
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేద క్రికెట్ బోర్డు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అయితే వారి ఆథ్వర్యంలో నడిచే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చిన ఆటగాళ్లకు కనీస బహుమతులు కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో అయితే లేదు.
పీఎస్‌ఎల్-2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టుకు (కరాచీ కింగ్స్) చిరస్మరణీయ విజయాన్ని అందించిన ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ విన్స్‌కు లీగ్ నిర్వహకులు మరీ అధ్వానంగా హెయిర్ డ్రైయర్‌ను బహుమతిగా ఇచ్చి అవమానించారు.
హెయిర్ డ్రైయర్‌ను తీసుకునేందుకు విన్స్ చాలా మొహమాటపడ్డాడు. గల్లీ క్రికెట్‌లో కూడా వేల సంఖ్యలో విలువ చేసే వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తుంటే.. అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొనే పీఎస్‌ఎల్‌లో వెయ్యిలోపు విలువ చేసే హెయిర్ డ్రైయర్లను బహుమతిగా ఇవ్వడం బాధాకరమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. హెయిర్ డ్రైయర్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ పీఎస్‌ఎల్ నిర్వహకులు పబ్లిసిటీ కోసం పాకులాడటం మరీ వింతగా అనిపించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్‌పై కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. మొహమ్మద్ రిజ్వాన్ (63 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హెప్ 8, ఉస్మాన్ ఖాన్ 19, కమ్రాన్ ఘులామ్ 36, మైఖేల్ బ్రేస్‌వెల్ 44 పరుగులు (నాటౌట్) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. పీఎస్‌ఎల్ చరిత్రలో ఇది మూడో భారీ ఛేదన. జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు.
కరాచీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (12) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్ బౌలర్లలో అకీఫ్ జావిద్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
మూడో ఫాస్టెస్ట్ సెంచరీ
సుల్తాన్స్‌తో మ్యాచ్‌లో విన్స్ చేసిన సెంచరీ పీఎస్‌ఎల్ చరిత్రలోనే మూడో వేగవంతమైన సెంచరీ. పీఎస్‌ఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉస్మాన్ ఖాన్ పేరిట ఉంది. 2023 సీజన్‌లో ఉస్మాన్ 36 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఆతర్వాత రిలీ రొస్సో అదే సీజన్‌లో 41 బంతుల్లో శతక్కొట్టారు. పీఎస్‌ఎల్‌లో విన్స్ కంటే వేగవంతమైన సెంచరీలు ఈ ఇద్దరివే. టీ20ల్లో విన్స్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.