కూతురికి పాలు పట్టిద్దామంటే రూ.5 కూడా చేతిలో లేవు: నటుడు | Adi Irani: Did Not Have Rs 5 to Buy Milk for Daughter After Movie Success | Sakshi
Sakshi News home page

Adi Irani: సినిమా సక్సెస్‌.. రూ.5 కూడా చేతిలో లేవు.. అవకాశాల కోసం ప్రతిరోజు..

Published Mon, Mar 17 2025 4:39 PM | Last Updated on Mon, Mar 17 2025 4:55 PM

Adi Irani: Did Not Have Rs 5 to Buy Milk for Daughter After Movie Success

సినిమా సక్సెస్‌ అయిందంటే ఆర్టిస్టుల పంట పండినట్లే అంటుంటారు. కానీ తన విషయంలో మాత్రం ఇది తలకిందులైంటున్నాడు బాలీవుడ్‌ నటుడు ఆది ఇరానీ (Adi Irani). తను నటించిన సినిమాలు సక్సెస్‌ అయినప్పటికీ కష్టాలు మాత్రం కొనసాగాయని చెప్తున్నాడు. ఈయన 1990వ దశకంలో అనేక సినిమాలు చేశాడు. షారూఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan), సల్మాన్‌ ఖాన్‌లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. 

ఇబ్బందులు ఏకరువు పెట్టిన నటుడు
సహాయ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆది తాజాగా తన ఇబ్బందులను బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1993లో వచ్చిన బాజీగర్‌ సినిమా (Baazigar Movie) షారూఖ్‌ను స్టార్‌గా మార్చింది. కానీ నాకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. 1995లో నాకు కూతురు పుట్టింది. ఆ సమయంలో పాల ధర రూ.5గా ఉండేది. కూతురికి పాలు కొనడానికి నా దగ్గర కనీసం రూ.5 కూడా ఉండేవి కాదు. 

బాజీగర్‌ సినిమా స్టిల్‌

పెట్రోల్‌కు డబ్బుల్లేకపోతే..
ప్రతిరోజు నగరానికి వెళ్లి ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగేవాడిని. అవకాశాల కోసం అడుక్కునేవాడిని. నా స్నేహితుడి స్కూటర్‌ తీసుకుని వెళ్లేవాడిని. కొన్నిసార్లు అందులో పెట్రోల్‌ కొట్టించడానికి కూడా నా దగ్గర డబ్బు ఉండేదికాదు. అప్పుడు బస్సుల్లో తిరిగేవాడిని. జనాలేమో.. నువ్వేంటి, బస్‌స్టాప్‌లో ఉన్నావని ఆశ్చర్యపోతూ అడిగేవారు. ఫ్రెండ్‌ వస్తానన్నాడు, అందుకే వెయిట్‌ చేస్తున్నా అని అబద్ధాలు చెప్పేవాడిని. 

అక్క సాయం వద్దన్నాను
బస్సుల్లో తిరుగుతుంటే నీకు బస్‌ ఎక్కాల్సిన అవసరం ఏంటనేవారు. వారి మాటలు భరించలేక ఒక్కోసారి ఇంటికి తిరిగి వెళ్లిపోయేవాడిని. మా అక్కకు నా విషయం తెలిసి ఎన్నోసార్లు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ నేను ఒప్పుకోలేదు. తమ్ముడినైనంతమాత్రాన జీవితాంతం నన్ను పోషించాలని లేదు కదా.. పైగా తనకంటూ ఓ కుటుంబం ఉంది. అప్పటికే ఆ ఫ్యామిలీని చూసుకుంటోంది. 

నా బాధలేవో నేను పడ్డా..
మళ్లీ నా కుటుంబాన్ని కూడా తనే చూసుకోవడం కరెక్ట్‌ కాదుకదా.. అందుకే నా బాధలేవో నేను పడ్డాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆది ఇరానీ అక్క అరుణ ఇరానీ అప్పటికే ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఆది ఇరానీ.. దిల్‌, బాజీగర్‌, బాద్‌షా, హమ్‌ ఆప్కే దిల్‌ మే రెహతా హై, వెల్‌కమ్‌ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 2022లో వచ్చిన ఎ థర్స్‌డే చిత్రంలో చివరిసారిగా నటించాడు.

చదవండి: నువ్వు దొరకడం నా అదృష్టం.. ఈ ఏడాదైనా జరగాల్సిందే!: రవి కృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement