పాకిస్తాన్ సూపర్ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారయ్యాయి. పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోగా.. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.
నిన్న జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ.. కరాచీ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (51) మరోసారి చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. బాబర్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పెషావర్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్ (30) ఓ మోస్తరుగా రాణించాడు. కరాచీ బౌలర్లు డేనియల్ సామ్స్, జహీద్ మహమూద్, ఆరాఫత్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. పెషావర్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నవీన్ ఉల్ హాక్ తన కోటా 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో పాటు 2 వికెట్లు పడగొట్టగా.. వుడ్, ఆమెర్ జమాల్, సైమ్ అయూబ్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. టిమ్ సీఫర్ట్ (41), ఇర్ఫాన్ ఖాన్ (39 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించినా కరాచీని గెలిపించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment