
లాహోర్: ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్‌లలో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ జట్టు అర్హత సాధించింది. పాకిస్తాన్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో టాప్–2లో నిలిచిన జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 87 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 205 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (80; 9 ఫోర్లు), కెపె్టన్ సనా ఫాతిమా (62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు.
అనంతరం థాయ్‌లాండ్ జట్టు 34.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో సనా ఫాతిమా, నష్రా సంధూ, రమీన్ షమీమ్ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయినా ఆ జట్టుకు వచ్చిన ఢోకా లేదు.
బంగ్లాదేశ్ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందుతుంది. బంగ్లాదేశ్ ఓడిపోయి... వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ మూడు జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. రన్‌రేట్ పరంగా బంగ్లాదేశ్‌కే మరో బెర్త్ దక్కే అవకాశం ఉంది.