
ఇస్లామాబాద్ : ఉగ్రవాది మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక కొన్ని రోజుల క్రితం బ్రిటన్ కూడా త్వరలోనే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తామని.. పాక్‌లోని ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే పాత్ర లేదని భారత్ ఒప్పుకుంటేనే.. మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అంశంపై చర్చిస్తామంటూ సదరు మంత్రి షరతులు విధించడం గమనార్హం.
పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్రదాడిలో మసూద్ అజహర్ పాత్ర ఉన్నట్లు భారత్ దగ్గర ఏమైనా రుజువులున్నాయా. ఉంటే వాటిని ప్రపంచానికి చూపించాలి. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే.. లేవని ఒప్పుకోవాలి. భారత్ అలా చేస్తేనే మసూద్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టే విషయం గురించి చర్చిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ‘పుల్వామా దాడి అనేది ప్రత్యేక అంశం. దీన్ని.. మసూద్ అజహర్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కానీ ఈ విషయంలో భారత్ తీరు ఏం బాగోలేదు. కశ్మీర్‌లో దేశీయ తిరుగబాటును అణచివేయడానికి భారత్ చేసే ప్రయత్నాల్లో ఈ ప్రచారం ఓ భాగమే. దీని గురించి మేం ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేద’ని ఫైజల్ పేర్కొన్నాడు.
ఓవైపు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెస్తుండగా.. చైనా మాత్రం అందుకు అడ్డుతగులుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment