భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని సియాల్ కోట్‌లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. నూర్ మదీనా మసీద్‌లో ఫజర్ ప్రార్థన అనంతరం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు లతీఫ్‌తోపాటు మరో ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లతీఫ్‌తోపాట మరో ఉగ్రవాది అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కాల్పులు జరిపిన అగంతకులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ దాడిపై పాక్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
పఠాన్ కోట్ దాడి వ్యూహకర్త
షామిద్ లతీఫ్(41) ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు లాంచింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికికి మాస్టర్‌మైండ్ లతీఫే. ఈ దాడిలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పఠాన్‌కోట్‌లో బాంబు పేలుడు జరిగి మరో అధికారి మరణించారు. తరువాత ఈ దాడికి పాల్పడిన అయిదుగురు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి.
అయితే ఈ పేలుళ్లకు సూత్రధాని షాహిద్ లతీఫ్ అంటూ అప్పట్లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అతడు పాక్‌లోని సియాల్‌కోట్ నుంచే ఈ దాడికి పథకం వేసి.. ఐదుగురు ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌పై దాడికి పంపినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ లతీఫ్‌ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇక ఇటీవల పాక్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల హత్యలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో వేర్వేరు ఉగ్రవాద సంస్థలకు చెందిన అయిదుగురు టాప్ కమాండర్‌లు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు.
లతీఫ్‌ను 1994 నవంబర్ ఉగ్రవాదం, చట్ట విరుద్ధ కార్యాకలాపాల నివారణ చట్టం (UAPA)ప్రకారం జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 16 ఏళ్ల పాటు మసూద్ అజార్‌తో కలిసి కోట్ బల్వాల్‌లోని జైలులో శిక్షననుభవించాడు. అనంతరం 2010లో వాఘా ద్వారా పాకిస్థాన్‌కు అప్పగించారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను హైజాక్ చేసిన కేసులో లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు.
చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత?
Comments
Please login to add a commentAdd a comment