Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt Amaravati Capital Event1
వేదనలో రాజ్యం... వేడుకలో రాజధాని!

‘‘ఠండా మతలబ్‌ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్‌ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్‌ టాక్‌. పది పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్ఠాన్నే లెక్కేసుకుందాం. దానికి పదింతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్‌ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు ఇరవై రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు, కమీషన్లు తీసేసినా మినిమమ్‌ నూటా యాభై శాతం లాభాలు కంపెనీ గల్లా పెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్‌ బిల్డింగ్, మార్కెటింగ్‌ టెక్నిక్‌ వంటి పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు.ఈ ధోరణి రాజకీయాల్లోకి, ప్రభుత్వ పాలనలోకి కూడా దిగుమతయింది. ఇందులో ఉద్దండులైన ఇద్దరు అగ్ర నాయ కులు నిన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో అమరావతి బ్రాండ్‌ షూటింగ్‌ను పునఃపునఃప్రారంభించారు. ప్రధాని సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరితేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్రవేసి అమ్మగల నేర్పరులు వారు. లేకపోతే, ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్‌ హక్కులున్నాయని ఎలా ప్రకటించు కోగలరు?ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి దీటైనవారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా! మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మీద, సెల్‌ఫోన్‌ల మీదా తనకే పేటెంట్‌ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్‌ వ్యాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు. ఈ షో జరగడానికి ముందునుంచే అమరావతి ప్రమోషన్‌ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచబ్యాంకూ, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారు. ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపించాయి.ఇందులో చాలా పనులకు ఏడేళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికీ, ప్రస్తుతానికీ పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్‌ టవర్ల అంచనాయే నూరు శాతం పెరిగింది. 2018లో సెక్రటేరియట్‌ నాలుగు టవర్లూ, సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడది 4,688 కోట్లకు ఎగబాకింది. ఏడేళ్లలో నూరు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని మార్కెట్‌ సమాచారం. అమరావతి బ్రాండ్‌ బాజా మిరు మిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాల కుల ఉద్దేశం కావచ్చు.అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానం ఎలా ఉన్నదో మచ్చుకు ఒక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్‌లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్‌ పాలనలో పలికిన సగటు ధర 24 వేల రూపాయలైతే, ఇప్పుడు 6,500. పత్తికి నాడు 10,500 పలికితే నేటి సగటు ధర 4,900. కందులు నాడు 11 వేలు, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీపండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి... ఇలా ఏ వ్యవసాయిక ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి. ఒకే రకమైన రాజధాని పనులకు ఏడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము నూరు శాతం ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట! జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47 వేల కోట్లు కావాలట! మరో 44 వేల ఎకరాలు సమీకరించాలట! అప్పుడు గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాదట! పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో! గిట్టుబాటు ధర లేకపోవడం ఒక్కటే కాదు. రైతు కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు. అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు. పంటల బీమా లేదు. దేవుడి మీదే భారం. ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరువు సాయం బకాయీల ఊసెత్తితే ఒట్టు. ఆర్‌బీకేలు అలంకార ప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప, సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పో యింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహా చలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు.అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చయినా అందులోంచే పెట్టాలి. ఏ అప్పయినా అందులోంచే చెల్లించాలి. లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్ర బాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతే తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానా లేవీ ఇంతవరకు రాలేదు.ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను ‘త్యాగం’ చేసిన 28 వేల మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లయినా దక్కుతాయని చెబు తున్నారు. కానీ, అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎం.ఎస్‌. ఎం.ఈ. రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకిచ్చిన సమా ధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవ్వాలి? ఎంత విధ్వంసం జరగాలి? ‘‘మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు’’ అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో?శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనే వారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునా దులపై తలెత్తుతున్న సందేహాలు ఇవి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం. రాష్ట్రంలోని మహిళలకు ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబి లోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయట పడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమరచి చెప్ప లేకపోయిన మాట కూడా వాస్తవం.రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరా వతిలో ‘పునరపి జననం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు. గౌరవించాలి కూడా! అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి నంగి మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు. బిల్లు మంజూరు చేసే అధి కారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్‌ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత మూడుసార్లు ‘వందేమాతరం’ అనిపించడం చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగు దేశం పార్టీలో ఈ ఆచారం లేదు.ఆరేళ్ల క్రింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలామందికి ఇంకా గుర్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యకరంగా నిన్నటి సభలో ‘‘టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ’’ అని పొగిడేశారు. ఈ భజన కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశం ఏమిటో గాని ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి–నీళ్లు తెచ్చిన ప్రధాని, ఈసారి పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే ఒక చాక్లెట్‌ తీసుకువచ్చారు.ఏదో వ్యూహం ప్రకారమే లోకేశ్‌తో ఈ సభలో మాట్లాడించి నట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేశ్‌ ‘నమో నమః’ అంటూ మూడుసార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగి నట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట ‘నమో గారు, నమో గారు’ అంటూనే మాట్లాడారు. ‘‘వంద పాకిస్తాన్లు దండెత్తి వచ్చినా నమో మిస్సైల్‌ ముందు బలాదూర్‌’’ అన్నారు. ప్రధాన మంత్రిని లోకేశ్‌ పొగుడుతున్నంతసేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేశ్‌ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు. ఇటువంటి సైడ్‌ లైట్స్‌ తప్ప ఈ సభ గురించి చెప్పు కోవడానికి ఇంకో విశేషం లేదు. అమరావతికి బ్రాండ్‌ వ్యాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్‌గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరా వతి స్థానం సంపాదించుకుంటుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

YS Jagan Serious Comments On CM Chandrababu2
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025

Modi meets Angolan President Lourenco3
ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు

న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికన్‌ యూనియన్‌ ప్రగతిశీల భాగస్వామ్యపక్షాలు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. గ్లోబల్‌ సౌత్‌కు ఇరుపక్షాలు మూలస్తంభాలని చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంప్రదాయ వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక సహకారం వంటి రంగాల్లో భారత్‌–అంగోలా మధ్య అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను, వారి మద్దతుదారులను శిక్షించడం తథ్యమని స్పష్టంచేశారు. ఉగ్రవాదులపై దృఢమైన, నిర్ణయాత్మక చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాల్లో ఇండియా శక్తిసామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, వజ్రాల ప్రాసెసింగ్, ఎరువులు, ఖనిజాల విషయంలో అంగోలాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అంగోలా అధ్యక్షుడు లోరెన్సోకు రాష్ట్రపతి భవన్‌ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి లారెన్సో ఘనంగా నివాళులర్పించారు. భారత్‌–అంగోలా మధ్య దౌత్య సంబంధాలు 1985లో ప్రారంభమయ్యాయి. ఆఫ్రియన్‌ యూనియన్‌కు ఈ ఏడాది అంగోలా దేశమే నేతృత్వం వహిస్తోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం లోరె న్సో గురువారం భారత్‌కు చేరుకున్నారు. అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు రూ.1,691 కోట్ల రుణం అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇందుకోసం 200 మిలియన్‌ డాలర్లు(రూ.1,691 కోట్లు) రుణంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు లోరెన్సో పర్యటన భారత్‌–అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను నిర్దేశిస్తుందని, భారత్‌–ఆఫ్రికా నడుమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

Plenty of water even in summer with construction of check dams4
కరువు ఎరుగని 'కృషీవలురు'!

కొడిమ్యాల మండలం పూడూరు వాగుపై 7 చెక్‌ డ్యాంలు ఉన్నాయి. వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకుని రైతులు ఈ నీటితో పంటలు సాగు చేసేవారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోవటంతో ఆరెపల్లి, అప్పారావుపేట, పూడూరు గ్రామ రైతులు చందాలు వేసుకొని దాదాపు రూ. లక్ష జమచేసి 40 పైపులు కొనుగోలు చేసి, కొండాపూర్‌ మైసమ్మ చెరువు మత్తడి నుంచి సాగు నీటిని తరలించారు. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతోపాటు పూడూరు వాగుపై ఉన్న ఏడు చెక్‌ డ్యాంలు నిండి పొంగిపోర్లుతున్నాయి. ఈ నీటితో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: వేసవికాలం వచ్చిందంటే చాలాచోట్ల ఎండిన పంటలు.. పశువుల మేతకు వదిలేసిన పొలాల చిత్రాలే కన్పిస్తాయి. ఎండిపోయిన వాగులు.. ఒట్టిపోయిన బావులు సర్వసాధారణం.. కానీ, కొన్నిచోట్ల ప్రభుత్వం వాగులు, వంకలపై నిర్మించిన చిన్నచిన్న చెక్‌డ్యాంలు అన్నదాతల తలరాతలను మార్చేశాయి. మండు వేసవిలోనూ నిండైన జలకళతో పచ్చని పంటలకు ప్రాణం పోస్తున్నాయి. మరికొన్నిచోట్ల అన్నదాతలు సరికొత్త ఆలోచనలతో సొంతంగానే నీటిని ఒడిసిపట్టి మండు వేసవిలో బంగారు పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కన్నీటి జీవితాలను ప‘న్నీటి’గా మార్చుకున్న పలువురు రైతుల విజయగాథలివీ... ఐదేళ్లుగా కరువు ఎరగని వీణవంక పల్లె కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం.. ఆ ప్రాంతంలో కరువును దూరం చేసింది. ఒకప్పుడు తాగు, సాగు నీటికి అల్లాడిన అక్కడి ప్రజలు.. చెక్‌డ్యాం వల్ల గత ఐదేళ్లుగా నిశ్చింతగా బతుకుతున్నారు. మండల కేంద్రానికి అర కిలోమీటర్‌ దూరంలోనే ఉన్న వాగులో వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసేందుకు 2018లో రూ.1.54 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంతో చెక్‌డ్యాంను నిర్మించారు. ఈ చెక్‌డ్యాం వీణవంకతోపాటు, బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, రామక్రిష్ణాపూర్‌ గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తోంది. సుమారు 220 ఎకరాల భూమి దీని కింద సాగవుతోంది. సొంత భూమిలో చెరువు తవ్వించి.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపల్‌ విలీన గ్రామం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన పుట్ట బాబు తన పంట పొలంలో 2 ఎకరాల విస్తీరణంలో 15 ఏళ్ల క్రితమే చెరువును తవ్వించి నీటి సంరక్షణ చేపట్టారు. వర్షం నీటితో పాటు ఆరు బోరు బావులతో చెరువును నింపుతున్నాడు. ఈ చెరువు ద్వారా 12 ఎకరాల్లో వర్షాకాలం, యాసంగీ సీజన్లలో వరి పంట సాగుచేస్తున్నాడు. చెరువు గట్టు చుట్టూ కొబ్బరి, మామిడి, సీతాఫలంచెట్లు పెంచి అదనపు ఆదాయం పొందుతున్నాడు. వట్టిపోని వట్టివాగు.. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని కాట్రపల్లి, వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి, పెనుగొండ గ్రామాల మీదుగా వెళ్లే వట్టివాగు ఇప్పుడు మండు వేసవిలోనూ నిండుకుండలా కనిపిస్తోంది. ఇటీవల యాసంగి పంటల కోసం కొంత ఆలస్యంగా ఎస్సారెస్పీ జలాలను వట్టి వాగులోకి మళ్లించటంతో వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి గ్రామాల పరిధిలో వాగుపై నిర్మించిన చెక్‌ డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. 9 చెక్‌డ్యాంలతో నీటి సమస్య దూరం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఊక చెట్టు వాగులో గతంలో నీరు ఉండక భూగర్భ జలాలు అడగంటేవి. గత ప్రభుత్వం ఈ వాగుపై 9 చెక్‌డ్యాంలు నిర్మించటంతో నీటి నిల్వ పెరిగి, చుట్టుపక్కల భూగర్భ జలాల పైపైకి వచ్చాయి. దీంతో సాగు, తాగు నీటి సమస్య దూరమైంది. సమీపంలోని బండ్రపల్లి, పల్లమరి, లాల్‌ కోట, నెల్లికొండి, పెద్ద వడ్డేమాన్, చిన్న వడ్డేమాన్, ఏదిలాపురం, చిన్న చింతకుంట, మద్దూరు, అల్లిపురం, కురుమూర్తి, అమ్మాపురం, గూడూరు, అప్పంపల్లి, ముచ్చింతల తదితర గ్రామాలలో 7,000 ఎకరాలలో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. వర్షపు నీటిని గుంతల్లో నిల్వ.. నల్లగొండ జిల్లా చండూరులో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి తన భూమిలోనే కందకాలు తవ్వించాడు. ఆరేళ్ల క్రితం తనకున్న దాదాపు 100 ఎకరాలలో పలు చోట్ల కందకాలు తవ్వించాడు. గొల్లగూడకు వెళ్లే దారిలో గల 50 ఎకరాలలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో వర్షపు నీటి గుంతలను తవ్వారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నా ఈ గుంతల్లో నీరు పుష్కలంగా ఉండటం గమనార్హం. ఈ నీటివల్ల భూగర్భ జలాలు పెరిగి పంటకు నీటి కరువు తీరింది. వాననీటిని ఒడిసి పట్టి.. మెదక్‌ జిల్లా రత్నాపూర్‌ గ్రామానికి చెందిన నింబాద్రిరావు అనే రైతు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు సరికొత్త ఆలోచన చేశారు. తన ఏడు ఎకరాల భూమి చుట్టూ స్ట్రెంచ్‌ కొట్టించి, వర్షాకాలంలో పడిన వర్షం నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశాడు. దీనికి రాళ్లు, సిమెంట్‌ లైనింగ్‌ చేసి నీటిని నిలువ చేస్తున్నాడు. ఈ నీటి ద్వారా ఎండా కాలంలోనూ పంటలకు నీరందేలా ఏర్పాటు చేసుకున్నాడు. డ్రిప్‌ ద్వారా మామిడి పంటకు నీళ్లు పారిస్తున్నాడు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూమిని ఇప్పుడు బంగారు పంటలు పండే సారవంతమైన భూమిగా తీర్చి దిద్దుకుని ఆదర్శంగా నిలుస్తున్నాడు. జహీరాబాద్‌ ప్రాంతంలో జలకళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో గతంలో చేపట్టిన వాటర్‌షెడ్‌ పనులు ఇప్పుడు రైతులకు జల సిరులు పారిస్తున్నాయి. ప్రముఖ ఇంజనీర్‌ హన్మంత్‌రావు ఇక్కడ చతుర్విద జల ప్రక్రియను ఆవిష్కరించారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో 2001లో వాటర్‌షెడ్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు 30 వేల ఎకరాలకు నీటి కొరత తీరింది. ఏడాది పొడువునా మూడు పంటలు పండుతున్నాయి.

India decides to completely ban imports from Pakistan5
దిగుమతులు బంద్‌

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: పహల్గాం దుస్సాహసానికి ము ష్కరులను ప్రేరేపించిన దాయాదికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పాకిస్తాన్‌ నుంచి దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ భారత్‌ శనివారం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులకూ ఇది వర్తిస్తుంది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాక్‌లో ఉత్పత్తయ్యే, ఆ దేశం గుండా ఎగుమతయ్యే అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తుల ప్రత్య క్ష, పరోక్ష దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేగాక పాక్‌ నౌకలకు భారత్‌లోకి అనుమతి నిషేధించింది. ఆ దేశానికి సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. దీని ప్రభావం కూడా పాక్‌పై తీవ్రంగా ఉండనుంది. ఇక పాక్‌కు అన్నిరకాల పార్సిల్, పోస్టల్‌ సేవలను కూడా సంపూర్ణంగా నిలిపేశారు. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పాక్‌కు మన గగనతలాన్ని ఇ ప్పటికే మూసేయడం తెలిసిందే. అంతేగాక సింధూ జల ఒప్పందం నిలిపివేత, పాక్‌ పౌరులకు వీసాల రద్దు వంటి పలు కఠిన చర్యలు కూడా కేంద్రం ఇప్పటికే తీసుకుంది. దివాలా ముంగిట ఉన్న పాక్‌కు ఆర్థికంగా ప్రాణాధారం వంటి 700 కోట్ల ఐఎంఎఫ్‌ రుణాన్ని అడ్డుకునే ప్రయత్నాలకు కూడా పదును పెట్టింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌ను గ్రే లిస్టులో చేర్చి రుణాలు, ఆర్థిక సాయాలు పూర్తిగా నిలిపేయాలని అంతర్జాతీయ సంస్థలకు శుక్రవారం విజ్ఞప్తి చేయడం తెలిసిందే. తద్వారా దాయాది ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీనిపై పాక్‌ శనివారం గగ్గోలు పెట్టింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఐఎంఎఫ్‌ రుణానికి భారత్‌ మోకాలడ్డుతోందంటూ ఆక్రోశించింది. దిగుమతులు అంతంతే పాక్‌ నుంచి దిగుమతుల నిషేధం ప్రభావం మనపై ఏమీ ఉండదు. పుల్వామా దాడుల నేపథ్యంలో 2019 నుంచే ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలను భారత్‌ దాదాపుగా తగ్గించుకుంది. గతేడాది దాయాది నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ కేవలం 4.2 లక్షల డాలర్లు! ప్రధానంగా సేంద్రియ లవణంతో పాటు ఫార్మా ఉత్పత్తులు, పళ్ల వంటివి వీటిలో ఉన్నాయి. అదే సమయంలో పాక్‌కు మన ఎగుమతుల విలువ ఏకంగా 44.8 కోట్ల డాలర్లుగా ఉంది. పాక్‌ ఉత్పత్తులపై భారత్‌ ఇప్పటికే 200 శాతం విధిస్తోంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌కు అన్ని ఎగుమతులనూ భారత్‌ ఇప్పటికే నిలిపేయడం తెలిసిందే. తొమ్మిదో రోజూ కాల్పులు సరిహద్దుల వెంబడి పాక్‌ దుశ్చర్యలు వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం శనివారం కూడా కాల్పులకు తెగబడింది. వాటికి దీటుగా బదులిచి్చనట్టు సైన్యం ప్రకటించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. కశీ్మర్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. శనివారం శ్రీనగర్‌లో ఐదుచోట్ల ముమ్మర తనిఖీలు కొనసాగాయి. రెచ్చగొట్టేలా పాక్‌ క్షిపణి పరీక్షలుఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్‌ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్‌ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్‌ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ‘సింధూ’ నిర్మాణాలను పేల్చేస్తాం పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ప్రేలాపనలు ఇస్లామాబాద్‌: సింధూ నదీ వ్యవస్థపై భారత్‌ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పేల్చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ప్రేలాపనలకు దిగారు. వాటిని తమపై దురాక్రమణ చర్యగానే పరిగణిస్తామన్నారు. ‘‘నదీ జలాలను ఆపేస్తే మేం ఆకలిదప్పులతో అలమటిస్తాం. అందుకే అలాంటి పరిస్థితి రానివ్వబోం’’అని చెప్పుకొచ్చారు. సింధూ ఒప్పందం నిలిపివేతపై అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు.

Labor Party wins landslide victory in Australia6
ఆ్రస్టేలియాలో లేబర్‌ పార్టీ ఘన విజయం

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియా ఫెడరల్‌ ఎన్నికల్లో అధికార లేబర్‌ పార్టీ మరోసారి విజయం దక్కించుకుంది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ చరిత్ర సృష్టించారు. ఆ్రస్టేలియాలో గత 21 ఏళ్లలో వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధానిగా ఆయన రికార్డుకెక్కారు. అల్బనీస్‌ మరో మూడేళ్లపాటు ప్రధానిగా కొనసాగబోతున్నారు. ఆ్రస్టేలియా పార్లమెంట్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో మొత్తం 150 సీట్లు ఉండగా, శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్బనీస్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ కడపటి వార్తలు అందేసరికి 83 సీట్లు గెలుచుకుంది. స్పష్టమైన మెజార్టీ సాధించింది. ప్రతిపక్ష లిబరల్‌ నేషనల్‌ పార్టీ 14 స్థానాలకే పరిమితమైంది. లిబరల్‌ పార్టీ 13, నేషనల్‌ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. కాటర్‌ పార్టీకి ఒక స్థానం, సెంట్రల్‌ అలయెన్స్‌కు ఒక స్థానం దక్కింది. మరికొన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతిపక్ష లిబరల్‌ నేషనల్‌ పార్టీ అగ్రనేత పీటర్‌ క్రెయిగ్‌ డటన్‌ తమ ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ప్రచారంలో తాము సరిగ్గా పని చేయలేకపోయామని అన్నారు. ఓటమికి బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని చెప్పారు. ప్రధాని అల్బనీస్‌కు ఫోన్‌చేసి, అభినందనలు తెలియజేశానని పేర్కొన్నారు. లేబర్‌ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని, దాన్ని తాము గుర్తిస్తున్నామని వెల్లడించారు. బ్రిస్బేన్‌ నియోజకవర్గంలో పీటర్‌ క్రెయిగ్‌ డటన్‌ ఓడిపోవడం గమనార్హం. ఇక్కడ ఆయనపై లేబర్‌ పార్టీ అభ్యర్థి అలీ ఫ్రాన్స్‌ విజయం సాధించారు. ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం, అధిక ధరలు, ఇంధనం విధానం, ఇళ్ల కొరత, వడ్డీ రేట్లలో పెరుగుదల వంటి అంశాలే ప్రతిపాదికగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తాను ప్రధానమంత్రి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దారిలో నడవనున్నట్లు పీటర్‌ క్రెయిగ్‌ డటన్‌ సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఖర్చులకు కళ్లెం వేస్తానని, ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తానని ప్రకటించారు. ఆయన విధానాల పట్ల ప్రజలు విముఖత చూపినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఆంథోనీ అల్బనీస్‌ మరోసారి నెగ్గే అవకాశం ఉందని ముందే అంచనాలు వెలువడ్డాయి. ఆంథోనీ నార్మన్‌ అల్బనీస్‌ 1963 మార్చి 2న ఆ్రస్టేలియాలోని సిడ్నీలో జన్మించారు. 1996లో తొలిసారిగా ఎంపీగా గెలిచారు. 2019 నుంచి లేబర్‌ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. 2019 నుంచి 2022 దాకా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2022లో ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో మూడేళ్లు పదవిలో కొనసాగబోతున్నారు. ‘‘ఆ్రస్టేలియా విలువలకు ప్రజలు మరోసారి పట్టంకట్టారు. వాటికి అనుగుణంగానే నూతన ప్రభుత్వ పాలన సాగుతుంది. అంతేతప్ప ఎవరినీ అనుసరించబోం. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ వీలైనంత త్వరలో అమలు చేసి చూపిస్తా’’ – విజయోత్సవ ప్రసంగంలో అల్బనీస్‌ మోదీ అభినందనలు అల్బనీస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్‌–ఆ్రస్టేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానంటూ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అల్బనీస్‌ నాయకత్వ సామర్థ్యం పట్ల ఆస్ట్రేలియా ప్రజల తిరుగులేని విశ్వాసానికి ఈ విజయమే తార్కాణమని పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యాన్ని భారత్‌–ఆ్రస్టేలియా బలంగా కోరుకుంటున్నాయని మోదీ స్పష్టంచేశారు.

Even the community kitchen will be closed in two weeks in Gaza7
గాజాలో ఆకలి కేకలు

గాజా: ఇజ్రాయెల్‌ ఆర్మీ రెండు నెలలుగా కొనసాగిస్తున్న దిగ్బంధం గాజాలోని పాలస్తీనియన్లను ఆకలి చావుల ప్రమాదపుటంచుకు చేర్చింది. ఆహారం, నీరు, మందులు, ఇంధనం వంటి అత్యవసరాలను సైతం సైన్యం అడ్డుకోవడంతో సరఫరాల తో వస్తున్న ట్రక్కులు వందలాదిగా సరి హద్దుల్లోనే నిలిచిపోయాయి. తమ వద్ద ఉన్న సరుకుల నిల్వలు మరో రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని గాజా ప్రజలకు ఆహారం అందిస్తున్న సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ లోగా ఇజ్రాయెల్‌ నిర్ణయం మా ర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అలాకాని పరిస్థితుల్లో ఇప్పటికే అర్ధాకలితో అలమటిస్తు న్న లక్షలాది మంది పాలస్తీనియన్లకు ఆకలి చావు లు తప్పవని హెచ్చరిస్తున్నాయి. తమ వద్ద ఉన్న నిత్యావసర సరుకుల నిల్వలు పూర్తిగా అడుగంటాయని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం(యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) తెలిపింది. మానవతా సాయం, పౌరుల ప్రాణాల విషయంలో బేరమాడటం సరైన విధానం కాదని ఐరాస మానవతా విభాగం చీఫ్‌ టామ్‌ ఫ్లెచర్‌ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా ఐదేళ్లలోపు వయస్సున్న 3.35 లక్షల మంది చిన్నారులు మరణం అంచున ఉన్నారని యునిసెఫ్‌ ఇప్పటికే హెచ్చరించింది. ఇది యుద్ధ నేరమేనని, ఇంతటితో ఆపాలని అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిడులు వస్తున్నటికీ ఇజ్రాయెల్‌ లక్ష్యపెట్టడం లేదు. బందీలందరినీ హమాస్‌ విడిచిపెట్టేదాకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్‌ బలగాలు గాజా నుంచి పూర్తిగా వైదొలిగేదాకా వెనక్కి తగ్గేది లేదని హమాస్‌ సైతం భీష్మించుకుంది. మటన్‌ బదులు కొషారి అమెరికన్‌ నియర్‌ ఈస్ట్‌ రెఫ్యూజీ ఎయిడ్‌(అనెరా) గాజాలో రెండు సామాజిక వంటశాలలను నడుపుతోంది. ఖాన్‌యూనిస్‌లో ని కమ్యూనిటీ కిచెన్‌ రోజుకు 6 వేల మందికి సరిపడా ఆహారం వండుతోంది. ప్రస్తు తం ఆకుకూరలు, బియ్యం, టమాటా సాస్‌లతో కూడిన కొషారి అనే వంటకాన్ని వండి వడ్డిస్తున్నామని నిర్వాహకుడు సమీ మ తార్‌ చెప్పారు. ఆహార నాణ్యతను పరీక్షించాకే పార్శిల్‌ చేస్తామని, ఒక్కో పార్శిల్‌లోని ఆహారం నలుగురికి సరిపోతుందని వివరించారు.మిగిలిన ఆహారాన్ని శరణార్థి శిబిరాలున్న అల్‌ మవాసీకి తరలించి, డజన్ల సంఖ్యలో ఉన్న సూపర్‌ వైజర్ల సాయంతో పంపిణీ చేస్తున్నామన్నారు. ‘గతంలో వారానికి వంద చొప్పున ట్రక్కుల్లో ఆహారం, మందులు ఇక్కడికి చేరేవి. ఈ ఏడాది ఆరంభంలో కాల్పుల విరమణ సమయంలో వచి్చన ఆహార పదార్థాలు, నిత్యావసరాలను నిల్వ ఉంచాం. దిగ్బంధనం కారణంగా ఆ నిల్వలు కరిగిపోయాయి. సరఫరా నిలిచిపో వడంతో స్థానిక దుకాణాలు మూతబడ్డాయి. దీంతో, ఎలాంటి ఆదాయ వనరు లు లేని వారు మేమందించే ఆహారంపైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరి కోసం గతంలో అన్నం, మాంసం వండే వాళ్లం. మాంసం దుకాణాలు మూతబడ్డాయి. బియ్యం, ఆకు కూరలు, పాస్టా, వంటనూనె, ఉప్పు వంటివి సైతం దొరక డం కనాకష్టంగా మారింది. గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో వంట కోసం 700 కిలోల కట్టెలు కొంటున్నాం. వంట చెరుకు ధర సైతం పెరిగిపోయింది. సరుకుల కొరత కారణంగా వచ్చే రెండు వారాల్లోపే ప్రజలకు ఏకైక ప్రాణాధారమైన ఇక్కడి కిచెన్లన్నీ మూతబడే ప్రమాదముంది’అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతమున్న సరుకులు కూడా ఖర్చయిపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియడం లేదని మతార్‌ నిర్వేదంతో అ న్నారు. మానవతా సాయం నిల్వలను హమాస్‌ శ్రే ణులు దోచుకుంటున్నాయంటూ ఇజ్రాయెల్‌ చేస్తున్న ఆరోపణలను మతార్‌ కొట్టిపారేశారు. ఇక్కడ ప్రతిదీ పారదర్శకంగా క్రమపద్ధతిలో జరుగుతోందని, బ యటి వ్యక్తుల ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. చిన్నారి ఆకలి చావు గాజా సిటీలోని రంటిసి హాస్పిటల్‌లో శనివారం జనన్‌ సలెహ్‌ అల్‌–సకఫీ అనే చిన్నారి కన్నుమూసింది. పోషహాకాహార లోపం, డీహైడ్రేషన్‌ ఆమె ఉసురు తీశాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదంతా ఇజ్రాయెల్‌ చేసిన పాపమేనని కుటుంబసభ్యులు దుమ్మె త్తి పోశారు. 63 రోజులుగా సాగుతున్న ఇజ్రా యెల్‌ దిగ్బంధనం ఫలితంగా కనీసం 57 మంది పాలస్తీనా బాలలు ఆకలి చావులకు గురయ్యారని గాజా ప్రభుత్వం తెలిపింది. రఫా సహా అన్ని సరిహద్దులను తెరిచి, గాజాలోని 24 లక్షల మంది పాలస్తీనవాసులకు మానవీయ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.

CRPF sacks jawan for concealing his marriage with Pak woman8
పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీడలు ఎక్కడున్నా పసిగట్టే పనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక భారత జవాన్ దొరికేశాడు. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని, ఆ విషయాన్ని తెలియకుండా గుట్టుగా ఉంచాడు. ప్రత్యేకంగా ద సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డాడు.ఇప్పుడు విషయం బయటపడటంతో సదరు జవాన్ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. సీఆర్పీఎఫ్ 41 బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్.. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని దాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ధృవీకరించింది. దేశ భద్రతకు సంబంధించి నియమావళిని అహ్మద్ అతిక్రమించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇలా చేయడం దేశ భద్రతకు అత్యంత హానికరం కావడంతోనే జవాన్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాల్సినట్లు సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.పాక్‌ పంజాబ్‌కు చెందిన మినాల్‌ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్‌లైన్‌లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేం‍ద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పూర్తి కథనం కోసం కింద ఆర్టికల్‌ను క్లిక్‌ చేయండిభారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా

Virat Kohli Creates World Record, Becomes First Batter To Achieve Huge Milestone9
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

ఐపీఎల్‌-2025లో టీమిండియా స్టార్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో మ‌రో హాఫ్ సెంచ‌రీని కోహ్లి త‌న ఖాతాలో వేసుకున్నాడు. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంత‌సేపు కింగ్ కోహ్లి బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 62 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో కోహ్లి ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్‌లో ఒక జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లి రికార్డుల‌కెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 1146 ప‌రుగ‌లు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గ‌జం డేవిడ్ వార్న‌ర్ పేరిట ఉండేది. వార్న‌ర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్న‌ర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా సీఎస్‌కేపై అత్య‌ధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన ప్లేయ‌ర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 10 సార్లు ఏభైకి పైగా ప‌రుగులు సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉండేది. ధావ‌న్ సీఎస్‌కేపై 9 సార్లు ఫిప్టీ ప్ల‌స్ ప‌రుగులు న‌మోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్‌(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్‌లో ఒకే వేదిక‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్న‌స్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్‌లో 8500 ప‌రుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయ‌ర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.చ‌ద‌వండి: #Kagiso Rabada: కగిసో ర‌బాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం?

Police Crack Bheemili Dakamarri Married Woman Case10
భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు

సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్‌ హిల్స్‌ వుడా లేఅవుట్‌లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్‌, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్‌ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్‌కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement