
ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌తో పోటీ పడి పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను నిర్వహిస్తున్న పాక్ క్రికెట్ బోర్డుకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్ప అని గప్పాలు కొట్టుకునే పీసీబీ, ఈ సారి పీఎస్‌ఎల్‌కు వస్తున్న ఆదరణ చూసి విస్తుపోతుంది.
ఐపీఎల్‌తో సమాంతరంగా జరుగుతుండటంతో పీఎస్‌ఎల్ మ్యాచ్‌లు చూసేందుకు జనాలు రావడం లేదు. స్వదేశంలోనే పీఎస్‌ఎల్‌కు ఆదరణ తక్కువ కావడం చూసి పీసీబీ అధికారులు అవాక్కవుతున్నారు. ఐపీఎల్‌తో పోటీ పడి తప్పు చేశామని లీగ్ ప్రారంభంలోనే వారు తెలుసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం హసన్ అలీ చెప్పినట్లు.. మంచి క్రికెట్ ఆడుతున్నా పాక్ అభిమానులు పీఎస్‌ఎల్‌ను పట్టించుకోవడం లేదు. లీగ్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) హోరాహోరీ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్.. ఛేదనలో జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకాలు బాదారు.
ఈ మ్యాచ్‌కు ముందు నిన్న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ 80 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆతర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ 136 పరుగులకే కుప్పకూలింది. గ్లాడియేటర్స్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఆమిర్ పెషావర్ పతనాన్ని శాశించారు.
ఇలా, ఒకే రోజు రెండు రసవత్తర మ్యాచ్‌లు జరిగినా పాక్ అభిమానులు పీఎస్‌ఎల్‌వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ రెండు మ్యాచ్‌లు జరిగిన స్టేడియాలు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. రాత్రి జరిగిన ముల్తాన్, కరాచీ మ్యాచ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉండింది.
కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు పట్టుమని 10 వేల మంది కూడా రాలేదు. పాక్ మీడియా ప్రకారం.. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం కంటే స్టేడియంలో సెక్యూరిటి గార్డులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు 5000 మంది స్టేడియానికి రాగా.. అక్కడ సెక్యూరిటి సిబ్బంది 6700 మంది ఉన్నారట. ఈ లెక్కలు చూస్తే చాలు పీఎస్‌ఎల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పవచ్చు.
ఇలాంటి లీగ్ ఐపీఎల్‌కు పోటీ అని పాక్ క్రికెట్ బోర్డు గొప్పలు చెప్పుకోవడం చూసి క్రికెట్ అభిమానులు నవ్విపోతున్నారు. పీఎస్‌ఎల్‌కు ఐపీఎల్‌తో పోలికే లేదని అంటున్నారు. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్ జరిగితే వేలు, కొన్ని సార్లు లక్షల సంఖ్యలో జనాలు వస్తారు. టీవీల్లో, ఇతర మాధ్యమాల్లో మ్యాచ్‌లు వీక్షించే వారి సంఖ్య లెక్కలేనంతగా ఉంటుంది. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఐపీఎల్‌ను అత్యధిక సంఖ్యలో వీక్షిస్తారు.
విదేశాల్లో వారి సొంత దేశ ఆటగాళ్ల కంటే భారత ఆటగాళ్లకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. 2008 నుంచి ప్రతి సీజన్‌లో విజయవంతమైన ఐపీఎల్‌ను చూసి ఓర్వలేని పాక్.. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌తో సమాంతరంగా పీఎస్‌ఎల్‌ను నిర్వహించి చేతులు కాల్చుకుంది.