
దక్షిణాది చిత్రాలను మనం ఆదరిస్తాం కానీ.. మన సినిమాలను సౌత్‌లో ఆదరించరు అంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan). సౌత్ హీరోల అభిమానులు హిందీ సినిమాలు చూసేందుకు థియేటర్‌కు రారు అని చెప్తున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన సికందర్ సినిమా ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. దక్షిణాదిలో కథలు కాపీ కొట్టరు. సొంత ఐడియాతో స్క్రిప్టు రాసుకుని సినిమా తీస్తారు.
సౌత్‌లో ప్రతి సినిమా అద్భుతమేమీ కాదు
అలా అని అక్కడ తెరకెక్కిన ప్రతి సినిమా అద్భుతం అని కాదు. సౌత్‌లో వారానికి రెండుమూడు సినిమాలు రిలీజవుతాయి. అవన్నీ సక్సెస్ అందుకోవు. అక్కడైనా ఇక్కడైనా మంచి సినిమా మాత్రమే హిట్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. ఇదే నియమం సౌత్‌కూ వరిస్తుంది. అలాగే సౌత్ సినిమాలను నార్త్‌లో ఎంతగానో ఆదరిస్తాం. కానీ వాళ్లు మాత్రం హిందీ చిత్రాలను పెద్దగా పట్టించుకోరు.

మన సినిమాలు చూడరు
నన్ను చూసి భాయ్ అని గుర్తుపడతారు, మాట్లాడతారు.. థియేటర్‌కు వెళ్లి నా సినిమాలు మాత్రం చూడరు. సౌత్ సినిమాలను నార్త్‌లో ఆదరించినంతగా.. బాలీవుడ్ చిత్రాలను దక్షిణాదిలో ఆదరించరు. రజనీకాంత్, సూర్య, చిరంజీవి, రామ్‌చరణ్ వంటి స్టార్ సినిమాలు రిలీజవుతున్నాయంటే మనమంతా వెళ్లి చూస్తాం.. కానీ వారి అభిమానులు మాత్రం ఆ హీరోలకే కట్టుబడి ఉంటారు. మన సినిమాల్ని చూడరు అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.
సికందర్ రిలీజ్
సికందర్ సినిమా విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ మార్చి 30న విడుదలైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, షరీబ్ హష్మి కీలక పాత్రలు పోషించారు.