న్యూఢిల్లీ: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ మనీల్యాండరింగ్ వ్యవహారాల గుట్టుమట్లను తేల్చే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) గట్టి షాకిచ్చింది. లష్కర్-ఎ-తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు నిధులు చేకూరుతున్న మార్గాలను అన్వేషించడంలో విఫలమైనందుకుగానూ ‘గ్రేలిస్టు’లో కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా(కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో ఎఫ్‌ఏటీఎఫ్ అధికారులు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మారకపోవడంతో అధ్యక్షుడు షియాంగ్‌మిన్ లియూ(చైనా) నేతృత్వంలోని బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి)
పాకిస్తాన్‌పై అమెరికా ఆగ్రహం
ఇదిలా ఉండగా.. లష్కర్, జైషే వంటి ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ అమెరికా బుధవారం పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పాకిస్తాన్ కేంద్రంగా... ఆఫ్గనిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అఫ్గన్ తాలిబన్, భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడిన లష్కర్- ఎ- తొయిబా, దాని అనుబంధ సంస్థలు, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్, అతడి అనుచరులపై కేసులు నమోదు చేసినా చెప్పుకోతగ్గ స్థాయిలో చర్యలు తీసుకోలేదు’’ అని విమర్శించింది. అదే విధంగా ఆఫ్గనిస్తాన్‌లో నివసిస్తూ పాక్‌పై ఉగ్రచర్యలను ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ భారత పౌరుడిని ఉగ్రవాదిగా గుర్తించాలన్న పాకిస్తాన్ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ విషయంపై స్పందించిన పాక్ విదేశాంగ శాఖ అమెరికా తీరు తమను నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేసింది.(సిబ్బందిని 50% తగ్గించండి: పాక్‌కు భారత్ ఆదేశం)
2018 నుంచి గ్రే లిస్టులో..
భారత్‌లో ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే గతంలో నిషేధించిన దాయాది దేశం... నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్‌లిస్టు’లో పెట్టి తన విధానమేమిటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎఫ్‌ఏటీఎఫ్ హెచ్చరికల నేపథ్యంలో... లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్-ఉద్- దావా(జేయూడీ), ఫతా-ఈ- ఇన్సానియత్(ఎఫ్‌ఏఐ)లను నిషేధిస్తామన్న పాక్.. వాటిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంటూ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2018 నుంచి ఎఫ్‌ఏటీఎఫ్ గ్రేలిస్టులో కొనసాగుతున్న పాకిస్తాన్.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే సమావేశం నాటికి తన పంథాను మార్చుకోనట్లయితే ఇరాన్, ఉత్తర కొరియా మాదిరి.. ‘బ్లాక్ లిస్టు’లో చేరే అవకాశం ఉంది. కాగా మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నిరోధక నిబంధనలకు అనుగుణంగా లేదని భావించే దేశాల జాబితాలో ఎఫ్‌ఏటీఎఫ్ తమను చేర్చకుండా ఉండేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment