PSL 2025
-
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన పాక్ వికెట్ కీపర్
పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆ దేశ జాతీయ జట్టు వికెట్‌కీపర్ సాహిబ్జాదా ఫర్హాన్ విధ్వంసకర శతకంతో విరుచకుపడ్డాడు. పెషావర్ జల్మీతో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో అతను 49 బంతుల్లోనే శతకొట్టాడు. ఓవరాల్‌గా 52 బంతులు ఎదుర్కొన్న ఫర్హాన్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫర్హాన్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో కొలిన్ మున్రో (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), సల్మాన్ అఘా (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆండ్రియస్ గౌస్ 0, ఆజమ్ ఖాన్ 16, జేసన్ హోల్డర్ 20 నాటౌట్, డ్వార్షుయిస్ 18 నాటౌట్ పరుగులు చేశారు. పెషావర్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, తలాత్ తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్.. ఇస్లామాబాద్ బౌలర్లు ఇమాద్ వసీం (4-0-26-3), షాదాబ్ ఖాన్ (4-0-29-2), డ్వార్షుయిస్ (2.2-0-23-2), నసీం షా (3-0-14-1), జేసన్ హోల్డర్ (2-0-20-1), షాన్ మసూద్ (3-0-25-1) కలిసికట్టుగా రాణించడంతో 18.2 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (47 బంతుల్లో 87; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. హరీస్‌తో పాటు పెషావర్ జట్టులో మిచెల్ ఓవెన్ (10), తలాత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుఫర్హాన్.. పాక్ దేశవాలీ క్రికెట్లో పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఏడాది అతను పాక్ నేషనల్ టీ20 కప్‌లో 72 బంతుల్లో 14 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాక్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్‌గా రికార్దైంది. ఓవరాల్‌గా చూసినా టీ20ల్లో ఇది మూడో అత్యధిక స్కోర్. టీ20ల్లో తొలి రెండు అత్యధిక స్కోర్లు క్రిస్ గేల్ (175 నాటౌట్), ఆరోన్ ఫించ్ (172) పేరిట ఉన్నాయి. ఫర్హాన్.. హ్యామిల్టన్ మసకద్జ (162 నాటౌట్), హజ్రతుల్లా జజాయ్‌తో కలిసి (162 నాటౌట్) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. పీఎస్ఎల్ 2025లో భాగంగా పెషావర్‌పై ఫర్హాన్ చేసిన చేసిన 49 బంతుల సెంచరీ ఈ సీజన్లో మొదటిది. ఇస్లామాబాద్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2019 సీజన్లో సౌతాఫ్రికా ఆటగాడు కెమరూన్ డెల్పోర్డ్ కూడా ఇస్లామాబాద్‌కు ఆడుతూ లాహోర్ ఖలందర్స్‌పై 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. -
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేద క్రికెట్ బోర్డు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అయితే వారి ఆథ్వర్యంలో నడిచే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చిన ఆటగాళ్లకు కనీస బహుమతులు కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో అయితే లేదు. పీఎస్ఎల్-2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టుకు (కరాచీ కింగ్స్) చిరస్మరణీయ విజయాన్ని అందించిన ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ విన్స్‌కు లీగ్ నిర్వహకులు మరీ అధ్వానంగా హెయిర్ డ్రైయర్‌ను బహుమతిగా ఇచ్చి అవమానించారు. హెయిర్ డ్రైయర్‌ను తీసుకునేందుకు విన్స్ చాలా మొహమాటపడ్డాడు. గల్లీ క్రికెట్లో కూడా వేల సంఖ్యలో విలువ చేసే వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తుంటే.. అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొనే పీఎస్ఎల్లో వెయ్యిలోపు విలువ చేసే హెయిర్ డ్రైయర్లను బహుమతిగా ఇవ్వడం బాధాకరమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. హెయిర్ డ్రైయర్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ పీఎస్ఎల్ నిర్వహకులు పబ్లిసిటీ కోసం పాకులాడటం మరీ వింతగా అనిపించింది.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్పై కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. మొహమ్మద్ రిజ్వాన్ (63 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హెప్ 8, ఉస్మాన్ ఖాన్ 19, కమ్రాన్ ఘులామ్ 36, మైఖేల్ బ్రేస్‌వెల్ 44 పరుగులు (నాటౌట్) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. పీఎస్ఎల్ చరిత్రలో ఇది మూడో భారీ ఛేదన. జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు. కరాచీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (12) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్ బౌలర్లలో అకీఫ్ జావిద్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు.మూడో ఫాస్టెస్ట్ సెంచరీసుల్తాన్స్తో మ్యాచ్‌లో విన్స్ చేసిన సెంచరీ పీఎస్ఎల్ చరిత్రలోనే మూడో వేగవంతమైన సెంచరీ. పీఎస్ఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉస్మాన్ ఖాన్ పేరిట ఉంది. 2023 సీజన్లో ఉస్మాన్ 36 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఆతర్వాత రిలీ రొస్సో అదే సీజన్లో 41 బంతుల్లో శతక్కొట్టారు. పీఎస్ఎల్లో విన్స్ కంటే వేగవంతమైన సెంచరీలు ఈ ఇద్దరివే. టీ20ల్లో విన్స్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. -
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌తో పోటీ పడి పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను నిర్వహిస్తున్న పాక్ క్రికెట్ బోర్డుకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్ప అని గప్పాలు కొట్టుకునే పీసీబీ, ఈ సారి పీఎస్ఎల్కు వస్తున్న ఆదరణ చూసి విస్తుపోతుంది. ఐపీఎల్‌తో సమాంతరంగా జరుగుతుండటంతో పీఎస్ఎల్ మ్యాచ్‌లు చూసేందుకు జనాలు రావడం లేదు. స్వదేశంలోనే పీఎస్ఎల్కు ఆదరణ తక్కువ కావడం చూసి పీసీబీ అధికారులు అవాక్కవుతున్నారు. ఐపీఎల్‌తో పోటీ పడి తప్పు చేశామని లీగ్ ప్రారంభంలోనే వారు తెలుసుకున్నారు.కొద్ది రోజుల క్రితం హసన్ అలీ చెప్పినట్లు.. మంచి క్రికెట్ ఆడుతున్నా పాక్ అభిమానులు పీఎస్ఎల్ను పట్టించుకోవడం లేదు. లీగ్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) హోరాహోరీ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్.. ఛేదనలో జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకాలు బాదారు.ఈ మ్యాచ్‌కు ముందు నిన్న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ 80 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆతర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ 136 పరుగులకే కుప్పకూలింది. గ్లాడియేటర్స్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఆమిర్ పెషావర్ పతనాన్ని శాశించారు.ఇలా, ఒకే రోజు రెండు రసవత్తర మ్యాచ్‌లు జరిగినా పాక్ అభిమానులు పీఎస్‌ఎల్‌వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ రెండు మ్యాచ్‌లు జరిగిన స్టేడియాలు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. రాత్రి జరిగిన ముల్తాన్, కరాచీ మ్యాచ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉండింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు పట్టుమని 10 వేల మంది కూడా రాలేదు. పాక్ మీడియా ప్రకారం.. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం కంటే స్టేడియంలో సెక్యూరిటి గార్డులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు 5000 మంది స్టేడియానికి రాగా.. అక్కడ సెక్యూరిటి సిబ్బంది 6700 మంది ఉన్నారట. ఈ లెక్కలు చూస్తే చాలు పీఎస్ఎల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పవచ్చు.ఇలాంటి లీగ్ ఐపీఎల్‌కు పోటీ అని పాక్ క్రికెట్ బోర్డు గొప్పలు చెప్పుకోవడం చూసి క్రికెట్ అభిమానులు నవ్విపోతున్నారు. పీఎస్ఎల్కు ఐపీఎల్‌తో పోలికే లేదని అంటున్నారు. ఐపీఎల్లో ఓ మ్యాచ్ జరిగితే వేలు, కొన్ని సార్లు లక్షల సంఖ్యలో జనాలు వస్తారు. టీవీల్లో, ఇతర మాధ్యమాల్లో మ్యాచ్‌లు వీక్షించే వారి సంఖ్య లెక్కలేనంతగా ఉంటుంది. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఐపీఎల్‌ను అత్యధిక సంఖ్యలో వీక్షిస్తారు. విదేశాల్లో వారి సొంత దేశ ఆటగాళ్ల కంటే భారత ఆటగాళ్లకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. 2008 నుంచి ప్రతి సీజన్లో విజయవంతమైన ఐపీఎల్‌ను చూసి ఓర్వలేని పాక్.. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌తో సమాంతరంగా పీఎస్ఎల్ను నిర్వహించి చేతులు కాల్చుకుంది. -
ఒకే సమయంలో విధ్వంసకర శతకాలు.. ఐపీఎల్లో అభిషేక్.. పీఎస్ఎల్లో రిజ్వాన్, విన్స్
క్రికెట్ అభిమానులు శనివారం (ఏప్రిల్ 12) సాయంత్రాన్ని తనివి తీరా ఎంజాయ్ చేశారు. నిన్న ఒకే సమయంలో రెండు వేర్వేరు లీగ్‌ల్లో మూడు విధ్వంసకర శతకాలు, రెండు అతి భారీ ఛేజింగ్‌లు నమోదయ్యాయి. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (246) ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. అభిషేక్ రఫ్ఫాడించడంతో సన్‌రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యత్తుమ ఛేజింగ్.నిన్న సాయంత్రం సన్‌రైజర్స్, పంజాబ్ మ్యాచ్ జరుగుతుండగానే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మరో సూపర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకరు, ఛేజింగ్‌లో మరొకరు విధ్వంకర శతకాలతో విరుచుకుపడ్డారు. పంజాబ్‌పై సన్‌రైజర్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించిన తరహానే పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. మొహమ్మద్ రిజ్వాన్ (63 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హెప్ 8, ఉస్మాన్ ఖాన్ 19, కమ్రాన్ ఘులామ్ 36, మైఖేల్ బ్రేస్‌వెల్ 44 పరుగులు (నాటౌట్) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు. కరాచీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (12) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్ బౌలర్లలో అకీఫ్ జావిద్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
అంతర్జాతీయ క్రికెట్లో గత కొంత కాలంగా దారుణంగా విఫలమవుతున్న పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 12) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ (పెషావర్ జల్మీ) డకౌటయ్యాడు. మొహమ్మద్ ఆమిర్ వేసిన అద్భుతమైన బంతికి బాబర్ బోల్తా పడ్డాడు. ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ క్వెట్టా గ్లాడియేటర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదర్కొంది.తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సౌద్ షకీల్ (59), ఫిన్ అలెన్ (53) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. హసన్ నవాజ్ (41), రిలీ రొస్సో (21 నాటౌట్), కుసాల్ మెండిస్ (35 నాటౌట్) రాణించారు. పెషావర్ బౌలర్లలో అలీ రజా, అల్జరీ జోసఫ్, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్.. ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (4-0-42-4) చెలరేగడంతో 15.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. గ్లాడియేటర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, ఉస్మాన్ తారిఖ్ తలో రెండు వికెట్లు తీయగా.. కైల్ జేమీసన్ ఓ వికెట్ పడగొట్టాడు. పెషావర్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. హుసేన్ తలాత్ (35), మిచెల్ ఓవెన్ (31) పర్వాలేదనిపించారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ సహా ఐదుగురు డకౌట్ అయ్యారు. బాబర్‌తో పాటు టామ్ కొహ్లెర్ కాడ్మోర్, మ్యాక్స్ బ్రయాంట్, అల్జరీ జోసఫ్, మొహమ్మద్ అలీ ఖాతా తెరవలేకపోయారు.కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్‌కు పోటీగా ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ఐపీఎల్‌తో సమాంతరంగా జరుగుతుండటంతో పీఎస్ఎల్కు స్వదేశంలోనే ఆదరణ కరువైంది. ఈ లీగ్‌ను వీక్షించే నాథుడే లేకుండా పోయాడు. విదేశీ స్టార్లంతా ఐపీఎల్లో బిజీగా ఉంటే, ఐపీఎల్లో అమ్ముడుపోని వారు, వెటరన్లు పీఎస్ఎల్లో ఆడుతున్నారు. పీఎస్ఎల్ ఎప్పుడూ జరిగినట్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగి ఉంటే స్వదేశంలోనైనా ఆదరణ ఉండేది. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్ఎల్ కూడా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులంతా క్యాష్ రిచ్ లీగ్‌కే ఓటేస్తున్నారు. ఐపీఎల్లో మ్యాచ్‌లు రసవ్తరంగా సాగుతుండటంతో క్రికెట్ ప్రేమికులు పీఎస్‌ఎల్‌వైపు కన్నేత్తి చూడటం లేదు. -
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2025 సీజన్ శుక్రవారం (ఏప్రిల్ 11) మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ (ISU)- లాహోర్ ఖలందర్స్ (LHQ) తలపడ్డాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఇస్లామాబాద్ జట్టు.. లాహోర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే, ఓపెనర్లు ఫఖర్ జమాన్ (1), మహ్మద్ నయీమ్ (8) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో లాహోర్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (38 బంతుల్లో 66) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా సికందర్ రజా (23) రాణించాడు.చెలరేగిన జేసన్ హోల్డర్అయితే, డారిల్ మిచెల్ (13) సహా మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసి లాహోర్ జట్టు ఆలౌట్ అయింది. ఇస్లామాబాద్ బౌలర్లలో పేసర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జేసన్ హోల్డర్ నాలుగు వికెట్ల (4/26)తో చెలరేగగా.. కెప్టెన్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (3/25) మూడు వికెట్లతో రాణించాడు.మిగిలిన వారిలో నసీం షా, రిలే మెరిడిత్, ఇమాద్ వసీం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన ఇస్లామాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఆండ్రీ గౌస్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (24 బంతుల్లో 25) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపుఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ మున్రో, సల్మాన్ ఆఘా కాస్త వేగంగా ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. మున్రో 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. సల్మాన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఇస్లామాబాద్ టార్గెట్ పూర్తి చేసింది. లాహోర్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఐపీఎల్‌తో ఢీ!కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సాధారణంగా ఐపీఎల్‌తో పోటీ లేకుండా పీఎస్ఎల్ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం క్యాష్ రిచ్ లీగ్‌ను ఢీకొడుతూ ఏప్రిల్ 11- మే 18 వరకు షెడ్యూల్ ఖరారు చేసింది. మరోవైపు మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడే నిమిత్తం పీఎస్ఎల్ నుంచి తప్పుకొన్నారు.చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!ఇక పరుగుల వరద పారే ఐపీఎల్‌తో పోటీకి వచ్చిన పీఎస్ఎల్ తొలి మ్యాచే చప్పగా సాగింది. కనీసం ఇరు జట్లు కలిసీ కనీసం మూడు వందల పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. పీఎస్ఎల్ ఇలాగే కొనసాగితే ఎవరూ చూడరని.. సొంత అభిమానులే పీసీబీని విమర్శిస్తున్నారు. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీలు, సిక్సర్ల వర్షం ఉండాలని.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.పీఎస్ఎల్-2025: ఇస్లామాబాద్ వర్సెస్ లాహోర్ స్కోర్లులాహోర్: 139 (19.2)ఇస్లామాబాద్: 143/2 (17.4)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లాహోర్‌ను ఓడించి ఇస్లామాబాద్.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. విదేశీ క్రికెటర్లు వీరే Agha goes BOOM! That’s a clean strike clearing the boundary! 🤩#HBLPSLX l #ApnaXHai l #IUvLQ pic.twitter.com/khDjmxyB57— PakistanSuperLeague (@thePSLt20) April 11, 2025