
నేడు పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆరేసి మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు నాలుగింట గెలిచి 8 పాయింట్లతో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. తాజా సీజన్‌లో ప్రత్యర్థి జట్ల మైదానాల్లో వరుస విజయాలు సాధిస్తున్న ఆర్‌సీబీ... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం గెలుపు రుచి చూడలేకపోయింది.
మాజీ చాంపియన్‌లు కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్‌ను వారి వారి సొంత మైదానాల్లో ఓడించిన ఆర్‌సీబీ... బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. మరోవైపు గత మ్యాచ్‌లో 111 పరుగులే చేసినా... బౌలింగ్ బలంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను నిలువరించిన పంజాబ్ కింగ్స్ మంచి ఊపు మీద ఉంది. పంజాబ్ స్పిన్నర్లను బెంగళూరు బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
చహల్ మ్యాజిక్ కీలకం...
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య రూపంలో ప్రతిభావంతులైన ఓపెనర్లు అందుబాటులో ఉండగా... అయ్యర్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్‌తో మిడిలార్డర్ మెరుగ్గా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫామ్‌ను ఐపీఎల్‌లో సైతం కొనసాగిస్తున్న అయ్యర్... తనకు అనువైన రోజు భారీ స్కోర్లతో చెలరేగుతున్నాడు. అదే సమయంలో నిలకడ కొనసాగించలేకపోతున్నాడు.
మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అదనపు స్పిన్నర్‌గా సేవలందిస్తున్నా... బ్యాటర్‌గా మాత్రం అతడి స్థాయి ప్రదర్శన ఇంకా రాలేదు. బౌలింగ్‌లోనూ పంజాబ్‌కు విభిన్న ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మార్కో యాన్సెన్, అర్ష్ దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పంజాబ్ ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలకం కానున్నాడు. బెంగళూరు పిచ్‌పై అతడికి మంచి అవగాహన ఉండటం పంజాబ్‌కు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది.
చిన్నస్వామిలో బోణీ కొట్టేనా...
ఈ సీజన్ ఆరంభం నుంచి మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రధానంగా బ్యాటర్లపైనే ఆధారపడుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ రూపంలో ఆ జట్టుకు ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే పవర్‌ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలో ధాటిగా ఆడుతున్న ఆర్‌సీబీ... మధ్య ఓవర్లలో మాత్రం సులువుగా పరుగులు రాబట్టలేకపోతోంది.
ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బెంగళూరు బ్యాటర్లు తడబడుతున్నారు. గుజరాత్ స్పిన్నర్ సాయికిషోర్, ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బౌలింగ్ ఆడలేక ఇబ్బంది పడ్డారు. బౌలింగ్‌లో హాజల్‌వుడ్, యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్ పేస్ బారం మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్‌ల్లో బెంగళూరు, 17 మ్యాచ్‌ల్లో పంజాబ్ విజయం సాధించాయి. 2023లో పంజాబ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లోనూ, గత ఏడాది పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు జట్టే గెలిచింది. పంజాబ్‌పై బెంగళూరు అత్యధిక స్కోరు 241 కాగా... అత్యల్ప స్కోరు 84. బెంగళూరుపై పంజాబ్ అత్యధిక స్కోరు 232 కాగా, అత్యల్ప స్కోరు 88.
తుది జట్లు (అంచనా)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ.
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, యాన్సెన్, జేవియర్, అర్ష్ దీప్ , స్టొయినిస్, చాహల్.