Multiplex companies
-
సీన్ రివర్స్.. నష్టాల్లోకి పీవీఆర్ ఐనాక్స్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో లాభాలకు బదులు నష్టాలు చవిచూసింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 12 కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది. సినిమా థియేటర్ల బిజినెస్ నీరసించడం ప్రభావాన్ని చూపించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో కంపెనీ రూ. 166 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 19 శాతం క్షీణించి రూ.1,622 కోట్లకు పరిమితమైంది. మొత్తం వ్యయాలు 7 శాతం తగ్గి రూ. 1,679 కోట్లుగా నమోదయ్యాయి. మూవీ ఎగ్జిబిషన్ ఆదాయం 20 శాతం క్షీణించి రూ. 1,579 కోట్లకు పరిమితమైంది. అయితే మూవీ ప్రొడక్షన్, పంపిణీ బిజినెస్ 78 శాతం పెరిగి రూ. 108 కోట్లను చేరుకుంది. -
ఐపీవోలకు కంపెనీల క్యూ..
ఇటీవల సెకండరీ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహంతో ప్రైమరీ మార్కెట్ సైతం కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో కొత్త ఏడాది (2024)లోనూ పలు కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కట్టనున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పబ్లిక్ ఇష్యూల వెల్లువ కొనసాగనున్నట్లు అంచనా వేశారు. న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది (2023)లో ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 52,000 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ ద్వారా దేశీ కార్పొరేట్లు సమీకరించిన నిధులివి. నిజానికి ఓవైపు వడ్డీ రేట్లు, మరోపక్క భౌగోళిక, రాజకీయ రిసు్కలు పెరిగినప్పటికీ.. ఐపీవోలు దూకుడు చూపుతున్నాయి. పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కోసం వెల్లువలా సెబీ తలుపు తడుతున్నాయి. దీంతో వచ్చే ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ బుల్లిష్ ధోరణిలోనే కొనసాగనున్నట్లు పలువురు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది (2022)లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మినహాయిస్తే పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 20,557 కోట్లు సమీకరించాయి. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పెట్టుబడులు అందుకున్నాయి. ప్రధానంగా మధ్య, చిన్న తరహా కంపెనీలు హవా చూపాయి. మార్కెట్ సెంటిమెంటు బలంగా ఉండటం ఇందుకు దోహదపడుతోంది. అయితే ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఏడాది మొదట్లో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే. కారణాలున్నాయ్.. ప్రైమరీ మార్కెట్లు జోరందుకోవడానికి లిస్టింగ్ లాభాలు, అందుబాటు ధరల్లో డీల్స్ కారణమవుతున్నట్లు పంటోమత్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఎండీ మహావీర్ లూనావత్ పేర్కొన్నారు. ఆయా రంగాల్లోని లిస్టెడ్ కంపెనీలు అధిక విలువల్లో ట్రేడవుతుండటం ఇందుకు జత కలసినట్లు అభిప్రాయపడ్డారు. పటిష్ట నియంత్రణా వ్యవస్థలు సైతం ఇందుకు అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 2023లో కనిపిస్తున్న ప్రోత్సాహకర పరిస్థితులు 2024లోనూ కొనసాగనున్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈసీఎం వి.ప్రశాంత్ రావు అంచనా వేశారు. ఇది బంగారు కాలంగా నిలిచే వీలున్నట్లు పేర్కొన్నారు. తరలివస్తున్న దేశ, విదేశీ పెట్టుబడులు, దేశీ మార్కెట్ల వృద్ధికిగల భారీ అవకాశాల కారణంగా వచ్చే ఏడాదిలోనూ ఐపీవో మార్కెట్ మరింత జోరు చూపనున్నట్లు జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల పూర్తి తదితర అనిశి్చతులు తొలగితే మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని పేర్కొన్నారు. మరో రూ. 26,000 కోట్లు నిధుల సమీకరణకు ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 24 కంపెనీలు అనుమతులు పొందాయి. ఇవి ఐపీవోలు చేపట్టడం ద్వారా రూ. 26,000 కోట్లు సమీకరించేందుకు వీలుంది. ఈ బాటలో మరో 32 కంపెనీలు లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వీటి నిధుల సమీకరణ అంచనా రూ. 35,000 కోట్లుగా ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 2023లో ఐపీవోల ద్వారా 58 కంపెనీలు రూ. 52,637 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో రూ. 3,200 కోట్లు అందుకున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ ఉంది. గతేడాది ఎల్ఐసీ (రూ. 20,557 కోట్లు) సహా.. 40 కంపెనీలు ఉమ్మడిగా రూ. 59,302 కోట్లు సమీకరించాయి. అయితే అంతకుముందు 2021లో 63 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా ఏకంగా రూ. 1.2 లక్షల కోట్లను అందుకున్నాయి. వెరసి రెండు దశాబ్దాలలోనే అత్యధిక నిధుల సమీకరణగా 2021 నిలిచింది! అధిక లిక్విడిటీ, ఇన్వెస్టర్ల ఆసక్తి, మార్కెట్ల జోరు నేపథ్యంలో గత మూడేళ్లలో 150 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. -
అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా ప్రభావం రిటైల్ రంగ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఇప్పటి వరకు భవన యజమాని, దుకాణదారు మధ్య అద్దె చెల్లించేలా ఒప్పందాలు ఉండేవి. రానున్న రోజుల్లో అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలోకి వచ్చి మాల్స్, దుకాణాలు తెరుచుకున్నాక వ్యాపారం తిరిగి గాడిన పడేందుకు కొన్ని నెలల సమయం పట్టనుంది. వ్యాపారాలు అంతంతే నమోదు అవుతాయి కాబట్టి అద్దెలు చెల్లించే స్థాయి విక్రయదారులకు ఉండదని నిపుణులు అంటున్నారు. వ్యాపారాలు లేనందున భవన యజమానులకు మరో మార్గం లేదని, ఆదాయంలో వాటా తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. దుకాణదారులు కోలుకోవడానికి ఈ విధానం చక్కని పరిష్కారం అని వారు అభిప్రాయపడ్డారు. ఆ నిబంధన ప్రకారం.. ఫోర్స్ మెజోర్ నిబంధన ప్రకారం అద్దెలో వెసులుబాటును దుకాణదారులు కోరవచ్చు. మూతపడ్డ కాలానికి అద్దె చెల్లించలేమని చెప్పేందుకూ ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మాల్స్‌లో దాదాపు 60 శాతం మేర స్థలాన్ని ప్రధాన బ్రాండ్ల యాంకర్ స్టోర్లతో నిండిపోయి ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఫోర్స్ మెజోర్ నిబంధనను వినియోగించుకుంటాయి. రిటైలర్ల ఆదాయంలో అద్దె ఖర్చు 12–16 శాతముంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. మాల్ యజమానులు 45 శాతం అద్దె కోల్పోయే చాన్స్ ఉందని చెబుతోంది. ఒకవేళ రెండు నెలలకుపైగా దుకాణాలు మూసివేస్తే దాని ప్రభావంతో 62 శాతం అద్దె కోల్పోయే అవకాశం ఉందని వివరించింది. కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో దుకాణదారుల ఆర్థిక స్థితిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలిపింది. గతంలో రోజుకు ఎంతకాదన్నా దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో రూ.500 కోట్ల వ్యాపారం నమోదయ్యేదని అంచనా. మొదలైన వినతులు.. అద్దెలు తగ్గించాల్సిందిగా రిటైలర్ల నుంచి వినతులు వస్తున్నాయని రియల్ ఎస్టేట్ సంస్థలు, మాల్ యజమానులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రిటైలర్లు ఎదుర్కోబోయే సమస్యలు, సవాళ్లను రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తెలియజేశాయి. అద్దె నుంచి మినహాయించాల్సిందిగా బిగ్‌బజార్, ఈజీడే క్లబ్ ఇప్పటికే భవన యజమానులకు విన్నవించింది. ఇదే బాటలో వీ–మార్ట్ సైతం చేరింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో అద్దె చెల్లించలేమని స్థల యజమానులకు సమాచారం ఇచ్చామని వీ–మార్ట్ సీఎండీ లలిత్ అగర్వాల్ వెల్లడించారు. -
మరిన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు!
- వ్యాపార విస్తరణకు సంస్థల అడుగులు - ప్రాతీయ మార్కెట్‌పై దృష్టి - సంప్రదాయ రూట్లో పీవీఆర్, ఐనాక్స్ - భారీ డీల్స్‌తో పెరుగుతున్న కార్నివాల్ సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో సినిమా ప్రొడక్షన్ వ్యయం తగ్గింది. దీనికి తగ్గట్టే సినిమాల నిర్మాణం పెరిగింది. దీంతో ప్రాంతీయ భాషా చిత్రాల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. వీటన్నిటికీ తోడు ఇపుడు ఏ సినిమా అయినా సాధారణంగా రెండు మూడు భాషల్లో విడుదలవుతోంది. ఇవన్నీ కలిసి సినిమా థియేటర్లకు గిరాకీ పెంచుతున్నాయి. సరిగ్గా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మల్టీప్లెక్స్‌లు భారీ విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నాయి. సినిమాల సంఖ్యకు తగ్గట్టుగా థియేటర్లు పెరగటం లేదని, ఈ లోటును భర్తీ చేయటానికి తాము ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాలపై దృష్టి సారిస్తున్నామని మల్టీప్లెక్స్ సంస్థలు చెబుతున్నాయి. ఇపుడు ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో మాల్స్ కూడా భారీగా వస్తుండటంతో థియేటర్లు ఏర్పాటు చేయటమూ వాటికి పెద్ద కష్టం కావటం లేదు. ప్రాంతీయ మార్కెట్‌పై మల్టీప్లెక్స్‌ల కన్ను భవిష్యత్తు అవకాశాలన్నీ ప్రాంతీయ మార్కెట్లోనే ఉన్నాయని భావిస్తున్న మల్టీప్లెక్స్ సంస్థలు.. తమ దృష్టిని జాతీయ మార్కెట్ నుంచి ప్రాంతీయ మార్కెట్‌పైకి మళ్లిస్తున్నాయి. ‘‘దేశంలో అధిక సంఖ్యలో చిన్న చిన్న పట్టణాలున్నాయి. వీటిల్లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకని మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థలు ఈ పట్టణాలపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది’’ అనేది మల్టీప్లెక్స్ వ్యాపారంలో అత్యధిక వాటా కలిగి ఉన్న పీవీఆర్ గ్రూప్ అభిప్రాయం. ఎక్కువ థియేటర్లున్న ఐనాక్స్, సినీ పోలిస్, కార్నివాల్ సినిమాస్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బావుంటుందన్నది సంస్థ అభిప్రాయం. పెరగనున్న మల్టీప్లెక్స్ స్క్రీన్లు: నిజానికి ఇప్పటిదాకా పీవీఆర్, సినీ పోలిస్లు సంప్రదాయ విస్తరణపైనే (మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్మాణం) ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. అంతే తప్ప వేరే సంస్థను కొనుగోలు చేయటం వంటివేమీ చేయలేదు. పీవీఆర్ గత రెండేళ్ల నుంచీ ఏడాదికి 70-75 స్క్రీన్లను పెంచుకుంటూ వెళుతోంది. ఇపుడు ఈ సంఖ్యను 100కు చేర్చే యోచనతో ఉంది. ‘‘దేశంలో సినిమా ప్రదర్శనలో మార్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సంప్రదాయక విస్తరణ అత్యవసరం. దీనివల్ల కొత్త స్క్రీన్లు వస్తాయి. కార్నివాల్ సంస్థ విస్తరణను స్వాగతిస్తున్నాము. కానీ దీనివల్ల మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. మారింది కేవలం మల్టీప్లెక్స్‌ల ముందు బ్యానర్ మాత్రమే’’ అని పీవీఆర్ గ్రూప్ పేర్కొంది. కార్నివాల్ సంస్థ ఇటీవల రిలయన్స్ మీడియా వర్క్స్‌కు చెందిన ‘బిగ్ సినిమాస్’లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి ఆ సంస్థను చేజిక్కించుకుంది. దీనివల్ల బిగ్ సినిమాస్ థియేటర్లన్నీ ఇకపై కార్నివాల్ సినిమాస్‌గా మారతాయని, అంతేతప్ప కొత్తగా స్క్రీన్లు పెరగటం వంటిది జరగదనేది పీవీఆర్ అభిప్రాయం. మరో అగ్రశ్రేణి సంస్థ సినీపోలిస్ కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్ల సంఖ్యను మరో 60కి పెంచటానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ‘‘దేశంలో మల్టీప్లెక్స్ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశాలున్నాయి. ఫన్ సినిమాతో ఒప్పందం చేసుకునేదాకా మేం ఒంటరిగానే వ్యాపార విస్తరణను చేపట్టాం. ప్రస్తుతం దేశంలో చాలా చైన్ మల్టీప్లెక్స్‌లు మావే. సంప్రదాయక విస్తరణపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. ఉనికి, లాభదాయకతపైనే వ్యాపార వృద్ధి అధారపడి ఉంటుంది’’ అని గ్రూప్ అభిప్రాయపడింది. ఈ ఏడాది కార్నివాల్ కూడా తన స్క్రీన్ల సంఖ్యను 500కు పెంచటానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థలు కొత్త స్క్రీన్లను మొదట కోల్‌కతా, తర్వాత బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీలలో నిర్మించనున్నాయి. మనకు థియేటర్ల సంఖ్య సమస్యేనా? ‘‘సినిమాల సంఖ్య పరంగా చూస్తే మనకు ఎలాంటి సమస్యా లేదు. ఎందుకంటే దేశంలో ఏటా 1000కి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. సంవత్సరానికి 4 బిలియన్ల టికెట్లను విక్రయిస్తున్నాం. మనకు ఉన్న సమస్యల్లా వాటి ప్రదర్శనకు తగినన్ని థియేటర్లు లేకపోవటమే’’ అనేది ఐనాక్స్ గ్రూప్ మాట. 10 లక్షల జనాభాకు మనం 9 స్క్రీన్లను (2 మల్టీప్లెక్స్‌లు) మాత్రమే కలిగి ఉంటే చైనా 25 స్క్రీన్లను కలిగి ఉందని సంస్థ వెల్లడించింది. మన దేశంలోని మొత్తం మల్టీప్లెక్స్ స్క్రీన్లు 2,050 మాత్రమే.