
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన యూరిన్ తాగి ఓ గాయం నుంచి త్వరగా కోలుకున్నట్లు తెలిపాడు. 'లాలంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేశ్ రావల్ మాట్లాడుతూ.. ఓసారి నేను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాను. అప్పుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) తండ్రి వీరు దేవ్‌గణ్ (Veeru Devgan) నన్ను చూసేందుకు వచ్చాడు.
దానివల్లే కోలుకున్నా..
త్వరగా కోలుకునేందుకు ఓ సలహా ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నా యూరిన్ తాగమని చెప్పాడు. అలాగే మందు, మాంసం, సిగరెట్ తాగడం వంటి అలవాట్లు మానేయమన్నాడు. ఆయన సలహాను పాటించాలనుకున్నాను. పదిహేను రోజులపాటు నా యూరిన్‌ను బీర్‌లా తాగాను. ఆ తర్వాత డాక్టర్ ఎక్స్‌రే తీసి చూసినప్పుడు షాకయ్యాడు. ఇంత త్వరగా గాయం ఎలా నయమవుతోంది అని ఆశ్చర్యపోయాడు. రెండున్నర నెలల తర్వాత డిశ్చార్జ్ అవ్వాల్సిన నేను వీరు దేవ్‌గణ్ చెప్పిన సలహా వల్ల నెలన్నరకే డిశ్చార్జ్ అయ్యాను. ఆయన సలహా నాకొక మ్యాజిక్‌లా పని చేసింది అని చెప్పుకొచ్చాడు.
సినిమా
పరేశ్ రావల్.. క్షణక్షణం, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్‌దాదా ఎంబీబీఎస్, తీన్మార్, ఆకాశమే హద్దుగా వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. హిందీలో సర్, వో చోక్రీ, మోహ్రా, రాజా, బందిష్, హీరో నెం.1, చాచీ 420, హీరా ఫెరి, ఆంఖెన్, యే తెరా ఘర్ యే మేరా ఘర్, హంగామా, హల్‌చల్, ఫిర్ హీరా ఫేరి, కూలీ నెం.1 ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా 'ద స్టోరీటెల్లర్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో కిట్టీ, భూత్ బంగ్లా, థామా, హీరా ఫేరి 3తో కలుపుకుని ఏడెనిమిది సినిమాలున్నాయి.
గమనిక: ఇది కేవలం నటుడి అభిప్రాయం/ అనుభవం మాత్రమే. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.