
అంతర్జాతీయ క్రికెట్‌లో గత కొంత కాలంగా దారుణంగా విఫలమవుతున్న పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 12) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ (పెషావర్ జల్మీ) డకౌటయ్యాడు. మొహమ్మద్ ఆమిర్ వేసిన అద్భుతమైన బంతికి బాబర్ బోల్తా పడ్డాడు. ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ క్వెట్టా గ్లాడియేటర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదర్కొంది.
తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సౌద్ షకీల్ (59), ఫిన్ అలెన్ (53) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. హసన్ నవాజ్ (41), రిలీ రొస్సో (21 నాటౌట్), కుసాల్ మెండిస్ (35 నాటౌట్) రాణించారు. పెషావర్ బౌలర్లలో అలీ రజా, అల్జరీ జోసఫ్, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్.. ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (4-0-42-4) చెలరేగడంతో 15.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. గ్లాడియేటర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, ఉస్మాన్ తారిఖ్ తలో రెండు వికెట్లు తీయగా.. కైల్ జేమీసన్ ఓ వికెట్ పడగొట్టాడు.
పెషావర్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. హుసేన్ తలాత్ (35), మిచెల్ ఓవెన్ (31) పర్వాలేదనిపించారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ సహా ఐదుగురు డకౌట్ అయ్యారు. బాబర్‌తో పాటు టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్, మ్యాక్స్ బ్రయాంట్, అల్జరీ జోసఫ్, మొహమ్మద్ అలీ ఖాతా తెరవలేకపోయారు.
కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్‌కు పోటీగా ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ఐపీఎల్‌తో సమాంతరంగా జరుగుతుండటంతో పీఎస్‌ఎల్‌కు స్వదేశంలోనే ఆదరణ కరువైంది. ఈ లీగ్‌ను వీక్షించే నాథుడే లేకుండా పోయాడు. విదేశీ స్టార్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉంటే, ఐపీఎల్‌లో అమ్ముడుపోని వారు, వెటరన్లు పీఎస్‌ఎల్‌లో ఆడుతున్నారు.
పీఎస్‌ఎల్ ఎప్పుడూ జరిగినట్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగి ఉంటే స్వదేశంలోనైనా ఆదరణ ఉండేది. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్‌ఎల్ కూడా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులంతా క్యాష్ రిచ్ లీగ్‌కే ఓటేస్తున్నారు. ఐపీఎల్‌లో మ్యాచ్‌లు రసవ్తరంగా సాగుతుండటంతో క్రికెట్ ప్రేమికులు పీఎస్‌ఎల్‌వైపు కన్నేత్తి చూడటం లేదు.