సినిమాలు కాపీ కొట్టడం బాలీవుడ్‌కు వెన్నతో పెట్టిన విద్య: నటుడు | Paresh Rawal Says Bollywood Copied Hollywood films | Sakshi
Sakshi News home page

Paresh Rawal: అన్నీ మిక్స్‌ చేసేవారు.. చాలావరకు కాపీ కొట్టిన సినిమాలే!

Published Wed, Feb 26 2025 8:07 PM | Last Updated on Wed, Feb 26 2025 8:10 PM

Paresh Rawal Says Bollywood Copied Hollywood films

ఒకచోట సినిమా హిట్టయిందంటే దాన్ని వెంటనే మరో భాషలోకి తర్జుమా చేస్తారు. లేదంటే రీమేక్‌ చేస్తారు. ఇవేవీ కాదని కొందరు సులువుగా కాపీ కొడుతుంటారు. 1980-90 ప్రాంతంలో బాలీవుడ్‌ ఇదే పని చేసేదన్న విమర్శలున్నాయి. ప్రాంతీయ చిత్రాలతో పాటు హాలీవుడ్‌ నుంచి కొన్ని కథలను తస్కరించేదన్న ఆరోపణలున్నాయి. నటుడు పరేశ్‌ రావల్‌ (Paresh Rawal) సైతం ఇదే నిజమంటున్నాడు.

కాపీ కొట్టేవారు
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్‌ (Bollywood) కాపీ కొట్టడం మొదట్లో నేనూ చూశాను. దర్శకుడి దగ్గరకు వెళ్లి సినిమా తీయాలనుందని చెప్పారనుకో.. మీకో దుమ్ముపట్టిన క్యాసెట్‌ ఇస్తాడు. నువ్వు ఈ సినిమా చూడు.. నేను ఇంకోటి చూస్తాను. రెండూ మిక్స్‌ చేద్దాం అంటాడు. కానీ ఒకానొక దశలో ఏం జరిగేదంటే హాలీవుడ్‌ స్టూడియోలు ఇండియాలోకి ప్రవేశించాయి. హాలీవుడ్‌ చిత్రాలను కాపీ కొట్టాలంటే వారికి డబ్బు చెల్లించాలి. చివరకు సినిమా ఆడకపోతే నష్టాల్లో కూరుకుపోవాలి. ఇదంతా ఎందుకని దర్శకులు సొంతంగా కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. లేకపోతే ఇంకా వారి కథల్ని దొంగిలిస్తూనే ఉండేవాళ్లం. 

ఇడియట్స్‌కు అప్పుడర్థమైంది!
ఎంతైనా మనం మంచి దొంగలం కదా! మనకు ఫారిన్‌వే నచ్చుతాయి. హాలీవుడ్‌ (Hollywood).. వారి కార్యాలయాలను ప్రారంభించి మంచి పనే చేసింది. దానివల్లే మనవాళ్లు వెనక్కు తగ్గారు. వీరి కథల్ని తీసుకున్నందుకుగానూ ఎక్కువ మొత్తం వారికే ఇస్తే మనకేం మిగులుతుందని ఆలోచించారు. సొంతంగా కథలు సృష్టించి విజయాలు అందుకున్నాడు. అప్పుడే ఈ తెలివితక్కువవాళ్లకు మన కథల్లోని శక్తి తెలిసొచ్చింది. మన కథలు ఎంత కొత్తగా, బలంగా, నాటకీయంగా ఉంటాయో అర్థం చేసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. 

సినిమా
ఇకపోతే ఆమిర్‌ దిల్‌ హై మాంత నహీ సినిమా హాలీవుడ్‌ క్లాసిక్‌ ఇట్‌ హాపెండ్‌ వన్‌ నైట్‌ నుంచే పుట్టిందే! సెవన్‌ బ్రైడ్స్‌ ఫర్‌ సెవన్‌ బ్రదర్స్‌ అనే ఇంగ్లీష్‌ సినిమా నుంచే అమితాబ్‌ సత్తే పే సత్తా రూపొందించింది. ఇలా హాలీవుడ్‌ రీమేక్స్‌ హిందీలో చాలానే ఉన్నాయి. బాలీవుడ్‌లో బోలెడన్ని సినిమాలు చేసిన పరేశ్‌ రావల్‌ తెలుగులోనూ అనేక చిత్రాల్లో మెరిశాడు. క్షణ క్షణం, మనీ, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌, తీన్మార్‌ వంటి చిత్రాలతో మెప్పించాడు.

చదవండి: సొంతిల్లు ఖాళీ చేయనున్న హీరో.. కుటుంబంతో అద్దె ఇంట్లోకి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement