
భారత రక్షణ శాఖ మంత్రి
రాజ్‌నాథ్ సింగ్ ధ్వజం
ఉగ్రవాద కార్యకలాపాల కోసం ప్రజల నుంచి పాక్ వసూళ్లని వెల్లడి
భుజ్: జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలపాలను మరింత విస్తృతం చేయడానికి ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు.
ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా శిబిరాలను పాక్ ప్రభుత్వం మళ్లీ నిర్మిస్తోందని చెప్పారు. మురిద్కే, బహవల్‌పూర్‌లో ఈ నిర్మాణాలు మొదలయ్యాయని వెల్లడించారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సైనికాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న సొమ్మంతా ఉగ్రవాదుల జేబుల్లోకే వెళ్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
పాకిస్తాన్‌కు ఆర్థిక సాయంపై ఐఎంఎఫ్ పునరాలోచించాలి
పాకిస్తాన్‌కు ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే ఆ సొమ్మంతా ఉగ్రవాద కార్యకలాపాలకే ఖర్చవుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోయడం పాకిస్తాన్‌కు అలవాటేనని మండిపడ్డారు. ఆ దేశానికి 2.3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించడంపై పునరాలోచన చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ను కోరారు. దుష్ట పాకిస్తాన్ సంగతి తెలిసి కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలనుకోవడం సరైంది కాదని చెప్పారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం అందిస్తే ఉగ్రవాదులకు సాయం చేసినట్లేనని పేర్కొన్నారు. అందుకే పాక్‌కు ఆర్థిక సాయంపై మరోసారి ఐఎంఎఫ్ ఆలోచించాలని, భవిష్యత్తులో ఎలాంటి సాయం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై ఇప్పటిదాకా తాము తీసుకున్న చర్యలన్నీ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అవసరమైతే ఫుల్ పిక్చర్ చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు.