
ఈసారి ఉగాది, రంజాన్ పండగలు వెంటవెంటనే వచ్చాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సినిమాలు పోటాపోటీగా రిలీజవుతున్నాయి. ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్, (Mad Square) రాబిన్‌హుడ్ (Robinhood), ఎల్2: ఎంపురాన్ (L2:Empuraan), వీర ధీర శూరన్ (Veera Dheera Sooran: Part 2) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడిక భారీ బడ్జెట్ సినిమా విడుదలకు సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, బాక్సాఫీస్ క్వీన్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం సికందర్ (Sikandar Movie). ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది.
లక్షన్నర ఖర్చు పెట్టి మరీ..
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సల్మాన్ (Salman Khan) వీరాభిమాని, రాజస్థాన్ వాసి కుల్దీప్ కస్వాన్ ఏకంగా 800 టికెట్లు కొనుగోలు చేశాడు. అది కూడా ఐకానిక్ గైటీ గెలాక్సీ థియేటర్‌లో! ఈ టికెట్ల కోసం అతడు ఏకంగా లక్షన్నర ఖర్చు చేశాడు. దీని గురించి కుల్దీప్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ కోసం నేనెప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఆయన పుట్టినరోజు నాడు నిరుపేదలకు అన్నదానం చేస్తాను.
అభిమానం కాదు పిచ్చి!
ఇప్పుడాయన సినిమా వస్తోంది కాబట్టి టికెట్లు పంచాలనుకున్నాను. అందుకోసం 800 టికెట్లు కొనుగోలు చేశాను. ఇందుకుగానూ రూ.1.72 లక్షలు ఖర్చు పెట్టాను. వీటిని అందరికీ పంచేస్తాను అన్నాడు. అన్నట్లుగానే ఆ 800 టికెట్లను ఉచితంగా ఇచ్చేశాడు. ఇది చూసిన జనాలు.. దీన్ని అభిమానం అనరు, పిచ్చి అంటారు అని కామెంట్లు చేస్తున్నారు.
సినిమా
సికందర్ సినిమా విషయానికి వస్తే.. ఈ యాక్షన్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నదియావాలా నిర్మించాడు. కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బాబర్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రీతమ్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ బీజీఎమ్ అందించాడు.