నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్‌ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్‌ | Still Making Me Laugh Abhishek Was Lucky: Shreyas Iyer On PBKS Loss | Sakshi
Sakshi News home page

నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్‌ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్‌

Published Sun, Apr 13 2025 11:47 AM | Last Updated on Sun, Apr 13 2025 12:05 PM

Still Making Me Laugh Abhishek Was Lucky: Shreyas Iyer On PBKS Loss

శ్రేయస్‌ అయ్యర్‌ (Photo Courtesy: BCCI/IPL)

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్రకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) అడ్డుకట్ట వేసింది. భారీ స్కోరు సాధించినా.. పంజాబ్‌కు ఆ సంతోషాన్ని మిగలనివ్వలేదు. ఆడుతూ పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదించి శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు ఊహించని షాకిచ్చింది. విధ్వంసకర బ్యాటింగ్‌లో తమకు తిరుగులేదని మరోసారి చాటుకుని.. పంజాబ్‌ను ఏకంగా ఎనిమిది వికెట్లతో రైజర్స్‌ చిత్తు చేసింది.

ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నిజం చెప్పాలంటే మేము అద్బుతంగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు సాధించాము. కానీ వాళ్లు.. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే దానిని ఛేదించేశారు.

నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్‌ లక్కీ..
ఇదెలా సాధ్యమైందో!.. నాకైతో నవ్వు వస్తోంది. మేము కొన్ని క్యాచ్‌లు మిస్‌ చేశాం. అభిషేక్‌ అదృష్టవంతుడు. అసాధారణ ఆటగాడు. మేము అంచనాలకు తగ్గట్లుగా బౌలింగ్‌ చేయలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకోవాలి.

ఏదేమైనా అభిషేక్‌- ట్రవిస్‌ హెడ్‌ మధ్య ఓపెనింగ్‌ భాగస్వామ్యం అద్భుతం అనే చెప్పాలి. మాకు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. ఫెర్గూసన్‌ వరుస విరామాల్లో వికెట్లు తీసేవాడు. కానీ.. అతడు గాయపడ్డాడు.

అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటి
ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. నేను, వధేరా 230.. మంచి స్కోరు అనుకున్నాం. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. ఇక సన్‌రైజర్స్‌ ఓపెనర్లు బ్యాటింగ్‌ చేసిన తీరును మాటల్లో వర్ణించలేము. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ.. నేను ఇంత వరకు చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటి ఇది’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ ప్రత్యర్థి జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.

కాగా ఉప్పల్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ సన్‌రైజర్స్‌తో తలపడింది. టాస్‌ గెలిచిన శ్రేయస్‌ అయ్యర్‌.. ఆతిథ్య జట్టును తొలుత బౌలింగ్‌కు ఆహ్వానించాడు. ఇక బ్యాటింగ్‌ అనుకూలించిన పిచ్‌పై పంజాబ్‌ బ్యాటర్లు దంచికొట్టారు.

శ్రేయస్‌ అయ్యర్‌ ధనాధన్‌
ఓ‍పెనర్లలో ప్రియాన్ష్‌ ఆర్య (13 బంతుల్లో 36) మెరుపు వేగంతో ఆడగా.. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23 బంతుల్లో 42) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ భారీ అర్ధ శతకం (36 బంతుల్లో 82) దుమ్ములేపగా.. ఆఖర్లో మార్కస్‌ స్టొయినిస్‌ (11 బంతుల్లో 34 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.

‘ట్రావిషేక్‌’ జోడీ బీస్ట్‌ మోడ్‌
ఇక లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. చాన్నాళ్ల తర్వాత రైజర్స్‌ ఓపెనింగ్‌ ‘ట్రావిషేక్‌’ జోడీ బీస్ట్‌ మోడ్‌లో బ్యాటింగ్‌ చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (37 బంతుల్లో 66) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. అభిషేక్‌ శర్మ (55 బంతుల్లో 141) భారీ సెంచరీతో మెరిసి.. రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  

వీరుడికి అదృష్టం కూడా కలిసి వచ్చింది
అయితే, అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ చహల్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో అభి ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను చహల్‌ మిస్‌ చేశాడు. అంతకంటే ముందు అంటే మూడో ఓవర్లో అభి రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత(3.4 ఓ‍వర్‌) నోబాల్‌ ద్వారా లైఫ్‌ పొందాడు. 

ఆ తర్వాత.. అంటే 12.4 వద్ద అభి శతకం పూర్తి చేసుకుని ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (40 బంతుల్లో) నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. మరోవైపు.. పంజాబ్‌ బౌలర్‌ ఫెర్గూసన్‌ రెండు బంతులు వేసిన తర్వాత గాయంతో మైదానం వీడాడు.

చదవండి: అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement