
5 వికెట్లతో పంజాబ్ కింగ్స్ జయభేరి
సొంతగడ్డపై కుదేలైన బెంగళూరు
టిమ్ డేవిడ్ మెరుపులు వృథా
పడగొట్టిన అర్ష్ దీప్ , యాన్సెన్, చహల్
మెరిపించిన నేహల్
ముందు వాన... తర్వాత హైరానా! శుక్రవారం రాత్రి బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ (ఆర్‌సీబీ) పరిస్థితి ఇది. ఆలస్యమైన ఆటలో వికెట్ల వేటను చకచకా మొదలుపెట్టిన పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిథని వారి సొంతగడ్డపై కుదేల్ చేసింది. కుదించిన ఓవర్లలో విదిల్చిన పంజాతో ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని ఎంచక్కా ఛేదించిన కింగ్స్ ఈ ఐపీఎల్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో మూడోసారి బెంగళూరు ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బోణీ కొట్టలేకపోయింది.
బెంగళూరు: పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గర్జించింది. బెంగళూరును వణికించింది. కింగ్స్‌ను విజేతగా నిలబెట్టింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ , మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి గెలిచింది. నేహల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. హాజల్‌వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు తమ తుదిజట్టును మార్చలేదు. పంజాబ్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్, సుర్యాంశ్ షెడ్గే స్థానాల్లో స్టొయినిస్, హర్‌ప్రీత్ బ్రార్ బరిలోకి దిగారు.
అందరూ తొందరగానే...
వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. కోహ్లి, సాల్ట్, లివింగ్‌స్టోన్‌లాంటి హిట్టర్లున్న జట్టులో ఏ నలుగురో, ఐదుగురో ఆడాల్సిన 14 ఓవర్లను ఏకంగా 11 మంది ఆడేశారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అందరూ తొందర, తొందరగా వికెట్లను పారేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సాల్ట్ (4), కోహ్లి (1), రజత్ పాటీదార్ (23), లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) చేతులెత్తేశారు.
డేవిడ్ ఒక్కడి మెరుపులతోనే...
జట్టు స్కోరు 95/9. అంటే 11 మంది క్రీజులోకి వచ్చారన్నమాటే! అందరూ బ్యాటింగ్‌కు దిగినా... స్కోరులో సగంకంటే ఎక్కువ స్కోరు ఒక్కడే టిమ్ డేవిడ్ చేశాడు. ఏడో వరుసలో, ఏడో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ అండగా నిలిచేవారే కరువైనా... ఆఖరి రెండు ఓవర్లలోనే అంతా మార్చాడు. 12 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లకు 63 పరుగులు చేసింది. డేవిడ్ స్కోరు 19 కాగా... జేవియర్ 13వ ఓవర్లో 2 బౌండరీలు సహా 11 పరుగులు చేశాడు.
ఇన్నింగ్స్ బ్రేక్‌కు ముందు...
చివరి 14వ ఓవర్లో తొలి మూడు బంతులు వరుసగా... 0, 0, 0 పరుగే రాలేదు. తర్వాత మూడు బంతుల్ని డేవిడ్ భారీ సిక్సర్లు బాదడంతో 18 పరుగులొచ్చాయి. 48 పరుగులు చేసిన డేవిడ్ సహా అంతా ఇన్నింగ్స్ బ్రేక్ కావడంతో మైదానం వీడుతున్నారు. కానీ అంపైర్ చాలా ఆలస్యంగా నోబాల్ సిగ్నలిచ్చాడు. సహచరులతో కబుర్లాడుతూ డగౌట్ చేరుతున్న ఆటగాళ్లను వెనక్కి పిలిచి ఫ్రీ హిట్ ఆడించడంతో 2 పరుగులు తీసిన డేవిడ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు.
నేహల్ మెరిపించాడు...
సులువైన లక్ష్యం కావడంతో పంజాబ్‌కు ఛేదనలో పెద్దగా కష్టం ఎదురవలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (16), ప్రభ్‌సిమ్రాన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) ఇలా టాపార్డర్ వికెట్లు రాలినా... మిడిలార్డర్‌లో నేహల్ భారీ షాట్లతో విరుచుకు పడి జట్టును గెలిపించాడు. దీంతో ఒకే ఓవర్లో హాజల్‌వుడ్ అయ్యర్, ఇన్‌గ్లిస్ (14) వికెట్లను పడగొట్టినా... నేహల్ బ్యాటింగ్ బెంగళూరును మ్యాచ్‌లో పట్టుబిగించకుండా చేసింది. 11 బంతులు మిగిలుండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది.

స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 4; కోహ్లి (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 1; పాటీదార్ (సి) జేవియర్ (బి) చహల్ 23; లివింగ్‌స్టోన్ (సి) ప్రియాన్‡్ష (బి) జేవియర్ 4; జితేశ్ (సి) నేహల్ (బి) చహల్ 2; కృనాల్ (సి అండ్ బి) యాన్సెన్ 1; టిమ్ డేవిడ్ (నాటౌట్) 50; మనోజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) యాన్సెన్ 1; భువనేశ్వర్ (సి) జేవియర్ (బి) హర్‌ప్రీత్ 8; యశ్ దయాళ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్ 0; హజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–26, 4–32, 5–33, 6–41, 7–42, 8–63, 9–63. బౌలింగ్: అర్శ్‌దీప్ 3–0–23–2, జేవియర్ 3–0–26–1, యాన్సెన్ 3–0–10–2, చహల్ 3–0–11–2, హర్‌ప్రీత్ బ్రార్ 2–0–25–2.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) హాజల్‌వుడ్ 16; ప్రభ్‌సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 13; అయ్యర్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 7; ఇన్‌గ్లిస్ (సి) సుయశ్ (బి) హాజల్‌వుడ్ 14; నేహల్ (నాటౌట్) 33; శశాంక్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; స్టొయినిస్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (12.1 ఓవర్లలో 5 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–22, 2–32, 3–52, 4–53, 5–81. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–26–2, యశ్ దయాళ్ 2.1–0–18–0, హాజల్‌వుడ్ 3–0–14–3, కృనాల్ 1–0–10–0, సుయశ్ 3–0–25–0.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ X ఢిల్లీ
వేదిక: అహ్మదాబాద్ , మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
రాజస్తాన్ X లక్నో
వేదిక: జైపూర్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం