
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తనకు గాయం చేసి కనీసం పట్టించుకోలేదంటున్నాడు నటుడు ఆది ఇరానీ (Adi Irani). గాయంతో అల్లాడిపోతుంటే తననలా గాలికి వదిలేసి వెళ్లిపోయాడని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆది ఇరానీ.. చోరీ చోరీ చుప్‌కే చుప్‌కే సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నాడు.
గాజు ముక్కలు గుచ్చుకుని..
ఆది మాట్లాడుతూ.. చోరీ చోరీ చుప్‌కే చుప్‌కే సినిమా షూటింగ్‌లో ఈ సంఘటన జరిగింది. సల్మాన్ నా వైపు గ్లాస్ ఫ్రేమ్ విసిరాడు. అది పగిలి నా ముఖం రక్తసిక్తమైంది. చిన్నచిన్న గాజు ముక్కలు నా ముఖానికి గుచ్చుకున్నాయి. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నా వల్ల కాదని చేతులెత్తేస్తే కనీసం రెండు నెలలైనా షూటింగ్ ఆగిపోవాల్సిందే! దానివల్ల నిర్మాతలు నష్టపోతారు. వారిని కష్టపెట్టడం ఇష్టం లేక కంటిన్యూ చేశాను.
కనీసం సారీ చెప్పలేదు
అయితే నాకు గాయమవగానే సల్మాన్ తనకు సంబంధం లేదన్నట్లుగా అక్కడి నుంచి ఉలుకూ పలుకు లేకుండా వెళ్లిపోయాడు. నా ముఖంపై రక్తం కారుతుంటే కనీసం సారీ కూడా చెప్పకుండా నన్నలాగే వదిలేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. కానీ తర్వాతి రోజు నేను షూటింగ్‌కు వచ్చినప్పుడు అతడి గదిలోకి పిలిచాడు. ఏంటని వెళ్లగా.. సారీ చెప్పాడు. ఆది, నన్ను క్షమించు.. నీ కళ్లలోకి కూడా చూడలేకపోయాను. అలా చేసినందుకు నా మనసంతా అదోలా ఉంది అంటూ మాట్లాడుతూ పోయాడు. సల్మాన్‌ది అహంకారమని నేననుకోను, అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని పేర్కొన్నాడు.
ఆది సినీ జర్నీ..
సల్మాన్ ఖాన్, రాణీ ముఖర్జీ, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చోరీ చోరీ చుప్‌కే చుప్‌కే. అబ్బాస్ ముస్తాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2001లో విడుదలైంది. ఆది విషయానికి వస్తే.. 1978లో వచ్చిన తృష్ణ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. దిల్, బాజీగర్, అనారి నెం.1, ఎ వెడ్నస్‌డే, వెల్‌కమ్ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు. కసౌటీ జిందగీ కే, సావిత్రి - ఏక్ ప్రేమ్ కహాని, ష్.. ఫిర్ కోయ్ హై, నాగిన్ వంటి సీరియల్స్‌లోనూ నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment