Jaish-e-Mohammed
-
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్‌లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్‌ను భారత్ వాంటెడ్‌గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్‌కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని సియాల్ కోట్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. నూర్ మదీనా మసీద్‌లో ఫజర్ ప్రార్థన అనంతరం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు లతీఫ్‌తోపాటు మరో ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లతీఫ్తోపాట మరో ఉగ్రవాది అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కాల్పులు జరిపిన అగంతకులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ దాడిపై పాక్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పఠాన్ కోట్ దాడి వ్యూహకర్త షామిద్ లతీఫ్(41) ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు లాంచింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికికి మాస్టర్‌మైండ్ లతీఫే. ఈ దాడిలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పఠాన్‌కోట్‌లో బాంబు పేలుడు జరిగి మరో అధికారి మరణించారు. తరువాత ఈ దాడికి పాల్పడిన అయిదుగురు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ పేలుళ్లకు సూత్రధాని షాహిద్ లతీఫ్ అంటూ అప్పట్లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అతడు పాక్‌లోని సియాల్కోట్ నుంచే ఈ దాడికి పథకం వేసి.. ఐదుగురు ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌పై దాడికి పంపినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ లతీఫ్‌ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇక ఇటీవల పాక్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల హత్యలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో వేర్వేరు ఉగ్రవాద సంస్థలకు చెందిన అయిదుగురు టాప్ కమాండర్లు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు. లతీఫ్‌ను 1994 నవంబర్ ఉగ్రవాదం, చట్ట విరుద్ధ కార్యాకలాపాల నివారణ చట్టం (UAPA)ప్రకారం జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 16 ఏళ్ల పాటు మసూద్ అజార్‌తో కలిసి కోట్ బల్వాల్లోని జైలులో శిక్షననుభవించాడు. అనంతరం 2010లో వాఘా ద్వారా పాకిస్థాన్‌కు అప్పగించారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను హైజాక్ చేసిన కేసులో లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు. చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
పీఏఎఫ్‌ఎఫ్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘జమ్మూకశ్మీర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు దిగుతున్న జైషే మహ్మద్‌కు ఇది మారుపేరు. ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి హింసాత్మక చర్యలకు కుట్ర పన్నుతోంది. యువతను ఉగ్ర భావజాలం వైపు ఆకర్షిస్తోంది’’ అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం పీఏఎఫ్‌ఎఫ్‌పై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. -
పాక్‌లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్‌తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్‌తో పాటు పొరుగున్న పాక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్‌కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్‌తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్‌ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్‌ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్‌లో అతివాద శక్తులు బలపడటం... భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్‌ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్‌పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్‌లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్‌లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్‌తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్‌లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్‌లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్‌ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్‌కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్‌లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఉగ్రవాద శక్తులకు తోడ్పాటు వద్దు: జైశంకర్
ఐక్యరాజ్యసమితి: లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆరోపించారు. శిక్ష పడుతుందన్న భయం వాటికి లేకుండా పోయిందన్నారు. ఇతర దేశాల అండ చూసుకొని రెచ్చిపోతున్నాయని చెప్పారు. ఆయన గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో ప్రసంగించారు. ఇండియాలో ముంబై, పఠాన్ కోట్, పుల్వామా దాడులకు పాల్పడింది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలేనని గుర్తుచేశారు. అలాంటి సంస్థలకు ఏ దేశమూ తోడ్పాటు అందించవద్దని కోరారు. ఉగ్రవాద మూకలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని విస్మరించడం తగదని అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. -
జైషే ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ: స్వాతంత్రదినోత్సవం రోజునే బైక్‌బాంబును పేల్చి విధ్వంసం సృష్టించాలన్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ పన్నాగాన్ని భద్రతాబలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. జమ్మూ జిల్లా కేంద్రంలో బాంబు పేలుడుకు సిద్ధమైన నలుగురు జైషే ఉగ్రవాదులు, వారికి సాయపడిన ఉత్తరప్రదేశ్ వాసిని, వారి సహాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. డ్రోన్ల ద్వారా అందే ఆయుధాలను తోటి ఉగ్రవాదులకు చేరవేసే పనిలో బిజీగా ఉండగా వీరిని అరెస్ట్‌చేశారు. అయోధ్య రామజన్మభూమిపై నిఘా పెట్టాలని, దాడికి సంబంధించిన ఆయుధాలను అమృత్‌సర్‌లో డ్రోన్ ద్వారా అందుతాయని, పాక్‌లోని ఉగ్రవాది.. యూపీకి చెందిన సోనూ ఖాన్ అనే వ్యక్తిని ఆదేశించాడు. ఆ పని పూర్తిచేసేలోపే పోలీసులు ఖాన్‌ను అరెస్ట్‌చేశారు. -
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. జైసే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్ధకు చెందిన వీరు శనివారం పట్టుబడ్డారు. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉగ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు.. టూవీలర్‌కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. ఆదివారం స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు దాడులకు సిద్ధమైనట్లు గుర్తించారు. -
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్‌కు చెందిన జైషే మొహమ్మద్ కశ్మీర్ కమాండర్, ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు, 2019 పుల్వామా దాడి సూత్రధారిగా భావిస్తున్న మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూ అలియాస్ అద్నన్ సహా మరొకరు హతమయ్యారు. గురువారం కశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీపీ) విజయ్ కుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఉగ్రమూకల కదలికలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం నమిబియాన్, మర్సార్, డాచిగాం అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కార్డన్‌సెర్చ్ చేపట్టాయి. ఈ సమయంలో చిన్నారులు, మహిళలను అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదులు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా వారు కాల్పులకు దిగగా దీటుగా బలగాలు స్పందించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ‘మృతుల్లో పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోస్ట్ ఉగ్రవాది, జైషే మొహమ్మద్‌కు చెందిన లంబూ ఉన్నాడు. ఇతడు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడు. 2019లో జరిగిన పుల్వామా దాడి కుట్రకు సూత్రధారి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీటులో ఇతడి పేరు ఉంది’ అని ఐజీపీ వెల్లడించారు. ఈ ఘన విజయం సాధించిన పోలీసులు, బలగాలను ఆయన అభినందించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో శ్రీనగర్–జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై అదిల్ అద్నాన్ అనే ఆత్మాహుతి దళ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో దాడి చేయగా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్కు శిక్షణ ఇచ్చింది లంబూయేనని భద్రతాధికారులు చెబుతున్నారు. ఎవరీ లంబూ? మొహమ్మద్ ఇస్మాయిల్ అల్వి అలియాస్ లంబూకు అబూ సైఫుల్లా అనీ ఫౌజీ భాయి అని కూడా పేర్లున్నాయి. ఇతడు జైషే మొహమ్మద్ కశ్మీర్ ప్రధాన కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని బహావల్పూర్లోని కోసర్ కాలనీకి చెందిన వాడు. ఐఈడీ తయారీలో ఇతడు దిట్ట. 2017లో కశ్మీర్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అవంతిపొరా, పుల్వామా, అనంత్‌నాగ్ జిల్లాల్లో ఇతడు ఉగ్ర కార్యకలాపాలు సాగించాడు. త్రాల్లోపాటు జాతీయరహదారిపై ఉగ్ర దాడులకు ఇతడు యత్నించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్థానిక ఉగ్రవాది సమీర్ అహ్మద్ దార్‌తో కలిసి పుల్వామాలో పనిచేశాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల తరఫున కూడా లంబూ పోరాడాడు. భారత బలగాలపై రాళ్లు రువ్వడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా కశ్మీర్ యువతను ప్రేరేపించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అవంతిపొరా, కాక్‌పొరా, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి యువతను ఉగ్రమార్గం పట్టించి, వారిని ఇతర ప్రాంతాలకు పంపించడంలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నాయి. ఇతడిపై 14 కేసులు నమోదయ్యాయి. -
పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్ని కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. తజికిస్తాన్ రాజధాని డషంబేలో బుధవారం ఎనిమిది దేశాలతో కూడిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశానికి దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం ఎస్సీఓ, యాంటీ టెర్రర్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్, ఉగ్రవాద దాడుల్లో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి దోవల్ ఒక కార్యాచరణని కూడా ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చదవండి: టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు -
200 మీటర్ల సొరంగం; పాక్ కుట్రలు బట్టబయలు!
న్యూఢిల్లీ: ఇటీవల నగ్రోటా వద్ద జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశంలో దొరికిన కీలక సమాచారం ఆధారంగా సరిహద్దు భద్రతా బలగాలు భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గల సుమారు 200 మీటర్ల పొడవు గల సొరంగాన్ని కనుగొన్నాయి. గురువారం నాటి ఎన్కౌంటర్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు, వారు దేశంలో ప్రవేశించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు అభిప్రాయపడ్డారు. పక్కా పథకం ప్రకారం కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడేందుకు సిద్ధమైన ముష్కరులు, ఈ క్రమంలో 8 మీటర్ల లోతు, 200- మీటర్ల పొడవు గల సొరంగాన్ని తవ్వినట్లు గుర్తించినట్లు ఆదివారం వెల్లడించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 160 మీటర్ల దూరంలో గల ఈ సొరంగం కొత్తగా తవ్విందని, దీని గుండా కశ్మీర్లోకి చొరబడి ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు ఉగ్రవాదులు పథకం రచించారని భద్రతా అధికాలు అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించడమే వీరి లక్ష్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. ‘‘సొరంగం తవ్వడానికి ఇంజనీరింగ్ నిపుణుల సహాయం తీసుకున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. తైవాన్‌లో తయారైన ఈట్రెక్స్ 20ఎక్స్ జర్మిన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) డివైస్‌ను ఉగ్రవాదులు ఉపయోగించారు. సరిహద్దు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఓ వాహనాన్ని నిలిపారు. భద్రతా బలగాల చేతికి చిక్కే ముందే భారీ విధ్వంసానికి పాల్పడేందుకు పథకం రచించారు. జీపీఎస్ డివైస్ ఆధారంగా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఉగ్ర కార్యకలాపాల నిరోధక విభాగం ఉన్నతాధికారి జాతీయ మీడియాతో పేర్కొన్నారు.(చదవండి: కశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం) పాక్ కుట్రలు బట్టబయలు! కాగా పాకిస్తాన్‌లోని రేంజర్ ఔట్‌పోస్టులు చక్ బురా, రాజబ్ షాహిద్, ఆసిఫ్ షాహిద్‌ల గుండా మొదలైన ఈ సొరంగం కశ్మీర్ దాకా తవ్వబడిందని, 32. 45648 అక్షాంశం(ఉత్తరం), 75.121815(తూర్పు) రేఖాంశం వద్ద కేంద్రీకృతమైనట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక దీపక్ రాణా నేతృత్వంలోని 48 బెటాలియన్ భద్రతా బలగాలు ఈ సొరంగాన్ని ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కనుగొన్నట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్‌లో తయారైన యూరియా ఫర్టిలైజర్, ఇసుక బస్తాలతో దీనిని నింపారు. జీపీఎస్ డేటా ఆధారంగా భారత్ సరిహద్దులో గల, బీఎస్ఎఫ్ బార్డర్ ఔట్‌పోస్టు రీగల్ సమీపంలోని 189 పిల్లర్ వద్దకు ఉగ్రవాదులు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం నడిచి, ఆర్మీ క్యాంపు సమీపంలో గల రైల్వే ట్రాక్ దాటి జాతీయ రహదారి 44 మీదకు చేరుకుని నవంబరు 19 అర్ధరాత్రి ట్రక్కు ఎక్కారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాయాది దేశం పాకిస్తాన్ భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే దిశగా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతంలోనూ భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించిన విషయం తెలిసిందే. దాదాపు 20 మీటర్ల పొడవు, 25 అడుగుల లోతు గల ఈ టన్నెల్ ముఖద్వారం వద్ద లభించిన ప్లాస్టిక్ ఇసుక సంచులపై పాకిస్తానీ గుర్తులు(కరాచీ, శకర్‌ఘడ్ అనే పదాలు) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వీలుగా ఈ సొరంగాన్ని నిర్మించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని పాకిస్తాన్ భారత్‌పై విషం చిమ్ముతూ ఉగ్రకుట్రలకు పథకం రచిస్తోందన్న ఆరోపణలకు ఈ పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. -
కశ్మీర్ విధ్వంసానికి పాక్ పన్నాగం
ఇస్లామాబాద్ : ఉగ్రవాదులపై పోరులో ముందున్న భారత్‌పై కక్ష తీర్చుకోవాలనుకుంటున్న దాయాది దేశం పాకిస్తాన్ ప్రయత్నాలు ఏమాత్రం మానటంలేదు. దేశంలో ఉగ్ర చర్యలకు పాల్పడాలని, ఉగ్రవాదులను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించాలని ప్రణాళిలు రచిస్తూనే ఉంది. ఏ ఒక్క అవకాశం వచ్చినా.. భారత్‌ను దొంగ దెబ్బ తీయాలని కలలు కంటోంది. సరిహద్దుల్లో కశ్మీర్‌ను వేదికగా చేసుకుని రక్తపాతం సృష్టించాలని కుట్రలకు పన్నుతోంది. అయితే భారత్‌కు చెందిన నిఘా వర్గాల అప్రమత్తతో ఎన్నోసార్లు పాక్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో విధ్వంసం సృష్టించేలా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలతో మంతనాలు జరిపినట్లు తేలింది. కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఇంటిలిజెన్స్ అధికారి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. (లద్దాఖ్, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం) ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ నేతృత్వంలోని అధికారుల బృంధం కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడాలని ప్రణాళిక రచించింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనపై నిరసనగా భారత ప్రభుత్వంపై కుట్ర పన్నాలని వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగా ఆ దేశంలో తలదాచుకుంటున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ మేరకు 2019 డిసెంబర్ 27న తొలి భేటీ, ఈ ఏడాది జనవరి తొలి వారంలో ఇస్లామాబాద్ వేదికగా రెండో భేటీ నిర్వహించారు. కశ్మీర్లో జాయింట్ ఆపరేషన్ ద్వారా విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ఈ రెండు సమావేశాల్లో తీర్మానం చేశారు. ఇదంతా పాక్ ఆర్మీకి చెందిన కీలక అధికారుల సమక్షంలోనే జరింది. అయితే అప్పటికే పాకిస్తాన్ కుట్రలను పసిగట్టిన భారత నిఘా వర్గాలు ఆర్మీ సహకారంతో వారి చర్యను భగ్నం చేశారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు చాకచాక్యంగా వహరించారు. దీంతో కశ్మీర్‌కు పాక్ నుంచి పొంచిఉన్న పెను ముప్పు తప్పిందని ఇంటిలిజెన్స్ అధికారి వెల్లడించారు. కాగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ గత ఏడాది ఆగస్ట్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను రెండుగా విభజించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్తాన్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం బహిరంగంగానే తప్పుబట్టింది. కశ్మీరీలను హక్కులను హరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని భారత్‌పై విషం కక్కింది. కశ్మీరీలకు అండగా తాము ఉంటామని ఇమ్రాన్ ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సైతం గట్టిగానే బదులిచ్చింది. కశ్మీర్ భారత్‌లోని అంతర్భాగమని, తమ నిర్ణయాల్లో తలదూర్చొద్దని హెచ్చరించింది. అయితే పాక్ బుద్ధిని ముందే ఊహించిన కేంద్రం.. ఆర్మీ సహాయంతో కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలో తలెత్తకుండా కఠిన చర్యలను చేపట్టింది. కీలక నేతలందరినీ గృహ నిర్బంధం చేసి పరిస్థితులను చక్కదిద్దింది. లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు 144 సెక్షన్ విధించి అప్రమత్తంగా వ్యవహరించింది. -
తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!
శ్రీనగర్: పుల్వామా దాడితో భారత సైన్యంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు మరోసారి అలాంటి పథకాన్నే రచించారు. అయితే, భద్రతా బలగాల ఉమ్మడి సెర్చ్ ఆపరేష్‌తో వారి కుట్రలు భగ్నమయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గడీకల్ ప్రాంతంలోని కెవారాలో హైవే పక్కన 52 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించామని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైవే పక్కన ఉన్న పండ్లతోటలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ ట్యాంక్‌లో ఈ మొత్తం బయటపడిందని తెలిపింది. పుల్వామా ఘటన జరిగిన ప్రాంతానికి 9 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని వెల్లడించింది. 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. ఆ ప్రాంతంలోనే మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. కాగా, 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఉగ్రవాదులు 35 కిలోల ఆర్డీఎక్స్ను మరికొన్ని జలెటిన్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు వెల్లడైంది. పుల్వామా దాడి వెను జైషే చీష్ మసూద్ అజార్ ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఇక పుల్వామా దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు చేసి జైషే ఉగ్రవాద శిబిరాలను మారూపాల్లేండా చేసిన సంగతి తెలిసిందే. -
పాక్ ఇప్పటికి ఉగ్రవాదులకు స్వర్గధామమే
వాషింగ్టన్: నేటికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు నిరంతరం మద్దతు ఇవ్వడమే కాక వారికి సురక్షితమైన స్వర్గంగా పనిచేస్తున్నదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, అఫ్గనిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై పాక్ ఇంకా నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదు అని అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. ‘ప్రాంతీయంగా పుట్టుకొచ్చిన కొన్ని ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ సురక్షితమైన స్వర్గధామంగా కొనసాగుతోంది’ అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీయో ఆరోపించారు. తమ దేశంలో నివసిస్తున్నట్లు భావిస్తున్న ఉగ్రవాద నాయకులను విచారించడానికి పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఈ నివేదిక పేర్కొంది. 2008లో ముంబై దాడుల సూత్రధారి జైషే ఈ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్, సాజిద్ మీర్ వంటి ఇతర ఉగ్రవాద నాయకులను విచారించడానికి పాకిస్తాన్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని నివేదిక పేర్కొన్నది. వీరిద్దరూ పాకిస్తాన్ రక్షణలో నివసిస్తున్నారని ప్రపంచం అంతా తెలుసు. కానీ అక్కడి ప్రభుత్వం ఈ వాదనలను తిరస్కరిస్తుంది అని తెలిపింది. ఉగ్రవాద గ్రూపులను అంతం చేయడంలో పాకిస్తాన్ ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కూడా పేర్కొంది. అయితే 2019 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలపై దాడి చేసిన తర్వాత పాక్ ఉగ్రవాద గ్రూపులకు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేయడానికి కొన్ని చర్యలు తీసుకున్న మాట వాస్తవం అని ఈ నివేదిక వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి పాకిస్తాన్ 2015లో జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. కానీ ఎలాంటి పురోగతి సాధించలేదు అని నివేదిక వెల్లడించింది. -
తీరు మారని పాక్.. అమెరికా ఫైర్!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ మనీల్యాండరింగ్ వ్యవహారాల గుట్టుమట్లను తేల్చే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గట్టి షాకిచ్చింది. లష్కర్-ఎ-తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు నిధులు చేకూరుతున్న మార్గాలను అన్వేషించడంలో విఫలమైనందుకుగానూ ‘గ్రేలిస్టు’లో కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా(కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ అధికారులు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మారకపోవడంతో అధ్యక్షుడు షియాంగ్‌మిన్ లియూ(చైనా) నేతృత్వంలోని బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి) పాకిస్తాన్‌పై అమెరికా ఆగ్రహం ఇదిలా ఉండగా.. లష్కర్, జైషే వంటి ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ అమెరికా బుధవారం పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పాకిస్తాన్ కేంద్రంగా... ఆఫ్గనిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అఫ్గన్ తాలిబన్, భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడిన లష్కర్- ఎ- తొయిబా, దాని అనుబంధ సంస్థలు, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్, అతడి అనుచరులపై కేసులు నమోదు చేసినా చెప్పుకోతగ్గ స్థాయిలో చర్యలు తీసుకోలేదు’’ అని విమర్శించింది. అదే విధంగా ఆఫ్గనిస్తాన్‌లో నివసిస్తూ పాక్‌పై ఉగ్రచర్యలను ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ భారత పౌరుడిని ఉగ్రవాదిగా గుర్తించాలన్న పాకిస్తాన్ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ విషయంపై స్పందించిన పాక్ విదేశాంగ శాఖ అమెరికా తీరు తమను నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేసింది.(సిబ్బందిని 50% తగ్గించండి: పాక్‌కు భారత్ ఆదేశం) 2018 నుంచి గ్రే లిస్టులో.. భారత్‌లో ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే గతంలో నిషేధించిన దాయాది దేశం... నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్‌లిస్టు’లో పెట్టి తన విధానమేమిటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరికల నేపథ్యంలో... లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్-ఉద్- దావా(జేయూడీ), ఫతా-ఈ- ఇన్సానియత్(ఎఫ్ఏఐ)లను నిషేధిస్తామన్న పాక్.. వాటిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంటూ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్టులో కొనసాగుతున్న పాకిస్తాన్.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే సమావేశం నాటికి తన పంథాను మార్చుకోనట్లయితే ఇరాన్, ఉత్తర కొరియా మాదిరి.. ‘బ్లాక్ లిస్టు’లో చేరే అవకాశం ఉంది. కాగా మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నిరోధక నిబంధనలకు అనుగుణంగా లేదని భావించే దేశాల జాబితాలో ఎఫ్ఏటీఎఫ్ తమను చేర్చకుండా ఉండేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేస్తోంది. -
కశ్మీర్లో హై అలర్ట్
శ్రీనగర్: ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే సమాచారంతో కశ్మీర్లో భద్రతా బలగాలు సోమవారం హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. ‘భద్రతాబలగాలే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఉప్పందించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను చంపినందుకు ప్రతీకారంగా కారు బాంబు, లేక ఆత్మాహుతి దాడి జరిపేందుకు కుట్ర పన్నినట్లు మాకు తెలిసింది’ అని ఓ అధికారి తెలిపారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యమున్న 17వ రోజున గతంలో ఇక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. -
బట్టబయలైన పాక్ కుట్ర... నిజాలు కక్కిన ఉగ్రవాది!
కాబూల్/న్యూఢిల్లీ: ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19ను కట్టడి చేసేందుకు మల్లగుల్లాలు పడుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇవేమీ పట్టకుండా మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఆరోగ్య సంక్షోభం తలెత్తిన వేళ ఉగ్ర దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నింది. ఆఫ్గనిస్తాన్- పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తాలిబన్ గ్రూపులను పునరుత్తేజపరిచి కశ్మీర్‌పై దాడికి వ్యూహాలు రచించింది. జైషే ఉగ్రవాదులతో కలిసి పనిచేయాల్సిందిగా తాలిబన్లను ఆదేశించిన దాయాది దేశం.. ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న భారత ఆస్తులను ధ్వంసం చేసేలా కుట్ర పన్నింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఆఫ్గన్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఎత్తుగడను చిత్తు చేశాయి. (పాకిస్తాన్ తీరుపై మండిపడ్డ భారత ఆర్మీ చీఫ్) ఈ క్రమంలో జైషే, తాలిబన్ ఉగ్రవాదులపై కాల్పులు జరిపి.. 15 మందిని మట్టుబెట్టారు. వీరిలో ఏడుగురు జైషే సంస్థకు చెందిన వారు కాగా ఎనిమిది మంది తాలిబన్ గ్రూపునకు చెందినవారు. ఇక వీరిని హతమార్చిన అనంతరం భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అఫ్గన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఈ ఎన్కౌంటర్లో వీరి చేతికి చిక్కిన ఓ ఉగ్రవాది తమ ప్రణాళిక గురించి వారికి వివరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ‘‘ఏప్రిల్ 13- 14 అర్ధరాత్రి సమయంలో జైషే ఉగ్రవాదులు నంగర్హర్ ప్రావిన్స్‌లో చొరబడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురిని హతమార్చారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు’’అని ఆఫ్గాన్ మీడియా ఈ మేరకు కథనం వెలువరించింది. (అప్గనిస్తాన్: ఏడుగురు పౌరుల ఊచకోత!) ఇక ఈ విషయం గురించి భారత సైన్యానికి చెందిన అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని తాము ముందే ఊహించామన్నారు. ‘‘ఐఎస్ఐ పాత ఆట మళ్లీ మొదలుపెట్టింది. గతంలో అఫ్గన్ లోపలి నుంచే కుట్రలు పన్నేది. అయితే అమెరికాతో ఒప్పందం తర్వాత వారి పంథా మారినట్లు వెల్లడించింది. ఇదంతా కేవలం అమెరికన్లను ప్రసన్నం చేసుకునేందుకే.. కానీ వారి తీరు మారలేదు. అయితే ఆఫ్గన్ రక్షణ దళాలు వారి ఆట కట్టించేందుకు దృఢ సంకల్పంతో యుద్ధం చేయడం ఊహించని పరిణామం. ఏదేమైనా వాళ్లు గొప్ప పని చేశారు’’అని పేర్కొన్నారు. కాగా దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న పాక్ మరోసారి కుట్రలకు తెరతీసింది.(తాలిబన్ల విడుదలకు అధ్యక్షుడి ఆదేశాలు) -
పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రికూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జమ్మూకశ్మీర్‌లోని లెత్‌పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, ఇన్షా తారిక్‌లు ఉన్నారు. సోమవారం రాత్రి వారి ఇళ్లపై సోదాలు జరిపిన అధికారులు మంగళవారం తెల్లవారుజామున అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేశారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు వీరు జైషే మొహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. అహ్మద్, ఇన్షా అరెస్ట్‌లతో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది. గతవారం పుల్వామా ఉగ్రదాడికి సహకరించిన జైషే మొహ్మద్ సభ్యుడు షకీర్ బషీర్ మాగ్రేను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్‌కు షకీర్ వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. షకీర్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకే అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్) -
‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడికి సంబంధించి ఒక కీలక నిందితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది. అతడిని పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ సభ్యుడిగా గుర్తించారు. పుల్వామాలోని కాకాపొరా ప్రాంతంలోని హజిబల్‌కు చెందిన షకీర్ బషీర్ మాగ్రే పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్‌కు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. బషీర్‌కు అక్కడ ఒక ఫర్నిచర్ షాప్ కూడా ఉంది. 2018లో పాకిస్తాన్ ఉగ్రవాది మొహ్మద్ ఉమర్ ఫారూఖ్ ద్వారా ధార్‌కు బషీర్ పరిచయం అయ్యాడు. ఆ తరువాత బషీర్.. జైషే మొహ్మద్ కోసం పూర్తి కాలం పనిచేశాడు. పలు సందర్భాలో ఆయుధాలు, పేలుడు సామగ్రిని ఉగ్రవాదుల కోసం సిద్ధం చేశాడని ఎన్ఐఏ తెలిపింది. -
ఉగ్రవాదంపై చర్యల్లో పాక్ విఫలం
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మనీలాండరింగ్ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలన్నీ పాక్ తుంగలో తొక్కిందని మండిపడింది. హఫీజ్ సయీద్‌తో పాటుగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ముద్ర వేసిన ఇతర ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయాన్ని నిరోధించడంలో పాక్ విఫలమైందని పేర్కొంది. పాక్ తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యలు 40లో 31 ఎఫ్ఏటీఎఫ్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చింది. గత ఏడాదే ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. ఈ ఏడాది గ్రే లిస్ట్ నుంచి పాక్‌ను బ్లాక్ లిస్ట్‌కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు పారిస్‌లో ఈ నెల 13 నుంచి జరగనున్నాయి. మా విమానం తిరిగిచ్చేయండి! పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి అమెరికా పర్యటన గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా పర్యటనకు ఇమ్రాన్ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు చెందిన ప్రైవేటు విమానంలో వెళ్లిన విషయం తెలిసిందే. తిరుగుప్రయాణంలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినందువల్ల ఇమ్రాన్, ఆయన బృందం వేరే విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. అయితే, సాంకేతిక లోపం వల్ల కాదు.. సౌదీ యువరాజుకు ఇమ్రాన్‌పై కోపం వచ్చి, తన విమానాన్ని వెనక్కు పంపించమని ఆదేశించినందువల్లనే ఇమ్రాన్ వేరే విమానంలో న్యూయార్క్ నుంచి పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లారని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని ‘ది ఫ్రైడే టైమ్స్’ ఒక కథనంలో వెల్లడించింది. -
యాపిల్ ట్రక్‌లో పట్టుబడ్డ టెర్రరిస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానిత జైషే మహ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న యాపిల్ ట్రక్కులో ఉగ్రవాది తలదాచుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ము నుంచి ఢిల్లీకి వెళుతున్న ట్రక్కులో జైషే ఉగ్రవాది ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న అంబాలా పోలీసులు వ్యూహాత్మకంగా అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన జైషే ఉగ్రవాదిని అంబాలా పోలీసులు జమ్ము పోలీసులకు అప్పగించారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదికి పలు కేసులతో సంబంధం ఉంది. జమ్ము కశ్మీర్ పోలీసులతో పాటు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు అతడిని విచారించేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లో దాడులతో తెగబడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో భద్రతను ముమ్మరం చేయడంతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లు యత్నాలను భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. -
ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లపై ఉగ్రవాదులు దాడికి వ్యూహం పన్నారన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని జమ్మూ, అమృత్సర్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నోలతో సహా 30 ప్రధాన నగరాలపై పేలుళ్లకు పథకం రచించినట్లు సమాచారం అందడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ను హిట్ లిస్ట్‌లో చేర్చామంటూ పౌర విమానయాన భద్రతా విభాగానికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పేరుతో లేఖ అందింది. సెప్టెంబర్ 10వ తేదీన పంపినట్లు ఉన్న ఈ లేఖలో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడనున్నట్లు ఉగ్రసంస్థ పేర్కొంది. అలాగే ఎయిర్ బేస్ కేంద్రాలు ఉన్న శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, పఠాన్ కోట్, హిందన్‌లపై దాడులు చేస్తామని హెచ్చరికలతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, అదీ ఎయిర్‌బేస్ కేంద్రంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. -
భారీ కుట్రకు పాక్ పన్నాగం.. మసూద్ విడుదల!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌పై ఉగ్రకుట్రకు పాల్పడేందుకు పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తోంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాకు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌ను భారీ దెబ్బతీయాలని ఆదేశం పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజాద్‌ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్, రాజస్తాన్, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్‌పై ప్రతీకార చర్యలకు ఎప్పటి నుంచో కాలుదువ్వుతున్న పాక్.. అజార్‌ను విడుదల చేసి ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు ఐబీ అనుమానం వ్యక్త చేస్తోంది. భారత్‌పై దాడికి పాల్పడేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం మసూద్‌ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది. కాగా అజాద్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలు పాక్‌పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు నటిస్తూనే పాక్ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. కశ్మీర్ అంశం అనంతరం రెండు దేశాల మధ్య వాతావరణం యుద్ధ రీతిలో మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. పాక్ మాటలకు భారత్ కూడా అదేరీతిలో ధీటైన సమాధానమే ఇచ్చింది. పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఓ అడుగుముందుకేసి కశ్మీర్‌కు తాము అండగా ఉంటామని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉంటామని గెంతులేశారు. భారత్‌పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరొందిన అజార్‌ను భారత్‌పై యుద్ధానికి ఉసిగొల్పేందుకు జైలు నుంచి విడుదల చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, రక్షణ సిబ్బంది సరిహద్దులో భద్రతను మరింత పెంచింది. బలగాలను అప్రమత్తం చేసింది. -
జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!
న్యూఢిల్లీ : పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో దోషిగా తేలిన ఉగ్రవాది బసీర్ అహ్మద్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతను శ్రీనగర్ నుంచి వచ్చిన జైషే ఉగ్రసంస్థ సభ్యుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటి కమిషనర్ (స్పెషల్ సెల్) సంజీవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో బసీర్ ఢిల్లీ పోలీసులపై కాల్పులు జరిపాడన్న ఆరోపణలపై అరెస్టయ్యాడు. అయితే, కింది కోర్టు నిర్దోషిగా తేల్చడంతో విడుదలై బయటికొచ్చాడు. ఈ తీర్పుపై పోలీస్‌శాఖ హైకోర్టును ఆశ్రయించగా అతన్ని దోషిగా తేల్చింది. కానీ, బసీర్ కోర్టులో లొంగిపోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో హైకోర్టు అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పక్కా సమాచారంతో బసీర్‌ను, అతనితోపాటు ఉన్న ఫయాజ్, మాజిద్ బాబాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ‘116వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఇక్కడి కేపీ రోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న రైఫిళ్లతో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అలాగే వారి వాహనంపై గ్రెనేడ్లను విసిరారు. దీంతో జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలించాం’అని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ అధికారి అర్షద్ అహ్మద్‌ను చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులను జైషే మొహ్మద్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రూటు మార్చుకోనంటున్న పాక్
న్యూఢిల్లీ : ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే... పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఇప్పటికే భారత్ చేతిలో అనేకసార్లు దెబ్బ తిన్న పాక్.. తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత సైన్యాలు ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేయడం, ప్రపంచ వేదిక మీద పాక్‌ను ఒంటరి చేయడం వంటి చర్యలు ఎన్ని తీసుకున్నప్పటికి దాయాది దేశంలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు మరింత తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికే 16 ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. ‘పీఓకేలో 16 టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్‌లను ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది. వేసవి ముగిసేలోపలే భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ క్యాంప్‌లకు చెందిన ఉగ్రవాదులు కొందరు ఎల్ఓసీ సమీపంలో పాడ్స్‌ను లాంచ్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. అయితే వారి చర్యలను చాలా నిశితంగా గమనిస్తున్నాం. ఏ మాత్రం అవకాశం చిక్కినా మరో సారి గట్టిగానే బుద్ధి చెప్తాం’ అన్నారు. జాకీర్ ముసాను చంపడం మూలానే ఇంత భారీ ఎత్తున ఉగ్ర చర్యలకు పాల్పడుతుండవచ్చని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జైషే మహ్మద్ నాయకత్వం మొత్తం అంతరించి పోయిందని.. ఉన్న వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారని అధికారులు తెలిపారు. భారత సైన్యం, ఇతర బలగాలు చేస్తున్న దాడులకు జడిసి.. కొత్త వారు ఎవరూ ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్‌ల్లో చేరేందుకు ముందుకు రావడం లేదన్నారు.