
ప్రభాస్ తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న చిత్రం ఆదిపురుష్ (Adipurush Movie). ఈ సినిమాలో ప్రభాస్ లుక్ నుంచి వానరాలను చూపించిన విధానం వరకు ప్రతిదానిపైనా ట్రోలింగ్ జరిగింది. వీఎఫ్‌ఎక్స్ బాలేవని, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)కు ముందు ఐదు తలలు, దానిపైన ఐదు తలలు పెట్టడమేంటన్న కామెంట్లు వినిపించాయి. మొత్తంగా ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతోపాటు ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయింది.
సినిమా చూపించా.. రియాక్షనే లేదు
మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను తన కుమారుడిని కూర్చోబెట్టి చూపించానంటున్నాడు ఆదిపురుష్ రావణ్ అలియాస్ సైఫ్ అలీ ఖాన్. తాజా నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌లో సైఫ్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ఉంటాను. అవి చూసి నా 9 ఏళ్ల కుమారుడు తైమూర్.. నువ్వసలు మంచివాడివా? చెడ్డవాడివా? అని అడుగుతుంటాడు. ఈ మధ్యే వాడికి ఆదిపురుష్ చూయించాను. వాడి నుంచి నాకు ఎటువంటి ఆహ్లాదకరమైన స్పందన రాలేదు. కాసేపటికి నన్నో చూపు చూశాడు. నాకు తన ఫీలింగ్ అర్థమై సారీ చెప్పా.. ఇట్స్ ఓకేలే అని నన్ను క్షమించేశాడు అని చెప్పుకొచ్చాడు.
పర్సనల్ లైఫ్
సైఫ్ అలీ ఖాన్.. నటి అమృత సింగ్‌ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు సారా, కుమారుడు ఇబ్రహీమ్ సంతానం. దశాబ్దానికి పైగా అన్యోన్యంగా ఉన్న దంపతులు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్ కరీనా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఐదేళ్లపాటు జంటగా కలిసున్న వీరు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2016లో తైమూర్, 2021లో జెహ్ జన్మించారు. సైఫ్.. దేవర: పార్ట్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
చదవండి: 'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్