
Photo Courtesy: BCCI
వరుస పరాజయాల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ (PBKS)ను చిత్తు చేసి.. ఆరెంజ్ ఆర్మీని సంతోషపెట్టింది. ఉప్పల్‌లో పరుగుల వరద పారించి మరోసారి తమదైన దూకుడుతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) సంతోషం వ్యక్తం చేశాడు.
అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు వీరాభిమానిని
‘‘నిజంగా ఇదొక అద్బుత విజయం. మా శైలిలో దూకుడుగా ఆడి గెలిచాం. ఈ వికెట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ బౌలర్ ఓ ఓవర్‌లో పది పరుగుల కంటే తక్కువ రన్స్ ఇచ్చాడంటే అదే గొప్ప. అందుకే మేము పంజాబ్ విధించిన లక్ష్యాన్ని సులువుగానే ఛేదించగలమనే ఆత్మవిశ్వాసం కలిగింది.
నేను అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు వీరాభిమానిని. ఏదేమైనా మేము బ్యాటింగ్ శైలిని మార్చుకునేందుకు సిద్ధంగా లేము. గతేడాది మా వాళ్లు ఎలా ఆడారో అందరికీ తెలుసు. ఈసారి కూడా అదే శైలిని కొనసాగిస్తాం. మా బ్యాటర్ల నైపుణ్యాలపై మాకు నమ్మకం ఉంది.
వాళ్లు అద్భుతమైన వాళ్లు
ఇక ఆరెంజ్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?!... వాళ్లు అద్భుతమైన వాళ్లు.. మా కోసం సన్‌రైజర్స్ జెండాలు రెపరెపలాడిస్తూ.. చుట్టూ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు’’ అంటూ ప్యాట్ కమిన్స్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
వరుసగా నాలుగు ఓడి
కాగా ఐపీఎల్-2025లో తొలుత ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడిన కమిన్స్ బృందం.. ఘన విజయంతో సీజన్‌ను మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది.
విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయాల బాట
ఈ నేపథ్యంలో అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేసే సన్‌రైజర్స్ శైలిపై విమర్శలు వెల్లువెత్తగా కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. హెడ్‌కోచ్ డానియల్ వెటోరీ కూడా తమ విధానం మారదని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే శనివారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో తిరిగి విజయాల బాట పట్టింది.
ఉప్పల్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. రైజర్స్ స్టైల్లోనే ఆడిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23 బంతుల్లో 42).. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 82) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆఖర్లో మార్కస్ స్టొయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అభిషేక్ విశ్వరూపం
సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక భారీ లక్ష్య ఛేదనలో రైజర్స్ ఏమాత్రం తడబడలేదు. సొంత మైదానంలో ట్రవిస్ హెడ్ (37 బంతుల్లో 66) బ్యాట్ ఝులిపించగా.. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141) న భూతో న భవిష్యత్ అన్నట్లుగా భారీ శతకం బాదాడు.
హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 21 నాటౌట్), ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 9 నాటౌట్) పని పూర్తి చేశారు. 18.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన రైజర్స్.. పంజాబ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
చదవండి: ఎగిరి గంతులేసిన కావ్యా మారన్.. అభిషేక్ తల్లిని హగ్ చేసుకుని మరీ! వీడియో
𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯
A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪
Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025