
నెలవారీ సంపాదనను నిత్యావసర ఖర్చులు, విలాసాలు, ఆన్‌లైన్ షాపింగ్.. వంటి వాటికి వెచ్చిస్తుంటారు. అయితే గ్రామీణ వినియోగదారుల ఖర్చులు పట్టణ వినియోగదారులతో పోలిస్తే కాస్తా భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ పట్టణాల్లో వినియోగదారుల ఖర్చులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఆర్థిక స్తోమత మెరుగ్గా ఉన్న కొందరు మరింత లగ్జరీ వస్తువులు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఖర్చు చేస్తారు. సాధారణంగా పట్టణ వినియోగదారులు ఎలాంటి వాటికి అధికంగా ఖర్చు చేస్తున్నారో నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఫుడ్ అండ్ బేవరేజెస్
నెలవారీ బడ్జెట్‌లో గణనీయమైన భాగం అంటే సుమారు 20-30% ఆహార పదార్థాలకు కేటాయిస్తున్నారు. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు ఇందులో ఉన్నాయి. బ్రాండెడ్, ప్యాకేజ్డ్ ఆహారాలు, తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది.
హౌసింగ్, యుటిలిటీస్
అద్దె లేదా ఇంటి కోసం ఈఎంఐలకు అధికంగా చెల్లింపులు చేస్తున్నారు. గృహ ఖర్చులు బడ్జెట్‌లో 25-35% వరకు ఉంటున్నాయి. సొంతంగా ఇళ్లు ఉన్న పట్టణ వినియోగదారులు తరచుగా తమ ఇంటి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రిన్యువేషన్, అలంకరణలు, స్మార్ట్ హోమ్ గాడ్జెట్ల కోసం వెచ్చిస్తున్నారు.
హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్
గత దశాబ్ద కాలంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి సేవలపై ఖర్చు గణనీయంగా పెరిగింది. ఈ విభాగాల్లో వరుసగా 8.2 శాతం, 7.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. దాంతో వీటికి చేసే ఖర్చు భారీ మొత్తంలో ఉంటుంది. ఆరోగ్య బీమా తీసుకోని వారి పరిస్థితులు దారుణంగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిఒక్కరు తమ కనీస బాధ్యతగా తప్పకుండా ఆరోగ్యబీమా తీసుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వాలు స్పందించి విచ్చలవిడిగా యాజమాన్యాలు వాటిని పెంచకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు.
రవాణా
ప్రజా రవాణా, వ్యక్తిగత వాహనాలు, ఇంధనం, నిర్వహణ.. వంటి ఖర్చులు బడ్జెట్లో 10-15% ఉంటున్నాయి. ఇది వినియోగదారుల వ్యయ సరళితోపాటు ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిని సూచిస్తుంది. చాలా మంది రవాణా కోసం కార్లు, ద్విచక్ర వాహనాలను ఎంచుకుంటున్నారు.
వినోదం
సినిమాలు, కచేరీలు, థీమ్ పార్కులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో ఖర్చు చేస్తున్నారు. ఇది సాధారణంగా బడ్జెట్లో 5-10% వాటాను కలిగి ఉంటుంది. కొవిడ్ సమయంలో ఆన్‌లైన్ గేమింగ్‌ల కోసం పట్టణ వినియోగదారులు అధికంగా ఖర్చు చేశారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు!
పొదుపు విషయంలో చాలా మందికి సాధారణంగా ఖర్చు తర్వాత మిగిలింది జాగ్రత్తగా పొదుపు చేద్దామనే ఆలోచన ఉంటుంది. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే ధోరణి అలవరుచుకుంటే తప్పకుండా దీర్ఘకాలంలో మంచి రాబడిని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఖర్చులు ఎలాగో ఉంటాయి. తర్కంతో ఆలోచించి తక్కువ ఖర్చు చేస్తూ పొదుపునకు పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.