
ప్రముఖ మూవీ మల్టీప్లెక్స్ పీవీఆర్ ఐనాక్స్ గురుగ్రామ్, బెంగళూరు వంటి ఎంపిక చేసిన నగరాల్లో కొత్త సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. సినిమా చేసే సమయంలో ప్రేక్షకులు థియేటర్‌ల్లో మద్యం సేవించడానికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. థియేటర్లలో తగ్గుతున్న ప్రేక్షకులను ఆకర్షించేందుకు, అదే సమయంలో మరింత వ్యాపారాన్ని పెంచుకునేందుకు కంపెనీ ఈమేరకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు కేవలం సినిమాలు చూడటానికి మాత్రమే వేదికలు కాదు. వినోదం, ఆతిథ్యం, రిటైల్, సాంకేతికతను మిళితం చేసి ప్రేక్షకులకు మెరుగైన సర్వీసులు అందించే డైనమిక్ వ్యాపార కేంద్రాలుగా తయారవుతున్నాయి. మల్టీప్లెక్స్‌లో ఎలాంటి వ్యాపారం సాగుతుందో కింద తెలుసుకుందాం.
సినిమాయే కోర్ బిజినెస్
ఏ మల్టీప్లెక్స్‌కైనా సినిమాలను ప్రదర్శించడమే ప్రధాన వ్యాపారం. స్టూడియోల నుంచి పంపిణీ హక్కులను పొందడం, మల్టీ స్క్రీన్లలో షోటైమ్‌లను షెడ్యూల్ చేయడం, ప్రేక్షకులకు టిక్కెట్లను విక్రయించడం ఇందులో భాగంగా ఉంటాయి. మల్టీప్లెక్స్‌లు హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ నుంచి చిన్న, ప్రాంతీయ సినిమాలు వరకు దాదాపు అన్ని రకాల సినిమాలను ప్రదర్శిస్తూ టికెట్ ఫేర్ ద్వారా డబ్బు సంపాదిస్తాయి.
ఫుడ్ సర్వీస్
సినిమా థియేటర్ ఆవరణలో కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్, ఇతర ఆహార పదార్థాలు దర్శనమిస్తాయి. మల్టీప్లెక్స్‌లో వీటి ధర కూడా సాధారణం కంటే అధికంగానే ఉంటాయి. ఈమేరకు ఆయా సంస్థలు లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుంది. స్నాక్స్, పానీయాలు, కాంబో డీల్స్ అమ్మకాలు, పిజ్జా, బర్గర్లు, సుషీ వంటి డైన్ ఇన్ సర్వీసులతో థియేటర్లు కొంత సంపాదిస్తాయి. కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో ఇన్-హౌస్ రెస్టారెంట్లు లేదా ఫుడ్ కోర్టులు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో నేరుగా థియేటర్ యాజమాన్యమే వీటిని నిర్వహిస్తుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో థర్డ్ పార్టీ విక్రేతలకు లీజుకు ఇస్తాయి. దానివల్ల సమకూరే అద్దె లేదా ప్రాఫిట్‌లో భాగస్వామ్యం ద్వారా అదనపు ఆదాయంగా ఉంటుంది.
లగ్జరీ ఏర్పాట్లు
మల్లీప్లెక్స్‌లో ప్రీమియం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లు వీఐపీ ఆడిటోరియంలు, రెక్లైనర్ సీటింగ్ లేదా ప్రైవేట్ స్క్రీనింగ్ గదులు వంటి ప్రీమియం సర్వీసులు అందిస్తున్నాయి. వీటికి ప్రేక్షకులు ప్రత్యేకంగా ధర చెల్లించాల్సి ఉంటుంది.
అడ్వర్టైజింగ్ అండ్ స్పాన్సర్‌షిప్స్
మల్టీప్లెక్స్‌లు ప్రధాన అడ్వర్టైజింగ్ ప్లాట్ ఫామ్‌లు, ప్రీ-షో వాణిజ్య ప్రకటనలు, ఇన్-లాబీ ప్రమోషన్లు, బ్రాండింగ్ పార్ట్‌నర్‌షిప్‌ల కోసం కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. నేషనల్ సినీమీడియా (ఎన్‌సీఎం) లేదా స్క్రీన్‌విజన్ వంటి సంస్థలచే తరచుగా నిర్వహించబడే ప్రీ-మూవీ స్లైడ్లు, వాణిజ్య ప్రకటనలు ఆదాయ వనరుగా ఉంటున్నాయి. థియేటర్లలోని డిజిటల్ సైనేజ్, పోస్టర్లు, ఇంటరాక్టివ్ డిప్‌ప్లేల ద్వారా స్థానిక వ్యాపారాలు లేదా కార్పొరేట్ స్పాన్సర్లను ఆకర్షిస్తుంటారు. కస్టమర్ల బిజినెస్ విస్తరణ కోసం ఇది ఎంతో తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: డాలర్‌కు ట్రంప్ గండం
రిటైల్ అండ్ మర్కండైజింగ్
మల్టీప్లెక్స్‌లు పాపులర్ సినిమాలకు సంబంధించిన దుస్తులు, బొమ్మలు, పోస్టర్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. స్టార్ వార్స్ లేదా మార్వెల్ థీమ్.. వంటి హాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థలు కొన్ని సినిమాలకు చెందిన లిమిటెడ్ ఎడిషన్ వస్తువులను థియేటర్లలో విక్రయిస్తుంటాయి. అందులో నుంచి కూడా మల్టీప్లెక్స్‌కు ఆదాయం వస్తుంది.