
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన అతి కొద్ది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒకటి. గత సీజన్లో వరుసగా పరాజయ పరంపరతో ప్రారంభించి మొదటి అయిదు మ్యాచ్ లలో నాలుగింటిలో ఓటమి చవిచూసి.. చివరికి ఆరో స్థానంతో ముగించింది ఢిల్లీ.
అయితే, ఈసారి జట్టు స్వరూపాన్నే మార్చేసింది. గత సీజన్ కెప్టెన్ భారత్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రికార్డు స్థాయిలో రూ 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కనుగోలు చేసిన తర్వాత కొత్త వ్యూహానికి తెరతీసింది.
అనుభవజ్ఞుడైన భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ (KL Rahul), దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ వంటి సీనియర్లను కొనుగోలు చేసింది. కానీ గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్ గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ ఢిల్లీ పగ్గాలు చేపట్టేందుకు అంత ఆసక్తి చూపించకపోవడంతో ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో రాణించిన మరో యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులు
ఢిల్లీ బ్యాక్‌రూమ్ సిబ్బందిలో కూడా మార్పులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్థానంలో భారత్ మాజీ ఆల్ రౌండర్ హేమాంగ్ బదానీని ప్రధాన కోచ్‌గా నియమించారు. భారత మాజీ బ్యాటర్ విశాఖపట్నంకి చెందిన వై వేణుగోపాలరావు కొత్త క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను మెంటార్‌గా, మాథ్యూ మోట్‌ను అసిస్టెంట్ కోచ్‌గా, మునాఫ్ పటేల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించారు.
సీనియర్లకు మళ్ళీ జట్టులో చోటు
అయితే ఢిల్లీ జట్టులో చాలా మంది గత సీజన్ ఆటగాళ్లు మళ్లీ జట్టు లో కొనసాగుతున్నారు. గత సీజన్ లో ప్రాతినిధ్యం వహించిన అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రెటైన్ చేసారు. వేలంలో ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌ను తిరిగి కొనుగోలు చేశారు. పేసర్ ముఖేష్ కుమార్ కూడా గత సీజన్ లో ఢిల్లీ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్ కూడా గతంలో ఈ ఫ్రాంచైజీ తరపున ఆడారు.
గత సీజన్‌లో తమ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌తో ఢిల్లీ సమస్యలను ఎదుర్కొంది. ఈ కారణంగా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేశారు. ఆస్ట్రేలియా కి చెందిన సీనియర్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (రూ 11.75 కోట్లు), టి నటరాజన్ (రూ 10.75 కోట్లు), ముఖేష్ కుమార్ (రూ 8 కోట్లు) , మోహిత్ శర్మ (రూ 2.20 కోట్లు)లను తీసుకువచ్చారు. ఇక స్పిన్ విభాగం లో కుల్దీప్ మరియు అక్షర్ పటేల్ ఉన్నారు.
ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ జట్టు నుంచి తప్పుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్ ని కొంత దెబ్బతీసింది. అయితే ఢిల్లీ కొత్త జట్టు కొత్త కెప్టెన్, కొత్త వ్యూహం తో ఈసారి రంగ ప్రవేశం చేస్తోంది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (సోమవారం)న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్ తో తమ ఐపీఎల్ 2025 సీజన్ని ప్రారంభిస్తుంది. విశాఖపట్నం ని తన రెండో హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న ఢిల్లీ తన మొదటి రెండు హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్ళు
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్
ఆస్ట్రేలియా కి చెందిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 2023 నుండి టీ20లలో పవర్‌ప్లేలో అత్యధిక స్ట్రైక్ రేట్ (168.04) ఉన్న బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (184.8), అభిషేక్ శర్మ (181.47) ల తర్వాత మూడో స్థానం లో ఉన్నాడు. 21 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 234.04 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు సాధించాడు. ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అతడిని కొనుగోలు చేసింది.
కెఎల్ రాహుల్
మాజీ లక్నౌ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ లో తన అసాధారణ ప్రతిభతో భారత్ జట్టుకి విజయాలు చేకూర్చి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్‌లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనింగ్ చేయనున్నాడు. ఐపీఎల్ లో బాగా నిలకడ రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడిగా పేరు పొందిన రాహుల్ 132 మ్యాచ్‌లు ఆడి 135 స్ట్రైక్ రేట్‌తో 37 అర్ధ సెంచరీలు, నాలుగు సెంచరీలతో 4,683 పరుగులు సాధించాడు.
ఫాఫ్ డు ప్లెసిస్
అపార అనుభవం ఉన్న ఈ దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఈ సీజన్ లో ఓపెనర్ గాను, ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఫాఫ్ 145 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడాడు. 140 స్ట్రైక్ రేట్‌తో 37 అర్ధ సెంచరీ లతో 4571 పరుగులు చేశాడు.
కరుణ్ నాయర్
దేశవాళీ క్రికెట్ లో సెంచరీలతో రికార్డుల మోత మోగించిన కరుణ్ నాయర్ మళ్ళీ ఐపీఎల్ లో ఢిల్లీ తరపున రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విదర్భ రంజీ ట్రోఫీ విజయంలో కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు.
ఫైనల్స్‌లో 120 , 80 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. 76 ఐపీఎల్ మ్యాచ్‌లతో, దాదాపు 130 స్ట్రైక్ రేట్‌తో 10 అర్ధ సెంచరీలతో 1,496 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో అతని స్థిరత్వం ఢిల్లీ కి కీలకం.
అక్షర్ పటేల్
కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అక్షర్ పటేల్ తన జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ తరపున బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ రాణించిన అక్షర్ పటేల్ కి కెప్టెన్ గా పెద్ద అనుభవం లేదు. అయితే తన నైపుణ్యంతో రాణించగల సామర్థ్యముంది.
అక్షర్ ఇంతవరకు 150 ఐపీఎల్ మ్యాచ్‌లలో, 130 స్ట్రైక్ రేట్‌తో మూడు అర్ధ సెంచరీలతో 1,653 పరుగులు చేశాడు. 8 కంటే తక్కువ ఎకానమీతో 123 వికెట్లతో సాధించిన అక్షర్ జట్టుకు సరైన సమతుల్యతను ఇస్తాడనడంలో సందేహం లేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
కెఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టియన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, మిచెల్ స్టార్క్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కాండే, విప్ రాజ్ నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ.
Comments
Please login to add a commentAdd a comment