్కెట్లో ఉత్తేజకర వాతావరణం కొరవడింది. -
వలస బాటలో మత్స్యకారులు
కృష్ణానదిని నమ్ముకొని ఏటి ఒడ్డున బతుకుతున్న మత్స్యకారుల జీవితాలు నానాటికి మసకబారుతున్నాయి. ఐదు దశాబ్దాల కిందట పొట్ట చేతబట్టుకొని విశాఖ నుంచి విజయపురిసౌత్ వచ్చిన మత్స్యకారులు ప్రస్తుతం పలు అవస్థలు పడుతున్నారు. రోజు మొత్తం షికారు (వేట) చేసినా చేపలు చిక్కని దైన్యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యశాఖ గత రెండు ఏళ్ళుగా సాగర్ జలాశయంలో చేపపిల్లలను వదలక పోవటంతో షికారు జరగక మత్స్యకారుల కుటుంబాలు అల్లాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందక వలస బాటపట్టాయి. విజయపురిసౌత్, న్యూస్‌లైన్ : విజయపురిసౌత్‌లోని డౌన్‌మార్కెట్, సాగర్ క్యాంప్‌లలో సుమారు 500 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరికి చేపల వేటే ప్రధాన పోషణ. వీరిలో సగం మందికి పక్కా గృహాలు కూడా లేవు. చేపల వ్యాపారుల వద్ద కుటుంబ పోషణకు అడ్వాన్స్‌లు తీసుకొని చేపలను వారికే అమ్ముతుంటారు. ప్రతి ఏటా 50 నుంచి 60 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు గుంటూరు, నల్లగొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్ జలాశయంలో ఇరువైపుల వదులుతుండేవారు. రెండేళ్లుగా చేప పిల్లలను వదలకపోవడంతో వారి జీవనోపాధి దెబ్బతింది. సహజంగా కుటుంబంలోని మగవారంతా షికారు (చేపల వేట) చేస్తారు. అనంతరం వచ్చిన చేపలను వేరు చేసేందుకు మహిళలు సహకరిస్తారు. పెద్ద చేపలను విక్రయించి చిన్న చేపలను ఎండబెట్టడం, కూర వండుకోవటం చేస్తుంటారు. వీరంతా ప్రతి రోజు చేపలతోనే భోజనం చేస్తారు. షికారు జరగని రోజు ఏటి ఒడ్డునే పస్తులు ఉంటారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యాం భద్రతా దృష్ట్యా కృష్ణా జలాశయం ఒడ్డున ఉన్న లాంచీస్టేషన్ నుంచి సాగర్మాత దేవాలయం వరకు ప్రభుత్వం సేఫ్టీవాల్ నిర్మాణం చేపట్టడంతో మత్స్యకారులు చేపలు షికారు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో రెండు మూడు నెలల్లో సేఫ్టీవాల్ నిర్మాణం పూర్తయితే కృష్ణా జలాశయంలోకి పుట్టీలతో ఎలా దిగాలని మత్స్యకారులు వాపోతున్నారు. దీనికి తోడు గత రెండు సంవత్సరాలుగా జలాశయంలో చేపపిల్లలను వదలక పోవటంతో చేపల వేట లేక సుమారు 200 మత్స్యకార కుటుంబాలు పుట్టీలతో సహా వివిధ ప్రాంతాలకు జీవనం కోసం తరలివెళ్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట, ఆల్మట్టి, మన రాష్ట్రంలోని వైజాగ్, కరీంనగర్, తుంగభద్ర ప్రాంతాలకు తరలివెళ్తున్నట్లు మత్స్యకారులు పేర్కొన్నారు.చేపపిల్లలను వదలలేదు... కృష్ణా జలాశయంలో గత రెండు ఏళ్ళుగా చేపపిల్లలను వదలక పోవటం వాస్తవమే. ప్రపంచ బ్యాంక్ నిధులతో 40 లక్షల చేపపిల్లలను వదలాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక లోపాల వల్ల జరగలేదు. తిరిగి టెండర్లు పిలిచి జలాశయంలో చేపపిల్లలను వదులుతాం. మత్స్యకారుల అభివృద్ధి కోసం పొదుపు పథకాలు, దేశాలమ్మ గుడి వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, జెట్టీల నిర్మాణం, చేపల మార్కెట్ల నిర్మాణం చేపడుతున్నాం. - బల రాం, జిల్లా మత్స్యశాఖ డీడీ