జిడ్డు బ్యాటింగ్‌!.. ఇలా అయితే కష్టం రాహుల్‌: పుజారా విమర్శలు | He Wanted to Save His Wicket: Pujara Slams KL Rahul Approach Vs RR | Sakshi
Sakshi News home page

వికెట్‌ కాపాడుకోవటానికే ప్రాధాన్యం.. ఇలా అయితే కష్టం రాహుల్‌: పుజారా

Published Thu, Apr 17 2025 10:51 AM | Last Updated on Thu, Apr 17 2025 11:44 AM

He Wanted to Save His Wicket: Pujara Slams KL Rahul Approach Vs RR

కేఎల్‌ రాహుల్‌ (Photo Courtesy: BCCI)

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) బ్యాటింగ్‌ తీరును భారత మాజీ క్రికెటర్‌ ఛతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) విమర్శించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాహుల్‌ జిడ్డు ఇన్నింగ్స్‌ ఆడాడని.. సీనియర్‌ ఆటగాడు ఇలా చేయడం తగదని పేర్కొన్నాడు. క్రీజులో కుదురుకున్న తర్వాతైనా ఈ కర్ణాటక క్రికెటర్‌ బ్యాట్‌ ఝులిపించాల్సిందని పుజారా అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌.. ఆరంభ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన రాహుల్‌ ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన విలువను చాటుకుంటున్నాడు. 

ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 238 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఢిల్లీ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, రాజస్తాన్‌ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో మాత్రం కేఎల్‌ రాహుల్‌ స్లో ఇన్నింగ్స్‌ ఆడాడు. 

అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్‌ జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌ (9) వికెట్‌ కోల్పోయింది. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్‌ నాయర్‌ రనౌట్‌ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు.

స్ట్రైక్‌ రేటు 118.75
ఈ క్రమంలో మరో ఓపెనర్‌ అభిషేక్‌ పోరెల్‌ (37 బంతుల్లో 49) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకోగా.. నాలుగో స్థానంలో వచ్చిన రాహుల్‌ అతడికి సహకరించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకునేందుకు రాహుల్‌ చాలా సమయమే తీసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. స్ట్రైక్‌ రేటు 118.75.

ఇక జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో షార్ట్‌ డెలివరీని ఆడబోయి రాహుల్‌ బంతిని గాల్లోకి లేపగా.. మిడ్‌ వికెట్‌ పొజిషన్‌లో ఉన్న హెట్‌మెయిర్‌ వేగంగా పరిగెత్తుకుని వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో రాహుల్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

షాట్ల ఎంపికలో జాగ్రత్త రాహుల్‌
ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ గురించి ఛతేశ్వర్‌ పుజారా స్పందించాడు. ‘‘కేఎల్‌ సీనియర్‌ ఆటగాడు.. అతడు 15- 20 బంతులు ఆడాలని అనుకుని ఉంటాడు. ఆ తర్వాత బ్యాట్‌ ఝులిపిద్దామనుకున్నాడేమో!... కానీ నాకైతే అతడు కాస్త దూకుడుగా ఆడితే బాగుండు అనిపించింది.

తను క్రీజులో కుదురుకున్నాడు.. పిచ్‌ పిరిస్థితులపై కూడా అవగాహన ఉంది. పరుగులు రాబట్టకపోతే కష్టమనీ తెలుసు. అయినా సరే ఎందుకో అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. రాహుల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కాస్త మార్పు వచ్చింది.

ఐపీఎల్‌లో తను ఓపెనర్‌గా వచ్చేవాడు. ఇప్పుడు మిడిలార్డర్‌లో వస్తున్నాడు. నిజానికి పవర్‌ ప్లేలో అతడి ఆట తీరు వేరేలా ఉండేది. ఏదేమైనా షాట్ల ఎంపికలో రాహుల్‌ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే, అతి జాగ్రత్త పనికిరాదు.

ఎంత సేపూ వికెట్‌ కాపాడుకోవడం కోసమేనా?
కేవలం వికెట్‌ కాపాడుకునేందుకే అతడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అలా కాకుండా తనదైన సహజశైలిలో రాహుల్‌ బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుంది’’ అని పుజారా అభిప్రాయపడ్డాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. రాహుల్‌ అవుటైన తర్వాత.. ఆఖర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 బంతుల్లో 34 నాటౌట్‌), కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (14 బంతుల్లో 34) ధనాధన్‌ దంచికొట్టారు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో 188 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ కూడా 188 పరుగులు చేసినా.. సూపర్‌ ఓవర్‌లో చెత్త బ్యాటింగ్‌తో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.

చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్‌ వాట్సన్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement