
పాకిస్తాన్ క్రికెటర్లకు ఘెర అవమానం జరిగింది. నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఆ దేశానికి చెందిన ఒక్క క్రికెటర్ కూడా అమ్ముడుపోలేదు. మీడియా కథనం ప్రకారం హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) పాకిస్తాన్‌కు చెందిన 45 మంది పురుషులు, 5 మంది మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. వీరిలో ఒక్కరిపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.
గత సీజన్‌లో అత్యధిక ధర పలికిన పాక్ ఆటగాడు నసీం షాను ఈ సీజన్‌లో ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు. గత సీజన్‌లో మంచి ధర దక్కించుకున్న ఇమాద్ వసీం, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ హస్నైన్‌ను ఫ్రాంచైజీలు తిరస్కరించాయి.
పాక్ ఆటగాళ్లకు ఈ గతి పట్టడానికి వారి ఫామ్‌లేమితో పాటు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టాయి. ఎనిమిదింట నాలుగు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు కొనుగోలు చేశారు. భారతీయ పెట్టుబడులు ఉండటం చేతనే హండ్రెడ్ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదని టాక్ నడుస్తుంది.
హండ్రెడ్ లీగ్‌లో పాక్ ఆటగాడు ఉసామా మిర్ అత్యధికంగా 13 మ్యాచ్‌లు ఆడాడు. హరీస్ రౌఫ్ 12, ఇమాద్ వసీం 10, మహ్మద్ అమిర్ 6, షాహీన్ అఫ్రిది 6, మహ్మద్ హస్నైన్ 5, జమాన్ ఖాన్ 5, షాదాబ్ ఖాన్ 3, వాహబ్ రియాజ్ 2 మ్యాచ్‌లు ఆడారు.
బ్రేస్‌వెల్, నూర్ అహ్మద్‌కు జాక్‌పాట్
హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ జాక్‌పాట్ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్ రన్నరప్ సధరన్ బ్రేవ్ దక్కించుకోగా.. నూర్ అహ్మద్‌ను మాంచెస్టర్ ఒరిజినల్స్ సొంతం చేసుకుంది.
డ్రాఫ్ట్‌లో బ్రేస్‌వెల్, నూర్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను లండన్ స్పిరిట్.. మరో ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేను ట్రెంట్ రాకెట్స్ సొంతం చేసుకున్నాయి.
నిన్నటి డ్రాఫ్ట్‌లో మరో మేజర్ సైనింగ్ ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. గతేడాది డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని వార్నర్‌ను ఈసారి లండన్ స్పిరిట్ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్, ఛాంపియన్స్ ట్రోఫీ హీరో రచిన్ రవీంద్రను మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది.
ఈసారి డ్రాఫ్ట్‌కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. ఆండర్సన్‌ను డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
మహిళల డ్రాఫ్ట్ విషయానికొస్తే.. సోఫి డివైన్, జార్జియా వాల్, పెయిజ్ స్కోల్‌ఫీల్డ్ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్‌లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్‌కార్డ్ డ్రాఫ్ట్ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్ లీగ్-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment