చైనా, మెక్సికో, కెనడాలపై ఇప్పటికే ట్రంప్ సుంకాల మోత
మనపైనా వేలాడుతున్న టారిఫ్ కత్తి...
కొన్ని రంగాల్లో ఎగుమతులకు అనుకోని వరం...
రూపాయి పతనమే మనకు ఇప్పుడు అతిపెద్ద దెబ్బ...
దిగుమతులు భారమై.. ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం
విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనంతో స్టాక్ మార్కెట్లకూ ప్రతికూలమే..
సాక్షి, బిజినెస్ డెస్క్: ట్రంప్ దూకుడు చూస్తుంటే.. ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్‌ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ–డాలరైజేషన్ చర్యల నుంచి వెనక్కతగ్గకపోతే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్‌లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థిక వేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి.. ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని చెబుతున్నారు. సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆమేరకు రేట్లు పెంచుతారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.
మన ఎగుమతులకు లాభమేనా?
ట్రంప్ టారిప్ వార్‌తో ప్రస్తుతానికి కొన్ని రంగాల్లో ఎగుమతిదారులకు కొంత లాభమేనని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతానికి మనపై సుంకాలు విధించకపోవడంతో చైనా ఉత్పత్తులతో పోలిస్తే మన ఎగుమతులకు పోటీతత్వం పెరుగుతుందని భారతీయ ఎగుమతిదారుల సంఘం (ఫియో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. అయితే, భారత్‌లోకి చైనా సహా పలు దేశాల నుంచి చౌక దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, ఇది మన పరిశ్రమలకు ముప్పుగా మారొచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విషయంలో తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ సూచించారు.
ఆటోమొబైల్: భారత వాహన విడిభాగాల సంస్థలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉంది. పరిశ్రమ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రకారం 2024–25లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఇందులో 3.67 బిలియన్ డాలర్లు, అంటే 28 శాతం అమెరికాకే వెళ్లాయి. తాజాగా ఇతర దేశాలపై టారిఫ్‌ల పెంపుతో యూఎస్‌లో మన వాటా పెంచుకోవడానికి సదవకాశమని కొంతమంది పరిశ్రమవర్గాలు చెబుతున్నారు. ‘ఆహార, వ్యవసాయ రంగాలతో పాటు వాహన విడిభాగాల రంగాలు తక్షణం ప్రయోజనం పొందుతాయి. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి’అని వాణిజ్య విధాన విశ్లేషకుడు ఎస్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
టెక్స్‌టైల్స్: ట్రంప్ తాజా టారిఫ్‌లు భారత టెక్స్‌టైల్ రంగానికి బూస్ట్ ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం (టీఈఏ) అధ్యక్షుడు కె.ఎం. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
ఫార్మా: భారత ఫార్మా రంగం అప్రమత్తతతో పాటు ఆశావహ ధోరణితో వేచిచూస్తోంది. ‘జెనరిక్స్‌లో చైనా చాలా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అమెరికాకు పెద్దగా ఎగుమతి చేయడం లేదు. ప్రధానంగా యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్ (ఏపీఐ), కెమికల్స్ వంటివి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు మనకు వీటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మనం వాటి కోసం చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి’అని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.
స్టీల్: ట్రేడ్ వార్ మరింత ముదిరితే సరఫరా వ్యవస్థల్లో తీవ్ర కుదుపులకు ఆస్కారం ఉంది. వివిధ దేశాల నుంచి భారత్‌కు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, పరిస్థితులను నిశితంగా గమనించి చర్యలు చేపట్టాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. చైనా స్టీల్ ఉత్పత్తి భారీగానే కొనసాగనున్న నేపథ్యంలో యూఎస్ దెబ్బకు ఇతరత్రా అందుబాటులో ఉన్న దేశాలకు ఎగుమతులను మళ్లించవచ్చని ఆర్సెలర్ మిట్టల్ వైస్–ప్రెసిడెంట్ రంజన్ ధార్ తెలిపారు.
ఎలక్ట్రానిక్స్: చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలతో తక్షణం ప్రయోజనం పొందే రంగాల్లో ఇదొకటి. అయితే, తక్షణం దీని ప్రయోజనం పొందేలా పాలసీ రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చర్యలు తీసుకోవాలని భారతీయ సెల్యులర్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. భారత్‌ను ఎగుమతి హబ్‌గా చేసుకుంటున్న యాపిల్‌తో పాటు మోటరోలా వంటి చైనా బ్రాండ్‌లు మన దగ్గరున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్ వంటి తయారీదారుల నుంచి అమెరికాకు ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. యాపిల్, శాంసంగ్ దన్నుతో 2024లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో యాపిల్ వాటా 65 శాతం కాగా (12.8 బిలియన్ డాలర్లు), శాంసంగ్ వాటా 20 శాతంగా (4 బిలియన్ డాలర్లు) ఉంది.
దిగుమతులు, రూపాయి, స్టాక్ మార్కెట్‌కు దెబ్బ...
ట్రేడ్ వార్ 2.0... ప్రపంచ దేశాల కరెన్సీ మార్కెట్లను సైతం కుదిపేస్తోంది. అనేక దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింత బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 110 స్థాయికి చేరింది. దీంతో మన రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. తాజాగా డాలరు మారకంలో 87 కిందికి పడిపోయింది. ఒకపక్క, ఎగుమతిదారులకు కాస్త ఊరట లభించినప్పటికీ.. మన వాణిజ్యం ఇప్పటికీ లోటులోనే ఉన్న నేపథ్యంలో దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెంపు భయాలు పెరిగాయి.
యూఎస్‌లోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇవ్వడంతో డాలర్ జోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన స్టాక్ మార్కెట్ నుండి పొలోమంటూ నిధులను వెనక్కి తీసేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి రివర్స్ గేర్‌లో ఉన్న ఎఫ్‌పీఐలు ట్రంప్ విజయం తర్వాత ఇంకాస్త జోరు పెంచారు. ఈ ఏడాది జనవరిలోనే రూ.87,000 కోట్ల విలువైన షేర్లను భారత్ మార్కెట్లలో విక్రయించడం విశేషం. దీంతో స్టాక్ సూచీలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి 10 శాతం పైగానే కుప్పకూలాయి. వెరసి టారిఫ్ వార్ దేశీ స్టాక్ మార్కెట్లకూ అతిపెద్ద ముప్పుగా మారుతోంది.
భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా...
2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గతేడాది అమెరికాకు భారత ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
అనుకూలం
⇒ ఫార్మా – చైనాపై టారిఫ్‌ల నేపథ్యంలో మన జెనరిక్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి.
⇒ టెలికం పరికరాలు – ఇతర దేశాలతో పోలిస్తే మన ఎగుమతులు జోరందుకుంటాయి.
⇒ ఎలక్ట్రానిక్స్ – దేశీ తయారీ కంపెనీలకు అమెరికా మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది.
⇒ టెక్స్‌టైల్స్ – భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
⇒ ఫుడ్–అగ్రి ప్రోడక్టŠస్ – ఆహార, వ్యవసాయ రంగాలకు తక్షణ ప్రయోజనం.
⇒ ఆటోమొబైల్ విడిభాగాలు – యూఎస్‌లో మన కంపెనీల ఎగుమతుల వాటా పెంచుకోవడానికి సదవకాశం.
⇒ పెట్రోలియం ఉత్పత్తులు – ఎగుమతులు పుంజుకోవడానికి చాన్స్.
⇒ ఐటీ సేవలు – రూపాయి పతనంతో మరింత ఆదాయం సమకూరుతుంది.
ప్రతికూలం
⇒ రూపాయి – డాలర్ భారీగా బలపడటంతో దేశీ కరెన్సీ విలువ మరింత పడిపోవచ్చు.
⇒ స్టాక్ మార్కెట్ – విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో పెట్టబడులు తరలిపోయి.. మార్కెట్ ఇంకా పడిపోవచ్చు.
⇒ ముడిచమురు – దిగుమతులు మరింత భారమై.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి.
⇒ బంగారం – రూపాయి పతనంతో విదేశీ మార్కెట్‌తో పోలిస్తే ధరలు కొండెక్కవచ్చు.
⇒ యంత్రపరికరాలు – దేశీ కంపెనీలు దిగుమతి చేసుకునే పరికరాలు, సామగ్రి ధరలు మరింత పెరుగుతాయి.
⇒ వంటనూనెలు – భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల నూనె ధర మరింత హీటెక్కవచ్చు.
⇒ ఎరువులు – వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతి భారమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment