ఆమె అరెస్ట్‌తో... అతలాకుతలం! | China telecoms giant Huawei CFO arrested in Canada | Sakshi
Sakshi News home page

ఆమె అరెస్ట్‌తో... అతలాకుతలం!

Published Fri, Dec 7 2018 3:46 AM | Last Updated on Fri, Dec 7 2018 3:46 AM

China telecoms giant Huawei CFO arrested in Canada - Sakshi

ఒక వ్యక్తి అరెస్ట్‌... ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నింటినీ గురువారం అల్లకల్లోలం చేసి పడేసింది. దీనికి తోడు డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ 71 మార్క్‌కు దిగడంతో మన మార్కెట్‌ కూడా అదే దారిలో ప్రయాణించింది. అన్ని రంగాల షేర్లలో అదేపనిగా అమ్మకాలు జరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడి కొనుగోళ్ల కంటే అమ్మకాలకే అధిక ప్రాధాన్యమివ్వటంతో... బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 572 పాయింట్లు పతనమై 35,312 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 182 పాయింట్లు క్షీణించి 10,601 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 1.59 శాతం, నిఫ్టీ 1.69 శాతం చొప్పున పతనమయ్యాయి. కిందటి వారమంతా లాభపడిన స్టాక్‌ సూచీలు... గడిచిన మూడు రోజులూ వరుసగా నష్టపోయాయి. మెటల్, ఆయిల్, గ్యాస్, ఫార్మా, ఆర్థిక, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ... ఇలా అన్ని రంగాల షేర్లూ నష్టపోయాయి. ఇటీవల నికర కొనుగోలుదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు బుధవారం నికర అమ్మకాలు జరపడం, మన జీడీపీ అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించాయి.

ఇంట్రాడేలో 618 పాయింట్లు నష్టం
స్టాక్‌ మార్కెట్‌పై దెబ్బ మీద దెబ్బ పడుతోందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తునుగుంట్ల చెప్పారు. ఇటీవల కొంత కోలుకున్నట్లు కనిపించిన రూపాయి మళ్లీ పతనమైందన్నారు. ముడి చమురు ఉత్పత్తి కోత దిశగా ఒపెక్‌ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని తెలియజేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే మంగళవారం (ఈ నెల 11న) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లలో ఒకింత ఆదుర్దా నెలకొందని చెప్పారాయన. నష్టాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజులో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రోజంతా నష్టాల్లోనే సాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 618 పాయింట్ల వరకూ నష్టపోగా,  నిఫ్టీ 195 పాయింట్ల వరకూ పతనమైంది.  

మరిన్ని విశేషాలు..
► 31 సెన్సెక్స్‌ షేర్లలో ఒక్క సన్‌ ఫార్మా మాత్రమే లాభపడింది. గత మూడు రోజులుగా నష్టపోతూ వస్తున్న సన్‌ఫార్మా షేర్‌.. సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టపోయినా, గురువారం పెరగడం విశేషం.  
► 50 షేర్ల నిఫ్టీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 47 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  
► ధరలను పెంచనున్నామని ప్రకటించడంతో మారుతీ సుజుకీ షర్‌ 4.6  శాతం పతనమై రూ.7,208 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 5 శాతం నష్టంతో రూ.7,178ను తాకింది. సెన్సెక్స్‌ షేర్లలో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. మారుతీ సుజుకీతో పాటు టాటా మోటార్స్‌  4%, బజాజ్‌ ఆటో 1.5%, హీరో మోటొకార్ప్‌1.2 శాతం చొప్పున పడిపోయాయి.
► లోహ షేర్లు భారీగా నష్టపోయాయి. వేదాంత, సెయిల్, ఎన్‌ఎమ్‌డీసీ, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకగా, టాటా స్టీల్, హిందుస్తాన్‌ జింక్‌ ఏడాది కనిష్ట స్థాయిలకు చేరువయ్యాయి. లోహ షేర్లే కాకుండా పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.
►  రిటైల్‌ రుణాల వడ్డీరేట్లను ఎమ్‌సీఎల్‌ఆర్‌తో కాకుండా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్స్‌తో అనుసంధానించాలన్న ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలోని 12 బ్యాంక్‌ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి.  


2.26 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కె ట్‌ భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 2.28 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,42,15,155 కోట్ల నుంచి రూ.2.26 లక్షల కోట్లు తగ్గి రూ.1,39,88,560 కోట్లకు పడిపోయింది. గత మూడు రోజుల్లో రూ.3.64 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.  

పతనానికి ప్రధాన కారణాలివీ...
► భారీ నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు...
చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ), మెంగ్‌ వాంఝూను కెనడాలో అరెస్టు చేశారు. ఈమె ఈ కంపెనీ వ్యవస్థాపకుడి కుమార్తె. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను హువావే కంపెనీ ఉల్లంఘించిందనేది ఆరోపణ. ఈ ఆరెస్ట్‌ను చైనా తీవ్రంగా నిరసించింది.  ఇప్పటికే వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–చైనా సంబంధాలు ఈ వివాదంతో మరింత క్షీణిస్తాయన్న భయాలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. జపాన్‌ నికాయ్‌ 1.9 శాతం, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 2.4 శాతం, చైనా షాంగై సూచీ 1.6 శాతం, కొరియా కోస్పి సూచీ 1.5 శాతం చొప్పున కుదేలయ్యాయి. ఇక యూరప్‌ స్టాక్‌ మార్కెట్లు 2–3 శాతం రేంజ్‌లో క్షీణించాయి.  అమెరికా డోజోన్స్‌ 700 పాయింట్లు, నాస్‌డాక్‌ 100 పాయింట్ల నష్టాలతో ట్రేడవుతున్నాయి.

► 71 మార్క్‌ దిగువకు రూపాయి...
ముడిచమురు ధరల భారీ పతనం కారణంగా కోలుకున్న రూపాయి ఇటీవల మళ్లీ నష్టాల బాట పట్టింది.  డాలర్‌ బలపడుతుండటం, మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తలెత్తడంతో రూపాయి మళ్లీ 71 మార్క్‌ను దాటింది.  

► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
నవంబర్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ   పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.  

ఒపెక్‌ సమావేశంపై ఆందోళన
ముడి చమురు ధరల పతనాన్ని అడ్డుకోవడానికి ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి కోతకు సిద్ధం అవుతున్నాయి. ఉత్పత్తి కోత కారణంగా మళ్లీ ధరలు పెరుగుతాయని, ఇది మన రూపాయిపై, మన ఆర్థిక స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నది.  

► ఎన్నికల ఫలితాలపై ఆదుర్దా  
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకం. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్, మిజోరమ్‌ ఎన్నికల పలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నది.  

► ఫిచ్‌ నివేదిక ప్రకంపనలు...
అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, ఫిచ్‌ ఈ ఏడాది భారత్‌ జీడీపీ అంచనాలను 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. మరోవైపు వచ్చే ఏడాది చివరికల్లా డాలర్‌తో రూపాయి మారకం 75కు చేరుతుందని కూడా ఫిచ్‌ పేర్కొనడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది.

► గణాంకాల నిరుత్సాహం
ఇటీవల వెలువడ్డ జీడీపీ, పన్ను వసూళ్లు, వాహన విక్రయా లు తదితర గణాంకాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మార్కెట్లో ఉత్తేజకర వాతావరణం కొరవడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement