వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే! | Sakshi Guest Column On US Trade war | Sakshi

వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!

Feb 7 2025 2:08 AM | Updated on Feb 7 2025 2:08 AM

Sakshi Guest Column On US Trade war

విశ్లేషణ

స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాన్ని ప్రపంచంపై బలవంతంగా రుద్దిన అమెరికా, దాన్ని తమకు లాభం కలిగినంత కాలం ఉపయోగించుకుని ఇపుడు లాభం లేదనిపించటంతో ఎదురు తిరుగుతున్నది. ఆ విషయం బయ టకు ఒప్పుకోకుండా అధ్యక్షుడు ట్రంప్‌ సాకులు వెతుకుతున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు పెంచిన ఆయన తన చర్యకు పేర్కొన్న కారణాలను గమనించండి: అక్రమ వలసలు, ఫెంటానిల్‌ అనే మాదక ద్రవ్యం రవాణా. 

అక్రమ వలసలు మెక్సికో నుంచే గాక, ఆ దేశం మీదుగా ఇతర లాటిన్‌ అమెరికన్‌ దేశాల నుంచి, చివరకు ఇండియా వంటి సుదూర దేశాల నుంచి కూడా సాగుతున్న మాట నిజం. వాటి నిరోధానికి మెక్సికో సరిహద్దులలో గోడల నిర్మాణం, వేలాది సైన్యాల మోహరింపు ఇప్పటికే మొదలు పెట్టారు. కెనడా, చైనా నుంచి అక్రమ వలసలు అత్యల్పం. మాదక ద్రవ్యాల తయారీ, రవాణాను ఈ మూడు దేశా లలో ఏదీ అధికారికంగా ప్రోత్సహించటం లేదు.  

స్వేచ్ఛా వాణిజ్యానికి భంగం
అమెరికా, కెనడా, మెక్సికోల మధ్య వాణిజ్యానికి ఒక ప్రత్యేక ఒప్పందం ఉంది. అది ట్రంప్‌ మొదటి హయాం (2017–21)లో జరి గిందే. దానిని ట్రంప్‌ స్వయంగా ఉల్లంఘిస్తున్నారు. అమెరికా పట్టు బట్టి చేయించిన గాట్స్‌ ఒప్పందానికీ, అందుకు రూపాంతరమైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకూ, ఇంకా చెప్పా లంటే అమెరికా పెట్టుబడిదారీ, స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతాలకూ ఈ చర్యలు విరుద్ధమైనవి. 

వాస్తవానికి తదనంతర కాలంలో ఇందుకు అనుగుణంగానే పాశ్చాత్య ప్రపంచంతో సహా అనేక దేశాలు పర స్పరమో, లేక ప్రాంతీయ బృందాలు గానో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. పెట్టుబడులు, వాణిజ్యంలో పరస్పర చర్చల ద్వారా జరిగే ఈ ఒప్పందాలు సాధారణంగా అన్ని పక్షాలకూ ప్రయో జనకరమవుతున్నాయనే భావన ఏర్పడింది కూడా. అటువంటిది, ఈ పరిణామాలన్నింటికీ మాతృదేశమనదగ్గ అమెరికాయే అందుకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతుండటం ఆశ్చర్యకరం. 

అనేక దేశాల వలెనే అమెరికాలోనూ మాదక ద్రవ్యాల విని యోగం పెద్ద ఎత్తున ఉంది. ఈ వినియోగం ఎప్పటినుంచి ఎందువల్ల మొదలై కొనసాగుతున్నదనే విషయం ప్రచారంలోకి రావటం లేదు. వియత్నాం యుద్ధంలో అమెరికా 1960ల నుంచి 1970ల వరకు ఉధృతంగా పాల్గొని భయంకరమైన హత్యాకాండ సాగించి ఆఖరుకు ఓటమిపాలైంది. ఆ కాలమంతా వారి యుద్ధ విమానాల రవాణా నైజీరియా మీదుగా జరిగినపుడు, యుద్ధం వల్ల వ్యథకు గురైన సైనికులు దానిని మరిచిపోయేందుకు స్థానికంగా లభించే మాదక ద్రవ్యా లకు అలవాటుపడ్డారు. 

అది యుద్ధం తర్వాత మాజీలు అయిన సైనికులకు కొనసాగి వారి ద్వారా, ఇతరత్రా వ్యాపించి స్థిరపడింది. ఆ కాలంలో లాటిన్‌ అమెరికా నుంచి డ్రగ్‌ కార్టెల్స్‌ ఎట్లా పని చేశాయన్న చర్చ అప్రస్తుతం. అయితే ఇందుకు సుంకాల హెచ్చింపు ఎట్లా పరిష్కారమవుతుందన్నది ట్రంప్‌ సైతం వివరించని ప్రశ్న. ఆ పని చేయటానికి బదులు, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసరాల చట్టం ఒక దానిని అడ్డు పెట్టుకుని మెక్సికో, కెనడా వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలపై 25 శాతం సుంకాలు పెంచారు.

కృత్రిమ ఆధిపత్యం
అమెరికా వంటి అగ్రస్థాయి సంపన్న దేశానికి ఇటువంటి చర్యల అగత్యం ఎందుకు ఏర్పడింది? తమ వద్ద ఉత్పత్తుల ఖర్చు పెరుగు తున్నందున, వెనుకబడిన దేశాలలో వేతనాలు, ముడిసరుకులు, మౌలిక సదుపాయాల ఖర్చు తక్కువ గనుక, అక్కడ ఉత్పత్తులు చేయించి, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవచ్చుననే వ్యూహంలో దీనికంతా మూలాలు ఉన్నాయి. 

ఇది కొంతకాలం సజా వుగా సాగినా, ఆయా దేశాలు సాంకేతికంగా, పారిశ్రామికంగా బల పడటం, తొలి దశలో అమెరికా నుంచి యూరప్‌ నుంచి తరలి వెళ్లిన ప్రైవేట్‌ కంపెనీలు అక్కడి లాభాలకు అలవాటుపడటంతో ఈ పాశ్చాత్య దేశాలకు పలు సమస్యలు మొదలయ్యాయి. అక్కడి పారి శ్రామికత, ఆదాయాలు, ఉపాధి అవకాశాలు తగ్గసాగాయి. మిగులు బడ్జెట్లు లోటు బడ్జెట్లుగా మారాయి. 

అమెరికా అయితే సుమారు 30 ట్రిలియన్‌ డాలర్ల లోటు, అప్పుల భారానికి చేరి, బంగారం నిల్వల మద్దతు లేకపోయినా డాలర్లను యథేచ్ఛగా ముద్రించి ప్రపంచం పైకి వదలటం, డాలర్‌ ఆధిపత్యాన్ని కృత్రిమంగా నిలబెట్టడం వంటి దశకు చేరుకుంది. మామూలుగానైతే ఆర్థికంగా ఇది దివాళా స్థితి అవుతుంది. కానీ ఆ కృత్రిమతను నిలబెట్టేందుకు, ఒకవేళ బ్రిక్స్‌ కూటమి డాలర్‌ను బలహీనపరిచే చర్యలు తీసుకునే పక్షంలో ఆ కూటమి దేశాలపై 100 శాతం సుంకాలు పెంచగలమంటూ పదేపదే బెదిరించవలసిన బలహీన స్థితిని అమెరికా ఎదుర్కొంటున్నది. 

ఇంతకూ ట్రంప్‌ సుంకాల హెచ్చింపు అమెరికాకు ఎంతవరకు ఉపయోగపడవచ్చునన్నది ప్రశ్న. ఈ తరహా చర్యలు ఆయన తన మొదటి పాలనా కాలంలోనూ తీసుకున్నారు. అపుడు ఆయన వాణిజ్య యుద్ధం కేవలం చైనాపై. అది చైనాకు కొంత నష్టం కలిగించినా అమెరికాకు అంతకన్న ఎక్కువ నష్టం కలిగిందన్నది అమెరికన్‌ ఆర్థిక వేత్తల దాదాపు ఏకాభిప్రాయం. 

అందుకు కారణాలను విశ్లేషించుకోవడానికి బదులు, తన వాణిజ్య యుద్ధాన్ని మిత్ర దేశాల పైకి కూడా విస్తరించటం నమ్మశక్యం కాకుండా ఉంది. రానున్న రోజులలో యూరోపియన్‌ దేశాలపై కూడా సుంకాల పెరుగుదల ఉండగలదని సూచించారు. అమెరికా దిగుమతులలో ఈ మూడు దేశాల ఉత్ప త్తులు కలిపి 40 శాతం ఉంటాయని అంచనా. అమెరికాకు ఎగుమతులు చేసే మొదటి 10 దేశాలలో చైనా తప్ప మిగిలినవన్నీ వారి మిత్ర దేశాలే. 

ఇండియా పదవ స్థానంలో ఉంది. ఇండియా పైనా సుంకాలు పెంచగలమని ట్రంప్‌ ఇప్పటికే అన్నారు. తమ ఆధునిక మోటార్‌ వాహనాలపై ఇండియా సుంకాలు తగ్గించాలని మొదటి పాలనా కాలంలో కోరగా అందుకు అంగీకరించని మోదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త బడ్జెట్‌లో అటువంటి ప్రతిపాదనలు చేయటం గమనించదగ్గది. ఆ చర్య ట్రంప్‌ను మెత్తబరచగలదేమో చూడాలి.

ట్రంప్‌ చర్యకు ప్రతిగా, కెనడా ప్రధాని ట్రూడో కొద్ది గంటల లోనే, అదే 25 శాతం స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షెన్‌బామ్‌ కూడా తాము సుంకాలను పెంచి తీరగలమన్నారు. ఈ రెండు దేశాల నుంచి వివిధ వినియోగ వస్తువులపైనే గాక యంత్ర పరికరాలు, చమురు, విద్యుత్‌ దిగుమతు లపై అమెరికా చాలా ఆధారపడి ఉంది. మరొక వైపు చైనా ఈ సుంకాలు వివక్షాపూరితం అంటూ డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేసింది. 

వాణిజ్య యుద్ధాలను అమెరికా గతంలోనూ చేసింది. కాకపోతే దౌత్యపరమైన లక్ష్యం కోసం ఇతరులను లొంగదీయటానికి. ట్రంప్‌ అట్లాగాక ఈ యుద్ధంతో తమ ఆర్థిక వ్యవస్థకు లాభం చేస్తామంటున్నారు. ఇతరులు లొంగి రావటంవల్ల అమెరికా లాభపడగలదనీ, దానితో ప్రజలపై ఆదాయ పన్ను మొత్తంగా రద్దు చేయవచ్చుననీ ఆశపెడుతున్నారు. 

అమెరికా మార్కెట్లు ఎంత పెద్దవి అయినా ఈ సుంకాల ఒత్తిడితో ఇతరులు కూడా సుంకాలు పెంచటం,  వారి ముడి వస్తువులు అమెరికా పరిశ్రమలకు లభించకపోవటం, ఆయా దేశాలు ఇతర మార్కెట్లను వెదుక్కోవటం వంటివి జరిగితే పరిస్థితి ఏమిటి? ఇవిగాక రెండు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. ఇటువంటి యుద్ధాలతో స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతపు భవిష్యత్తు ఏమిటన్నది ఒకటైతే, ఈ ప్రభావాలు రాజకీయంగా, భౌగోళికంగా ఏ విధంగా ఉండవచ్చు ననేది రెండవది.
 

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement