
చిన్నప్పటి నుంచి టీవీల్లో డ్యాన్స్ షోలు చూస్తూ డాన్సర్ కావాలనుకునేవాడు రోహిత్ సరాఫ్. వెండితెరపై కుమారుడిని చూడాలని కలలు కనేవాడు అతడి తండ్రి. అయితే తన కల నెరవేరే భాగ్యాన్ని చూడలేదు. రోహిత్ పన్నెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ‘నాన్న ఆత్మకు శాంతి చేకూరాలంటే నేను నటుడిని కావాల్సిందే’ అని బలంగా డిసైడైపోయాడు రోహిత్.
టీవీ షోల నుంచి..
ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన సరాఫ్ ఒక టీవీ చానల్ యూత్ షోకు హాజరయ్యాడు. కెమెరా ముందుకు రావడం కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించింది. ‘బాగా కష్టపడితేగానీ ఇక్కడ నెగ్గుకు రాలేం’ అనుకున్నాడు. మొదటి సంవత్సరం రెండు టీవీ షోలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత యాడ్స్‌లో, ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అయితే... తొలి సినిమా షూట్ చేసిన రెండున్నరేళ్ల తరువాత అది ఆగిపోయిందని తెలుసుకున్నాడు. బాగా నిరాశకు గురయ్యాడు.
ఆర్థిక ఇబ్బందులు..
ఆడిషన్స్‌కు కూడా వెళ్లేవాడు కాదు. దీంతో ఎవరి నుంచి పిలుపు వచ్చేది కాదు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఆ చీకటి రోజులలో ‘ఇలా అయితే ఎలా?’ అని తనకు తానే ప్రశ్న వేసుకున్నాడు. మళ్లీ కష్టపడాలని గట్టిగా అనుకున్నాడు. ‘ప్రతిరోజూ కొండంత ధైర్యంతో, కోటి కలలతో నిద్ర లేవాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.
డియర్ జిందగీ, హిచ్కీ, ది స్కై ఈజ్ పింక్‌లాంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ‘యస్...నాకు భవిష్యత్తు ఉంది’ అనే ఆశాకిరణం ఉజ్వలంగా మెరిసింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘మిస్‌మ్యాచ్‌డ్’ తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రస్తుతం మణిరత్నం– కమల్‌హాసన్ సినిమాలో, ధర్మ ప్రొడక్షన్‌లాంటి పెద్ద సంస్థ సినిమాలో నటిస్తున్నాడు. ‘కలలు అనేవి పిరికి వాళ్ల కోసం కాదు. ధైర్యంగా ఉండే వ్యక్తుల కోసమే’ అంటున్న 28 సంవత్సరాల రోహిత్ సరాఫ్ ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’ జాబితాలో చోటు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment